సీమాంధ్ర నాయకుల కోరిక నెరవేరింది. విభజనకు సంబంధించి కేంద్ర కేబినెట్ తయారు చేసిన ముసాయిదాపై 6 వారాల లోపు అభిప్రాయం చెప్పాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్రపతి నుండి తాఖీదు అందినట్లు తెలుస్తోంది. అధికారికంగా ఇంకా సమాచారం వెలువడనప్పటికీ ముసాయిదా బిల్లు రాష్ట్రపతి భవన్ గేటు దాటిందని పత్రికలు ఇప్పటికే వార్తలు ప్రచురించాయి. రాష్ట్రపతి 6 వారాల గడువు సూచించారని అధికారిక వర్గాలను ఉటంకిస్తూ ది హిందు తెలిపింది.
రాష్ట్రాల విభజనకు సంబంధించి గత ప్రభుత్వాలు నెలకొల్పిన సాంప్రదాయాలను గౌరవించాలని రాయలసీమ, కోస్తాంధ్ర ప్రాంతాలకు చెందిన రాజకీయ నాయకులు కోరుతున్న సంగతి తెలిసిందే. వారం రోజుల్లో అభిప్రాయం పంపించాలంటూ రాష్ట్ర అసెంబ్లీపైన కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఒత్తిడి తెస్తారని భావిస్తున్న నేపధ్యంలో రాష్ట్రపతి ఎన్ని రోజులు గడువు ఇస్తారన్న అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు కొందరు బుధవారం (డిసెంబర్ 11) రాష్ట్రపతిని కలిసి గోడు వెళ్లబోసుకున్నారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పే పేరుతో రాష్ట్రపతిని కలిసిన 6గురు కాంగ్రెస్ ఎం.పి లు గత సంప్రదాయాలు పాటించాలని విజ్ఞప్తి చేసుకున్నారు. విభజన ప్రక్రియ రాజ్యాంగ విరుద్ధంగా జరుగుతోందని వారు ఫిర్యాదు చేశారని కూడా పత్రికలు, ఛానెళ్లు చెబుతున్నాయి. కానీ ఏ అంశంలో రాజ్యాంగ విరుద్ధంగా జరుగుతోందని వారు భావించారో నిర్దిష్ట సమాచారం అయితే లేదు.
రాష్ట్రాల విభజనకు సంబంధించి రాజ్యాంగ సభలో అంబేద్కర్ కూ ఇతర సభ్యులకు మధ్య జరిగిన చర్చలను ఉటంకించడమే గానీ ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం గానీ, కేంద్ర కేబినెట్ గానీ ఫలానా రాజ్యాంగ సూత్రాన్ని ఉల్లంఘించారని నిర్దిష్టంగా చెప్పినట్లు లేదు. ఏ.పి.ఎన్.జి.ఓ నేతలు, సీమాంధ్ర రాజకీయ నేతలు ‘రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారని’ కెమెరాల ముందు వాపోవడమే తప్ప ఏ అంశంలో ఉల్లంఘన జరిగిందో చెప్పడంలో స్పష్టత ఇవ్వడం లేదు.
ప్రధానంగా అసెంబ్లీ తీర్మానం అవసరమా కాదా అన్న విషయంలోనే వీరి అభ్యంతరాలు ఉన్నట్లు కనిపిస్తోంది. కానీ 5వ రాజ్యాంగ సవరణ మేరకు రాష్ట్రాల విభజనలో కేంద్రానిదే ప్రధాన పాత్ర అని ఆర్టికల్ 3 స్పష్టంగా చెబుతోంది. విభజన ప్రక్రియ రాష్ట్రానికి అప్పజెపితే విడిపోవాలని కోరుకుంటున్నవారికి ఎప్పటికీ న్యాయం జరిగే అవకాశం లేదు.
తెలంగాణ విభజననే తీసుకుంటే సీమాంధ్ర ప్రాంతం వారిదే అసెంబ్లీలో మెజారిటీ. కాబట్టి వారి అభిప్రాయమే అసెంబ్లీలో నెగ్గుతుంది. అలాంటప్పుడు తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు న్యాయం ఎలా జరుగుతుంది? సీమాంధ్ర పాలకులు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ అంగాలను తమ గుప్పిట్లో పెట్టుకుని తెలంగాణ ప్రాజెక్టులపైనా, ఆర్ధిక అవసరాలపైనా వివక్ష చూపారన్న తెలంగాణ ప్రజల ఆక్రోశానికి ఎప్పటికి న్యాయం జరిగేను? న్యాయం జరిగే అవకాశం లేదు కనుకనే రాజ్యాంగ నిర్మాతలు ముందు చూపుతో విభజన అంశాన్ని కేంద్రం పరిధిలో ఉంచారు.
