తూ.చై.స: చైనా రూల్స్ పాటించండి -అమెరికా


J-10 fighter jets of China Air Force

J-10 fighter jets of China Air Force

అమెరికా మెడలు వంచడంలో చైనా సఫలం అయిందా? కనీసం తూర్పు చైనా సముద్రం వరకయినా అమెరికాను దారికి తెచ్చుకోవడంలో చైనా పాక్షికంగా సఫలం అయినట్లు కనిపిస్తోంది. తూర్పు చైనా సముద్రంలోని దియోయు/సెంకాకు ద్వీపకల్పం పైన చైనా విధించిన నిబంధనలను పాటించాల్సిందిగా తమ వాణిజ్య విమానాలకు అమెరికా ప్రభుత్వం సలహా ఇచ్చింది.

చైనా విధించిన ‘వాయు రక్షణ గుర్తింపు మండలం’ (Air Defence Identification Zone -ADIZ) పరిధిని ఉల్లంఘిస్తూ ప్రవేశించిన అమెరికా, జపాన్, దక్షిణ కొరియా యుద్ధ విమానాలను చైనా యుద్ధ విమానాలు వెంటాడిన నేపధ్యంలో అమెరికా సలహా ప్రాధాన్యత సంతరించుకుంది. ఆర్డర్లు జారీ చేయడమే గాని మరొకరి ఆర్డర్ పాటించి ఎరుగని అమెరికా చైనా ఆర్డర్ కు తలవంచడం ప్రపంచ ప్రజలకు ఒక విధంగా వినోదమే.

ADIZ పరిధిని నిర్ణయించడం అమెరికా, జపాన్ లు అనాదిగా చేస్తున్న పనే. చివరికి దక్షిణ కొరియా కూడా అమెరికా అండతో తమదైన ADIZ ను విధించి అమలు చేస్తోంది. సముద్ర తీరప్రాంతం ఉన్న దేశాలు తీరం నుండి 12 నాటికల్ మైళ్ళ మేర సముద్రంపై తమ సొంత సముద్ర జలాలుగా పరిగణిస్తాయి. ఈ హక్కులను అంతర్జాతీయ సముద్ర చట్టాలు గుర్తించాయి. ఈ 12 మైళ్ళ మేర ఉండే వాయుతలం పైన హక్కులను గుర్తించే చట్టాలు మాత్రం ఏమీ లేవు. అయినప్పటికీ అమెరికా, జపాన్ లతో సహా 20 దేశాలు తమ తమ ADIZ లను ప్రకటించి అమలు చేస్తున్నాయి. జపాన్ 1969 నుండీ తూర్పు చైనా సముద్రంలో ADIZ అమలు చేస్తోంది.

ఒక దేశం ADIZ ప్రకటిస్తే అందులోకి ప్రవేశించే విమానాలు ఏవైనా మొదట తాము ఎవరో తమను తాము గుర్తించాలి (identify). ADIZ లో ప్రవేశించేందుకు ఆ దేశ అనుమతి తీసుకోవాలి. సదరు ADIZ లో ఎంతసేపు తమ విమానం ఎగిరేది వివరాలు ఇవ్వాలి. జపాన్, దక్షిణ కొరియాలు ఎప్పటినుండో ADIZ ను అమలు చేస్తుండగా చైనా కొద్ది రోజుల క్రితమే ప్రకటించింది.

చైనా ADIZ ను పాటించాలని వాణిజ్య విమానాలకు (ప్రయాణికులను చేరవేసే విమానాలు, సరకు రవాణా విమానాలు) సలహా ఇచ్చినంత మాత్రాన దాని చట్టబద్ధతను తాము గుర్తించినట్లు కాదని అమెరికా బింకం ప్రదర్శించడం విశేషం. ఆ మాటకొస్తే ఏ దేశ ADIZ కూ చట్టబద్ధత లేదు. ADIZ ల చట్టబద్ధతను గుర్తించే అంతర్జాతీయ చట్టాలు ఏమీ లేవు. కాబట్టి తమ వాణిజ్య విమానాలకు అమెరికా ఇచ్చిన సలహా తలవంచడంతో సమానమే అవుతుంది.

