10 జిల్లాలతో కూడిన తెలంగాణ ఏర్పాటు చేయాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. రాయల తెలంగాణ ఏర్పాటుపై సాగిన ఊహాగానాలకు దీనితో తెరపడింది. కావూరి సాంబశివరావు రాయల తెలంగాణ కోసం కేబినెట్ లో ప్రయత్నించినప్పటికి సాధ్యం కాలేదని వార్తా ఛానెళ్ల ద్వారా తెలుస్తోంది. గ్రేటర్ హైద్రాబాద్ 10 యేళ్లకు మించకుండా ఇరు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా ఉంటుంది. 13 జిల్లాల ఆంధ్ర ప్రదేశ్ కు కొత్త రాజధాని ఎక్కడో నిర్ణయించడానికి నిపుణుల కమిటీ ఏర్పాటు చేస్తారు. ఇది 45 రోజుల లోపుల నిర్ణయం తీసుకుంటుంది.
ఆంధ్ర ప్రదేశ్ ను విభజించి 10 జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలన్న నిర్ణయాన్ని ‘దురదృష్టకరం’ గా సీమాంధ్ర తెలుగుదేశం అభివర్ణించింది. కేబినెట్ నిర్ణయాన్ని నిరసిస్తూ వైకాపా పార్టీ రేపు (డిసెంబర్ 6) రాష్ట్ర బంద్ కు పిలుపిచ్చింది. తాజా పరిణామాల నేపధ్యంలో పోలీసు, పారా మిలట్రీ బలగాలను రాష్ట్ర ప్రభుత్వం మోహరిస్తోంది. 10 జిల్లాల తెలంగాణ ప్రకటించినందుకు తెలంగాణ కాంగ్రెస్ తమ నాయకురాలికి, కేంద్ర కేబినెట్ కు కృతజ్ఞతలు చెప్పింది. తెలంగాణ కావాలంటూనే తమపై దుష్ప్రచారం చేశారని కాంగ్రెస్ నేత జానా రెడ్డి ఆరోపించారు.
కేంద్ర హోమ్ మంత్రి సుశీల్ కుమార్ షిండే పత్రికలకు చెప్పిన వివరాల ప్రకారం గ్రేటర్ హైద్రాబాద్ పదేళ్ళకు మించకుండా ఉమ్మడి రాజధానిగా ఉంటుంది. బహుశా వీలయితే ఈ లోపే ఉమ్మడి రాజధానిగా హైద్రాబాద్ ఉనికి ఆగిపోయే అవకాశం ఉందని ఈ మాటలు ధ్వనిస్తున్నాయి. హైద్రాబాద్ లో (సీమాంధ్ర) ప్రజల రక్షణ కోసం తెలంగాణ గవర్నర్ కు ప్రత్యేక అధికారాలు కట్టబెట్టనున్నారు. మరో కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి ప్రకారం మరో పదేళ్ళ వరకు విద్యా, ఉపాధి రంగాలలో హైద్రాబాద్ లో కొత్త నిర్ణయాలు చేయరు.
విభజన అనంతరం ఇరు రాష్ట్రాలకు ఆర్టికల్ 371(డి) వర్తింప జేయాలని కేబినెట్ నిర్ణయించింది. అనగా ఇరు రాష్ట్రాలకు రాష్ట్రపతి ఉత్తర్వుల కింద ప్రత్యేక హోదా ఉంటుంది. ఇరు రాష్ట్రాలలోనూ వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి కేంద్రం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని షిండే తెలిపారు. మరో ఆరు నెలల్లో సాధారణ ఎన్నికలు జరిగి కొత్త కేంద్ర ప్రభుత్వం ఏర్పాటవుతుంది. కొత్త ప్రభుత్వం ఇలాంటి ప్రత్యేక శ్రద్ధకు ఎంతవరకు కట్టుబడుతుందో అనుమానమే. ఆ మాటకొస్తే మళ్ళీ కాంగ్రెస్ పార్టీయే ప్రభుత్వం ఏర్పాటు చేసినా ‘వెనుకబడిన ప్రాంతాలపై ప్రత్యేక శ్రద్ధ’ అన్న హామీ నెరవేరడం అనుమానమే. ఇలాంటి వాగ్దానాలను ఈ పార్టీలు ఎన్ని వందలసార్లు చేయలేదు?
‘ఆంధ్ర ప్రదేశ్ పునర్వ్యవస్ఢీకరణ 2013’ బిల్లు ఇప్పుడు జరుగుతున్న శీతాకాల సమావేశాల్లోనే ప్రవేశపెట్టాలని ఆశిస్తున్నట్లు షిండే చెప్పారు. కానీ ఖచ్చితంగా ప్రవేశపెడతామని మాత్రం చెప్పలేదు. సమావేశాలు 21 రోజులు మాత్రమే జరుగుతున్నందున ఈ సమావేశాల్లో బిల్లు రావడం కష్టమేనని పౌరవిమానయాన మంత్రి అజిత్ సింగ్ చెప్పడం విశేషం. బడ్జెట్ సమావేశాల్లోనే తెలంగాణ సాధ్యం అవుతుందని ఆయన స్పష్టం చేశారు.
