తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కేవలం సోనియా చేతుల్లోనే ఉందన్నట్లుగా అనేకమంది అభిప్రాయపడడం ఏమిటో అర్ధం కాకుండా ఉంది. తెలంగాణ ప్రజల ఆందోళన, ఆకాంక్షలు, చరిత్ర… ఇవేవీ లేకుండానే కేంద్ర ప్రభుత్వం నడుపుతున్న కాంగ్రెస్ పార్టీ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పడం, చిత్రించడం అమాయకత్వమా, అజ్ఞానమా, మిడి మిడి జ్ఞానమా?
వివిధ పార్టీల నేతలు ఇరుకు స్వభావంతో, స్వార్ధ ప్రయోజనాల కోసం అంతా సోనియాయే చేస్తున్నట్లు చెబితే చెప్పొచ్చు గాక! సోనియా వల్లనే తెలంగాణ సాధ్యం అయిందంటూ ఓట్ల రాజకీయాలు చెయ్యొచ్చు గాక! కానీ పత్రికలకి ఏమొచ్చింది?
ఈ కార్టూన్ చూస్తే తెలంగాణ వ్యవహారం మొత్తం సోనియా చేతుల్లోనే నడుస్తున్నట్లు అర్ధం స్ఫురిస్తోంది. ఇటువంటి కార్టూన్ ది హిందు లాంటి పత్రికలో రావడం నాకసలు నచ్చలేదు. ఈ కార్టూన్ ప్రచురించడం అంటే తెలంగాణ ప్రజల ప్రజాస్వామిక ఆకాంక్షలను నిరాకరిస్తున్నట్లు చెప్పడమే.
జనం లేకుండా, జనం వేసే ఓట్లు లేకుండా కాంగ్రెస్ పార్టీ లేదు, ప్రభుత్వమూ లేదు. సోనియా అంతకన్నా లేదు. సి.డబ్ల్యూ.సి కమిటీ, కేంద్ర కేబినెట్, మంత్రుల కమిటీ (జి.ఓ.ఎం) వీళ్ళెవరూ లేకుండా సోనియా ఏం చేయగలరు? మరీ ముఖ్యంగా తెలంగాణ ప్రజల్లో ఆ కోరిక లేకుండా తెలంగాణ వంటకానికి సోనియా పూనుకోగలరా?
రాయల తెలంగాణ సాకారం అయితే దానికి కాంగ్రెస్ ని గానీ, సోనియా గాంధీని గానీ లేదా ఆమె సహచరులను గానీ విమర్శించినా, ప్రశంసించినా ఒక అర్ధం ఉంటుంది. ఎందుకంటే అది ప్రజల కోరిక కాదు కాబట్టి. ఆ రెండు జిల్లాల్లోని కొంతమంది ధనికవర్గాల కోరిక ఉండొచ్చు గానీ ప్రజల ప్రయోజనాలు మాత్రం అందులో ఉండవు. కేవలం సమైక్యాంధ్ర పేరుతో సాగుతున్న ఆందోళనలను చల్లార్చడానికి, అసెంబ్లీ, పార్లమెంటుల్లో నాలుగు సీట్లు ఎక్కువ సంపాదించడానికి ఇలాంటి చర్యకు పాల్పడితే రాయలసీమ సాంస్కృతిక, చారిత్రక ఐక్యతను విచ్ఛిన్నం చేయడం కాదా?
కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనేది సోనియా, కాంగ్రెస్ లు మాత్రమే పూనుకుంటే అయ్యేది కాదు. కేంద్రంలో బి.జె.పి మద్దతు లేకుండా, రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీల సమ్మతి లేకుండా ఒక్క కాంగ్రెస్, సోనియా లవల్లనే రాష్ట్రం ఏర్పడుతోంది అని సూచించడం అజ్ఞానం అన్నా కావాలి, లేదా వాస్తవాల విస్మరణ అన్నా కావాలి లేదా ఐదారు దశాబ్దాల ప్రజల పోరాటం పట్ల గుడ్డితనంతో ఉండడం కావాలి.
hindu telangana meedha dani panithyam meeru ippude gurthincharaa …. telangana vadulu eppudo gurthincharu …. CPM ,Hindu ,N Ram telangana ku pachi vyathirekulu
రాయల తెలంగాణా కు మద్దతు తెలపడంలో న్యాయం ఉంది!తెలుగు వారికి రెండు రాష్త్రాలు ఉన్నప్పుడు,రాయలసీమవాసులు రెండు రాస్త్రాలలో ఉంటే కలిగే ఇబ్బందులలో పెద్దగా తేడా ఏమీలేదు!
గుడ్లగూబలు సూర్యోదయం చూడలేనట్లు తెలంగాణ ప్రజలు ఇన్ని సంవత్సరాలుగా పోరాడుతున్నా…., వారికి నైతిక మద్తతు కానీ, సానుభూతి కానీ చూపలేని వారు చేసే వాదన ఇది.
తన ప్రయోజనాల కోసమే ఐతే తెలంగాణే కాదు. దేశంలో చాలా రాష్ట్రాల డిమాండ్లు ఉన్నాయి. ఆ రాష్ట్ర్రాలన్నీ ఇస్తే అప్పుడు అందరూ సోనియా కూటమికో, కొడుక్కో ఓట్లు వేస్తారు కదా. ?
మరి సోనియా, విదర్భ తదితర రాష్ట్రాలను ఎందుకు ఇవ్వడం లేదు.? ఆ మాట కొస్తే- తెలంగాణ ఓట్ల కోసమే ఐతే…తెలంగాణ ఇవ్వకుంటేనే సీమాంధ్రలో ఎక్కువ ఓట్లు వస్తాయి కదా…? తక్కువ ఓట్లు ఉన్న తెలంగాణకే ఎందుకు మొగ్గు చూపుతున్నారు….?
ఎందుకంటే ఒక నాయకుడు ఇవ్వాలనుకుంటే రాష్ట్రం ఇవ్వలేరు. దానికి ప్రజల డిమాండ్ ఉండాలి..?
ఒక వేళ సోనియా ఇప్పుడు ఇవ్వకున్నా…, రేపు అదే అంశాన్ని బీజేపీ తనకు అనుకూలంగా మార్చుకుంటుంది. కాబట్టి యూపీఏ తెలంగాణ ఇవ్వక తప్పని పరిస్థితి ఏర్పడింది.