ఉక్రెయిన్: రష్యా వైపా, ఇ.యు వైపా?


యూరోపియన్ యూనియన్ లో చేరడాన్ని ఉక్రెయిన్ వాయిదా వేయడంతో ఇప్పుడక్కడ ఆందోళనలు జరుగుతున్నాయి. ప్రజలు పెద్ద ఎత్తున రాజధానికి తరలి వచ్చి ఇ.యు లో చేరాలంటూ నినాదాలు చేస్తున్నారు. ఇ.యులో చేరడాన్ని నిరాకరిస్తున్న అధ్యక్షుడు, ప్రధాని రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. పశ్చిమ దేశాలకు అనుకూలంగా వ్యవహరించే మూడు ప్రతిపక్ష పార్టీల నేతృత్వంలో ఈ ఆందోళనలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అల్లర్లకు పాల్పడినవారిని పోలీసులు అరెస్టు చేయగానే అమెరికా, ఐరోపాల ప్రభుత్వాలు, పత్రికలు ‘మానవ హక్కులు’ అంటూ కాకి గోల చేయడాన్ని బట్టి ఆందోళనల స్పాన్సరర్లు, లబ్దిదారులు ఎవరో అర్ధం అవుతూనే ఉంది.

ఉక్రెయిన్ లో జరుగుతున్న ఆందోళనలు 2004 నాటి ‘ఆరంజ్ రివల్యూషన్’ ను గుర్తుకు తెస్తున్నాయని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఆరంజ్ రివల్యూషన్ నిజానికి రివల్యూషన్ కాదు. అప్పటి అధ్యక్ష ఎన్నికల్లో మెజారిటీ ఓట్లతో అధ్యక్ష పదవి చేపట్టిన యనుకోవిక్ ఐరోపా దేశాల అడుగులకు మడుగులు ఒత్తడానికి నిరాకరించాడు. పశ్చిమ దేశాలు తమ నిధులతో నడిచే ఎన్.జి.ఓ సంస్ధల సహాయంతో ఆందోళనలు రెచ్చగొట్టాయి. న్యాయమూర్తులు సైతం అమ్ముడుబోయి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికయిన యనుకోవిక్ ను అధ్యక్షపదవి నుండి తప్పించారు. దీనినే ‘ఆరంజ్ రివల్యూషన్’ గా పశ్చిమ దేశాలు, పత్రికలు సంతోషంగా చెప్పుకుంటాయి.

ఇ.యు ప్రతిపాదించిన ‘అసోసియేషన్ అగ్రిమెంట్’ ని చదివినవారు ఎవ్వరూ ఇ.యు లో చేరాలని ఆందోళన చెయ్యరని ప్రధాని అజరోవ్ ప్రకటించడం గమనించాల్సిన విషయం. ఇ.యు ఒప్పందాన్ని వాయిదా వేయడానికే తాము నిర్ణయించుకున్నామని అధ్యక్షుడు యనుకోవిక్, లిధువేనియా రాజధాని విలినియస్ లో నవంబర్ 30 తేదీతో ముగిసిన ఇ.యు సమావేశాల్లో స్పష్టం చేశాక ఉక్రెయిన్ రాజధాని కీవ్ లో ఆందోళనలు తీవ్రం అయ్యాయి. వీటిని పోలీసులు అదుపులోకి తెచ్చినప్పటికీ మరికొంతమంది ఇంకా ఆందోళనల్లో ఉన్నారు. రాజధానిలో తిష్ట వేసిన ఆందోళనకారుల వల్ల తమకు తీవ్ర అసౌకర్యంగా ఉన్నదని నగరవాసులు ప్రభుత్వాధికారులకు ఫిర్యాదులు చేయడం విశేషం.

