స్వలింగ సంపర్కం చట్ట విరుద్ధం -సుప్రీం కోర్టు


LBGT rally 02

స్వలింగ సంపర్కాన్ని నేర సమానం చేసే చట్టాన్ని రద్దు చేస్తూ ఢిల్లీ హై కోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు తిరస్కరించింది. అసహజమైన స్వలింగ సంపర్కం చట్ట విరుద్ధం అని స్పష్టం చేసింది. ఐ.పి.సి లోని సెక్షన్ 377 స్వలింగ సంపర్కాన్ని నిషేధిస్తుంది. దీనికి పాల్పడినవారిని నేరస్ధులుగా పేర్కొంటూ గరిష్టంగా 10 సంవత్సరాల జైలు శిక్షను ఇది ప్రతిపాదిస్తుంది. పౌరుల ప్రాధమిక హక్కులను తిరస్కరిస్తోందని చెబుతూ ఈ సెక్షన్ ను రద్దు చేస్తున్నట్లుగా 2009లో ఢిల్లీ హై కోర్టు తీర్పు చెప్పింది.

ఈ తీర్పును స్వలింగ సంపర్కుల హక్కుల సంస్ధలు స్వాగతించగా పలువురు వ్యతిరేకించారు. తీర్పుకు అనుకూలంగానూ, వ్యతిరేకంగానూ దాఖలయిన పిటిషన్లను ఒక్కటిగా చేసి సుప్రీం కోర్టు విచారణ నిర్వహిస్తోంది. గత సంవత్సరం ఫిబ్రవరి నుండి తీర్పును రిజర్వులో పెట్టిన సుప్రీం కోర్టు బుధవారం తన తీర్పు వెలువరించింది.

స్వలింగ సంపర్కం అసహజం అనీ, చట్ట విరుద్ధం అనీ సుప్రీం కోర్టు చెప్పినప్పటికీ ప్రభుత్వం నుండి మరిన్ని సలహాలు సూచనలు స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. ప్రభుత్వం అవసరం అనుకుంటే ఐ.పి.సి సెక్షన్ 377 ను రద్దు చేయడం గానీ లేదా సవరణలు చేయడం గానీ చేయదలుచుకున్నట్లయితే తమకు అభ్యంతరం లేదని సుప్రీం కోర్టు తెలిపింది. ఇప్పటికైతే హై కోర్టు తీర్పును పక్కన బెడుతున్నట్లు స్పష్టం చేసింది.

సెక్షన్ 377 ప్రస్తుతం ఉనికిలో ఉన్న భారతీయ సాంప్రదాయాలను, విలువలను ప్రతిబించేది కాదని, వాస్తవానికి బ్రిటిష్ ప్రభుత్వం తమ సమాజంలోని విలువలకు అనుగుణంగా ఈ సెక్షన్ ను భారత దేశం రుద్దిందని అటార్నీ జనరల్ వాహనవతి సుప్రీం కోర్టులో వాదిస్తూ పేర్కొన్నారు.

“ఐ.పి.సి సెక్షన్ 377 భారత దేశంలో ఉనికిలో ఉన్న విలువలు, సాంప్రదాయాలను ప్రతిబింబిస్తూ ప్రవేశపెట్టినది కాదు. వలస పాలకులు తమ నైతిక విలువలకు అనుగుణంగా ఈ చట్టాన్ని మనపై రుద్దారు. ఐ.పి.సి ప్రవేశపెట్టడానికి ముందు భారత దేశంలో ఉన్న సమాజం స్వలింగ సంపర్కం పట్ల బ్రిటిష్ సమాజం కంటే మరింత గొప్ప సహనాన్ని పాటించింది. ఆ కాలంలో కుటుంబం మరియు సంతానోత్పత్తిలకు సంబంధించి ఉనికిలో ఉన్న విక్టోరియన్ నైతికత మరియు విలువల ప్రభావం మేరకు ఈ సెక్షన్ ను పొందుపరిచారు” అని అటార్నీ జనరల్ జి.ఇ.వాహనవతి వాదించారు.

