తెహెల్కాకు సోమా చౌదరి రాజీనామా!


Shoma Chaudhury

మరో అనూహ్య పరిణామం! తెహెల్కా రధానికి ఇప్పుడు సారధి కూడా లేరు. యుద్ధం చేయాల్సిన వ్యక్తే విల్లమ్ములను బొంద పెట్టడంతో ఇప్పటికే బోసిపోయిన రధం సోమా చౌదరి రాజీనామాతో సారధి కూడా కరువై ఒంటరిగా మిగిలింది. అద్వితీయ కధనాలతో చెలరేగిపోయిన తెహెల్కా రధం ఇప్పుడు యుద్ధ వీరుడూ, సారధీ ఇద్దరూ లేక వెలతెలా పోతోంది. అన్నివైపుల నుండి విమర్శలు చుట్టుముట్టడంతో తన ఉనికి పత్రికకు నష్టమో, లాభమో తానే తేల్చుకోలేకుండా ఉన్నానని చెబుతూ సోమా చౌదరి తన రాజీనామాను ప్రకటించారు.

తరుణ్ తేజ్ పాల్ వ్యవహారం పత్రికలకు ఎక్కినప్పటినుండీ ఆయన నిర్వాకాన్ని కప్పి పుచ్చడానికి ప్రయత్నించారంటూ సోమా చౌదరిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. పలువురు పత్రికా ప్రముఖులే ఆమెపై దాడి ఎక్కుపెట్టారు. తెహెల్కా పత్రికలో సైతం జె మజుందార్ లాంటి ముఖ్యమైన ఉద్యోగులు కొన్ని రోజుల క్రితమే రాజీనామా చేశారు. దానితో విమర్శలకు తానొక్కరే సమాధానం చెప్పుకోవలసిన పరిస్ధితిలోకి సోమా నెట్టబడ్డారు. బాధితురాలి పక్షాన నిలవడం మాని తేజ్ పాల్ నేరాన్ని తక్కువ చేసి చూపారన్న నింద ఆమెను రాజీనామాకు పురికొల్పిన ప్రధాన కారణం అని ఆమె రాజీనామా లేఖలోని అంశాల ద్వారా స్పష్టం అవుతోంది.

అయితే కప్పిపుచ్చడానికి ప్రయత్నించానన్న ఆరోపణలను సోమా చౌదరి తిరస్కరించారు. లైంగిక దాడి విషయం పత్రికలకు ఎక్కినప్పటి నుండి పరిణామాలు వేగంగా జరిగిపోతున్న తరుణంలో తనకు తోచినంతవరకు బాధితురాలి పక్షానే తాను నిలిచానని ఆమె చెబుతున్నారు. కానీ తాను చేసిందాని కంటే ఇంకా ఎక్కువే చేసి ఉండొచ్చని ఆమె అంగీకరించారు. ఇతర లైంగిక అత్యాచారాలు జరిగినప్పుడు తాను వ్యక్తం చేసిన ఫెమినిస్టు విలువల నుండి తాను పక్కకు తప్పుకున్నానన్న ఆరోపణలను ఆమె ఖండించారు. అప్పటికీ, ఇప్పటికే తాను అదే విలువలతో ఉన్నాననీ, తన అవగాహన మారలేదని చెప్పారు.

‘ది హిందు సెంటర్ ఫర్ పాలిటిక్స్ అండ్ పబ్లిక్ పాలసీ’ వెబ్ సైట్ లో ఒక ఆర్టికల్ రాస్తూ సదరు సెంటర్ చీఫ్ కో-ఆర్డినేటర్ వసుంధర సిర్నాటే సోమా చౌదరిని “పనికిమాలిన ఫెమినిస్టు” (inept feminist) గా అభివర్ణించారు. ఇంకెంతమంది జర్నలిస్టులు ఆమెను ఆ విధంగా చెప్పి నిరసించారోగానీ ఆమెపై పడాల్సిన ప్రభావమే పడింది. గురువారం ఉదయం (తెల్లవారు ఝాము) గం. 5:52 ని. లకు ఆమె తన సహోద్యోగులకు పంపిన ఈ మెయిల్ ద్వారా తానూ రాజీనామా చేస్తున్నట్లు తెలిపారని ది హిందు తెలియజేసింది. తాను మరింత కట్టుదిట్టంగా వ్యవహరించి ఉండాల్సిందని అంగీకరిస్తూనే తన చర్యలు నేరాన్ని ‘కప్పిపెట్టడానికి’ ఉద్దేశించినవి మాత్రం కావని చెప్పుకొచ్చారు.

