
Hamid Karzai and Hassan Rouhani
‘లోయ జిర్గా’ ఆమోదించిన తర్వాత కూడా అమెరికాతో ‘భద్రతా ఒప్పందం’ పై సంతకం పెట్టకుండా తాత్సారం చేస్తున్న ఆఫ్ఘన్ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ ఇరాన్ కు వెళ్ళి మరీ స్నేహ-సహకార ఒప్పందంపై సంతకం చేసేశారు. ఆఫ్ఘన్ ప్రజలకు భద్రత ఇవ్వడంపై హామీ ఇవ్వకుండా, 2014 తర్వాత కూడా అమెరికా, నాటో సేనలు ఆఫ్ఘన్ లో కొనసాగింపజేసే ఒప్పందంపై సంతకం చేసేది లేదని కర్జాయ్ రెండు వారాల క్రితం తిరస్కరించారు. కానీ ‘ప్రాంతీయ భద్రత’ కోసం ఇరాన్ తో సుదీర్ఘ స్నేహ, సహకార ఒప్పందంపై ఆఫ్ఘన్, ఇరాన్ అధ్యక్షులు ఇరువురూ సంతకం చేసినట్లు సోమవారం ప్రకటన వెలువడడంతో అమెరికాకు పుండు మీద కారం రాసినట్లే అయింది.
“ఇరాన్ తో సుదీర్ఘ కాలం పాటు స్నేహ, సహకార ఒప్పందం కుదుర్చుకోడానికి ఆఫ్ఘనిస్తాన్ అంగీకారం తెలిపింది. రాజకీయ, ఆర్ధిక, సాంస్కృతిక మరియు భద్రతా రంగాల్లో స్నేహ, సహకారాల కోసం ఈ ఒప్పందం సుదీర్ఘ కాలం పాటు అమలులో ఉంటుంది. ప్రాంతీయ శాంతికి ఈ ఒప్పందం దోహదం చేస్తుంది” అని ఆఫ్ఘన్ అధ్యక్షుడు కర్జాయ్ ప్రతినిధి అయిమల్ ఫైజీ చెప్పారని రాయిటర్స్ వార్తా సంస్ధ తెలిపింది. ఈ మేరకు ఇరు దేశాలు ఆదివారమే ఉమ్మడి కమ్యూనిక్ జారీ చేశారని ది హిందు తెలిపింది.
ఆఫ్ఘన్ అధ్యక్షుడు కర్జాయ్ ఇరాన్ పర్యటిస్తున్న సందర్భంగా తాజా ఒప్పందం కుదిరింది. ఈ పర్యటనకు ముందు ఆయన అమెరికా ప్రతిపాదించిన ‘ద్వైపాక్షిక భద్రతా ఒప్పందం’ (బి.ఎస్.ఏ) పై సంతకం చేయడానికి నిరాకరించడం విశేషం. 2013 ముగిసేలోపు బి.ఎస్.ఏ పై సంతకం చేయాలని అమెరికా విదేశీ మంత్రి జాన్ కెర్రీ ప్రత్యేకంగా ఫోన్ చేసి మరీ చెప్పినప్పటికీ అమెరికా కోరిక నెరవేరలేదు.
అమెరికా ఒప్పందం గురించి మరిన్ని చర్చలు జరగాల్సి ఉందని కర్జాయ్ చెబుతున్నారు. 2014 లో ఎన్నికలు జరుగుతాయని ఆ ఎన్నికల వరకూ ఒప్పందాన్ని వాయిదా వేస్తున్నానని కర్జాయ్ ప్రకటించారు. ఆఫ్ఘన్ లోని వివిధ గిరిజన తెగల పెద్దలతో కూడిన అసెంబ్లీని ‘లోయ జిర్గా’ అంటారు. ప్రభుత్వ విధానాలను ఈ అసెంబ్లీ లో ప్రవేశపెట్టి ఆమోదం పొందడం అక్కడ ఒక సాంప్రదాయంగా కొనసాగుతోంది. లోయ జిర్గా నిర్ణయాలకు చట్టబద్ధత లేనప్పటికి ఎన్నికల దృష్ట్యా దీనికి ప్రాముఖ్యత ఉన్నది. అలాంటి లోయ జిర్గా సైతం ఇటీవల జరిపిన సమావేశంలో అమెరికా భద్రతా ఒప్పందానికి ఆమోదం తెలిపింది. అయినప్పటికీ అమెరికా బి.ఎస్.ఏ పై అప్పుడే సంతకం పెట్టబోవడం లేదని లోయ జిర్గా సమావేశాల చివరి రోజు ప్రకటించి కర్జాయ్ అందరినీ ఆశ్చర్యపరిచారు.