అయితే అంతకుముందు హోమ్ మంత్రిత్వ శాఖ తరపున సుప్రీం కోర్టులో వాదించిన అడిషనల్ సొలిసిటర్ జనరల్ పి.పి.మల్హోత్రా సుప్రీం కోర్టులో దీనికి సరిగ్గా భిన్నమైన వాదన వినిపించారు. స్వలింగ సంపర్కం పూర్తిగా అనైతికం అనీ, భారతీయ సంప్రదాయాలకు విరుద్ధం అనీ వాదిస్తూ ఢిల్లీ హై కోర్టు తీర్పును రద్దు చేయాలని కోరారు. “స్వలింగ సంపర్కం తీవ్ర అనైతికం. సామాజిక నియమాలకు విరుద్ధం. అలాంటి చర్యల ద్వారా వ్యాధులు వ్యాపించే అవకాశం చాలా ఎక్కువగా ఉన్నది” అని జస్టిస్ జి.ఎస్.సింఘ్వి, ఎస్.జె.ముఖోపాధ్యాయ లతో కూడిన బెంచి ముందు వాదించారు. తాను హోమ్ మంత్రిత్వ శాఖ తరపున వాదిస్తున్నట్లు కూడా ఆయన తెలిపారు.

“ఇతర దేశాలతో పోలిస్తే మన రాజ్యాంగం భిన్నమైనది. నైతిక, సామాజిక విలువలు కూడా భిన్నమైనవే. కాబట్టి మనం వాటిని అనుసరించలేము. భారతీయ సమాజం స్వలింగ సంపర్కాన్ని తిరస్కరిస్తుంది. భారతీయ చట్టాలు భారతీయ సమాజానికి భిన్నంగా ఉండజాలవు” అని మల్హోత్రా వాదించారు.

అయితే విచిత్రంగా, మల్హోత్రా వాదనలను హోమ్ మంత్రిత్వ శాఖ అదే రోజు తిరస్కరించింది. ఢిల్లీ హైకోర్టు తీర్పుపై తాము ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, తీర్పుపై జరుగుతున్న వాద, ప్రతివాదాల్లో సుప్రీం కోర్టుకు సహాయం చేయాల్సిందిగా మాత్రమే తాము చెప్పామని హోమ్ శాఖ హడావుడిగా విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొంది. సహాయం చేయాలని కోరినప్పుడు ఏ విధంగా సహాయం చేయాలో కూడా హోమ్ శాఖ చెప్పి ఉండాలి. హోమ్ శాఖ చెప్పిన మేరకే మల్హోత్రా వాదించి ఉండాలి కూడా. ఐనా ఆయన వెనుక నిలబడడానికి హోమ్ శాఖ ఎందుకు సిద్ధపడలేదన్నది అప్పట్లో పత్రికల్లో ఒక టాపిక్ అయింది. ఢిల్లీ హై కోర్టు తీర్పుపై ఎవరైనా అప్పీలు చేసినట్లయితే సుప్రీం కోర్టుకు సహాయం చేయాలని కేబినెట్ కోరిందని, అంతకు మించి ఆయనకు ఆదేశాలివ్వలేదని హోమ్ శాఖ ప్రకటన తెలిపింది.

సుప్రీం బెంచి మాత్రం అప్పట్లో స్వలింగ సంపర్కానికి అనుకూలమైన వ్యాఖ్యలు చేసింది. సమాజంలో అనేక మార్పులు వస్తున్నాయని, గతంలో ఆమోదయోగ్యం కానివి ఇప్పుడు ఆమోదయోగ్యం అవుతున్నాయని పేర్కొంది. కలిసి బతకడం (live-in relationship), ఒంటరి తల్లి/తండ్రి, అద్దె గర్భం మొదలైన అంశాలను ఉదాహరణలుగా బెంచి పేర్కొంది.

అయితే దేశంలోని పలు సంస్ధలు, సంఘాలు ఢిల్లీ హైకోర్టు తీర్పు రద్దు చేయాలని వాదించాయి. అనేక రాజకీయ, సామాజిక, మత సంస్ధలు ఇందులో ఉన్నాయి. ఈ అంశంపై తుది తీర్పు ఇవ్వాలని సుప్రీం కోర్టును కోరాయి. బి.జె.పి నాయకులు ఢిల్లీ కోర్టు తీర్పును గట్టిగా తిరస్కరించారు. తీర్పును సవాలు చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్ కూడా వారు దాఖలు చేశారు. బి.జె.పి సీనియర్ నేత బి.పి.సింఘాల్ స్వయంగా పిటిషన్ దాఖలు చేస్తూ స్వలింగ సంపర్కం భారతీయ సంస్కృతికి వ్యతిరేకం అని వాదించారు. అది అనైతికం, చట్ట విరుద్ధం అని ఆయన వాదించారు.

