ముగిసిన మండేలా లాంగ్ వాక్ -2


MANDELA 2

మొదటి భాగం తరువాత……………….

అయితే మండేలా ఖైదుతో వర్ణ వివక్ష వ్యతిరేక ఉద్యమం బలహీనపడకపోగా మరింత బలపడింది. 1980ల కల్లా జాత్యహంకార రాజ్యం ఆస్తులను ధ్వంసం చేసే చర్యలు ఊపందుకున్నాయి. గెరిల్లా దాడులు పెరిగిపోయాయి. మండేలా ఖైదు దక్షిణాఫ్రికా అంతటా సంవత్సరాల తరబడి స్ధిరమైన చైతన్యానికి పాదుకొల్పింది.

ఉమ్మడి నాయకత్వానికి మండేలా ప్రాధాన్యం

1986లో వెలువడిన ‘మండేలా కోసం ఎదురుచూపులు’ అన్న పుస్తకంలో రచయిత జె.ఎం.కొయెట్జి ఇలా పేర్కొన్నారు. “1985 నాటి తిరుగుబాట్లలో ఎక్కడ చూసినా ఆయన మొఖమే ప్రత్యక్షం అయ్యేది. పోస్టర్ల పైనా, టి-షర్టుల పైనా, గోడలపైనా ఎక్కడ చూసినా… ‘మండేలాను విడుదల చేయాలి’ అన్న నినాదాలు అధికార వ్యవస్ధ గోడలను అంటుకుపోయి ఉండేవి. కానీ మండేలా పేరు ఉచ్ఛరిస్తూ వీధుల్లో వెల్లువలా కదం తొక్కిన యువత ఎన్నడూ ఆయన రూపాన్ని చూసింది లేదు, ఎన్నడూ ఆయన గొంతును విన్నదీ లేదు.”

“పదివేల రోజుల జైలు జీవితం ఆయననూ, ఆయన రాజకీయ ఆకాంక్ష, స్వేచ్ఛా పిపాస, తిరుగుబాటు ప్రతిష్టలనూ కాలం బారినపడి శిధిలం కాకుండా పదిలపరించింది. ఆఫ్రికా విముక్తి కోసం లియోపోల్డ్ సెంఘోర్, జులియస్ న్యెరెరే ల యుగం నుండి ఏతెంచిన  దూతగా ఆయన అవతరించారు. అవధుల్లేని ఆఫ్రికా విముక్తి ఆశలకు ప్రతిరూపం అయ్యారు” అని ‘ది లాంగ్ వాక్ టు ఫ్రీడం’ పుస్తకాన్ని సమీక్షిస్తూ మరో రచయిత విలియం ఫిన్నెగాన్ పేర్కొన్నారు. అయితే ఈ తరహా వ్యక్తి పూజను మండేలా అనేక సందర్భాల్లో తిరస్కరించారు. బృందంలో సభ్యుడుగా, కార్యకర్తగా ఉన్నపుడు మాత్రమే తాను నిర్మాణాత్మక కృషి చేయగలనని విడుదల అనంతరం ఆయన గట్టిగా చెప్పేవారు. ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ సభ్యుడుగా మాత్రమే తన కృషికి క్రెడిట్ ఇవ్వాలని వివిధ ఇంటర్వ్యూలలోనూ, ఉపన్యాసాలలోనూ గుర్తు చేసేవారు.

ప్రముఖ అమెరికా విలేఖరి, రాజకీయ, మీడియా విమర్శకులు, స్వతంత్ర సినిమా నిర్మాత, పౌరహక్కుల ఉద్యమ కార్యకర్త అయిన డేని షేష్టర్ మండేలా జీవిత, ఉద్యమ విశేషాలపై పుస్తకాలు రాశారు. నాన్-ఫిక్షన్ సినిమాలు తీశారు. ‘మండేలా: లాంగ్ వాక్ టు ఫ్రీడం’ పేరుతో ఆయన తీసిన సినిమా వచ్చే క్రిష్టమస్ రోజు ప్రపంచం అంతా విడుదల అవుతోంది. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ లో చదివిన షెస్టర్ నల్లజాతి ప్రజల ఉద్యమానికి మద్దతుగా దక్షిణాఫ్రికాలో 1960ల్లోనే పని చేశారు.

