పుట్టిన ప్రతి మనిషి చనిపోక తప్పదు. ఐనా మనిషి దుఃఖించక మానడు. చావు, పుట్టుకలకు అతీతంగా జీవితాన్ని సార్ధకం చేసుకునేవారు చరిత్రలో అనేకులు ఉన్నారు. వారిలో మానవజాతి తలచుకునేది కొందరినే. ఎవరైతే జాతి పురోగతికి మార్గ నిర్దేశకులుగా నిలుస్తారో, ఎవరైతే జాతి మొత్తాన్ని ఏక తాటిపై నడిపిస్తారో వారిని మానవ జాతి చరిత్ర జాతి నేతలుగా రికార్డు చేస్తుంది. అలాంటి గొప్ప నాయకుల్లో నెల్సన్ మండేలా ముందు పీఠిన నిలుస్తారు.
జులై 18, 1918 తేదీన ఒక చిన్న తెగ నాయకుని కుటుంబంలో జన్మించిన నెల్సన్ మండేలా కాలేజీ చదువు పూర్తి చేసే నాటికి ఒక సాధారణ వ్యక్తి. లాయర్ వృత్తిలో పైకి ఎదగాలని అందరిలాగా మామూలు కలలు కన్న వ్యక్తి. కానీ మామూలు జీవనానికి కూడా అడుగడుగునా ఎదురైన అవమానాలు, ఛీత్కారాలు ఆయనను తిరుగుబాటు వైపుకు పురిగొల్పాయి.
ఎ.ఎన్.సి పార్టీలో చేరితే లాయర్ కెరీర్ కు ఆటంకం అవుతుందని భయపడిన ఒక సామాన్యుడు సుదీర్ఘ జైలు జీవితాన్ని గుండె ధైర్యంతో ఎదుర్కొన్న వీరుడుగా అవతరించడానికి ప్రేరేపించింది అప్పటి సామాజిక పరిస్ధితులే. ప్రజా నాయకులు పుట్టరని, తయారవుతారని చెప్పేందుకు ప్రబల ఉదాహరణ నెల్సన్ మండేలా.
జాత్యహంకార ప్రభుత్వం మోపిన దేశద్రోహం నేరానికి విచారణ ఎదుర్కొన్నప్పటి నుండి ఇటీవల వరకూ మండేలా జీవితంలోని ప్రధాన ఘట్టాలను ఈ ఫోటోలు మన ముందు ఉంచుతున్నాయి. బోస్టన్ గ్లోబ్, ది అట్లాంటిక్ పత్రికలు ఈ ఫోటోలు అందించాయి.