ఆర్ధిక సమస్యలతో సతమతం అవుతున్న ఉక్రెయిన్ కు ఆర్ధిక సాయం ఇవ్వడంలో ఇ.యు విఫలం అయిందని అందుకే తాము ఒప్పందం వాయిదా వేస్తున్నామని అధ్యక్షుడు విక్టర్ యనుకోవిక్ విలినియస్ చర్చల్లో స్పష్టం చేశాడు. ‘ఈస్ట్రన్ పార్టనర్ షిప్’ పేరుతో జరిగిన విలినియస్ సమావేశాల సందర్భంగా ఇ.యు లో చేరడానికి ఆర్మీనియా కూడా నిరాకరించింది. అయినా అదేమీ పెద్ద సమస్య కాలేదు. దానికి ఒక కారణం ఉక్రెయిన్ కీలక భౌగోళిక స్ధానంలో ఉండడం కాగా సహజ వనరులూ అపారంగానే ఉండడం. ఐరోపా ఖండంలో వైశాల్యం రీత్యా రష్యా తర్వాత పెద్ద దేశం ఉక్రెయిన్. 4.5 కోట్ల జనాభా ఉన్న ఉక్రెయిన్ ఎగుమతులు రష్యాకు ఎక్కువగా వెళ్తాయి.

ఈస్ట్రన్ పార్టనర్ షిప్ శిఖరాగ్ర సమావేశాల కోసం అనేక సంవత్సరాలుగా చర్చలు జరుగుతున్నాయి. ఈ సమావేశాల్లోనే ఉక్రెయిన్ లాంఛనంగా ఇ.యు లో చేరుతుందని అందరూ భావించారు. అందరి అంచనాలను తారుమారు చేస్తూ ఇ.యు చేరికను వాయిదా వేస్తున్నట్లు సమావేశాలకు వారం ముందు ఉక్రెయిన్ ప్రకటించడంతో అమెరికా, ఇ.యు లు షాక్ తిన్నాయి. రష్యా ఒత్తిడితోనే ఉక్రెయిన్ వెనక్కి వెళ్లిందని అవి ఆరోపించాయి. నాగరిక ఐరోపా సమాజంలో చేరకపోవడం ద్వారా ఉక్రెయిన్ తప్పు చేసిందని పశ్చిమ పత్రికలు గగ్గోలు పెట్టాయి.

అయితే ఇ.యు ప్రతిపాదించిన ఒప్పందంలోని షరతులు చూస్తే ఉక్రెయిన్ ప్రభుత్వం సరైన నిర్ణయమే తీసుకుందని అర్ధం అవుతుంది. రష్యాకు సంవత్సరానికి 16 బిలియన్ డాలర్ల మేరకు ఉక్రెయిన్ ఎగుమతులు చేస్తుంది. యూరోపియన్ యూనియన్ కు చేసే ఎగుమతులు 17 బిలియన్లని అంచనా. అయితే ఉక్రెయిన్-రష్యాల మధ్య ఉండే చారిత్రక, సాంస్కృతిక సంబంధాలు విడదీయలేనివి. ఇ.యు లో చేరాలంటే ఉక్రెయిన్ అనేక షరతులను అమలు చేయాల్సి ఉంటుంది. నేమ్ బోర్డ్ లకు వాడే ఇనప శీలల దగ్గర్నుండి రైలు పట్టాల వరకు సర్వం మార్చుకోవలసిన పరిస్ధితి ఏర్పడుతుంది. ఇ.యు చేరిక వల్ల ఉక్రెయిన్ పై 33 బిలియన్ యూరోల భారం పడుతుందని ఆర్ధికవేత్తలు అంచనా వేస్తున్నారు.

ఇంత భారం భరిస్తున్నా కేవలం 1 బిలియన్ యూరోలు మాత్రమే సహాయం ఇవ్వడానికి ఇ.యు అంగీకరించింది. మరింత సాయం ఇవ్వడానికి అంగీకరిస్తే ఇ.యు లో చేరే అంశాన్ని పరిశీలిస్తామని అధ్యక్షుడు యనుకోవిక్ ప్రకటించాడు. కానీ ఇ.యుయే ప్రస్తుతం దీన పరిస్ధితిలో ఉంది. సదరు దీన పరిస్ధితి నుండి బైటపడే చర్యల్లో భాగంగానే అది ఉక్రెయిన్ ను కలుపుకోడానికి సిద్ధపడింది. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ద్వారా తమ సరుకులతో ఉక్రెయిన్ ను ముంచెత్తడానికి తద్వారా ఆర్ధికంగా లాభం పొందడానికి ఇ.యు ప్రయత్నిస్తోంది.