“నేను తీసుకున్న ప్రారంభ చర్యలు ఏ విధంగానూ (నిజాన్ని) తొక్కిపెట్టడానికి ఉద్దేశించినవి కావు. నా ఫెమినిస్టు అవగాహనల విషయానికి వస్తే సదరు అవగానల మేరకే నేను ప్రతిస్పందించానని నమ్ముతున్నాను. అందువల్లనే ఇతర అన్ని అంశాలకంటే నా సహ ఉద్యోగిని (బాధితురాలు) చెప్పినదానికే నేను మొట్టమొదటి ప్రాధాన్యం ఇచ్చాను” అని సోమా చౌదరి తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు.

అత్యంత తీవ్రంగా కలిచివేసిన ‘లైంగిక ఆరోపణల’ విషయం తన దృష్టికి నవంబరు 18 తేదీన వచ్చిందని, ఆ వెంటనే తాను వరుస చర్యలు తీసుకున్నానని సోమా చౌదరి పేర్కొన్నారు. “నా మనసు వరకూ, నేను తక్షణ ఆగ్రహంతోనే, నా కొలీగ్ పట్ల సహానుభూతితోనే, సాటి మహిళా ఉద్యోగిగానే స్పందించాను” అని సోమా పేర్కొన్నారు. బాధితురాలు వ్యక్తం చేసిన కోర్కెలకు అనుగుణంగా లైంగిక వేధింపుల వ్యతిరేక కమిటీ ఏర్పాటు చేయడానికి వెంటనే చర్యలు తీసుకున్నాను. “విషయం పత్రికలకు ఎక్కడానికి ముందు నా చేతుల్లో రెండు రోజుల సమయం మాత్రమే మిగిలింది. ఆ తర్వాత జరుగుతున్న విషయాలను నాకు తప్పుగా ఆపాదించారు. అర్ధ సత్యాలు, ఎంపిక చేయబడిన లీక్ లు… ఇవన్నీ మీడియాలో పడి భారీ పరిణామం సంతరించుకుని నాకు వ్యతిరేకంగా ఎక్కుపెట్టబడ్డాయి” అని సోమా ఈ మెయిల్ లో ఆక్షేపించారు.

బాధితురాలికి సహానుభూతిగా తాను తీసుకోగలిగిన అన్ని చర్యలు తీసుకున్నప్పటికీ “మా (జర్నలిస్టు) సహోదర బృందమే నా వ్యక్తిగత సమగ్రతను పదే పదే ప్రశ్నించారు. నిజానికీ జనం కూడా ఇందులో భాగం అయ్యారు. నా వ్యక్తిగత సమగ్రత గురించి లేవనెత్తబడిన ప్రశ్నల వలన తెహెల్కా గౌరవానికి భంగం కలగడం నాకు ఇష్టం లేదు. గత వారం రోజులుగా జరిగింది అదే” అని సోమా చౌదరి రాజీనామా లేఖలో పేర్కొన్నారు. సవాళ్లను మధ్యలో వదిలి వెళ్ళే రకాన్ని తాను కానని, కానీ “ప్రస్తుత చీకటి సమయంలో నా ఉనికి పత్రికకు ప్రమాదం కలిగిస్తున్నదో, లేక దోహదపడుతున్నదో నేనే తేల్చుకోలేకున్నాను” అని వాపోయారు. ఫలితంగా పత్రికకు తాను రాజీనామా చేస్తున్నానని ఆమె తెలిపారు.

సి.సి.టి.వి ధృవీకరణ

Tehelka Editor Tarunగోవా పోలీసులు సేకరించిన సి.సి.టి.వి రికార్డులు బాధితురాలు చెప్పిన అంశాలను ధృవీకరిస్తున్నాయని తెలుస్తోంది. ఈ విషయం పోలీసులు అధికారికంగా చెప్పలేదు. అయితే పేరు చెప్పడానికి ఇష్టపడని గోవా పోలీసు అధికారి ఈ సంగతి చెప్పారని ది హిందు తెలిపింది. నేరం జరిగిన హోటల్ నుండి నవంబర్ 7 నాటి సి.సి.టి.వి ఫుటేజీని గోవా పోలీసులు ఇప్పటికే సేకరించారు. “లిఫ్ట్ లో ఏదో జరుగుతోందన్న విషయం ఈ ఫుటేజీ ద్వారా ధ్రువపడింది” అని సదరు అధికారి చెప్పారు.

