ఢిల్లీ రాష్ట్ర పీఠం – మ్యూజికల్ చైర్ -కార్టూన్


Musical 'number'

ఢిల్లీ రాష్ట్రంలో ఓ విచిత్రమైన పరిస్ధితి నెలకొంది. నిజమైన హంగ్ అసెంబ్లీ అంటే ఇదేనా అన్నట్లుగా ఉండడం ఈ విచిత్రంలో ఒక భాగం. ఇంతకు ముందు హంగ్ అసెంబ్లీ లేదా హంగ్ పార్లమెంట్ అనేకసార్లు ఏర్పడినా ప్రస్తుతం ఢిల్లీలో వచ్చిన పరిస్ధితి లాంటిది ఎప్పుడూ ఉద్భవించిన దాఖలా లేదు.

గతంలో హంగ్ అసెంబ్లీ అన్నా, హంగ్ పార్లమెంటు అన్నా రాజకీయ సంక్షోభం గానీ రాజ్యాంగ సంక్షోభం గానీ ఉండేది కాదు. అంటే: ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రానప్పటికీ మెజారిటీ గ్రూపు ఒకటి వెంటనే ఏర్పాటైపోయేది. రెండు, లేదా మూడు పార్టీలు లేదా అంతకంటే ఎక్కువ పార్టీలు కలిసి అప్పటికప్పుడు ఒక కూటమిని ఏర్పాటు చేసేవి.

ఎన్నికల ప్రచారం సందర్భంగా తాము వల్లించిన సిద్ధాంతాలూ గట్రా ఏమన్నా ఉంటే వాటిని అధికారం కోసం నిస్సిగ్గుగా వదులుకుని మరీ ఈ కూటములు ఏర్పడేవి. దాంతో ప్రభుత్వం ఏర్పాటు చేసే ప్రక్రియ నిర్విఘ్నంగా సాగిపోయేది. ఎంత నిర్విఘ్నంగా అంటే చివరికి ముఖ్యమంత్రి పీఠాన్ని చెరి కొన్ని సంవత్సరాలు పంచుకునేంత నిర్విఘ్నంగా అన్నమాట! ఎన్నికలకు ముందు ప్రచారం సందర్భంగా తాము ఒకరికొకరు పడదిట్టుకున్న సంగతిని ఇట్టే మరిచిపోయి జనాల్ని అడ్డంగా ఫూల్స్ చేస్తూ ఈ తతంగం జరిగిపోయేది.

ఈసారి ఢిల్లీ వ్యవహారం మాత్రం దానికి గుణాత్మకంగానే భిన్నంగా ఉండడం ఒక ముఖ్య పరిణామం. ఆమ్ ఆద్మీ పార్టీ రెండో అతి పెద్ద పార్టీగా అవతరించడమే ఈ పరిస్ధితిలో ఒక ముఖ్యమైన కేంద్రంగా ఉన్న విషయాన్ని గుర్తించాలి. ఆమ్ ఆద్మీ పార్టీకి వచ్చిన సీట్లు ఎలా ఉన్నాయంటే ఆ పార్టీ సీట్ల సంఖ్య వలన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ధైర్యం, ఆత్రం బి.జె.పి చేయలేయపోతోంది.

మామూలుగానైతే ఎమ్మెల్యేలను కొనేసే పని ఈ పాటికి పూర్తయి ఉండేది. కానీ ఆమ్ ఆద్మీ పార్టీకి వచ్చిన ప్రతిష్టే అవినీతి పునాది మీద. రాజకీయ నాయకుల అవినీతిని తీవ్రంగా ద్వేషిస్తున్న ప్రజలు, ముఖ్యంగా నగరాలు, పట్టణాల ప్రజలు ఇన్నాళ్ళూ మరో ప్రత్యామ్నాయం లేక వ్యతిరేక ఓటును ప్రయోగిస్తూ వచ్చారు. కానీ ఈసారి మాత్రం ఢిల్లీ ప్రజలకు ఒక ప్రత్యామ్న్యాయం కనిపించింది. అవినీతికి వ్యతిరేకంగా పోరాటం నిర్వహించిన నాయకుడే పార్టీ పెట్టి ఓట్లు అడగడంతో వారు మరో మాట ఆలోచించలేదు.

అదే సమయంలో కాంగ్రెస్ (ప్రభుత్వ) వ్యతిరేక ఓటు బి.జె.పి, ఏ.ఏ.పి ల మధ్య చీలిపోయింది. ఫలితంగా ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోయినా ‘హార్స్ ట్రేడింగ్’ (ఎమ్మెల్యేల కొనుగోలు) ను మాత్రం ఇప్పటివరకు అయితే అరికట్టగలిగింది. బి.జె.పి కి 31, అకాలీ దళ్ కు 1, కాంగ్రెస్ కు 8, ఎ.ఎ.పి కి 28, ఇతరులకు 2 సీట్లు వచ్చినట్లు వార్తలు చెబుతున్నాయి. అంటే ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 36 సీట్లు ఎవరికీ లేవు.

ఆమ్ ఆద్మీ పార్టీకి వచ్చిన సీట్లకు పునాది అవినీతి వ్యతిరేకత కనుక బి.జె.పి నాయకులు అటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గానీ, ఇటు ఏ.ఏ.పి ఎమ్మేల్యేలను గాని కొనలేరు. అలా కొన్నట్లయితే వారికి 2014 సాధారణ ఎన్నికల్లో ప్రజలు (కనీసం ఢిల్లీ ప్రజాలైనా) తగిన బుద్ధి చెప్పడం ఖాయం. పోనీ కాంగ్రెస్ మద్దతు తీసుకునే పొజిషన్ లో ఎ.ఎ.పి పార్టీ ఉందా అంటే అదీ లేదు. ఎ.ఎ.పి పార్టీ ఇన్నాళ్లూ పోరాటం చేసిందే కాంగ్రెస్ పైన. అవినీతిలో నిండా కూరుకుపోయిన కాంగ్రెస్ మద్దతు తీసుకోవడం అంటే అంతకుమించిన అవినీతి మరొకటి ఉండదు.

