ఆ సుప్రీం జడ్జి పేరు ఎ.కె.గంగూలీ


Asok Kumar Ganguly

‘నువ్వు కూడానా బ్రూటస్?’

షేక్ స్పియర్ నాటకంలో రోమన్ డిక్టేటర్ జులియస్ సీజర్ ను కత్తితో పోడిచినవారిలో బ్రూటస్ కూడా ఉండడం చూసి సీజర్ వేసే ప్రశ్న ఇది. ‘జులియస్ సీజర్’ నాటకంలో మూడో సీన్ లో (మార్క్ ఏంటోని ప్రసంగం ‘ఫ్రెండ్స్, రోమాన్స్, కంట్రీమెన్!’ కాకుండా) అత్యంత పేరు పొందిన డైలాగ్ ఇది. తనకు అత్యంత ప్రియమైన స్నేహితుడని భావించిన సెనేటర్ మార్కస్ బ్రూటస్ కూడా తనను హత్య చేస్తున్నవారిలో ఉండడం చూసి సీజర్ ఇలా స్పందిస్తాడు. “అయితే నువు చావాల్సిందే సీజర్” అని సీజర్ తనకు తాను చెప్పుకుని చనిపోతాడు.

న్యాయ విద్య అభ్యసించి ఇంటర్న్ గా పని చేస్తున్న ఒక యువ మహిళా న్యాయవాదిని లైంగికంగా వేధించింది సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎ.కె.గంగూలీ అని తెలిస్తే ఆయన గురించి తెలిసినవారు కూడా ఇలాంటి ప్రశ్నే వేస్తారు. “మీరు కూడానా, గంగూలీ?” అని.

తనను లైంగికంగా వేధించింది జస్టిస్ అశోక్ కుమార్ గంగూలీ అని బాధిత యువతి ముగ్గురు సభ్యుల సుప్రీం కోర్టు కమిటీకి తెలియజేసిందని ది హిందు తెలిపింది. గత సంవత్సరం డిసెంబర్ లో దేశం అంతా బస్సులో సామూహిక అత్యాచారానికి గురయిన మెడికల్ ఇంటర్న్ నిర్భయ కేసుపై ఉద్యామిస్తుండగానే జస్టిస్ ఎ.కె.గంగూలీ ఒక హోటల్ లో తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని యువతి ఆరోపించారు.

నిజానికి సదరు యువతి ఎవరికీ ఫిర్యాదు చేయలేదు. ఆమె తాను ఎదుర్కొన్న చేదు అనుభవం గురించి తన బ్లాగ్ లో రాసుకున్నారు. ఇది కాస్తా ఒక పత్రిక దృష్టికి వచ్చి ప్రచురించడంతో సుప్రీం కోర్టు దృష్టికి వెళ్లింది. సుప్రీం కోర్టు విచారణ కోసం నవంబర్ 12 తేదీన త్రిసభ్య కమిషన్ ను నియమించింది. జస్టిస్ ఆర్.ఎం.లోధా, హెచ్.ఎల్.దత్తు, రంజన దేశాయ్ లు ఇందులో సభ్యులు.

సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి ఒక యువతిపట్ల అసభ్యంగా ప్రవర్తించారన్న వార్త వచ్చిన తర్వాతే సుప్రీం కోర్టు కూడా తన ‘విశాఖ కేసు మార్గదర్శక సూత్రాలను’ తానే పాటించలేదన్న సంగతి గుర్తుకు వచ్చింది. విశాఖ కేసులో 1996లో సుప్రీం కోర్టు కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. దేశంలోని ప్రతి ప్రైవేటు, ప్రభుత్వ సంస్ధ పని స్ధలాలలో లైంగిక వేధింపులు నివారించడానికి ప్రతి స్ధాయిలోనూ ఒక ప్రత్యేక కమిటీ వేయాలి. ఈ కమిటీలో సగానికంటే ఎక్కువమంది మహిళలు ఉండాలి. సంస్ధకు చెందినవారు కాకుండా బైటివారు, మహిళల హక్కుల కోసం పని చేస్తున్నవారు ఒకరు లేదా ఇద్దరు ఈ కమిటీలో ఉండాలి.

విచిత్రం ఏమిటంటే ఈ సూత్రాన్ని సుప్రీం కోర్టే ఇంకా పాటించలేదు. ఎ.కె.గంగూలీ పుణ్యాన అది ఇప్పుడు జరిగింది. పది మంది సభ్యులు గల న్యాయమూర్తులతో లైంగిక వేధింపుల నిరోధక కమిటీ వేస్తున్నట్లు సుప్రీం కోర్టు నిన్ననే ప్రకటించింది.