ఈ వాదనలను రికార్డు చేసుకున్న సుప్రీం కోర్టు తన తీర్పును రిజర్వులో ఉంచుతున్నట్లు  మార్చి 27, 2012 తేదీన పేర్కొంది. సదరు తీర్పును ఇప్పుడు వెలువరించింది.

సుప్రీం కోర్టు తీర్పును యోగా గురువు బాబా రాందేవ్ స్వాగతించారు. ఆయన మిత్రుడొకరు ఢిల్లీ హైకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా పిటిషన్ దాఖలు చేసినవారిలో ఉన్నారు. తీర్పును స్వాగతించడంతో రామ్ దేవ్ ఊరుకోలేదు. స్వలింగ సంపర్కులు తన వద్దకు వచ్చినట్లయితే వారి జబ్బు నయం చేస్తానంటూ వివాదాస్పద ప్రకటన చేశారు. ఆయన ఏర్పాటు చేసిన పత్రికా సమావేశానికి హాజరయినవారు ఎవరూ స్వలింగ సంపార్కులు కారాదని తాను ప్రార్ధిస్తున్నట్లు కూడా పేర్కొన్నారు. 

తీర్పును వ్యతిరేకించినవారూ అనేకమంది ఉన్నారు. ప్రముఖ లాయర్ హరీష్ సాల్వే తీర్పును వ్యతిరేకించారు. సమాజ్ వాదీ పార్టీ ఎం.పి శివానంద్ తివారీ సుప్రీం తీర్పు కంటే హై కోర్టు తీర్పు శాస్త్రీయంగా ఉందని పేర్కొన్నారు. సుప్రీం తీర్పును గౌరవిస్తామని ఐ.టి మంత్రి కపిల్ సిబాల్ తెలిపారు. ఐతే ‘చట్టాన్ని సవరించే అవకాశం మాకుంది. దానిని వినియోగిద్దాం’ ఆయన వ్యాఖ్యానించారు. దాని అర్ధం ఏమిటో చెప్పడానికి మాత్రం నిరాకరించారు. పార్లమెంటు సమావేశాలు సజావుగా జరిగితే చట్టం రాజ్యాంగ సవరణ చేస్తామని తెలిపారు.

11 thoughts on “స్వలింగ సంపర్కం చట్ట విరుద్ధం -సుప్రీం కోర్టు

  1. పింగ్‌బ్యాక్: స్వలింగ సంపర్కం చట్ట విరుద్ధం -సుప్రీం కోర్టు | ugiridharaprasad

  2. ఈరోజు TOI చూశారా? స్వలింగ homosexualsనిచూసి hetrosexuals మగాళ్ళు నేర్చుకోవలసిందెంతైనా ఉందని ఒక article రాశారు!

    హోమోనో, హెట్రోనో వాళ్ళ పడగ్గదుల్లోకూడా చట్టమో, మనమో ఎందుకు దూరాలి? ఈవ్యవహారానికి వ్యతిరేకతాంతా ఒక్క సంస్కృతీ, సాంప్రదాయాల కోణమేతప్ప అంతగా పట్టించుకోవలసిందేమీ కాదని నాకు అనిపిస్తుంది. ఇద్దరు మనుషులు వారి ఇచ్ఛప్రకారం ఇతరులకు భౌతికహాని జరుగనంతవరకూ, ఇతరుల భౌతిక హానిని ప్రేరేపించనంతవరకూ ఏంచేసుకుంటారు అనేది పూర్తిగా వారివారి ఇష్టం.