పైగా ఉక్రెయిన్ ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసినందుకు శిక్ష పడి జైలులో ఉన్న మాజీ అధ్యక్షురాలిని ‘వైద్య చికిత్స’ పేరుతో విడుదల చేసి విదేశాలకు పంపాలని ఇ.యు షరతు విధించింది. ఈ షరతును ఉక్రెయిన్ పార్లమెంటు తిరస్కరించింది.

యూరేసియన్ ఎకనమిక్ యూనియన్ (ఇ.ఇ.యు)

ఉక్రెయిన్ ప్రభుత్వం జులై 2015 కల్లా 60 బిలియన్ డాలర్ల మేరకు అప్పు చెల్లింపులు చేయాల్సి ఉంది. దేశ జి.డి.పి ($176 బిలియన్) లో ఇది దాదాపు మూడో వంతు.  ఈ పరిస్ధితుల్లో ఇ.యు వాణిజ్య ఒప్పందానికి ఉక్రెయిన్ అంగీకరిస్తే రష్యా తమ వాణిజ్యం విషయంలో కఠినంగా ఉండడానికి నిర్ణయించుకుంది. రష్యా కఠిన వాణిజ్య నిబంధనలకు పరిహారం కోసమే 1 బిలియన్ యూరోలు ఇ.యు ఇవ్వజూపింది. ఈ మొత్తంతో సరిపెట్టుకుంటే ఉక్రెయిన్ లో అల్పాదాయ వర్గాలు తీవ్రంగా నష్టపోతారని అధ్యక్షుడు యనుకోవిక్ తెలిపాడు. అయితే ఉక్రెయిన్ అల్పాదాయ వర్గాల సంక్షేమంతో ఇ.యు కు పని లేదు. ఉన్నత మధ్య తరగతి, ఉన్నత తరగతి, సూపర్ ధనిక తరగతుల మార్కెట్ తోనే దానికి పని. ఆ మార్కెట్ లో చొరబడితే అసలే ఋణ సంక్షోభంతో తీసుకుంటున్న ఇ.యు కాస్త తెరిపిడి పడవచ్చని భావించింది.

ఉక్రెయిన్, ఇ.యు ల మధ్య మార్చి 2014 లో మరో విడత చర్చలు జరగనున్నాయి. అప్పటికి ‘యూరేసియన్ ఎకనామిక్ యూనియన్’ ఏర్పాట్లలో బెలారస్, రష్యా, కజకిస్ధాన్ లు నిండా మునిగి ఉంటాయి. యూరోపియన్ యూనియన్ కు ప్రత్యామ్నాయంగా రష్యా ముందుకు తెస్తున్న యూరేసియన్ ఎకనమిక్ యూనియన్ కే ఇ.యు ప్రధానంగా భయపడుతోంది. రష్యా, కజకిస్తాన్ లతో కూడిన కస్టమ్స్ యూనియన్ నే యూరేసియన్ ఎకనమిక్ యూనియన్ గా రష్యా విస్తరిస్తోంది. ఇది గనుక విజయవంతం అయితే ఇ.యు, అమెరికాల ఆర్ధిక ఆధిపత్య విస్తరణ అవకాశాలకు మూడినట్లే. మధ్య, పశ్చిమ ఆసియా దేశాలను కలుపుకోవడం ద్వారా రష్యాను ఒంటరిని చేసి లొంగ దీసుకోవాలన్న ఐరోపా, అమెరికాల దురాలోచనకు ఈ కొత్త కూటమి మంగళం పాడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Map of Eurasian Economic Community -Eurasec

Map of Eurasian Economic Community -Eurasec

Deep and Comprehensive Free Trade Area (DCFTA) ఏర్పాటును ఇ.యు ప్రతిపాదిస్తుండగా యూరేసియన్ యూనియన్ ఫ్రీ ట్రేడ్ ఏరియాను రష్యా ముందుకు తెస్తోంది. DCFTA ద్వారా ఒనగూరే లాభాలు ప్రారంభంలో ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ రష్యా తదితర సి.ఐ.ఎస్ (కామన్ వెల్త్ ఆఫ్ ఇండిపెండెంట్ స్టేట్స్ -పూర్వ సోవియట్ రష్యా రాజ్యాలతో రష్యా ఏర్పాటు చేసిన కూటమి) దేశాలతో కోల్పోయే వాణిజ్యతో పోలిస్తే అది పెద్ద లెక్కలోకి రాదని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇ.యు-ఉక్రెయిన్-ఇ.ఇ.యు ల మధ్య సంబంధాల్లోని వివిధ అంశాలు ఇలా ఉన్నాయి.