అయితే కోర్టు ద్వారా ముందుకు వెళ్లడానికి బాధిత యువతి మొదట నిరాకరించింది. త్రిసభ్య కమిటీ ముందు నవంబర్ 19 తేదీన హాజరయిన యువతి తనకు కోర్టు ద్వారా ప్రొసీడ్ అయ్యే ఆసక్తి లేదని తెలిపింది. అలాంటప్పుడు విషయాన్ని ఎందుకు బహిర్గతం చేశారని కమిటీ ప్రశ్నించగా ఇలాంటి ఘటనలు అత్యున్నత స్ధానాల్లో కూడా జరుగుతాయని చెప్పడానికే తన బ్లాగ్ లో రాశానని ఆమె తెలిపారు.

నవంబర్ 12 తేదీన ఒక ఆంగ్ల పత్రికలో ప్రచురితమైన ఆర్టికల్ ను ఒక అడ్వొకేట్ చీఫ్ జస్టిస్ సదాశివం దృష్టికి తెచ్చారు. ఆ రోజు మధ్యాహ్నమే కేంద్ర ప్రభుత్వ అడ్వొకేట్ జనరల్ జి.ఇ వాహనవతి మరిన్ని వివరాలు సి.జె.ఐ (చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా) దృష్టికి తెస్తూ పిటిషన్ దాఖలు చేశారు.

నవంబర్ 9 తేదీన ‘జర్నల్ ఆఫ్ ఇండియన్ లా అండ్ సొసైటీ’ అనే బ్లాగ్ లో బాధిత యువతి ఆర్టికల్ రాశారని దానికి ఒక పత్రిక ప్రచురించిందని చెప్పారు. “ఆరోపణల్లో నిజాలు ఏమిటో విచారించాల్సి ఉంది” అని ఆయన తన పిటిషన్ లో పేర్కొనడం గమనార్హం. ఆరోపణలు తప్పని రుజువైనా చర్యలు తీసుకోవాలని వాహనవతి ప్రతిపాదించగా దానితో సి.జె.ఐ ఏకీభవించారు.

అంటే ఇప్పుడు భారం ప్రధానంగా బాధితురాలిపైనే పడినట్లు కనిపిస్తోంది. ఆమె తన ఆరోపణలను రుజువైనా చెయ్యాలి లేదా రుజువు చేయలేని ఆరోపణలు చేసినందుకు శిక్ష అయినా ఎదుర్కోవాలి. ఇదంతా కోర్టుల విశ్వసనీయత పేరుతో జరుగుతోంది. లైంగిక వేధింపులకు గురి కావడం అటుంచి అత్యున్నత న్యాయ అధికారిపై ఆరోపణలు చేసినందుకు బాధితురాలు మూల్యం చెల్లించాలా?

బాధితురాలు అమెరికా పత్రిక ది వాల్ స్ట్రీట్ జర్నల్ కు ఇంటర్వ్యూ ఇవ్వడం గమనార్హం. తాను చాలా ఇబ్బందికి గురవుతున్నానని తాను అబద్ధం చెప్పడం లేదన్న సంగతిని తనకు తాను నిరంతరం సర్ది చెప్పుకోవాల్సిన పనిలో పడ్డానని ఆమె ఈ ఇంటర్వ్యూలో చెప్పారు. “చివరికి ఎలాగో బైటికి చెప్పాక దానిని ఎలాగో నా జ్ఞాపకాల నుండి తొలగించాలన్నదే నా ప్రధాన లక్ష్యంగా ఉండింది. నేను వృత్తిగతంగా ఎంతగానో ఆరాధించిన వ్యక్తి ఆయన! మార్గదర్శనం కోసం నేను ఆయన వైపు చూశాను” అని ఆమె ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