సమైక్యాంధ్ర అనేది ప్రధానంగా ఒక భావన. తెలంగాణ ప్రైవేటు కంపెనీల్లో సీమాంధ్ర విద్యార్ధులకు, ఉద్యోగార్ధులకు అవకాశాలు ఉండవు అన్న వాదన ఒక కోణంలో భావన కాగా మరొక కోణంలో వాస్తవం. రాష్ట్ర విభజన జరగలేదు కాబట్టి ఈ వాదనకు ఇంకా భౌతిక ఉనికి లేదు. విభజన జరిగిన తర్వాత ప్రైవేటు కంపెనీల్లో ఎలాగూ అందరికీ ఉద్యోగావకాశాలు ఉంటాయి. ఒక రాష్ట్రంలోని ప్రభుత్వ సంస్ధల్లో (కాలేజీలు, యూనివర్సిటీలు, వైద్య సంస్ధలు) ఇతర రాష్ట్రాల ప్రజలకు పరిమిత అవకాశాలు ఉంటాయి కనుక ఈ వాదన ఈ కోణంలో వాస్తవమే. కానీ తెలంగాణ ప్రజలు కోరుకున్నది ఇదే కదా.
ప్రత్యేక రాష్ట్రంగా విడిపోతే తమ అవకాశాలు తమకు దక్కుతాయన్న ఉద్దేశ్యంతోనే తెలంగాణ రాష్ట్రాన్ని అక్కడి ప్రజలు కోరుకున్నారు. వారు ఏ డిమాండ్ తో అయితే రాష్ట్రాన్ని కోరుకున్నారో అదే డిమాండ్ ను సీమాంధ్ర ప్రజలు ఫిర్యాదుగా చేస్తున్నారు. అటువంటి ఫిర్యాదు వాళ్ళు ఇతర రాష్ట్రాల పైన కూడా చేయాల్సి ఉంటుంది. బెంగుళూరు, మద్రాసు, బొంబే, ఢిల్లీ తదితర నగరాల్లో తెలుగువారు అవకాశాలు పొందుతున్నందుకు అక్కడి ప్రజలు కూడా ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది.
సీమాంధ్ర ప్రాంతంలో ప్రజలంతా ఒకే ప్రయోజనం కలిగినవారు కాదు. అక్కడి పారిశ్రామికవేత్తలు, భూస్వాములు, పెట్టుబడిదారులు తదితర ధనికవర్గాల ప్రయోజనాలు, శ్రామిక వర్గాల ప్రయోజనాలు ఒకటి కాదు. శ్రామికవర్గాలు అంటే రైతులు, కూలీలు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పారిశ్రామిక కార్మికులు తదితర వర్గాలు అని. ధనికవర్గాలు లక్షన్నర కోట్ల బడ్జెట్ ను కోల్పోతారు కనుక వారికి విభజన నష్టమే. కానీ శ్రామిక వర్గ ప్రజలకు విభజన వల్ల కొత్త ఉపాధి లభిస్తుంది.
కొత్త ఐ.ఐ.టి, ఐ.ఐ.ఎం, కొత్త ఆసుపత్రులు, కొత్త రాజధాని, కొత్త సచివాలయం, అసెంబ్లీ ఇలాంటి నిర్మాణాలు కొత్త ఉపాధిని తెస్తాయి. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నట్లయితే ఈ కొత్త సంస్ధలు ఉండవు కదా. ఈ ఉపాధి ఎంత తక్కువైనా గతం కంటే ఎక్కువేనని గుర్తించాలి. గతంలో కంటే రాజధాని దగ్గర అవుతుంది. ఇక హైద్రాబాద్ ఎలాగూ దూరం కాబోదు. ఇన్నాళ్లూ చెన్నై, కలకత్తా, బోంబే లు మనకు ఎలాగో హైద్రాబాద్ అలా అవుతుంది. మన రాష్ట్రంలో లేనంత మాత్రాన ఈ నగరాలకు వెళ్లకుండా మనల్ని నిషేదించడం లేదు. శివసేన లాంటివారు విద్వేషం వెళ్లగక్కినపుడు చట్టపరమైన రక్షణ ఉంటుంది.