“తేజ్ పాల్, బాధితురాలు ఇద్దరూ మొదట హాలీవుడ్ నటుడు రాబర్ట్ డి నీరో (హీట్, కేసినో చిత్రాల నటుడు)  ను ఆయన రూమ్ దగ్గర దిగబెడుతున్నట్లు కనిపిస్తోంది. ఇది రాత్రి 9 గంటలప్పుడు. అనంతరం 10:30 ప్రాంతంలో తేజ్ పాల్ అదే ఎలివేటర్ దగ్గర గ్రౌండ్ ఫ్లోర్ లో బాధితురాలిని లోపలికి లాగుతున్న దృశ్యం రికార్డయింది. రెండు నిమిషాల తర్వాత రెండో అంతస్ధులో లిఫ్టు తెరుచుకుంది. ఆమె తన దుస్తులు సరిచేసుకుంటూ వేగంగా బైటికి రావడం మెట్ల మీదుగా కిందికి వెళ్లిపోవడం కనిపించింది” అని పోలీసు అధికారి చెప్పారు.

లిఫ్టు లోపల సి.సి.టి.వి కెమెరా లేదని కొద్ది రోజుల క్రితం పత్రికలు తెలిపాయి. మొదటి నుండి కెమెరా లేదా లేక సంఘటన జరిగాక తొలగించారా అన్న అనుమానాలను కొందరు వ్యక్తపరిచారు కూడా. ఇతర కెమెరాలో పై దృశ్యాలు రికార్డ్ అయినందున ఇంకా ఎవరికన్నా అనుమానాలుంటే అవి ఇప్పటికన్నా తొలగిపోవాలి.

15 thoughts on “తెహెల్కాకు సోమా చౌదరి రాజీనామా!

 1. మాటల్లో చెప్పలేని దారుణం జరిగితేతప్ప మనలోని క్రోధం నిద్రలేవదా
  జనవరి 12, 2013
  https://teluguvartalu.com/2013/01/12/%E0%B0%AE%E0%B0%BE%E0%B0%9F%E0%B0%B2%E0%B1%8D%E0%B0%B2%E0%B1%8B-%E0%B0%9A%E0%B1%86%E0%B0%AA%E0%B1%8D%E0%B0%AA%E0%B0%B2%E0%B1%87%E0%B0%A8%E0%B0%BF-%E0%B0%A6%E0%B0%BE%E0%B0%B0%E0%B1%81%E0%B0%A3%E0%B0%82/?relatedposts_exclude=20918

  విశేఖర్ గారూ,

  నిర్బయ ఘటనపై షోమా చౌదరి కథనాన్ని మీ బ్లాగులోనే పై లింకు ద్వారా మళ్లీ ఇప్పుడు చదివాను. మొత్తం చదివాక షోమాపై ఇప్పుడు వచ్చిన ఆరోపణ, ఆమె రాజీనామాకు దారి తీసిన ఆరోపణలు నిజం కావని, కాకూడదనే భావిస్తున్నాను.

  ఎందుకంటే భారతదేశంలో అత్యాచారం అనేది మన సంస్కృతిలో ఎంత బలీయంగా పాతుకుపోయిందో పై లింకులోని కథనంలో అంత గొప్పగా వ్యక్తీకరించిన షోమా, ఇప్పుడు తను పనిచేసే సంస్థలోని ఎడిటర్ స్థాయి వ్యక్తిపై ఆరోపణ వస్తే దాన్ని తేలిగ్గా తీసుకున్నారనే భావనను విశ్వసించడానికి నా మనసులో ఇచ్చగిచ్చడం లేదు.

  బాధితురాలి ఆరోపణను సానుభూతితో అర్థం చేసుకుంటూనే, ఈ బురదలో కనీసం షోమాకయినా పాత్ర లేదని, ఉండదని, ఉండకూడదని కోరుకుంటున్నాను. షోమా, తేజ్‌పాల్ పట్ల కాసింతయినా పక్షపాతం చూపించారని రుజువైతే ఇక మనం కాగితాలమీద అచ్చయిన ఏ రాతనయినా యధాతథంగా నమ్మడానికి వీల్లేదనే నా భావం.