“పసిఫిక్ సముద్రంలో సముద్ర జలాలను, వాయు తలాన్ని స్వేచ్ఛగా వినియోగించడం అనేది స్ధిరత్వానికి, శ్రేయస్సుకు, భద్రతకు అత్యవసరం. తూర్పు చైనా సముద్రం పైన చైనా ప్రకటించిన ADIZ పట్ల మేము ఇప్పటికీ ఆందోళనతోనే ఉన్నాము” అని అమెరికా విదేశాంగ శాఖ జారీ చేసిన లిఖిత ప్రకటన పేర్కొంది. NOTAM (Notices to Airmen) నిబంధనలకు అనుగుణంగానే చైనా ADIZ నిబంధనలను పాటించాలని కోరుతున్నాం గానీ చట్టబద్ధత గుర్తించి కాదని అమెరికా ఈ ప్రకటనలో చెప్పుకుంది.

చైనా నిబంధనలు పాటించాలని కమర్షియల్ విమానాలను కోరిన అమెరికా తమ యుద్ధ విమానాలను మాత్రం చైనాకు చెప్పకుండానే తూర్పు చైనా సముద్రంపై తిప్పుతోందని తెలుస్తోంది. దక్షిణ కొరియా, జపాన్ లు కూడా అమెరికాను అనుసరిస్తున్నాయి. అయితే చైనా చేతులు ముడుచుకుని కూర్చోలేదు. తమ ADIZ లోకి ప్రవేశించిన రెండు అమెరికా గూఢచార విమానాలను, 10 జపాన్ F-15 జెట్ లను శుక్రవారం చైనా యుద్ధ విమానాలు (Su-30, J-10) వెంబడించాయి. తమ వాయుతలంలోకి చొచ్చుకు వచ్చిన విమానాలను వెంటాడి తరిమామని చైనా ఆ తర్వాత ప్రకటించింది.

చైనా చర్యకు అమెరికా, జపాన్ లు ఆగ్రహంగా స్పందించాయి. ఏకపక్షంగా ADIZ ప్రకటించడం తమకు ఆమోదయోగ్యం కాదని

Click to enlarge

Click to enlarge

ప్రకటించాయి. అమెరికా, జపాన్ ల అభ్యంతరాలకు చైనా అంతే దీటుగా స్పందించింది. “దానిని (చైనా ADIZ) రద్దు చేయాలంటే మొదట జపాన్ 44 యేళ్ళు7గా అమలు చేస్తున్న తన సొంత ADIZ ను రద్దు చేయాలని మేము కోరాల్సి ఉంటుంది. 44  యేళ్ళ తర్వాత మేమూ జపాన్ కోరికను పరిశీలిస్తాము” అని చైనా రక్షణ శాఖ ప్రతినిధి యాంగ్ యుజున్ స్పష్టం చేశాడు.

జపాన్ ADIZ భారీ పరిమాణంలో ఉండడాన్ని పక్క పటంలో చూడవచ్చు. దీనిని జపాన్ 1969 నుండి అమలు చేస్తోంది. దక్షిణ కొరియా ప్రకటించిన ADIZ ఉత్తర కొరియా గగనతలాన్ని కూడా ఆక్రమించడాన్ని పటంలో గమనించవచ్చు. అమెరికా అండ చూసుకునే దక్షిణ కొరియా ఈ ఆధిపత్యాన్ని చెలాయిస్తోంది. జపాన్, దక్షిణ కొరియాలు ప్రకటించుకున్న ADIZ లను చైనా ప్రకటించిన ADIZ తీసి పక్కన పెట్టేసింది. ADIZ అనేది సార్వభౌమాధికారం గల ప్రాంతం కాదని పాఠకులు గుర్తించాలి. తమ దేశ రక్షణ కోసం అని చెప్పి ధన, కండబలం కలిగిన దేశాలు వీటిని అమలు చేస్తుంటాయి. ADIZ బలప్రదర్శనల్లోకి చైనా కూడా ప్రవేశించడంతో భౌగోళిక ఆధిపత్య రాజకీయాలు (తూర్పు చైనా సముద్రం వరకు) రసకందాయంలో పడినట్లే.     

ముందుంది ముసళ్ళ పండగ!

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s