 • ఇ.యు అసోసియేషన్ అగ్రిమెంట్ ద్వారా 95 కస్టమ్స్ సుంకాల నుండి ఉక్రెయిన్ కు విముక్తి దొరుకుతుంది. పన్నేతర వాణిజ్య అడ్డంకులు 35 శాతం మేర తగ్గుతాయి. తద్వారా ఉక్రెయిన్ ఎగుమతిదారులు 0.487 బిలియన్ యూరోలు మిగుల్చుకుంటారు.
 • ప్రస్తుతం ఇ.యుకు ఉక్రెయిన్ చేస్తున్న ఎగుమతులు 17 బిలియన్ డాలర్లు. రష్యాకు చేసే ఎగుమతులు 16 బిలియన్ డాలర్లు. ఇ.యుతో ఒప్పందం చేసుకుంటే రష్యా ఎగుమతి మార్కెట్ మొత్తాన్ని ఉక్రెయిన్ కోల్పోతుంది. రష్యా మార్కెట్ మొత్తం కోల్పోతే ఉక్రెయిన్ 35 బిలియన్ యూరోలు నష్టపోతుందని రష్యా అంచనా వేస్తోంది.
 • ఉక్రెయిన్ కార్ మార్కెట్ లో 13 శాతం ఇ.యు నుండి దిగుమతి అవుతున్నాయి. ఇ.యు చేరిక వల్ల ఇదింకా పెరిగి స్వదేశీ ఉత్పత్తిదారులు తీవ్రంగా నష్టపోతారు. ప్రారంభంలో కొన్ని రక్షణలు ఇస్తామని ఇ.యు చెబుతోంది. కానీ ఆ తర్వాత?
 • అత్యంత ఘోరమైన విషయం ఏమిటంటే దేశీయ గ్యాస్ వినియోగదారుల నుండి వసూలు చేసే ధరల్ని బాగా పెంచాలని ఐ.ఏం.ఎఫ్ సిఫారసు చేసింది. గ్యాస్ సబ్సిడీ తగ్గించేసి ధరలు పెంచితే భవిష్యత్తులో గ్యాస్ మార్కెట్ ని పశ్చిమ బహుళజాతి కంపెనీలు ఆక్రమిస్తాయి. ఐ.ఎం.ఎఫ్ కి పశ్చిమ దేశాలు అప్పగించిన పని ఇదే. అప్పులతో ఆదుకుంటున్నట్లు కనిపిస్తూ పశ్చిమ బహుళజాతి కంపెనీల మార్కెట్లుగా దేశాలను మార్చడం ఐ.ఎం.ఎఫ్ పని. ఇండియాలో ఐ.ఎం.ఎఫ్ అదే పని చేసింది. ఋణ సంక్షోభం అడ్డం పెట్టుకుని ఐరోపాలోను అదే చేసింది. ఉక్రెయిన్ లోనూ అదే చేయడానికి నడుం బిగించింది.
 • ఇ.యు వాణిజ్య ప్రమాణాలను అందుకోడానికి ఉక్రెయిన్ 350 చట్టాలు చేయాల్సి ఉంటుంది. ఇ.యు కూడా ఉక్రెయిన్ కోసం దాదాపు 2 లక్షల సవరణలు తన చట్టాలో చేస్తుంది. ఉక్రెయిన్ చేసే సవరణలు విదేశీ దోపిడీకి అవకాశం ఇస్తే, ఇ.యు చేసే సవరణలు మరో దేశాన్ని పట్టి పల్లార్చే అవకాశం బహుళజాతి కంపెనీలకు కల్పిస్తాయి.
 • ఉక్రెయిన్ వాణిజ్య పోటీ చట్టాలనూ మార్చుకోవాలి. తద్వారా దేశీయ కంపెనీలను బలహీనం చేయాల్సి ఉంటుంది. దేశీయ కంపెనీ గ్రూపులను, కార్టెల్స్ నూ బలహీనపరిచి విదేశీ కంపెనీల పనిని సులువు చేయాలి. ‘లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్’ పేరుతో జరిగే ఈ ప్రహసనం దేశం గర్వించదగ్గ సంస్ధలను మొదలు నుండి కుళ్ళబొడుస్తుంది.
 • రోడ్డు పైన గుర్తులు సూచించే సైన్ బోర్డులకు వాడే మేకుల దగ్గర్నుండి రైల్వే పట్టాల గేజ్ వరకూ సమస్తం మార్చేయాల్సి ఉంటుంది.
 • ఉక్రెయిన్ ప్రధాన ఇంధన (గ్యాస్, చమురు) వనరు రష్యాయే. మెజారిటీ రుణాలు రష్యా ఇచ్చినవే. ప్రధాన వాణిజ్య భాగస్వామి రష్యాయే. అలాంటి రష్యా నేతృత్వంలోని ఇ.ఇ.యు లో ఆర్మీనియా, తజకిస్తాన్, కిర్ఘిస్తాన్, బెలారస్ లాంటి పొరుగు దేశాలు చేరుతున్నాయి. ఉక్రెయిన్ దానికి బదులు ఇ.యు లో చేరితే అది దాదాపు ఆత్మహత్యతో సమానం అని చెప్పవచ్చు. ఇ.యు సాహసర్యంలో నిరంతరం చస్తూ బతకడమే ఉక్రెయిన్ కి మిగులుతుంది.
 • ఇ.ఇ.యు లో చేరితే రష్యా లోని నాలుగు ప్రధాన బ్యాంకులు ఇచ్చిన 20 బిలియన్ డాలర్ల రుణానికి భద్రత ఉంటుంది. ఒత్తిళ్ళు ఉండవు.
 • కస్టమ్స్ యూనియన్ (2015 నుండి ఇ.ఇ.యు) లో సభ్యత్వం పొందితే మిలట్రీ సహకారం కూడా ఉంటుంది. ఇ.యు ఒప్పందంలో ఇది లేదు.
 • ఇ.యుతో చర్చలు జరుపుతుండగానే రష్యా ఉక్రెయిన్ నుండి చేసుకుంటున్న ధాన్యం దిగుమతులను తగ్గించుకుంది. కస్టమ్స్ యూనియన్ సభ్యత్వం వలన వ్యవసాయ ఎగుమతులు తగ్గకపోగా ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది.
 • రష్యా నుండి దూరం అయితే ఉక్రెయిన్ కొత్త గ్యాస్ సంబంధాల కోసం చూడాలి. అప్పు పెట్టి గ్యాస్ పొందే సౌకర్యం పోతుంది.