  ఏదేమైనా మీడియాలో కాసింతయినా సత్యసంధత మిగిలే ఉందని గుడ్డిగా నమ్మేవారికి కూడా తేజ్‌పాల్ ఉదంతం చెంపపెట్టులా ఇప్పటికే తగిలింది. ఇక షోమాకు కూడా లైంగిక వేధింపుపై పక్షపాత దృష్టి ఉందని తేలితే ‘విలువ’ అనే పదానికే అర్థం లేకుండా పోతుందని నా భయం. అందుకే షోమాపై ఈ ఆరోపణ నిజం కాకూడదనే బలంగా కోరుకుంటున్నా.

  ఒక విషయం మాత్రం నిజం… నిర్భయపై గత సంవత్సరం చివరలో జరిగిన దారుణానికి, తెహల్కా మహిళా జర్నలిస్టుపై జరిగిన లైంగిక వేధింపుకు తేడా లేదు. తేడా అల్లా ఏదంటే ఒకరు మన మధ్య లేరు. ఒకరు మన మధ్యే ఉన్నారు. అంతే..

 2. ఈ తరుణంలో సోమచౌదరి రాజినామా ఆమె వృత్తికి ప్రవృత్తికి మధ్య నిజాలను నివృత్తిచేయడానికి జంకి వెనుకంజ వేసిందనే అపవాదుకు గురికాక తప్పదు. ఎన్నో రహశ్యాలను తేటతెల్లం చేసే తెహల్కా ఇంత హల్కాగా అందరి దృష్టిలో పడగానే సరికాదు. ఎన్నో జీవితాలను హాలాహలంలో ముంచెత్తిన సంస్థ తప్పటడుగులకు ఎవరు మడుగులొత్తరు సరికదా దాయాదులందరూ కోలాహలంగా గుమిగూడి తరుణ్ తేజ్ పాల్ని నిక్కచ్చిగా నిలదీసి కసితీర్చుకుంటారు. ముఖ్యంగా నివురుకప్పిన నిప్పులా ప్రభుత్వాధికారులు, వివిధ రాజకీయపక్ష భాదితులు, నల్లధనేతరులు అంటా మూకుమ్మడిగా దాడిచేసే నేపధ్యంలో తరుణ్ తేజం పాలిపోకతప్పదు.

 3. సోమా చౌధురి & తరుణ్ తేజ్‌పాల్‌లు వ్యాపార భాగస్వాములు. వాళ్ళకి తెహెల్కా పత్రికతో పాటు ఇంకో వ్యాపారం కూడా ఉంది. ఎంత వ్యాపార భాగస్వామి అయినా అతను వ్యక్తిగతంగా చేసే తప్పులని సమర్థించకూడదు.సోమా చౌధురి & తరుణ్ తేజ్‌పాల్‌లు వ్యాపార భాగస్వాములు. వాళ్ళకి తెహెల్కా పత్రికతో పాటు ఇంకో వ్యాపారం కూడా ఉంది. ఎంత వ్యాపార భాగస్వామి అయినా అతను వ్యక్తిగతంగా చేసే తప్పులని సమర్థించకూడదు.

 4. ‘నువ్వు కూడానా బ్రూటస్?’
  ” షేక్ స్పియర్ నాటకంలో రోమన్ డిక్టేటర్ జులియస్ సీజర్ ను కత్తితో పోడిచినవారిలో బ్రూటస్ కూడా ఉండడం చూసి సీజర్ వేసే ప్రశ్న ఇది.” సోమా చౌధురి గురించి రాజశేఖర్‌ రాజు గారి వ్యాఖ్య ఇలా వుంది. కొన్ని వాస్తవాలు నమ్మలేనివిగా వుంటాయి. అది అంతే!

 5. *నిర్భయపై గత సంవత్సరం చివరలో జరిగిన దారుణానికి, తెహల్కా మహిళా జర్నలిస్టుపై జరిగిన లైంగిక వేధింపుకు తేడా లేదు*

  రాజు గారు,

  నిర్భయ దారుణానికి దీనికి పోలికేలేదు. ఇది నిర్భయ కన్నా ఘోరం. పెద్ద చదువులు చదివి, రచయితగా సంఘం లో పేరు ఉన్నవాడు, బాధితురాలిని చిన్నపటినుంచి దశాబ్దాలుగా ఎరిగిన వాడు, తండ్రి స్నేహితుడే కాక, కూతురి మితృరాలు అయిన ఆమేతో ఇటువంటి ప్రవర్తన హేయమైనది. ఇక నిర్భయ విషయం తీసుకొంటే బస్సు లో పనిచేసే క్లీనర్లు, చదువు లేని వారు. అతని సంగతి పక్కన పెడితే, ఈ రోజు ఆయన భార్య,కూతురు గోవాకు తోడు గా పోవటం చూస్తే వాళ్లు చేసిన పని కూడా సబబు గా లేదనిపించింది. భర్త చేసిన వెధవ పనికి వారి మద్దతు చూస్తూంటే, వామపక్ష భావజాలంవారు రోజు దుమ్మెత్తి పోసే పురాణ హిందూ పతివ్రతలతో పోటిపడుతున్నట్లుగా ఉన్నారు.