“వర్ణ వివక్ష ఎంత దుర్మార్గమైనదో నేను కళ్ళారా చూశాను. అది కేవలం జాతికి సంపంధించినది మాత్రమే కాదు. జనాన్ని, వారి శ్రమను, కార్మిక శక్తిని నియంత్రణలో ఉంచుకునే పద్ధతుల్లో అదొకటి. అది ఎల్లప్పుడూ పూర్తిగా ఆర్ధికమైనదే. అందులో కొంతభాగమే ఆర్ధిక సంబంధితం అనుకోవడం పొరబాటు. తమకు కూడా రాజ్యాంగం వర్తింప జేయాలని అమెరికా నల్ల ప్రజలు చేసిన పోరాటంతో దక్షిణాఫ్రికా ప్రజల పోరాటాన్ని పోల్చడం ద్వారా అమెరికన్లు అయోమయం సృష్టించడానికి ప్రయత్నిస్తారు. వాస్తవం ఏమిటంటే దక్షిణాఫ్రికాలో మైనారిటీలకు కాదు, మెజారిటీ జాతి ప్రజలకు అసలు రాజ్యాంగమే లేదు.” అని డేని షెస్టర్ ఒక ఛానెల్ తో మాట్లాడుతూ అన్నారు. వర్ణ వివక్ష వాస్తవంలో సామాజిక అణచివేత మాత్రమే కాదని, పునాదిలో ఆర్ధిక దోపిడీకి శక్తివంతమైన సాధనంగా దాన్ని తయారుచేసుకున్నారని డేని మాటల ద్వారా స్పష్టం అవుతోంది.

మండేలా ఉద్యమ నిర్మాణ పద్ధతులు, పని విధానం గురించి షెస్టర్ ఇలా తెలిపారు.

“మొదటిది: ఉమ్మడి పని పద్ధతిలో మండేలాకు అమితమైన నమ్మకం ఉంది. ఇతరులతో కలిసి పని చేయడం పైనే ఆయన ప్రధాన ఆసక్తి. నలుగురి దృష్టిని ఆకర్షించే ప్రయత్నం ఎ కోశానా లేదు. ప్రముఖులకు మనం సహజంగా ఇచ్చే సెలబ్రిటీ స్ధాయిని ఆయన స్వీకరించరు.

“రెండవది: ఆయన ఉద్యమాన్ని వికేంద్రీకరిస్తూ నిర్మాణాన్ని కేంద్రీకరించారు. వివిధ తెగలను ఉద్యమంలోకి తెచ్చారు. కార్మిక యూనియన్లు ఆర్గనైజ్ చేశారు. మత సంస్ధలను కలుపుకున్నారు. ఒక ఉమ్మడి లక్ష్యం కోసం నానా విధాల ప్రజలను ఏక తాటిమీదికి తెచ్చారు. అదే సమయంలో వారికొక నిర్మాణం ఉంది. ప్రజాస్వామిక విలువలకు ఆ నిర్మాణంలో ఎక్కువ విలువ ఇచ్చారు.

మూడవది: అమెరికా వాళ్ళకు తెలియని విషయం ఏమిటంటే వర్ణ వివక్ష రద్దు అనంతరం కూడా ఎ.ఎన్.సి నేతలు తీవ్రమైన ఒత్తిడులు ఎదుర్కొన్నారు. దేశీయంగా తెల్లవారి పెట్టుబడి నుండీ, విదేశీయంగా అమెరికన్ వ్యాపారాల నుండీ తీవ్ర ఒత్తిళ్ళు వచ్చాయి. వీటి వలన వారు తలపెట్టిన సంస్కరణలను అమలు చేయలేకపోయారు. నిరంతరం వెనక్కి లాగబడ్డారు. ఇది ఒక విధమైన నయా ఉదారవాద విధానానికి దారి తీసింది. ఫలితంగా దరిద్రం, ఆకలి, నిరుద్యోగం, అవినీతి మున్నగు అనేక సమస్యలను ఎదుర్కోవడంలో వారి సామర్ధ్యం కుదించివేయబడింది.”

