నిన్న మొన్నటి వరకు చీకటి ఖండంగా పిలువబడిన ఆఫ్రికా ఇప్పుడు తనను తాను ప్రపంచానికి చూపుకుంటోంది. జాత్యహంకార అణచివేత నుండి దక్షిణాఫ్రికాను విడిపించిన ఉద్యమానికి నేతగా నెల్సన్ మండేలా ప్రపంచ రాజకీయ యవనికపై 1990లలో అవతరించిననాటి నుండి రువాండా, బురుండి మారణకాండల మీదుగా ‘అరబ్ వసంతం’ పేరుతో ఇటీవల ట్యునీషియా, ఈజిప్టులలో ప్రజా తిరుగుబాట్లు చెలరేగడం వరకు ఆఫ్రికాను అంతర్జాతీయ వార్తల్లో నిలిపాయి.
ఇది మానవ ప్రపంచం. కాకులు దూరని కారడవులకు నిలయమైన ఆఫ్రికా దక్షిణ దేశాలు విస్తారమైన జంతు, పక్షి జాతులకు నిలయాలు. ఇక్కడి జీవ వైవిధ్యం శోధించినవారికి శోధించినంత. ప్రకృతిలో కలిసిపోయే ఓపికే ఉంటే అనేక అద్భుతమైన జీవాలతో సావాసం చేయొచ్చు. మనిషి జీవనం సకల చరాచర జీవజాతుల జీవనంతో విడదీయరాని విధంగా ముడిపడి ఉందని తెలియడానికి బహుశా డార్విన్ అవసరం లేదేమో.
బోస్టన్ గ్లోబ్ పత్రిక ఫోటోగ్రాఫర్ ఎస్డ్రాస్ ఎం సారెజ్ ఇటీవల కీన్యా, టాంజానియా లు సందర్శించాడు. అతని కెమెరా రికార్డు చేసిన అద్భుత దృశ్యాలివి. మనం జంతువులను ఎలా చూస్తామో జంతువులూ మనల్ని అలానే చూస్తాయని కింద సింహం, జిరాఫీలను చూస్తే అర్ధం అవుతుంది. ఆశ్చర్యమో, భయమో లేక రెండూనో తెలియకుండా సింహం చూస్తుంటే, పొదల చాటు నుండి వింతగా, భయంగా కొత్త విజిటర్ ని ఒక లుక్ వేద్దామన్న దృష్టితో జిరాఫీ చూస్తోన్న దృశ్యాన్ని ఫోటోగ్రాఫర్ భలే పట్టాడు.
నది దాటుటూ మొసలికి దొరికిపోయిన చారల గుర్రం పిల్లను చూస్తే అయ్యో అనిపిస్తుంది. అడవి దున్నను వేటాడి తింటున్న సింహం దృశ్యం మహా భీభత్సంగా ఉన్నందున ఇవ్వలేదు గానీ చిన చేపను పెద చేప, చిన మాయను పెద మాయ కబళించి ఆరగించడం ప్రకృతి ధర్మమేగా అని సరిపెట్టుకోవాలి. ఏనుగు పిల్లకు భరోసా ఇస్తున్న తల్లి ఏనుగు, మనిషి సంచారం విని పొదల్లోకి పరుగెత్తుతున్న పిల్ల చీటా, వేటకు ముందు రిలాక్స్ అవుతున్న చిరుత, తనను సమీపిస్తున్న మగ దూడబాతుకు రెక్కలిప్పీ ఆహ్వానిస్తున్న ఆడ దూడబాతు… ఇవన్నీ ఆఫ్రికా సఫారిలో కొన్ని సుందర దృశ్యాలు.
ఫోటోలు: బోస్టన్ గ్లోబ్
పింగ్బ్యాక్: ఆఫ్రికన్ సఫారి: అరుదైన జంతు ప్రపంచం -ఫోటోలు | ugiridharaprasad
చాలా అద్భుతంగా ఉన్నాయి ఫోటోలు.ఇంత గొప్పగా ఉంటే ప్రత్యక్షంగా చూస్తే ఇంకెలా ఉంటుందో…