  ఈ సంఘటన గురించి తెలిసిన వెంటనే నాకు బిజెపి మాజి అధ్యక్షుడు బంగారు లక్ష్మణ్ గారు గుర్తుకు వచ్చారు. ఆయనకి అమ్మాయీల పిచ్చి లేకపోవటం వలన, ఆయనకు లక్ష రూపాయల లంచం ఇచ్చినట్లుగా, చిత్రికరించి దోషిగా నిలబెట్టారు. వేల కోట్ల స్కాం లు జరిగే చోట వీరి స్టింగ్ ఆపరేషన్ వలన ప్రభుత్వానికి ఎన్ని కోట్ల ఆదాయం వచ్చిందో, ఆర్మి కాంట్రక్ట్ లో అవినితీ ఎంత అంతమయ్యిందో నాకు తెలియదు. కాని సాధారణ స్థాయి పార్టి కార్యకర్త నుంచి ఒక జాతీయపార్టి అధ్యక్షుడి గా ఎదిగిన బంగారు లక్ష్మణ్ ను మాత్రం బద్నాం విజయవంతంగా చేశారు. ఎంతగా చేశారంటే , పాపం ఆయన ఒక్కడే కోర్టు చుట్టు తిరుగుతున్నాడు. పార్టి తరపున నుంచి ఆయనకు సహయం అందిమటానికి ఎవరిని ముందుకురాకుండా కట్టుదిట్టం చేశారు. వస్తే అవినితి పరుడిని ఎలా సమర్ధించావని నిలదీస్తూ టి వి లలో చర్చలు మొదలుపెట్టి, మీడీయా వాళ్లు ఎక్కడా విరుచుకు పడాతారో అని ఒక్కరు ఆయనకు మద్దతునివ్వటానికి రాలేదు. సానుభూతి షోమా మీద కాదు ఎవరైనా చూపించాల్సింది. బంగారు లక్షమణ్ మీద అనిపిస్తుంది. ఈ రోగ్ లు చేసిన స్టింగ్ ఆపరేషన్ లో అమాయకంగా ఇరుక్కుపోయాడు. నమో లాంటి గట్టివారు తెలివిగా తప్పించుకొన్నారు.

  ఒకప్పుడు తరుణ్ తేజ్ పాల్ తో కలసి స్టింగ్ ఆపరేషన్ చేసిన అనిరుధ్ బెహల్ కొత్త స్టింగ్ ఆపరేషంతో టివి చర్చలలో కనిపించాడు.ఆ చర్చలలో పాల్గొన్నవారు ఆయనను ఎగతాళి గా మాట్లాడారు. ఆయన ను పట్టించుకొన్న నాధుడు లేడు. ఈ సంఘటనతో స్టింగ్ ఆపరేషన్ లు విశ్వసనీయతను పూర్తిగా కోల్పొయాయి.

 6. శ్రీరామ్ గారూ,

  మీ వ్యాఖ్యతో ప్రాథమికంగా ఏకీభవిస్తున్నా. చిన్న సవరణలు

  ఒక వ్యక్తి హంతకుడు, రేపిస్టు, చోరుడు… ఎవరైనా కావచ్చు.. సమాజం మొత్తంగా అతడిని నిలదీస్తున్నప్పుడు, ప్రశ్నిస్తున్నప్పుడు, సకారణంతో అయినా సరే వెంట బడుతున్నప్పుడు అతడితో ఎలా వ్యవహరించాలి అనేది ఆ కుటుంబమే తేల్చుకోవలసి ఉంటుందనుకుంటాను. కుటుంబ పెద్దపై ఆరోపణ వచ్చినంతనే కుటుంబం అతడికి మద్ధతు ఇవ్వకూడదు అంటే ఇది ఏ వ్యవస్థలో నయినా ఆచరణ సాధ్యం కాదనిపిస్తోంది.అలా అని తేజ్‌పాల్ వ్యవహారాన్ని నేను తేలిక చేసి చూడటం లేదు.