  3. మనదేశంలో ఉన్న ప్రభుత్వాలూ, వాటిని నడిపిస్తున్న రాజకీయపార్టీల తీరుతెన్నులూ చూస్తుంటే ఒక్క విషయం స్పష్టం.
    ఓట్లు రాల్చేందుకు ఉపయోగిస్తుందీ, సీట్లు సంపాదిస్తుందీ అనుకుంటే రాజ్యాంగంలో ఎలాంటి మార్పులైనా చేయటానికి ఈ‌పార్టీలూ, ప్రభుత్వాలూ సిధ్ధం. అబ్బే లాభసాటికాదూ అనుకుంటే ఏ సమస్యనైనా చూడనట్లు నటించటానికీ వీళ్ళు సర్వదాసిధ్ధం.

  4. భౌతిక హాని జరగనిది ఏదైనా తప్పు కాదనుకుంటే ఇన్సెస్ట్ కూడా తప్పు కాదనుకొవాల్సి వస్తుంది.

  5. అదికూడా తప్పుకాదు. అది తప్పన్న భావన సంస్కృతి(అలవాటు) వల్లకలిగే అభిప్రాయమ్మాత్రమే. కలిగే సంతానానికి జన్యుపరమైన లోపాలుంటాయికాబట్టి, సంతానం విషయంలో తప్ప ఇతరత్ర అభ్యంతరాలేమీ ఇతరులకుండాల్సిన అవసరంలేదు. అది వాళ్ళవాళ్ళ ఇష్టం. వాళ్ళవాళ్ళ వ్యక్తిగత వ్యవహారం. తప్పైనా కాకున్నా మిగతావాళ్ళు దాన్ని నిషేధించాల్సిన, నిరోధించాల్సిన అవసరంలేదు. తప్పొప్పులు వ్యక్తిగతమైనవి. ఆ వ్యక్తిగత తప్పొప్పుల గురించి ఆలోచించుకోవాల్సింది ఆ ఇద్దరేతప్ప మిగిలినవారు కాదు.

    నైతికతా దృక్కోణంలోకాకుండా (యెందుకంటే నైతికత సాపేక్షికమైనది. మీరు పెరిగిన సమాజాన్నిబట్టి నైతికతను మీరు నిర్వచించుకుంటారేతప్ప అదేమీ పరమమైన కొలబద్దకాదు) incest ఎందుకు నిషేధార్హమో వివరించగలరా?

  6. ఏది తప్పు/పాపం అన్నదాన్ని నిర్వచించేది అనాదిగా వస్తున్న ఆచారాలే తప్ప తర్కం కాదు. నేను జైనుణ్ణయ్యుంటే ఉల్లిపాయతినడంకూడా నాకు పాపమయ్యుండేటిది. మీరు మాత్రం భేషుగ్గా తినేసేవాళ్ళు. నేను ముస్లిమునయ్యుంటే రంజాన్ రోజుల్లో ఉపవాసముండనందుకు నా మనసు నన్ను బాధపెట్టేది. మిమ్మల్ని మాత్రం అదేమీ చెయ్యగలిగేదికాదు. నాకు తప్పు/పాపంగా అనిపించినవి మీకూ అలాగే అనిపించాల్సిన అవసరంలేదు. మీకూ, నాకు పాపంగా అనిపించినవి ఇతరులక్కూడా అలాగే అనిపించాలనుకోవడం సరైనదీకాదు. ఏది తప్పు/పాపం అనేవాటిని మనం చేయబోతున్న/చేస్తున్న పనులవల్ల ఇతరులకు హానికలుగుతుందాలేదా అన్నకోణంలోంచి చూడాలి తప్ప ఆచారాలకోణంలోంచి కాదు. In short, it’s the consequences and the stake holders we should be concerned about while defining the wrong not the traditions.

  7. విశేషజ్ఞ & Marxist Hegelian గార్లకు

    చర్చను ఈ ఆర్టికల్ లోని అంశం వరకు పరిమితం చేద్దాం. incest ఒప్పు గురించి చర్చించే స్ధాయికి భారత సమాజమే కాదు, మొత్తం మానవ సమాజమే చేరుకోలేదు. నైతిక విలువలు సాపేక్షికం అంటే అర్ధం ఏ విలువా పాటించనవసరం లేదని కాదు. సమాజం మారుతుంది అని గుర్తించాలి నిజమే. కానీ అది విలువల పతనాన్ని కూడా legitimize చేసేట్లు ఉండ(కూడ)దు. ప్రస్తుత సమాజం యొక్క విలువల సగటు స్ధాయిని దృష్టిలో పెట్టుకుని చర్చ చేయాలని నా సూచన.