అసలు సమస్యలే ఉండవా అంటే ఉంటాయి. కానీ ఆ సమస్యలు మన ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక స్వభావం వల్ల ఉత్పన్నం అయ్యే సమస్యలే తప్ప తెలంగాణ విభజన వల్ల వచ్చే సమస్యలు కావు. ఉదాహరణకి నీటి విభజనకు సంబంధించి సమస్యలు తప్పకుండా వస్తాయి. కానీ నీటి సమస్యలు కర్ణాటకతో లేవా? పోలవరం ప్రాజెక్టు విషయంలో ఒడిషాతో మనకు సమస్యలు లేవా? కృష్ణా, గోదావరి జలాల విషయంలో మహారాష్ట్రతో సమస్యలు లేవా?
ఈ సమస్యలకు కారణం మన పాలకులకు ప్రజల బాగోగుల పట్ల చిత్తశుద్ధి లేకపోవడమే. మన ముఖ్యమంత్రి చెప్పిన లెక్కల ప్రకారమే మనం వాడుకున్న నీళ్ళ కంటే అనేక రేట్లు నీరు సముద్రంలో వృధాగా పోతోంది. వీటిని నిల్వచేసి వాడుకునే సామర్ధ్యం పొందడానికి పెద్ద పెద్ద భారీ ప్రాజెక్టులే అవసరం లేదు. అనేక చిన్న చిన్న ప్రాజెక్టుల ద్వారా నీటిని నిల్వ చేసుకోవడానికి కె.ఎల్.రావు లాంటి ఇంజనీర్లు అనేక ఉపాయాలు చెప్పి ఉన్నారు. కొన్ని చోట్ల నదుల అనుసంధానం ద్వారా వృధా నీటిని ఎలా అరికట్టవచ్చో వారు పధకాలు రచించారు. కానీ పాలకులకు ప్రజలపై దృష్టి లేకపోవడం వలన ఇవి సాకారం కావడం లేదు. కాబట్టి సీమాంధ్ర ప్రజలు వీటిపై దృష్టి పెట్టాలి తప్ప తెలంగాణ ప్రజల ఆకాంక్షకు అడ్డుపడడం ధర్మం కాదు.
రాష్ట్ర విభజన తర్వాత కూడా తెలంగాణ ప్రజల సమస్యలు అనేకం కొనసాగుతాయి. కానీ ప్రాంతీయ వివక్ష, నిర్లక్ష్యం అనే ఫిర్యాదులు వారిక చేయలేరు. ఇవి కాకుండా ఇరు ప్రాంతాల ప్రజలు ఉమ్మడిగా పోరాడవలసిన సమస్యలు ఇంకా అనేకం ఉన్నాయి. వీటికి విభజనతో సంబంధం లేదు. విభజన ఇష్టం లేని నాయకులు ప్రతి సమస్యను విభజనతో ముడిపెట్టి జనాన్ని మోసం చేస్తున్నారు. తెలంగాణలో కూడా ప్రతి సమస్యను విభజనతో ముడిపెట్టి అదే పరిష్కారం అని చెబుతున్నారు. ఇలాంటి ప్రచారాల పట్ల జనం అప్రమత్తంగా ఉండాలి.
ఈ నేపధ్యంలో విభజన ఎంత త్వరగా జరిగితే ప్రజలకు అంత త్వరగా ఒక పీడ వదులుతుంది. ఇది నానినన్నాళ్లూ రాజకీయ నాయకులు, ప్రభుత్వ నేతలు తమ చేతగాని తనాన్నీ, తమ ప్రజా వ్యతిరేక నిర్ణయాలను కూడా విభజన సమస్యలోకి నెట్టివేస్తున్నారు. దీన్ని ప్రజలు అనుమతించరాదు. అనేక ప్రభుత్వ ఉద్యోగాల స్ధానంలో కాంట్రాక్టీకరణ ప్రవేశపెట్టి ప్రజల ఉపాధిని పెద్ద ఎత్తున రద్దు చేసిన మోసం గురించి ఇప్పుడు ఎవ్వరూ మాట్లాడడం లేదు. సందట్లో సడేమియా లాగా గ్యాస్, పెట్రోల్, డీజెల్ రేట్లు పెంచేస్తున్నారు.
