రెండొంతులు మహిళా విలేఖరులకు వేధింపులు, బెదిరింపులు


ప్రపంచ వ్యాపితంగా మహిళా విలేఖరులు అనేక గడ్డు పరిస్ధుతుల మధ్య వృత్తి ధర్మం నిర్వహిస్తున్నారు. జర్నలిస్టులుగా పని చేస్తున్న మహిళల్లో మూడింట రెండు వంతుల మంది వేధింపులు, బెదిరింపులు, లైంగిక అత్యాచారాలను ఎదుర్కొంటున్నారు. మహిళా విలేఖరుల పైన మొదటిసారి జరిగిన సర్వేలో ఈ సంగతి వెల్లడి అయింది. వార్తల మీడియాలో పని చేస్తున్న స్త్రీలు ఎదుర్కొంటున్న వివిధ హింసల గురించి ఈ సర్వే జరిగింది. ఈ వేధింపులు ఏ స్ధాయిలో జరుగుతున్నాయో తెహెల్కా ఎడిటర్-ఇన్-చీఫ్ తరుణ్ తేజ్ పాల్ ఉందంతం తెలియజేస్తోంది.

తమ వృత్తికి సంబంధించి ‘వేధింపులు, బెదిరింపులు, దుర్భాషలు, లైంగిక వేధింపులు’ ఎదుర్కొంటున్నారా అన్న ప్రశ్నకు సమాధానాలను సర్వే సేకరించింది. ప్రపంచవ్యాపితంగా 822 మంది మహిళా విలేఖరులను సర్వే చేయగా వారిలో 530 మంది ‘అవును’ అని సమాధానం ఇచ్చారు. అనగా 64 శాతం మంది.

వాషింగ్టన్ డి.సి నుండి పని చేసే ‘ఇంటర్నేషనల్ వుమెన్స్ మీడియా ఫౌండేషన్’ సంస్ధ, లండన్ నుండి పని చేసే ‘ఇంటర్నేషనల్ న్యూస్ సేఫ్టీ ఇనిస్టిట్యూట్’ (ఐ.ఎన్.ఎస్.ఐ), ఐరాసకు చెందిన ‘గ్లోబల్ ఫోరం ఫర్ మీడియా అండ్ జెండర్’ సంస్ధ… ఈ మూడూ ఉమ్మడిగా ఈ సర్వే నిర్వహించాయని ది హిందు తెలిపింది.

వేధింపుల్లో ప్రధానమైనవి: పై పదవి ద్వారా అందుబాటులో అధికారం ఉపయోగించుకుని వేధింపులకు పాల్పడుతున్నారని 22.5 శాతం మంది చెప్పారు. దుర్భాషలు, రాత పూర్వకమైన మరియు భౌతిక వేధింపులు ఎదుర్కొంటున్నట్లు 21 శాతం మంది చెప్పారు. పరువు ప్రతిష్టలకు భంగం కలిగించే ప్రయత్నం చేయడం లేదా అలా చేస్తామని బెదిరించడం లాంటి వేధింపులు ఎదుర్కొంటున్నామని 18.73 శాతం మంది చెప్పారని ది హిందు తెలిపింది. వీటిలో మెజారిటీ కేసుల్లో బాస్, సూపర్ వైజర్, సహోద్యోగి, ఇంటర్వ్యూ చేసే వ్యక్తి… వీరే ప్రధాన నిందితులు.

46 శాతం మంది మహిళా విలేఖరులు లైంగిక వేధింపులు ఎదుర్కొన్నామని తెలిపారు. లైంగిక వేధింపులు ఎదుర్కొనే సాధారణ స్ధలం కార్యాలయమే (office) అని 59 శాతం మంది చెప్పారు. ఆఫీసుల్లో వేధింపులకి పాల్పడేవారిలో ప్రధమ స్ధానాన్ని సహోద్యోగులు ఆక్రమించారు. ఆ తర్వాత స్ధానం ఇంటర్వ్యూ చేసేవారిది కాగా మూడో స్ధానం బాస్ లది.