  8. సమాజంలో నీతి నియమాలు అనేవి కేవలం భౌతిక హాని ఆధారంగా ఉండవు. పది మంది చూస్తుండగా బూతులు మాట్లాడితే ఎవరికీ వచ్చే నష్టం లేదు. అయినా ట్రైన్‌లో ప్రయాణిస్తున్నప్పుడు తోటి ప్రయాణికునితో ఎలాంటి సెక్స్ ఓరియెంటెడ్ విషయాలూ మాట్లాడము. IPCలోని ఒక సెక్షన్‌ని రద్దు చేసే అధికారం పార్లమెంట్‌కి మాత్రమే ఉంది. అందుకే ఆ సెక్షన్‌ని రద్దు చేసే అధికారం హైకోర్ట్‌కి లేదని సుప్రీంకోర్ట్ తీర్పు చెప్పింది. డిల్లీ హైకోర్ట్ కేవలం వ్యక్తి స్స్వేచ్ఛ ఆధారంగా ఆ తీర్పు చెప్పిందని నాకు అనిపిస్తోంది. అలా తీర్పు చెప్పే అధికారం కోర్ట్‌కి లేదు.

  9. శేఖర్గారు… విలువల పతనం. ఒకప్పుడు వితంతువులు మళ్ళీ పెళ్ళిచేసుకోవడాన్ని విలువల పతనంగా భావించారు, కారణమేదైనా.. విడాకులు కోరడాన్ని, మనుస్మృతి అమల్లో లేకపోవడాన్ని, స్త్రీ స్వేచ్ఛనీ, ఆఖరికి స్త్రీవిద్యనికూడా విలువల పతనంగా భావించే మనుషులు మనకు తారసపడుతున్నారు. పైనుదహరించినవి కొన్ని పాయింట్లుమాత్రమే. ఒక x-axis మీద ఇలాంటి points చాలా ఉన్నాయనుకుంటే, సమాజం ఒక్కొక్క pointకి చేరుకోవడం ఒక్కొక్కరికి విలువల పతనంగా అనిపిస్తుంది. విలువల పతనంకూడా అభిప్రాయమే! కొంతమంది అభిప్రాయంప్రకారం ఆధునికీకరణ పేరుతో ఈ విలువల పతనాన్ని legitimize చేయడమ్మాత్రమేకాదు వడివడిగా ముందుకు (వాళ్ల ఉద్దేశంలో క్రిందకు) సాగిస్తున్నాం ఒక సమాజంగా మనం.

  10. పీనల్ కోడ్‌ని రూపొందించే అధికారం పార్లమెంట్‌కి మాత్రమే ఉన్నప్పుడు దాన్ని కోర్ట్ ఎలా రద్దు చేస్తుంది?

    నా విషయానికొస్తే, నేను నమ్మినదే చెపుతాను. నా దృష్టిలో పిన్ని వరసైన స్త్రీని పెళ్ళి చేసుకోవడం తప్పు కాదు, కొన్ని దేశాలలో అలా పెళ్ళి చేసుకోవడానికి అనుమతి ఉంది కూడా. కానీ ఇండియాలోని హిందూ వివాహ చట్టంలోని Prohibited degree of kinship ప్రకారం అలాంటి వివాహాలు చెల్లవు. నేను Prohibited degree of kinship సూత్రాన్ని హిందూ వివాహ చట్టం నుంచి తొలిగించాలని అంటాను. కానీ దాన్ని తొలిగించే అధికారం కోర్ట్‌కి లేదు. నేను అటువంటి పెళ్ళి చేసుకున్నప్పుడు నా పెళ్ళి చెల్లదని కోర్ట్ తీర్పు చెప్పినా నేను కోర్ట్‌ని తప్పు పట్టలేను. ఆ న్యాయమూర్తి కాగితాల మీద వ్రాయబడిన చట్టాల ప్రకారమే తీర్పు చెప్పాడు కానీ నా వ్యక్తిగత స్వేచ్ఛ ఆధారంగా అతను తీర్పు చెప్పలేడు కాబట్టి. న్యాయమూర్తి యొక్క ధర్మాన్ని అతని ఉద్యోగ ధర్మంగానే ఎందుకు అర్థం చేసుకోకూడదు?

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s