విద్యుత్ రేట్లను కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం పెద్ద ఎత్తున పెంచేసింది. కేవలం రెండు మూడు నెలల పరిధిలోనే మూడుసార్లు విద్యుత్ రేట్లు పెంచింది. మరోసారి పెంచడానికి కూడా సిద్ధపడుతోంది. మామూలుగా అయితే కిరణ్ రెడ్డి ప్రభుత్వం పైన ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమించి ఉండాలి. దురదృష్టవశాత్తూ కిరణ్ రెడ్డి సీమాంధ్ర ప్రజలకు ఇప్పుడు పెద్ద విభజన వ్యతిరేక హీరో. నిత్యజీవితావసరం ఐన విద్యుత్ రేట్లు భారీగా పెంచినప్పటికీ జనంలో హీరోగా ప్రతిష్ట పొందిన నేత గతంలో ఎవరన్నా ఉన్నారా? విభజన చుట్టూ భావోద్వేగాలు రెచ్చగొట్టడం ద్వారా కిరణ్ కుమార్ రెడ్డి ఈ ఫీట్ సాధించగలిగారు. ఇది గ్రహించకపోతే మనకు మించిన ఫూల్స్ ఇంకెవ్వరూ ఉండబోరు.
తెలంగాణ రాష్ట్రం వల్ల అక్కడి ప్రజల సమస్యలన్నీ తీరవు అన్నది ఎంత నిజమో విభజన వల్ల మిన్ను విరిగి మీదపడదు అన్నదీ అంత నిజం. ఈ వాస్తవం జనానికి తెలిస్తే కేంద్ర మంత్రుల నుండి రాష్ట్ర మంత్రుల వరకు వేస్తున్న విచిత్ర వేషాలు కూడా వారికి అర్ధం అయినట్లే. అర్ధం కాకుండా ఉండడానికి అటు ప్రతిపక్ష పార్టీలూ, ఇటు పాలక పక్షమూ రసవత్తర నాటకంలో భాగస్వాములు అవుతూ అసలు సమస్యల నుండి ప్రజల దృష్టిని మళ్లించడంలో సఫలం అవుతున్నారు. బహుపరాక్!
పింగ్బ్యాక్: విభజన రంధిలో ఫూల్స్ అవుతున్న జనం | ugiridharaprasad
Reblogged this on ugiridharaprasad.
సమశ్య ప్రజాపరమైనా సారధ్యం రాజకీయ, ప్రభుత్వ పాలనాయంత్రాంగానిది. ఈ విషయంలో ప్రజలు ప్రేక్షకుల పాత్రవహించినా తప్పోప్పుల బాధ్యత, లాభనష్టాల బేరీజు, సరిహద్దు వివాదాల రివాజు ప్రభుత్వ నిర్దేశిత నిర్ణయాలు ఆమోదయోగ్యమైతే ప్రజలకు సంతోషం. ఇందులో ప్రజలు కాదు నాయకులు ఫూల్స్ అవుతున్నారు. నేరకపోయి నేరస్థులుగా మారారు. వాళ్ళ గొయ్యిని వాళ్ళే తవ్వుకుని పార్టీపరంగా భవిష్యత్త్తును భూస్థాపితం చేసుకోబోతున్నారు. రాబోయే ఎన్నికల తదనంతరం చేయవలసిన కార్యక్రమాన్ని ముందస్తుగా చేసి ప్రజల మన్ననలకు బదులు నెత్తిన మన్ను కుమ్మరించుకున్నారు. మన తెలుగు రాజకీయం వెన్నుదన్నులతో దేశాన్ని ఏలే ప్రభుత్వం మనకే వెన్నుపోటు పొడిచే ప్రయత్నానికి నాంది పలకడం వారి ముగింపుకు వారే చరమగీతం పాడుకోవడం. విధి బలీయం.
ఇప్పటి వరకు ఏర్పడిన రాష్త్రాలు(కొత్తవి) ఆయా మాతృరాష్త్రాల అస్సెంబ్ల్య్ ఆమోదాలుతోనే ఏర్పడినవి కదా!మరి మనకే ఎందుకు సమస్య!పోనీ కేంద్రం సామరస్యపూర్వంగా పరిష్కరించడానికి ఎటువంటి ప్రయత్నాలు చేసింది?మీకు తెలిస్తే దయచేసి చెప్పండి!కేంద్రం ఈ విదం గా నిరంకుషంగా వ్యవహరించడాన్ని మీరు ఎలా సమర్దిస్తారు?