బద్ధ శత్రు దేశాలకు ఇరాన్ స్నేహ హస్తం


Mohammad Javad Zarif

ఇరాన్ తన బద్ధ శత్రు దేశాలకు కూడా స్నేహ హస్తం చాస్తోంది. P5+1 దేశాలతో తాత్కాలిక ఒప్పందం కుదిరిన వెంటనే ఇరాన్ విదేశీ మంత్రి మహమ్మద్ జవద్ జరీఫ్ మధ్య ప్రాచ్యంలోని ఇతర ప్రత్యర్ధి దేశాలతో సంబంధాలను బాగు చేసుకునే పనిలో పడ్డారు. అందులో భాగంగా సున్నీ ముస్లిం మత దేశాలలో ఆయన పర్యటిస్తున్నారు. మధ్య ప్రాచ్యంలో మతపరంగానూ, చమురు వాణిజ్య ప్రయోజనాలపరంగానూ తమకు ప్రధాన ప్రత్యర్ధి సౌదీ అరేబియా కు సైతం జారీఫ్ ప్రయాణం చేయడం విశేషం.

P5+1 దేశాలు, ఇరాన్ ల మధ్య నవంబర్ లో చరిత్రాత్మక ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. ఇది జరిగిన వెంటనే ఇరాన్ విదేశీ మంత్రి మహమ్మద్ జవద్ జరిఫ్ మధ్యప్రాచ్యంలో సుడిగాలి పర్యటన చేపట్టారు. ఇరాన్ ఒప్పందం పట్ల అనుమానాలు వెలిబుచ్చిన దేశాలకు ప్రయాణించి వారి అనుమానాలను నివృత్తి చేయడం లక్ష్యంగా ఈ పర్యటన సాగింది. సోమవారం కువైట్ వెళ్ళిన జరిఫ్, కలిసి పనిచేయడానికి ముందుకు రావాల్సిందిగా సౌదీ అరేబియాను ఆహ్వానించారని ఎ.ఎఫ్.పి వార్తా సంస్ధ తెలిపింది. “ఈ ప్రాంతంలో సౌదీ అరేబియాను మేము ఒక ముఖ్యమైన, ప్రభావశీలమైన దేశంగా పరిగణిస్తున్నాము. ఈ ప్రాంతంలో శాంతి, సుస్ధీరతల కోసం కలిసి పని చేద్దామని ఆహ్వానిస్తున్నాము” అని జరిఫ్ ప్రకటించారు.

P5+1 తో ఒప్పందం కుదిరినప్పటికి ఇది తాత్కాలికమే. అనగా 6 నెలలు. సౌదీ అరేబియా, ఇజ్రాయెల్ ల వలన ఈ ఒప్పందం దీర్ఘకాలిక ఒప్పందంగా మారకుండా ఉండే ప్రమాదాన్ని ఇరాన్ ఎదుర్కొంటోంది. ఇరాక్, సిరియా, లెబనాన్ లలో సౌదీ అనుకూల శక్తులు పని చేస్తున్నాయి. ప్రాంతీయంగా ఇరాన్ ప్రయోజనాలను దెబ్బతీయగల శక్తి వీటికి ఉన్నది. షియా-సున్నీ సెక్టేరియన్ ఘర్షణలను ప్రోత్సహించడం ద్వారా నెలల తరబడి చర్చల ద్వారా సాధించిన అంతర్జాతీయ సానుకూలత దెబ్బ తినిపోయే ప్రమాదం ఉన్నది. అందుకే ప్రాంతీయంగా వైరి శక్తులను మంచి చేసుకునేందుకు ఇరాన్ ప్రయత్నిస్తోంది.

ఈ ప్రయత్నాలలో భాగంగా జెనీవా ఒప్పందం ఎవరికి వ్యతిరేకం కాదని ఇరాన్ విదేశీ మంత్రి తన పర్యటనలో హామీ ఇచ్చాడు. “ఈ ప్రాంతంలో ఎ దేశానికి వ్యతిరేకంగానూ జెనీవా ఒప్పందం ఉద్దేశించబడలేదు. అంతర్జాతీయ శక్తులతో కుదిరిన అణు ఒప్పందం ప్రాంతీయ సుస్ధిరత, భద్రతల కోసమే అని హామీ ఇస్తున్నాము” అని జరిఫ్ తమ పొరుగు గల్ఫ్ దేశాలకు హామీ ఇచ్చారు.