  సమాజం ముందు దోషిగా నిలబడిన వ్యక్తికి ఆ కుటుంబం మద్దతుగా నిలబడటం అనేది ఆ కుటుంబానికి సంబంధించిన హక్కుగా కూడా ఉంటుందేమో ఆలోచించాలి. పైగా తేజ్‌పాల్ సహచరి, కుమార్తె ఇరువురూ… విలువల పట్ల తెహెల్కా స్థాయి యుద్ధాలు చేసిన వారు కాదనుకుంటాను. స్ట్రింగ్ ఆపరేషన్లతో, వినూత్న పరిశోధనలతో వ్యవస్థను కదిలించినందుకే తేజ్‌పాల్ తన వ్యక్తిగత ‘పాప’భారాన్ని ఇంత పెద్ద ఎత్తున భరించవలసి వస్తోంది తప్పితే సాదాసీదా సంపాదకుడుగా ఉంటే ఆ ఘటన ఇంత చర్చకు దారి తీసి ఉండదేమో మరి. మామూలు పరిస్థితుల్లో అయితే శతకోటి లింగాల్లో బోడిలింగం లెక్కన అతడూ ఒక సాదా సీదా నైతిక దుర్వర్తనుడిగా మిగిలి ఉండేవాడేమో ఆలోచించండి.

  పైగా, ప్రజాశత్రువులు అని ముద్రవేసి సోవియట్ రష్యా, చైనాలలో అనేకమందిని నాటి సోషలిస్టు సమాజాలు దాదాపుగా వెలివేసినంత పనిచేసినా, ఆ ప్రజాశత్రువుల కుటుంబాలు వారిని వదిలేసిన చరిత్ర ఒక్కటి కూడా నేనయితే వినలేదు. ఒకటి రెండు ఉదంతాలు ఎక్కడైనా జరిగి ఉన్నా అది మినహాయింపుగా మాత్రమే ఉంటాయి తప్పితే ఏ సమాజంలోనూ అలాంటి ఉదాహరణలు వ్యవస్థీకృత రూపం దాల్చలేదు. నైతిక పరమైన తప్పు చేసిన వెంటనే అలాంటి వ్యక్తులను వారి కుటుంబాలు త్యజించివేయడం అనేది ఏ వ్యవస్థలో కూడా సాధ్యం కాదనుకుంటాను.

  పోతే.. మీరు పేర్కొన్న బంగారు లక్ష్మణ్ ఉదంతంపై మీ వ్యాఖ్య పట్ల విస్తృతార్థంలో నాకూ ఏకీభావమే ఉంది. గత 60 సంవత్సరాలుగా వందలాది కోట్ల పాయల ప్రజాధనాన్ని కొల్లగొట్టి ముడ్డికింద దాచుకుని పెద్దమనుషులుగా ఊరేగుతున్న వారిని ఈ దేశంలో ఏ చట్టమూ ఏమీ చేయలేకపోయింది. కాని కెమెరా కంటికి దొరికిపోయిన పాపానికి, అది కూడా కేవలం లక్షరూపాయల గడ్డి తిన్నందుకే బీజేపీ మాజీ అధ్యక్షుడికి అంతపెద్ద శిక్ష విధించడం విన్నప్పుడు నాకు కూడా అయ్యో అనిపించింది. కోర్టు తీర్పుపై వ్యక్తుల వ్యాఖ్యలు నిలవవు అనే వాస్తవాన్ని అంగీకరిస్తూనే.. చిన్న పామును పెద్ద కర్రతో కొట్టారేమో అనిపించింది.

  మీరన్నట్లుగానే, “సాధారణ స్థాయి పార్టి కార్యకర్త నుంచి ఒక జాతీయపార్టి అధ్యక్షుడిగా ఎదిగిన బంగారు లక్ష్మణ్ ను మాత్రం బద్నాం విజయవంతంగా చేశారు. ఎంతగా చేశారంటే , పాపం ఆయన ఒక్కడే కోర్టు చుట్టు తిరుగుతున్నాడు”. అక్షరసత్యమే.. ఇటీవలికాలంలో కోర్టు పుణ్యమా అని లాలూ ప్రసాద్ యాదవ్ సైతం జైలుకెళ్లవలసి వచ్చింది. అయతే చివరి నిమిషం వరకు ఆయనను కాపాడడానికి, ఆయన పార్లమెంటు సభ్యత్వం రద్దు కాకుండా ఉండటానికి కేంద్ర ప్రభుత్వం ఎంత ఘాతుకాలకు పాల్పడిందో అందరికీ తెలుసు.