లైంగిక వేధింపులు ఎలా ఉంటాయి? ‘దుస్తుల ధారణ గురించి, కనపడే విధానం (appearance) గురించి అసభ్య కూతలు కూయడం’ ఒక పద్ధతి. 68 శాతం మంది ఇలాంటి వేధింపులు ఎదుర్కొంటున్నట్లు చెప్పారు. లైంగిక సూచనలు, శబ్దాలు చేయడం చేస్తారని 57 శాతం మంది చెప్పారు. లైంగిక అర్ధాలతో జోక్ లు వేయడం ద్వారా వేధిస్తారని 57 శాతం మంది చెప్పారు.

మహిళా విలేఖరుల్లో 63 శాతం మంది లైంగిక హింసను ఎదుర్కొంటున్నామని చెప్పారు. ఇవి ఆఫీసుల్లోనూ, విధినిర్వహణ చేసే చోట్లలోనూ జరుగుతున్నాయని వారు చెప్పారు. తమ ఇష్టానికి వ్యతిరేకంగా లైంగిక పద్ధతుల్లో తాకడం ద్వారా హింస ఎదుర్కొన్నామని 85 శాతం మంది చెప్పారు. పనికి సంబంధించి హింస లేదా వేధింపుల పరిస్ధితిని ఎదుర్కోవడానికి తమ యాజమాన్యాలు లేదా పై అధికారులు తమను ఏ విధంగానూ హెచ్చరించడం, సిద్ధపరచడం చేయలేదని 80 శాతం మంది చెప్పారు.

సర్వేలో పాల్గొన్నవారిలో 50 శాతం మంది వార్తా పత్రికల్లో పని చేసేవారు. వారిలో కూడా అత్యధికులు రిపోర్టర్లే.

పైన పేర్కొన్న ఐరాస సంస్ధ మహిళా విలేఖరులు ఎదుర్కొంటున్న అనేక ఇబ్బందులను సేకరించి రికార్డు చేస్తోంది. దుర్భాషలు, లైంగిక హింస, భౌతిక హింస, లైంగిక వేధింపులు, జాతి వివక్షతో కూడిన వేధింపులు, వయసు సంబంధిత వేధింపులు, డిజిటల్ భద్రతకు సంబంధించిన బెదిరింపులు వీటిలో కొన్ని. వేధింపులను ఎంతవరకు నిరోధిస్తున్నది, బాధితులను ఎంతవరకు రక్షిస్తున్నది, వారిని ఏ మేరకు సిద్ధం చేస్తున్నది కూడా ఈ సంస్ధ కొలుస్తుంది.

లైంగిక వేధింపుల వలన మహిళా విలేఖరులపై మానసికంగా తీవ్ర ప్రభావం కలుగుతోంది. అయినప్పటికీ వారిలో 50 శాతం మంది తమ చేదు అనుభవాలను ఫిర్యాదు చేయడం లేదని సర్వేలో తేలింది.

“విలేఖరుల భద్రత అనగానే మనం సాధారణంగా యుద్ధరంగాల్లో రక్షణ పొందడం, అలజడులు, ఆందోళనలు జరిగే వార్తలు కవర్ చేసేటప్పుడు రక్షణ పొందడం, పర్యావరణ వినాశనాలు, ప్రమాదాలు జరిగే వార్తలను కవర్ చేసేటప్పుడు పొందవలసిన రక్షణ… ఇలానే ఆలోచిస్తాము. కానీ కార్యాలయమే శత్రుపూరిత వాతావరణాన్ని మహిళలకు అందిస్తున్నాయని మనం ఎంత తరచుగా ఆలోచిస్తాం?” అని ఐ.ఎన్.ఎస్.ఐ డైరెక్టర్ హన్నా స్టార్మ్ ప్రశ్నించారు.

నిజమే కదా!

One thought on “రెండొంతులు మహిళా విలేఖరులకు వేధింపులు, బెదిరింపులు

  1. మహిళా విలేఖరులకు ఈ సారాంశాననుసరించి బైకులు నడిపేవారికి శిరస్త్రాణం ధరించే రీతిలో వీరికి లైంగిక (వేధింపు) రక్షణ కవచాలు త్వరలో అమలులోకి తెచ్చే ప్రక్రియకు శ్రీకారం చుట్టక తప్పదు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s