వర్ణ వివక్షకు వ్యతిరేకంగా పోరాడినవారిలో తెల్లజాతి వారు కూడా ఉన్నారు. అలాంటివారిలో ఫాదర్ మైఖేల్ లాప్స్-లే ఒకరు. మండేలా మరణవార్త అనంతరం ‘డెమోక్రసీ నౌ’ అనే స్వతంత్ర టి.వి చానెల్ తో మాట్లాడుతూ ఆయన ఇలా తెలిపారు. “ఇది అమితంగా చింతించవలసిన రోజు. అదే సమయంలో అమేయమైన ఆయన త్యాగశీలతకు దక్షిణాఫ్రికా మొత్తం కృతజ్ఞత తెలిపాల్సిన రోజు. ఒక విధంగా ఆయన విశ్రమించవచ్చని చెప్పాలని ఉంది. కానీ విశ్రమించడానికి సమయం కాదనీ చెప్పాలని ఉంది. ఇది ఒక అసాధారణమైన యుగాంతం. ఈరోజు నుండి దక్షిణాఫ్రికన్లు ఆత్మత్యాగం-నిబద్ధత అనే చైతన్యాన్ని చేతబట్టి కొత్త ప్రపంచం సృష్టించడానికి కంకణం కట్టుకోవలసిన రోజు. ఆయన ప్రపంచ స్ధాయి యుగకర్త” అని మైఖేల్ పేర్కొన్నారు. మండేలా విడుదల అయిన తర్వాత దక్షిణాఫ్రికా తెల్ల ప్రభుత్వ దుండగులు పంపిన లెటర్ బాంబు వలన మైఖేల్ రెండు చేతులు పోగుట్టుకున్నారు.

44 యేళ్ళ వయసులో ఖైదు చేయబడి 27 సంవత్సరాల జైలు జీవితం అనంతరం 71 యేళ్ళ వయసులో 1990 ఫిబ్రవరిలో స్వేచ్ఛా ప్రపంచంలోకి మండేలా అడుగు పెట్టారు. అయితే ఎ.ఎన్.సి నాయకత్వంలో సాగిన సుదీర్ఘ పోరాటం నల్లవారికి కూడా ఓటు హక్కుతో కూడిన ముఖ్యమైన రాజకీయ హక్కులను సాధించినప్పటికీ మౌలిక మార్పులు తేవడంలో విఫలం అయిందని చెప్పక తప్పదు. దానికి కారణం ఏమిటో డేని మాటల్లోనే తెలుస్తోంది. దేశంలో ఉత్పత్తి సాధనాలైన పరిశ్రమలు, భూములు, గనులు అన్నీ తెల్ల పెట్టుబడి నియంత్రిస్తోంది. వారికి అమెరికా పెట్టుబడి తోడయింది. స్వదేశీ, విదేశీ ఆధిపత్య వర్గాల ఒత్తిళ్లను జయించలేనప్పుడు ఉద్యమ ఫలితం ఎలా ఉండాలో అలాగే ఉంది.

భూముల పునఃపంపిణీకి పూనుకోవడానికి బదులు మార్కెట్ రేట్లకు తెల్లవారి నుండి భూములను కొనుగోలు చేసి నల్లజాతి ప్రజలకు స్వాధీనం చేసే విధానాన్ని ప్రకటించారు. దీనిని ‘ఇష్టాపూర్వక అమ్మకందారు నుండి ఇష్టాపూర్వక కొనుగోలుదారుకు భూముల బదిలీ’ అని చెప్పారు. ప్రభుత్వంపై మోయలేని భారం మోపడానికి మాత్రమే దారి తీసింది. అలా చూసినా 7 శాతం భూములను మాత్రమే తెల్లవారి నుండి నల్లవారికి బదిలీ చేయడం సాధ్యపడింది. ఇష్టపూర్వకంగా భూముల అమ్మకానికి తెల్లవారు సిద్ధపడకపోవడం దానికి ప్రధాన కారణం. వర్ణ వివక్ష పాలనను కూలదోసి ప్రజాస్వామ్య వ్యవస్ధ వేళ్లూనుకునేలా చేయడానికి ఈ మాత్రం రాజీ పడక తప్పలేదని కమ్యూనిస్టు పార్టీ నేత ధాబో ఎంబెకి (మండేలా అనంతరం 1999-2008 కాలంలో దక్షిణాఫ్రికా అధ్యక్షుడు అయ్యారీయన) వివరణ ఇచ్చారు. మెజారిటీ ప్రజల ప్రయోజనాలను కాపాడుతూనే మైనారిటీ ప్రజల భయాలను కూడా పరిగణించాల్సి వచ్చిందనీ, లేనట్లయితే మైనారిటీలు ప్రజాస్వామ్య వ్యవస్ధకు హాని చేసే ప్రమాదం పొంచి ఉందని ఆయన తమ విధానాలను సమర్ధించుకున్నారు. ఈ విధానాల ఫలితంగా 2000 సంవత్సరం తర్వాత కూడా తెల్లవారి చేతుల్లో 87 శాతం వ్యవసాయ భూములు ఉండగా మిగిలిన 13 శాతం భూములపై మాత్రమే నల్లజాతి ప్రజలకు హక్కులు లభించాయి.