చట్టపరంగా పోవాలని తాను అనుకోలేదని కూడా ఆమె చెప్పారు. “మొదటిది, నా కేసు సంవత్సరాల తరబడి సాగుతుంది. రెండోది, డిఫెన్స్ లాయర్లు నేను దాడికి గురయిన ప్రతి క్షణంలోకి మరోసారి వెళ్ళేలా చేస్తారు. మూడోది, దాడి కేసుల్లో, భౌతిక సాక్ష్యాలేవీ లేనప్పుడు ఆదిక ఒకరి మాటకు మరొకరి మాటే ఉంటుంది. మచ్చలేని ఒక జడ్జి పైన ఒక న్యాయ శాస్త్ర గ్రాడ్యుయేట్ గెలవడానికి ఎ కారణమూ లేదు. ఇప్పుడు కూడా నేను కమిటీ ముందు హాజరయినపుడు నన్ను అనుమానపు దృక్కులతో చూస్తున్న భావన కలుగుతోంది. నేను అబద్ధం చెప్పడం లేదని నాకు నేను పదే పదే చెప్పుకోవాల్సి వస్తోంది” అని ఆమె పేర్కొన్నారు. అయితే ఈ సంగతి జాతీయ స్ధాయిలో దేశం దృష్టిని ఆకర్షించినందుకు సంతోషంగా ఉందని ఆమె పేర్కొన్నారు.

ఇక్కడ జస్టిస్ ఎ.కె.గంగూలీ ప్రాముఖ్యత గురించి చెప్పుకోవడం సముచితం అవుతుంది. ఆయన కలం నుండి అనేక అద్భుతమైన తీర్పులు వచ్చాయి. ఇటీవల కాలంలో చూస్తే 2జి కుంభకోణానికి సంబంధించి 122 స్వదేశీ, విదేశీ ప్రైవేటు కంపెనీల లైసెన్సులను రద్దు చేసిన ద్విసభ్య బెంచి తీర్పరుల్లో ఆయన ఒకరు.

ఎమర్జెన్సీ కాలంలో పౌరుల ప్రాధమిక హక్కులను సస్పెండ్ చేయడాన్ని ఐదుగురు సభ్యుల సుప్రీం కోర్టు బెంచి మెజారిటీ తీర్పుతో సమర్ధించింది. ఈ తీర్పును 1976లో డివిజనల్ మేజిస్ట్రేట్ గా ఉన్న ఎ.కె.గంగూలీ తప్పు పట్టారు. ఈ తీర్పు ద్వారా సుప్రీం కోర్టు భారత పౌరుల ప్రాధమిక హక్కులకు భంగం కలిగించిందని జస్టిస్ ఆఫ్తాబ్ ఆలంతో కలిసి తీర్పు ఇచ్చి సంచలనం సృష్టించారు.

ఒక నిందితుడికి శిక్ష విధించాక అతని శిక్షను ఒకసారి రద్దు చేయడం గానీ తగ్గించడం గానీ చేసే హక్కు రాష్ట్రపతి, గవర్నర్ లకు ఉంటుంది. ముఖ్యంగా మరణ శిక్షలు పడిన కేసుల్లో. దీనిని ప్రశ్నించడం ద్వారా కూడా ఎ.కె.గంగూలీ వార్తల్లో నిలిచారు. న్యాయస్ధానం అధికారాల్లోకి రాష్ట్రపతి గానీ, గవర్నర్ గానీ చొచ్చుకురావడానికి రాజ్యాంగంలో వీలు లేదని ఆయన ఒక తీర్పులో పేర్కొన్నారు.

మహారాష్ట్ర ప్రభుత్వంపై 10 లక్షల రూపాయల జరిమానా విధించిన తీర్పు కూడా వార్తల్లో నిలిచింది. ఒక ఎం.ఎల్.ఎ పై కేసు నమోదు చేయరాదని అప్పటి (2010) మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎస్.పి పై ఒత్తిడి చేశారు. ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేయని ఎస్.పి ఆ విషయాన్ని కేసు డైరీలో నమోదు చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం దొరికిపోయింది. న్యాయ ప్రక్రియలోకి జొరబడినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి బోంబే హై కోర్టు రు. 25,000 జరిమానా విధించగా రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్లింది. జస్టిస్ ఎ.కె.గంగూలీ జరిమానాను రు.10 లక్షలకు పెంచి సంచలనం సృష్టించారు.

2011లో గ్రేటర్ నోయిడా మునిసిపాలిటీ అభివృద్ధి కోసం అని చెప్పి రైతుల నుండి 156 హెక్టార్ల పొలాన్ని స్వాధీనం చేసుకుంది. ఆ తర్వాత పొలాన్ని రియల్ ఎస్టేట్ కంపెనీలకు, బిల్డర్లకు అప్పజెప్పింది. ఈ కేసు సుప్రీం కోర్టు వరకు వచ్చింది. జస్టిస్ ఎ.కె.గంగూలీ, జస్టిస్ అభిషేక్ సింఘ్విలతో కూడిన ధర్మాసనం స్వాధీనం చేసుకున్నా భూమి మొత్తం రైతులకు తిరిగి ఇచ్చేయాలని తీర్పు చెప్పింది.