యూరోపియన్ యూనియన్ తో గానీ, అమెరికాతో గానీ వాణిజ్య సంబంధాలు పెట్టుకుంటే, అది కూడా వారి షరతుల మేరకు పెట్టుకుంటే పరిస్ధితి ఏమిటనేది ఈ అంశాలు చెబుతాయి. ఈ అంశాల నేపధ్యంలో ఉక్రెయిన్ తీసుకున్న నిర్ణయం, ప్రస్తుతానికి అది తాత్కాలికమే అయినా, మంచి నిర్ణయం. వచ్చే మార్చిలో ఇ.యు లో చేరడానికి ఆమోదిస్తే కనుక ఆ దేశ ప్రజలకు తీవ్ర నష్టకరం. ఇ.యు చేరికను ఉక్రెయిన్ ప్రజలు వ్యతిరేకించాల్సిందిపోయి ఆహ్వానించడం సరి కాదు. తమను నడిపిస్తున్న శక్తులు నేరుగా నిప్పుల కొలిమిలోకి తమను నడిపిస్తున్నాయని వారు గుర్తెరగాలి.

One thought on “ఉక్రెయిన్: రష్యా వైపా, ఇ.యు వైపా?

 1. పింగ్‌బ్యాక్: ఉక్రెయిన్: రష్యా వైపా, ఇ.యు వైపా? | ugiridharaprasad

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s