మరోవైపు ఈ విధానాలు ఆచరణలో కొద్దిమంది నల్లజాతి ధనికులు వృద్ధి చెందడానికి దోహదపడింది. “బ్లాక్ ఎకనమిక్ ఎంపవర్-మెంట్” విధానం పేరుతో ప్రైవేటు రంగానికి ఒక టార్గెట్ ఇచ్చారు. సదరు టార్గెట్ మేరకు కంపెనీలు నల్లజాతి యాజమాన్యం చేతుల్లోకి వెళ్లాలని నిర్దేశించారు. కానీ ఇది కూడా భూముల పునఃపంపిణీ లాగానే ఘోరంగా విఫలం అయింది. 2009 నాటికి మార్కెట్ కేపిటలైజేషన్ (షేరు విలువ ప్రకారం ఒక కంపెనీకి ఉండే మొత్తం విలువ) ప్రకారం కేవలం 8 శాతం ప్రైవేటు వ్యాపారాలు మాత్రమే నల్లజాతి వ్యాపారుల చేతుల్లో ఉన్నాయి. తెల్లజాతి వ్యాపారుల పేరాశ వలన, ఉద్యోగాల సృష్టిలో వారికి ఆసక్తి లేకపోవడం వలన నల్లవారి పరిస్ధితి 1994లో ఎలా ఉన్నదో ఇప్పటికీ దాదాపు అలాగే ఉన్నదని ధాబో ఎంబకి స్వయంగా తెలిపారని కెనడాకు చెందిన గ్లోబల్ రీసర్చ్ సంస్ధ తెలిపింది.

గ్లోబల్ రీసర్చ్ సంస్ధ ప్రకారం మండేలా విడుదల అనంతరం జరిగిన పునర్నిర్మాణ చర్చలను టి.విలో ప్రసారం చేయగా, అసలు చర్చలు అత్యంత రహస్యంగా తెరవెనుక సాగాయి. టి.వి ప్రత్యక్ష ప్రసారాల్లో రాజకీయ చర్చలు జరుగుతుండగా తెరవెనుక ఆర్ధిక చర్చలు సాగాయి. ఇందులో ప్రపంచ బ్యాంకు పాల్గొంది. అనేక ప్రపంచ స్ధాయి బహుళజాతి వ్యాపార కంపెనీలు కూడా పాల్గొన్నాయి. ఈ కంపెనీల్లో అనేకం అమెరికాకు చెందినవే. పరిశ్రమలను, వ్యాపారాలను నియంత్రించడానికి నల్లజాతి ప్రభుత్వం చేయదలచిన ప్రయత్నాలను, చట్టాలను నిరోధించడమే లక్ష్యంగా ఈ రహస్య చర్చలు జరిగాయి. దారిద్ర్య నిర్మూలన కోసం తలపెట్టిన విధానాలలో కూడా ఇవి జోక్యం చేసుకుని అడ్డుకట్ట వేశాయి. మార్కెట్ అనుకూల స్ధిరత్వం పేరుతో ఈ విధంగా దేశాన్ని నయాఉదార దోపిడీకి కట్టుబడేలా చేయడంలో ప్రపంచ బ్యాంకు, అమెరికా బహుళజాతి కంపెనీలు సఫలం అయ్యాయి. ఫలితంగా హామీ ఇచ్చిన ఉపాధి ఎన్నడూ ప్రజల దరి చేరలేదు.