జెనీవాలో P5+1 ఒప్పందానికి ముందు ‘ఎలాంటి ఒప్పందానికైనా తాము వ్యతిరేకం’ అని సౌదీ అరేబియా ప్రకటించింది. ఇరాన్ అణు కార్యక్రమాన్ని ప్రపంచ దేశాలు అడ్డుకోకపోతే తాము చూస్తూ ఊరుకోబోమని బ్రిటన్ లో సౌదీ రాయబారి ‘ద టైమ్స్’ పత్రికకు ఇంటర్వ్యూ ఇస్తూ స్పష్టం చేశాడు. పాకిస్ధాన్ అణు బాంబుల నిర్మాణంలో సౌదీ అరేబియా పెట్టుబడులు పెట్టిందని, తాను కోరుకున్నపుడు అణు బాంబులు తెప్పించుకోగల పొజిషన్ లో సౌదీ అరేబియా ఉన్నదని బి.బి.సి అదే సమయంలో సంచలనాత్మకంగా ప్రకటించింది.  

ఈ నేపధ్యంలోనే ఇరాన్ విదేశీ మంత్రి వైరి దేశాల పర్యటన చేపట్టారు. కువైట్, ఒమన్, యు.ఎ.ఇ, కతార్ దేశాలను ఆయన పర్యటించారు. ఇరాన్, అమెరికాల మధ్య గత జనవరి నుండి రహస్య చర్చలు ఒమన్ లో జరగడం విశేషం. ఇరాన్ కు చెందిన కొన్ని సహజవాయు క్షేత్రాలను కతార్ దేశం కూడా భౌగోళికంగా పంచుకుంటోంది. కతార్ పర్యటన ద్వారా ఈ అంశాన్ని కూడా ఇరాన్ మంత్రి చర్చించి ఉండవచ్చని పత్రికలు భావిస్తున్నాయి.

1979 నాటి ఇస్లామిక్ విప్లవం ద్వారా అమెరికా అనుకూల షా ప్రభుత్వాన్ని కూలదోసిన తర్వాత ఇరాన్ షియా రాజ్యాన్ని కూల్చడానికి అమెరికా తదితర పశ్చిమ దేశాలు చేయని ప్రయత్నం లేదు. చమురు వాణిజ్యంలో పోటీ లేకుండా చేసుకోడానికి సౌదీ అరేబియా సున్నీ రాచరికం అమెరికాకు పూర్తిగా సహకరిస్తూ వచ్చింది. షియా మతంలోనే ఒక శాఖకు చెందిన బషర్ ఆల్-అస్సాద్ ప్రభుత్వం, లెబనాన్ లోని షియా మత హిజ్బోల్లాలు ఇరాన్ కు అండగా నిలిచాయి. ప్రాంతీయంగా ఇజ్రాయెల్ సాగిస్తున్న జాత్యహంకార, దురాక్రమణ విధానాలను ఈ మూడు శక్తులు స్ధిరంగా ప్రతిఘటించాయి.

ఇరాన్ ప్రతిఘటనను లొంగదీసుకోడానికి అమెరికా ఆ దేశ అణు విధానాన్ని అస్త్రంగా ప్రయోగించింది. అంతర్జాతీయ అణు శక్తి సంస్ధ (ఐ.ఎ.ఇ.ఎ) లో ఇరాన్ సభ్య దేశం. అందువలన విద్యుత్, వైద్య ప్రయోజనాలకు అణు పరిజ్ఞానాన్ని వినియోగించుకునే హక్కు ఇరాన్ కు ఉంది. కానీ ఇరాన్ రహస్యంగా అణు బాంబు నిర్మిస్తోందంటూ పశ్చిమ పత్రికలు అబద్ధపు ప్రచారం సాగించాయి. మరోవైపు ఇజ్రాయెల్ నిజంగానే అణ్వస్త్రాలను కుప్పలు పోస్తున్నా చూసీ చూడనట్లు నటించాయి. అంతర్జాతీయ తనిఖీల పేరుతో ఇరాన్ అణు కర్మాగారాల్లోకి గూఢచారులను ప్రవేశపెట్టి విద్రోహ చర్యలకు అమెరికా, ఇజ్రాయెల్ పాల్పడ్డాయి. ఇరాన్ అణు శాస్త్రవేత్తలను అనేకమందిని కుట్ర చేసి హత్య చేశాయి. వీటన్నింటిని అధిగమిస్తూ యురేనియం శుద్ధి చేసే శక్తిని ఇరాన్ అభివృద్ధి చేసుకుంది. రష్యా సహాయంతో ఆయుధ శక్తిని పటిష్టం చేసుకుంది.