పైగా అమెరికా ప్రత్యర్ధి ఇరాన్ తో స్నేహ సహకార ఒప్పందానికి కర్జాయ్ సిద్ధం కావడం పరిశీలకులు భృకుటి ముడివేసేలా చేసింది. ఇరాన్, ఆఫ్ఘన్ దేశాల విదేశాంగ మంత్రులు మరిన్ని చర్చలు జరిపి తమ అధ్యక్షులు అంగీకరించిన ఒప్పందం వివరాలు తేల్చనున్నట్లు తెలుస్తోంది. ఇరాన్-ఆఫ్ఘన్ ఒప్పందం నేపధ్యంలో అమెరికాతో ఆఫ్ఘన్ భద్రతా ఒప్పందం తమకు అంగీకారయోగ్యం కాదని ఇరాన్ అధ్యక్షుడు రౌహాని ప్రకటించడం మరింత ఆసక్తికరంగా మారింది.
“ఈ ప్రాంతంలో విదేశీ బలగాలు కొనసాగడం వలన తలెత్తే ఉద్రిక్తతలు మాకు ఆందోళన కలిగిస్తాయి. విదేశీ బలగాలన్నీ ఈ ప్రాంతం నుండి వెళ్లిపోవాలని మేము నమ్ముతున్నాం. ఆఫ్ఘన్ భద్రతకు సంబంధించిన బాధ్యతను ఆఫ్ఘన్ ప్రజలకే అప్పజెప్పాలి” అని ఇరాన్ అధ్యక్షుడు హాసన్ రౌహాని కర్జాయ్ పర్యటన సందర్భంగా ప్రకటించారు.
ద్వైపాక్షిక భద్రతా ఒప్పందం పై త్వరలో సంతకం చేయకపోతే తమ బలగాలు పూర్తిగా ఆఫ్ఘన్ నుండి వెళ్లిపోతాయని అమెరికా ఇప్పటికే బెదిరించింది. అమెరికా బలగాలు పూర్తిగా వెళ్లిపోవడం అంటే అమెరికా నుండి సహాయం ఏదీ ఇక ఆఫ్ఘనిస్ధాన్ కు అందబోదు. ఒప్పందం కుదిరితే ఆఫ్ఘన్ పోలీసు, సైనిక బలగాల శిక్షణ కోసం సాలీనా 4 బిలియన్ డాలర్ల సహాయం అమెరికా అందజేస్తుందని పత్రికలు తెలిపాయి. ఒప్పందం లేకపోతే ఈ మొత్తం ఆగిపోతుందని అమెరికా బెదిరింపు అంతరార్ధం. అయినప్పటికీ కర్జాయ్ ప్రస్తుటానికయితే బెదరడం లేదు. ఈ బెదిరింపులన్నీ తమకు మామూలే అనీ కర్జాయ్ ప్రతినిధి ఫైజీ వ్యాఖ్యానిస్తున్నారు. “మాకు సంబంధించినంతవరకు గడువు అంటూ ఏమీ లేదు” అని కర్జాయ్ సంతకానికి అమెరికా విధించిన గడువు గురించి వ్యాఖ్యానిస్తూ ఫైజీ అన్నారు.
గ్వాంటనామో బే జైలులో బంధించిన ఆఫ్ఘన్ ఖైదీలను అమెరికా విడుదల చేయాలని కర్జాయ్ డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. తద్వారా తాలిబాన్ తో జరిగే శాంతి చర్చలు సఫలం అవుతాయని ఆయన భావిస్తున్నట్లు విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే ప్రాంతీయంగా బలాబలాల పొందికలో మార్పులు చోటు చేసుకుంటున్నందున ఈ వ్యాఖ్యానం పాక్షిక సత్యమే అవుతుంది.
అమెరికా ఎత్తులను చిత్తు చేసే సమవుజ్జీ దేశాల సఖ్యత, సమైక్యత, సమయానుకూలంగా మార్పులు చెందుతున్నాయనడానికి ఇది తార్కాణం.
Reblogged this on ugiridharaprasad.
పింగ్బ్యాక్: ఆఫ్ఘనిస్తాన్: అమెరికాను కాదని ఇరాన్ తో స్నేహ ఒప్పందం | ugiridharaprasad