ఈ తీర్పులన్నీ ప్రజాపక్ష దృక్పధంతో ఇచ్చినవే. ముఖ్యంగా కార్మికవర్గ దృక్పధంతో ఇచ్చిన తీర్పులని సరిగ్గా గమనిస్తే అర్ధం అవుతుంది. ఈ దేశంలో కలిగిన వర్గాలే ప్రభుత్వాలను నడుపుతున్నాయి. వారి అవసరాల కోసమే చట్టాలు పని చేస్తాయి. అందుకే రైతుల నుండి భూములు లాక్కొని బిల్డర్లకు ఇవ్వడం ప్రభుత్వాలకు సాధ్యపడింది. అందుకే ప్రజల ఆస్తి అయిన 2జి స్పెక్ట్రమ్ ను అత్యంత తక్కువ ధరలకు స్వదేశీ, విదేశీ కంపెనీలకు ప్రభుత్వాలు కట్టబెట్టడం సాధ్యపడింది. అందుకే ఎమ్మెల్యే పై ఎఫ్.ఐ.ఆర్ కట్టొద్దని సాక్ష్యాత్తూ ముఖ్యమంత్రే ఎస్.పి ని ఆదేశించగలిగాడు. ఈ కేసుల్లో బాధితులంతా కార్మికవర్గానికి చెందినవారే. అనగా శ్రమ చేసేవారే. శ్రమజీవుల శ్రమను దోచుకుని బతికి పరాన్న భుక్తులకు ఈ దేశ పాలక వ్యవస్ధ మద్దతుగా వస్తుందని ఈ కేసులు స్పష్టం చేస్తున్నాయి.

కానీ ఎ.కె.గంగూలీ ఇలాంటి పాలక వ్యవస్ధ ప్రయోజనాలకు వ్యతిరేకంగా తీర్పులు ఇచ్చారు. ఆయన తీర్పులు విదేశీ కంపెనీలను కూడా (2జి కేసులో) బాధించాయి. వారి బిలియన్ల రూపాయల లాభాలను వారికి దక్కకుండా 2జి తీర్పు అడ్డుపడింది. రైతుల భూములను లాక్కున్న బిల్డర్ల ధనదాహాన్ని ఒక తీర్పు కత్తిరించింది. ఈ నేపధ్యంలో బాధితురాలు అమెరికా పత్రిక వాల్ స్ట్రీట్ జర్నల్ కు ఇంటర్వ్యూ ఇవ్వడం పలు అనుమానాలు కలిగిస్తోంది.

ఈ దేశ అత్యున్నత న్యాయస్ధానం తనకు తానుగా కమిటీ వేసిన తర్వాత కూడా ఆ కమిటీ ముందు ఒకసారి మాత్రమే హాజరయ్యారు. నవంబర్ 21 తేదీన హాజరు కావాలని కోరినా ఆమె హాజరు కాలేదు. పైగా కమిటీ సభ్యులు తనను అనుమానంగా చూశారాని అమెరికా పత్రికకు చెప్పడం ద్వారా ఆమె ఎ ప్రయోజనాలను ఆశించారో అర్ధం కానీ విషయం. ఒకపక్క దేశం దృష్టిని ఆకర్షించినందుకు సంతోషం వ్యక్తం చేస్తూ మరోపక్క న్యాయమూర్తుల చిత్తశుద్ధిని విదేశీ పత్రికల ముందు శంకించడం దేన్ని సూచిస్తోంది? ఈ ప్రశ్నకు సమాధానం ఇప్పుడే దొరక్కపోవచ్చు. కేవలం భవిష్యత్తులో మాత్రమే సమాధానం వెతుక్కోగాలం. ఈ లోపు ఆమె ఫిర్యాదు అబద్ధం కారాదని ఆశించడం మాత్రమే చేయగలం.

One thought on “ఆ సుప్రీం జడ్జి పేరు ఎ.కె.గంగూలీ

  1. పింగ్‌బ్యాక్: ఆ సుప్రీం జడ్జి పేరు ఎ.కె.గంగూలీ | ugiridharaprasad

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s