“ఇప్పుడు ప్రవేశపెడుతున్నాం, ఇంకా కొత్తది, మెరుగైనది, మీ కోసం. ఇక పాత దానిలోని @#$% అన్నీ ఇట్టే మాటు మాయం. తళతళలాడే కొత్తది… కేవలం మీ కోసం.”
టి.వీల్లోనూ, సినిమాకి ముందూ మనకోసం అంటూ మనల్ని ఇబ్బంది పెట్టే ఇలాంటి యాడ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది! మన జీవితాల్ని ఎంతో సుఖమయం చేస్తున్నామనీ, అందుకోసం రాత్రింబవళ్ళు కష్టపడుతున్నామని చెప్పని కంపెనీకి మార్కెటింగ్ మెళకువలు తెలియనట్లే లెఖ్ఖ! ఆ రకంగా మన ఓపికని పరీక్షించడమే కాక చమురు కూడా వదిలిస్తారు.
అన్నా హజారే సరికొత్త దీక్ష విషయం ఇలానే ఉందని కార్టూనిస్టు సూచిస్తున్నారు. పార్లమెంటు చలికాలం సమావేశాలు ప్రారంభం అయ్యే రోజున తాను మళ్ళీ దీక్ష చేస్తానని అన్నా హజారే గత సెప్టెంబర్ లోనే ప్రకటించారు. అయితే ఈ సారి ఆయన నిరవధిక దీక్ష లాంటిదేమీ తలపెట్టడం లేదు. కేవలం ఒక రోజు మాత్రమే దీక్ష చేస్తానని చెప్పారు.
తాను రామ్ లీలా మైదానంలో దీక్ష చేస్తానని, దేశంలోని కార్యకర్తలు కూడా తనను అనుసరించాలని ఆయన కోరారు. అయితే అంతా రామ్ లీలా మైదానానికి రానవసరం లేదని, తమ తమ తహసీళ్లలోనూ, జిల్లా మేజిస్ట్రేట్ ఆఫీసుల దగ్గరా జన లోక్ పాల్ బిల్లు కోసం దీక్ష చేస్తే సరిపోతుందని ఆయన రాయితీ ఇచ్చారు. బహుశా కార్టూనిస్టు చెబుతున్న ‘కొత్త, మెరుగైన దీక్ష’ అంటే ఇదే కావచ్చు.
చిత్రం ఏమిటంటే లోక్ సభ ఆమోదించిన లోక్ పాల్ బిల్లు బలహీనమైనదని, దానికి ఒప్పుకునేది లేదని చెప్పిన అన్నా హజారే ఈసారి అలాంటి డిమాండ్ ఏమీ చేయలేదు. వర్షాకాల సమావేశాల్లో రాజ్యసభలో బిల్లు ప్రవేశపెడతానని చెప్పిన ప్రధాని తన హామీ నెరవేర్చలేదని, ఆమోదించే బదులు బిల్లును రాజ్యసభ సెలెక్ట్ కమిటీకి పంపారని అన్నా విమర్శించారు.
ఒక పక్క ఎన్నికల కోలాహలం సాగుతుంటే అన్నా హజారే ఒక్కరే ఒంటరిగా దీక్ష చేయాల్సిన పరిస్ధితులు వచ్చాయని కార్టూనిస్టు సూచిస్తున్నారు. తనతో పాటు దీక్ష చేసి దేశంలో ఉద్యమం విస్తరించడానికి సహాయం చేసిన అనేక ఎన్.జి.ఓ సంస్ధల నాయకులు ఇప్పుడు రాజకీయ పార్టీ పెట్టి ఎన్నికల బరిలో దిగిపోయారు మరి! ఒకప్పటి సహచరులు ఎన్నికల కోలాహలంలో మునిగిపోగా అన్నా దీక్ష మాత్రం ఒంటరిదైపోయింది.
వ్యవస్ధ పునాదిలోని సమస్యల జోలికి పోకుండా పైపై మార్పులు కోరుకునే ఉద్యమం ఏదైనా ఇలానే ఉంటుంది. ఆ ఉద్యమాలకు కార్పొరేట్ల మద్దతు ఉంటే ఇక చెప్పేదేముంది!
Read this article: http://content.janavijayam.in/2013/11/blog-post_27.html