  అంత చేసి లాలూ… ఆయన బృందం తిన్న గడ్డి 30 కోట్ల రూపాయలు మాత్రమే అనుకుంటాను. వీళ్లతో పోలిస్తే బ్యాంకులకు వందల కోట్లు ఎగనామం పెట్టి దర్జాగా తిరుగుతున్న పారిశ్రామిక ప్రభువులకు ఎంతెంత శిక్షలు పడాలి? ఒక్కరికయినా ఈ స్వాహాతంత్ర భారతంలో పడిన పాపాన పోలేదు కదా.

  మీ చివరి వ్యాఖ్య.. తేజ్‌పాల్ సహచరుడిని తాజా టీవీ చర్చల్లో గేలి చేశారన్నది. మీరన్నట్లు విశ్వసనీయతను కోల్పోయినవి స్టింగ్ ఆపరేషన్‌లు మాత్రమే కావు. ఒక పత్రిక మీద, దాని పరిశోధనాత్మక జర్నలిజం మీద పెట్టుకున్న నమ్మకం కూడా ఇప్పుడు భ్రష్టు పట్టిపోయింది కదా. ఆ బాధతోనే సోమా చౌదరిపై ఆరోపణ నిజం కాకుంటే బావుండు అని నేను మొదట్లోనే అన్నాను. కాని తేజ్‌పాల్ అవినీతిపై నూటికి నూటికి నూరుపాళ్లు సమయుద్ధం చేయలేదని ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తోంది కనుక ఇప్పుడు విలువలపై పెద్దగా ఆశలు లేవు.

  ధన్యవాదాలు.

 7. రాజు గారు,
  మీరు రాసిందానికి వివరణలో పోయే ముందు రెండు మాటలు. మీలాంటి వారు రాసే విధానం చూసినపుడు, నా భావవ్యక్తీకరణ మీద అనుమానం వస్తుంది. నేను చెప్పాలనుకొన్నది సరిగా చెప్పగలుగుతున్నాన అనిపిస్తుంది. కారణం నేను రచయితను కాను. నాకు తెలిసినది వ్యాఖ్యలు గా రాస్తాను అంతే.

  నేను సాధారణం గా టివి చూడను. ఈ విషంలో జరిగే తతంగం చూడటానికి టివి పెడితే తరుణ్ తేజ్ పాల్ ని భార్యాకూతురుతో విమానంలో పోతున్నాడు. సాధారణం గా వామపక్ష భావజాల రచయితలు రాసే వ్యాసాలు,కథలు చదివితే స్రీ కి చదువు లేకపోవటం వలన, ఆస్థి పైన హక్కు లేకపోవటం వలన పురుషుడి సంపాదన పైన ఆధారపడి ఉండటం వలన వాడు చేసే వెధవ పనులను భరిస్తూంట్టుంది అని రాస్తారు. అదే మహిళల కి చదువు,సంపాదన, ఆస్థి లాంటివి ఉంటే స్వేచ్చగా నిర్ణయాలు తీసుకోగల్గుతుంది. అప్పుడు సమాజం లో మార్పు వస్తుంది అని రాస్తారు. తరుణ్ తేజ్ పాల్ భార్య,కూతురికి చదువు,సంపాదన, ఆస్థి మూడు ఉన్నాయి. స్వేచ్చగా బతికే అవకాశం,ధైర్యం ఉంది. అయినా భర్త చేసిన వెధవపనిని నిలదీయలేదు. సరికదా! ఆయన అరేస్ట్ కావటానికి వెళుతూంటే, తోడుగా వీరు పోవటం అవసరమా? విమానంలో ఆయన పక్కనే అంటి పెట్టుకొని, కంటికి రెప్పలా కాపాడుకొవలసిన అవసరం ఏముంది? ఆపరేషన్ థీయేటర్ లో కి తీసుకొని పోయే పేషంట్లా అనారోగ్యంతో ఉన్నవాడుకాదు కదా!? ఆధునిక మహిళలై ఉండి వీరు ప్రపంచానికి పంపేసందేశం ఎమిటి? మా ఆయన విలువలు పేరు చెప్పి నానా రకాల గడ్డితిని డబ్బులు మాకుటుంబం కోసం సంపాదించాడు. కనుక మాకు ఆయన ఊరుమీదపడి తప్పులు చేసినా ఫరవాలేదు. ఇది వ్యతిరేకుల కుట్ర అనే మేసేజ్ పంపినట్లుంది.
  అదే పురాణాలలో ద్రౌపది భర్తల తప్పులను,లోపాలను ఉతికి ఆరేసిన సందర్భాలు భారతం లో ఉన్నాది. ఇంత అడ్వాంటేజ్ పొసిషన్ లో ఉండి, ఏమాత్రం వ్యక్తిత్వం లేకుండ ఆయన భార్య ప్రవర్తించిన తీరు ఎమీ బాగాలేదు. ఒకవేళ ఆమేకు భర్త మీద చెప్పలేనంత ప్రేమ,ఆయన తో సంఘీభావం,ఆయనకు ఎమైనా జబ్బులు ఉంటే వేరే విమానంలో పోయి, ఆయనకు సేవలు చేసుకొంటె బాగుండేదేమో! అనిపించింది.అంతకు మించి ఎమీ లేదు.