వర్ణ వివక్ష అంతం అయిన తర్వాత కూడా నల్లజాతి ప్రజల జీవన పరిస్ధితులు ఏ మాత్రం మెరుగుపడకపోవడం పట్ల నెల్సన్ మండేలా సైతం అసంతృప్తి వ్యక్తపరిచారని అమెరికా విలేఖరి డేని షెస్టర్ చెప్పడం గమనార్హం. నెల్సన్ మండేలా, ధాబో ఎంబకి లాంటి అగ్రనేతల అసంతృప్తిని బట్టే ప్రజా విముక్తి రాజీలతోనూ, ఒడంబడికలతోనూ, శాంతియుత ఒప్పందాలతోనూ ఎన్నడూ సాధ్యం కాదని స్పష్టం అవుతోంది. సాయుధ మార్గం మరోదారి లేదని ఉద్యమ కాలంలో నమ్మిన వ్యక్తులు గనకనే మండేలా, ఎంబకీలు వైఫల్యాలను అంగీకరించగలిగారు. ఆదినుండి వలస పాలకులకు, సామ్రాజ్యవాదులకు సేవలు చేయడంలో తరించినవారయితే ఈ మాత్రం ఒప్పుకోలు సాధ్యం అయ్యేది కాదేమో.

…………………అయిపోయింది 

6 thoughts on “ముగిసిన మండేలా లాంగ్ వాక్ -2

 1. మండేల గురించి మీరు రాసిన విధానానికి స్పందించి…

  ఓ మహాత్మా…! ఓ మహర్షీ……!
  ఈ దూర్తలోకాన్ని కాలితో తన్నేసి వెలిపోయిన నెల్సన్‌ మండేలా !
  తెల్ల జాతి గుండెల్లో నిదుర పోయిన వాడా!
  నల్ల జాతికికొంతైనా వెలుగుచూపిన వాడా!
  ప్రపంచానికి నీవెంతైనా వేగుచుక్కవే!
  శాస్వతంగా నిదుర పోయావు మాప్రపంచ ప్రజల గుండెలు మండెలా!
  ఆత్మల పై మాకు నమ్మకం లేదు గానీ, నల్ల జాతీ ని అంటి పెట్టుకొని ఉంటావు ఉధాత్మతవై!
  ఓ మహాత్మా…! ఓ మహర్షీ……! లాంగ్‌ లీవ్‌ మండేలా. లాంగ్‌ లీవ్‌!

 2. Excellent vishekhar sir, but i feel all your feelings are biased towards revolutionary change. Revolution also having its own disadvantages it cant create class less society. If possible write unbiased else no problem. All your articles are excellent. Keep going. Thanks.

 3. @chandu: change is not a thing we can get it in overnight, it is a contineous process. Thousands of years deprivation we cant achieve in years it will take centuries. Here we have to see how efficiently mandela worked and how he is inspiring people for centuries. Thats the readon we have to remember him. Negative thinking will not lead the change to correct direction. Thanks.

 4. Malala Yousafzai ku mandelaaku nobel prize lu ..shnathi bahumathullu evaru isthunnaru evaru virini hero laga prapancha meedhaku ruddduthunnaru .. zimbabawe lo vachina revolutionary changes ku ardhikaa anksha latho addu paduthunadhi evaru ?…….artham kanidhi Revolution changes vunte samasya lenti ? …. SA lo 10 % vunna prajala vaadda inkaaa 90% sampadanu ala ne vunchi ardhikaa samnthavani thisku rakundaa sangikaa smanthvam ela sadhyam ? 1000 years ? thella vallu SA vachindhi 18th and 19 th century lo …… shathruve villa nu endhuku hero nu chesthadu ? aaa mania lo manamu endhuku vugi povali ? marpu samyanni nirnayeeenchedi evaru ?

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s