ముసాయిదా బిల్లును ఆంధ్ర ప్రదేశ్ శాసన సభకు పంపవలసిందిగా రాష్ట్రపతికి సిఫారసు చేశామని షిండే తెలిపారు. అభిప్రాయాలు చెప్పడానికి రాష్ట్రపతి, ఏ.పి శాసన సభకు ఎన్ని రోజులు గడువు ఇచ్చేదీ తమకు స్పష్టత లేదని చెప్పారు. ఆయన ఇచ్చే గడువును బట్టి బిల్లు శీతాకాల సమావేశాల్లో పార్లమెంటులోకి వచ్చేదీ లేనిదీ తేలుతుందని సూచించారు. మరో రెండు రోజుల్లో ముసాయిదా బిల్లు రాష్ట్ర శాసన సభకు రావచ్చని ఛానెళ్లు ఊహిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఆశలకు భిన్నంగా రాష్ట్రపతి వ్యవహరిస్తారా అన్నది చూడాల్సిందే.
కేంద్ర కేబినెట్ ప్రకటన వచ్చిన ఈ రోజు రాష్ట్ర ప్రజలకు ‘బ్లాక్ డే’ అని ఎ.పి.ఎన్.జి.ఓ నేత అశోక్ బాబు వ్యాఖ్యానించారు. కేబినెట్ నిర్ణయం కాగానే తెలంగాణ ఏర్పాటయినట్లే అని భావించడం సరికాదని ఓ వింత వ్యాఖ్య చేశారాయన. శాసనసభ, పార్లమెంటుల్లో ఆమోదం పొందాకనే విభజన జరిగినట్లన్న సంగతి గుర్తించాలని అశోక్ బాబు హిత బోధ చేశారు. సీమాంధ్ర ప్రజలను ఇంకా మభ్య పెట్టాలని చూడడం బాధ్యతారాహిత్యం. ఒక ఉద్యోగ సంఘ నేతకు అది తగనిపని. రాజకీయ నాయకులకు విలువలు ఎలాగూ లేవని జనం నిర్ణయించేసుకున్నారు. ప్రజా సంఘాల నేతలయినా వారికి భిన్నంగా ఉండాలని ఆశించడంలో తప్పులేదనుకుంటాను.
13 జిల్లాల ఆంధ్ర ప్రదేశ్ కు కొత్త రాజధాని ఎక్కడ అన్న విషయం నిర్ణయించడానికి నిపుణుల కమిటీ ఏర్పాటు చేస్తామని షిండే తెలిపారు. ఈ కమిటీ 45 రోజుల లోపు నివేదిక ఇస్తుందని తెలిపారు. ఇప్పుడిక కొత్త రాజధాని కోసం రాయబారాలు, లాబీయింగులు, అదిరింపులు-బెదిరింపులు, వేడుకోళ్ళు, చర్చలు ఊపందుకుంటాయి. టి.వి ఛానెళ్లకు, పత్రికలకు బోలెడు మేత. కొన్నాళ్లు తెలంగాణ ప్రకటిస్తారా లేదా అని, ఆ తర్వాత ప్రకటించిన తెలంగాణ ఇస్తారా లేదా అని, ఇంకొన్నాళ్లు యు.టియా లేక ఉమ్మడి రాజధానా అనీ, ఆ తర్వాత 10 జిల్లాల తెలంగాణా లేక 12 జిల్లాల తెలంగాణా అని, మరో కొన్ని రోజుల పాటు రాష్ట్రపతి ఎన్ని రోజుల గడువు ఇస్తారా అని, ఆ తర్వాత అసెంబ్లీ ఏమి చేస్తుందా అనీ, ఆ తర్వాత శీతాకాల సమావేశాలా లేక ప్రత్యేక సమావేశాలా లేక బడ్జెట్ సమావేశాలా అనీ….
అబ్బబ్బ! తెలంగాణ ఏర్పాటు అంత తేలిక కాదు సుమీ! సాగదీసెటోడికి సాగదీసినంత! అలిగినోడికి అలిగినంత! కలిగినోడికి కలిగినంత! పూసినోడికి పూసినంత! రాసినోడికి రాసినంత! అనుభవించడానికి జనానికి ఎంతో ఎప్పటికీ తేలేను?
sir,
please explain article 371D.
సీమాంధ్రుల విభిన్న పక్షపాత రాజకీయ ధోరణులు తెలంగాణా రాష్ట్ర ఆవిర్భావానికి దోహదపడ్డాయి అనడంలో ఎట్టి సందేహం లేదు. పదవి కక్కుర్తికి పర్యవసానం వారి బలహీనత. చేతులు కాలాక ఆకులు పట్టుకోవడంలో వాళ్ళ డొల్లతనం బయటపడుతుంది. ఆత్మాభిమానం లేని రాజకీయం ఎదుటివారిలో ఆత్మస్థైర్యానికి ఆయువుపట్టు అవుతుంది. ఈ దశలో అధిష్టానం తెలివిగా పవులు కదిపి సీమాంధ్ర నాయకులను చెప్పు కింద తేళ్ళులా నలిపేశారు. వారి ఆక్రోశంలో బాధకంటే బాధ్యతారహితం అత్యధికం. రాయలసీమ రాయలతెలంగానం, విశాఖ గిరిజన మంత్రి రాజధాని, ఏలురు మంత్రి హైద్రాబాద్ యు.టి. అని అజ్ఞాన ప్రకటనలతో ప్రకంపనాలు సృష్టించి ప్రత్యేక తెలంగాణా రాష్ట్రసాధనలో భాగస్వాములయ్యారు.