తలచేము నిను నెల్సన్ మండేలా… -విని తీరాల్సిన పాట!


1990 దశాబ్దం అంతా ఈ పాట తెలుగు నేలపై మోగుతూ ఉండేది. ముఖ్యంగా పి.డి.ఎస్.యు విద్యార్ధి సంఘంతో పాటు ఇతర విప్లవ విద్యార్ధి సంఘాల్లో పని చేసిన, అనుసరించిన విద్యార్ధులకు ఈ పాట చిరపరిచితం.

నల్లజాతి ప్రజల సాయుధ తిరుగుబాటుకు తలఒగ్గుతూ దక్షిణాఫ్రికా జాత్యహంకార ప్రభుత్వం 1990లో నెల్సన్ మండేలాను విడుదల చేసినపుడు అప్పటి అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య కళాకారులు శక్తి ఉరఫ్ జె.కనకరాజు గారు ఈ పాట రాసి పాడారు.

తెలంగాణ ప్రజా కళాకారులు జయరాజ్ గారితో కలిసి అప్పట్లో శక్తి ఇచ్చిన ‘గొల్ల సుద్దులు’ కళా ప్రదర్శన విప్లవ శ్రేణులను ఉర్రూతలూగించేవి. 90ల్లోని వారి ప్రదర్శనల్లో ఈ పాట తప్పనిసరిగా ఉండేది. అరుణోదయా సంస్ధ వాళ్ళు ఈ పాటతో కూడిన క్యాసెట్ ను కూడా విడుదల చేశారనుకుంటాను.

మళ్ళీ ఇన్నాళ్ల తర్వాత ఈ పాటను దృశ్య రూపంలో చూడడం/వినడం చాలా చాలా … మాటలు రావడం లేదు. మండేలా చనిపోయిన సందర్భంగా ఈ పాట మళ్ళీ వినడం వలన ‘ఆనందంగా ఉంది’ అనలేకపోతున్నాను.

ఎక్కడో వేలమైళ్ళ దూరంలో అరేబియా మహా సముద్రానికి ఆవల చీకటి ఖండంగా పేరుగాంచిన ఆఫ్రికాలో సాగిన ఒక గొప్ప పోరాట గాధను ఈ పాట తెలుగు విద్యార్ధులకు పరిచయం చేసింది.

ఆఫ్రికా ఖండానికి దక్షిణ కొసలోని సుసంపన్నమైన దక్షిణాఫ్రికా దేశాన్ని తెల్లతోలు దొరలు దురాక్రమించారని, ఆ దేశ వనరులును దోపిడీ చేయడానికి వారు జాత్యహంకార అణచివేతను ఆలంబనగా చేసుకున్నారని ఈ పాట తెలియజేసింది.

తెల్లదొరల జాతి అణచివేత పాలనను 27 యేళ్ళ జైలు శిక్షతో గేలి చేసిన వీరుడు ఒకరున్నారని, నిరసన రంగును రక్తమాంసాల దుస్తులుగా ధరించిన నీగ్రో జాతి, తాము ఎదుర్కొంటున్న అమానవీయ అణచివేతను ఆయన నాయకత్వలో ధిక్కరించి పోరాడుతున్నారన్న రోమాంఛిత స్ఫూర్తిని తెలుగు జాతి ఎదకు ఈ పాట మోసుకొచ్చింది.

బహుశా ఈ వీడియోలో పాడిన వ్యక్తి కూడా శక్తి అనుకుంటాను. జాతి అణచివేతను ఎదుర్కొన్ని పోరాడే జాతి విముక్తి పోరాటం ప్రపంచంలో ఏ మూల జరిగినా దాన్ని మనదిగా చేసుకోవాలన్న సందేశాన్ని ఈ పాట అద్భుతమైన రీతిలో మనకిస్తుంది. కామ్రేడ్ శక్తి గారికి బ్లాగ్ ముఖంగా మరోసారి అభినందనలు, ధన్యవాదాలు!

***

చెరసాలలు ఏ పోరును ఆపవనీ, చరితలొ చిరకాలం నీ పేరు నిలుచుననీ

తలచేము నిను నెల్సన్ మండేలా, మా గుండెల్లో ప్రతి క్షణము ఉండేలా

 –

ఏ రంగు ఏ జాతి ఏ ప్రజలైనా, మానవులంతా ఒకటని చాటించావు

ఒకజాతి నొకజాతి పీడించేదీ ఎన్నాళ్ళు ఎన్నేళ్లని నిలదీసావు

జైళ్లను రగిలించిన ఓ వీరుడా… చీకటి ఖండంలో ఉదయించిన సూర్యుడా…     ॥ తలచేము ॥

 –

అధికారం మత్తులోన పొగరెక్కిన తెల్లజాతి, హజం ఇంక సాగదంటూ ధ్వజం ఎత్తి నడిచావు

నల్లజాతి గుండెల్లో నివురు ఊది నిప్పు జేసి, పోరాటపు పెను మంటలు రగిలించావు

సానబట్టినా నల్లని వజ్రమా…. ఓ గర్జించే ఆఫ్రికా సింహమా….                         ॥ తలచేము ॥

 –

షార్ప్ వెల్లు వీధుల్లో కదం తొక్కె బాలలు, సావెటో లో సవాలంటు తిరగబడె వీరులు

జబ్బ చరిచి నిలుచున్న జోహేన్స్ బర్గ్ గనులు, మా దెబ్బకెదురు లేదన్న కేప్ టౌను రేవులు

భగ భగ భగ భగ రగిలి దక్షిణాఫ్రికా… నిను తలుచుకుంటూ పాడె అరుణ గీతికా… ॥ తలచేము ॥

 –

జాతి మత భేదాలు భాషా విద్వేషాలు, దేశ రాష్ట్ర సరిహద్దులు లేవు మాకు లేవంటూ

ప్రపంచ మానవులంతా ఒక్కటై నేడు, ఓ మండేలా నీ కొరకై నినదించెను చూడు

భూమాత నిను బిడ్డగ చూసుకుని… గర్వంతో పొంగి  ఎదకు హత్తుకునే…         ॥ తలచేము ॥

3 thoughts on “తలచేము నిను నెల్సన్ మండేలా… -విని తీరాల్సిన పాట!

  1. పింగ్‌బ్యాక్: తలచేము నిను నెల్సన్ మండేలా… -విని తీరాల్సిన పాట! | ugiridharaprasad

  2. మొన్న మండేలా పరమపదించిన రోజే…ఓ ఛానల్ లో ఈ పాట విన్నపుడు చాలా బాగుందనిపించింది.
    ఆరా తీస్తే శక్తి గారే రాసి…పాడారని తెలిసింది. పీ.డీ.ఎస్.యూ రాజకీయాల ద్వారా, ఆ తర్వాత కవిగా, రచయితగా , ప్రస్తుతం జర్నలిస్టుగా తన ప్రతిభ చాటుతున్న శక్తి…ఈ పాట రాశారని విని చాలా సంతోషించాను.
    మండేలా జీవితాన్ని, పోరాటాన్ని, ప్రజల అభిమానాన్ని అన్నిటినీ అద్భుతంగా పాట ద్వారా వ్యక్తం చేసిన శక్తి నిజంగా గొప్ప రచయితనని నిరూపించుకున్నారు.
    ఇంత అద్భుతమైన పాటని జాతీయ అంతర్జాతీయ వార్తల్లో మళ్లీ ఓ సారి విని సంతోషించాను. రాసి పాడిన శక్తి గారికి, మాకందించిన మీకు ధన్యవాదాలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s