ఇరాన్ ప్రతిఘటనకు ఒక ఫ్రంట్ గా ఉన్న సిరియాను దారిలోకి తెచ్చుకుంటే ఇరాన్ ను లొంగదీసుకోవచ్చన్న ఆలోచనతో సిరియాలో కిరాయి తిరుగుబాటును అమెరికా, ఐరోపా, ఇజ్రాయెల్, సౌదీ అరేబియా, కతార్, యు.ఎ.ఎ లు ప్రవేశపెట్టాయి. రెండున్నరేళ్లు గడిచినా సిరియా ప్రభుత్వాన్ని కూల్చలేకపోయాయి. పైగా యురేనియం అణు శుద్ధి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇరాన్ మరింత పెంచుకుని అణు బాంబుకు అవసరమైన 90 శాతం శుద్ధి చేయగల శక్తిని సంతరించుకునేవైపుగా వేగంగా ప్రయాణిస్తోంది.

మరోవైపు అమెరికా, ఐరోపాలను ఆర్ధిక సమస్యలు చుట్టుముట్టాయి. చైనా ఆర్ధికంగా బలోపేతం అయింది. రష్యా బలీయమైన ఐరోపా శక్తిగా అభివృద్ధి చెందుతూ చైనాతో కలిసి బ్రిక్స్ కూటమిని ఏర్పాటు చేసింది. ఆఫ్రికా, దక్షిణ అమెరికాలలో చైనా ప్రభావం విస్తరిస్తోంది. ప్రపంచ రాజకీయాలు పశ్చిమ దేశాల చేతుల్లోనుంచి జారిపోయే ప్రమాదం ముంచుకొచ్చింది.

ఫలితంగా అమెరికా, ఐరోపాలు ముఖ్యంగా అమెరికా ఎత్తుగడలు మార్చుకుంది. అదిరింపులు, బెదిరింపులు, దాడులకు బదులు స్నేహం నటించే ఎత్తుగడను చేపట్టింది. దాడులకు ప్రతిఫలం దక్కకపోగా స్వయంగా ఆర్ధిక క్షీణతకు అవి దారితీస్తున్న సంగతిని గుర్తించడమే కాక, గతంలోవలే బెదిరించే శక్తి తనకు కొరవడిందని, బెదిరిపోయే పరిస్ధితి అవతలి దేశాలకూ లేదనీ అమెరికా గుర్తించిన ఫలితమే ఇరాన్ తో ఒప్పందానికి అది సిద్ధపడడం. ఒక వైఫల్యం నుండి గుణపాఠం తీసుకుని మరో మార్గంలో సాఫల్యం వైపుగా ప్రయాణించే ఎత్తుగడను అమెరికా చేపట్టింది. బలంతో చేయలేని పనిని రాజనీతితో, దౌత్యంతో పూర్తి చేయడానికి ఉపక్రమించింది. అంతే తప్ప అమెరికా ఆధిపత్య లక్ష్యంలో మార్పులేమీ లేవు.

వాణిజ్య వైరి దేశాలతో సైతం సంబంధాలు పెట్టుకునేందుకు ఇరాన్ ప్రయత్నించడం వల్ల ఆ దేశానికి మేలు జరగొచ్చు. కానీ చేజారిన శక్తులను కూడదీసుకునేందుకే అమెరికా వెనకడుగు వేస్తోందన్న సంగతి గుర్తుంచకపోతే అంతిమ పరిశీలనలో ఒక్క ఇరాన్ కే కాకుండా మూడో ప్రపంచ దేశాలన్నింటికీ నష్టం కలిగించే పరిణామాలు చోటు చేసుకునే అవకాశం పొంచి ఉంది. అమెరికా-యూరప్-ఇజ్రాయెల్ దుష్ట కూటమి ప్రభావాన్ని తుడిచిపెట్టే కృషిని పక్కన పెడితే ఇరాన్ ప్రజలు తీవ్రంగా నష్టపోక తప్పదు.

4 thoughts on “బద్ధ శత్రు దేశాలకు ఇరాన్ స్నేహ హస్తం

  1. పింగ్‌బ్యాక్: బద్ధ శత్రు దేశాలకు ఇరాన్ స్నేహ హస్తం | ugiridharaprasad

  2. అమెరికా దేశం ఎటుపోతున్నాదో ఆదేశానికే తెలియటం లేదనిపిస్తుంది. ప్రతి ఒక్కటి ప్రైవేటై జేషన్ చేయటం మొదలుపెట్టి, సి.ఐ.ఎ. చేసేపనిని కూడా ప్రైవేట్ కంపెనిలకు థార్డ్ పార్టి అవుట్సుర్సింగ్ ఇస్తున్నట్లు, ఇంతకు మునుపు వచ్చిన వార్తల వలన అర్థమతుంది. బహుశా మనదేశం వారు , అది ఐ.టి. కంపెని అనుకొని అప్రోచ్ అయిఉంటారు. ఇప్పుడు దాని గురించి కొత్త వర్తలు తెలిసితే ఎమీ చేయాలో పాలుపోక జుట్టుపీకొంట్టుంటారు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s