నిజానికి అమ్ముడుబోవడానికి ఎ.ఎ.పి లో పలువురు ఎమ్మేల్యేలు సిద్ధంగా ఉండి ఉండాలి. ఎందుకంటే ఎ.ఎ.పి ఎమ్మెల్యేల్లో కనీసం డజను మంది కాంగ్రెస్, బి.జె.పి రెబెల్స్ అని పత్రికల ద్వారా తెలుస్తోంది. వీరు తమ మాతృ సంస్ధలకు అమ్ముడుబోవడానికి సదా సిద్ధమే. కానీ కొనుగోలు చేసే ధైర్యం బి.జె.పి, కాంగ్రెస్ లకు లేకపోవడమే ఒక విచిత్ర పరిస్ధితి. ఆ రెండు పార్టీలు హార్స్ ట్రేడింగ్ కి సిద్ధపడితే వారిక సాధారణ ఎన్నికల్లో ఎదురయ్యే పరిణామాలకు సిద్ధపడాలి.

అందుకే ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి బి.జె.పి ముందుకు రావడం లేదు. ఎ.ఎ.పి ప్రభుత్వం ఏర్పాటు చేయదలిస్తే తాను  బేషరతు ఇస్తానంటూ కాంగ్రెస్ పార్టీ చెబుతోంది. తద్వారా తనమీద ఉన్న అవినీతి మచ్చను కొంతైనా మాపుకోవచ్చని కాంగ్రెస్ ఆశ. కానీ దానికి ఒప్పుకుంటే కాంగ్రెస్ మచ్చ మాపడం అటుంచి ఎ.ఎ.పి కి కూడా అవినీతి మచ్చ వచ్చేస్తుంది. కాబట్టి ఎ.ఎ.పి కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు.

హంగ్ అనే కాన్సెప్ట్ కి రాజకీయ కోణంలో నిజమైన అర్ధం ఏమిటో ఇప్పుడు మనం ఢిల్లీలో చూస్తున్నాం. నంబర్ల రీత్యానే కాకుండా, రాజకీయ భావాలు, తాము ప్రాతినిధ్యం వహించే వర్గాల ప్రయోజనాల రీత్యా కూడా ఎవరూ ప్రభుత్వం ఏర్పాటు చేయలేని పరిస్ధితే నిజమైన హంగ్ అసెంబ్లీ/పార్లమెంటు కు దారితీయాలి. ఎ.ఎ.పికి రాజకీయ భావాలంటూ ఏమీ ఉన్నట్లు ఎప్పుడూ చెప్పలేదు. అందులో ఉన్న కొంతమందికి లెఫ్ట్ భావాలు ఉన్నాయని చెబుతారు గానీ అది నిజం కాదు. మహా అయితే వారిని లిబరల్ అనవచ్చేమో.

అనేకమంది ఎ.ఎ.పి కేడర్ ప్రజల ప్రయోజనాలకు ప్రతినిధులే అయినా పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ప్రవేశించాక వారిక అనివార్యంగా ధనిక వర్గాల ప్రయోజనాలే నెరవేర్చాలి. లేనట్లయితే వారిని ఎలా కూల్చాలో ధనికవర్గాలకు బాగానే తెలుసు. ఆరున్నర దశాబ్దాల అనుభవంలో వారి వద్ద అనేక అక్రమ అస్త్రాలు ఉన్నాయి. వాటిలో ఒకటో, రెండో లేదా కలిపో ప్రయోగించారంటే చాలు. అదీ కాక ఎ.ఎ.పి కి ప్రధాన పోషకులు కార్పొరేట్ కంపెనీలే. కనుక వారు ప్రభుత్వం ఏర్పాటు చేసినా సాధించేదేమీ ఉండదు. ప్రభుత్వంలోని సమస్త అంగాలూ ధనిక వర్గాలకు సేవలు చేస్తున్నప్పుడు కేవలం కొంతమంది ఎమ్మేల్యేల నిజాయితీ వల్ల ప్రయోజనం ఉండదు. కఠినంగానే ఉన్నా ఇది వాస్తవం. చేదు వాస్తవం.

కానీ ప్రజలు ప్రత్యామ్నాయం కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారన్న విషయాన్ని ఎ.ఎ.పి ప్రదర్శన నిస్సందేహంగా రుజువు చేస్తోంది.

సాధారణంగా ‘మ్యూజికల్ చైర్స్’ ఆట అంటే కుర్చీలు స్ధిరంగా ఉంటే ఆటగాళ్లు తిరుగుతూ ఉండాలి. కానీ ఇక్కడ కుర్చీయే ఆట ఆడుతోంది. తాను ఆట ఆడుతూ కూర్చోవడానికి మాత్రం ఎవరికీ దక్కనని చెబుతోందని కార్టూనిస్టు సూచిస్తున్నారు. చివరికి బి.జె.పి చెబుతున్న ‘మళ్ళీ ఎన్నికలే’ ఖాయం అవుతాయేమో చూడాలి.

3 thoughts on “ఢిల్లీ రాష్ట్ర పీఠం – మ్యూజికల్ చైర్ -కార్టూన్

  1. పింగ్‌బ్యాక్: ఢిల్లీ రాష్ట్ర పీఠం – మ్యూజికల్ చైర్ -కార్టూన్ | ugiridharaprasad

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s