 8. మీ సూత్రం చాలా బాగుంది. కానీ ఆ సూత్రాన్ని మోడి అభిమానులు కూడా పాటిస్తే ప్రధాన మంత్రి, ముఖ్యమంత్రి అటుంచి కనీసం పంచాయితీ ప్రెసిడెంట్ కూడా కాలేరేమో ఆయన!

 9. రాజు గారు,
  సాధారణం గా షోమ చౌదరి లాంటి వామపక్ష వాదులకు సమాజం మీద అవగాహన చాలా ఉన్నట్లు అనుకొంటాం. తీరా చూస్తే వారికి కనీస అవగాహన ఉందా అనిపిస్తుంది. బంగారు లక్ష్మణ్ గారిని ఇరికించేముందుగా ఆయన గురించి ఎమైనా ఆలోచించింరా? మనదేశంలో ప్రాంతీయ పార్టిలన్ని దాదాపు కుటుంబ,కుల పార్టిలు. ఆ పార్టిలలో ఇతర వర్గాలకు స్థానం ఉండదు. కాంగ్రెస్ లేక బిజెపి లాంటి జాతీయపార్టిలలో ఇతర వర్గాలకు అవకాశం వచ్చేది. వారికి రాక రాక ఒక అవకాశమొస్తే, పెద్ద స్టింగ్ ఆపరేషన్ చేసి,చివరికి వీరు ఎమీ సాధించారో ఆలోచించాలి. దళితులు, మైనారిటిలకు మనదేశం లో న్యాయం జరగటంలేదని వాదించే వారు, చివరికి దళితుడైన బంగారు లక్ష్మణ్ గారిని దోషిగా నిలిపారు. అది విచిత్రం. వారి తెలివి. ఇకవారి దాక వస్తే షోమా ఎమి చేసిందంటే
  Shoma was hysterical during raid at Tehelka: Goa cops
  http://articles.timesofindia.indiatimes.com/2013-11-30/india/44595825_1_goa-cops-tehelka-office-goa-police

  బంగారు లక్ష్మణ్ తో పోలిస్తె లాలు ప్రసాదుకి వయసు,శక్తి ఉన్నాదనిస్తుంది. క్రితం సారి బంగారు లక్ష్మణ్ టివి లో చూసినపుడు వయసు వలన, కేసుల వలన కోర్ట్ చుట్టు తిరుగుతూ చాలా అలసిపోయినట్లు, శక్తి హీనంగా ఉన్నారు. అందువలన నాకు ఆయనంటే సానుభూతి.

 10. శ్రీరాం గారూ,
  మీ భావవ్యక్తీకరణను మీరు స్పష్టంగానే చెప్పగలుగుతున్నారు. చివరకు కమ్యూనిస్టులపై, కమ్యూనిస్టు సిద్ధాంతాన్ని విశ్వసించే వారిపైన కూడ మీరు ఏమాత్రం దాచుకోకుండానే మీ అభిప్రాయాలను, మీ వ్యతిరేకతను చాలా సార్లు వ్యక్తం చేశారు. మీ వామపక్ష వ్యతిరేకతను నేను అంగీకరించినా, అంగీకరించకపోయినా దాన్ని ప్రకటించే మీ హక్కును మాత్రం గుర్తించాల్సిందే. ఈ అంశంపై మీ అభిప్రాయాలను ప్రకటించే విషయంలో మీరు స్పష్టంగానే ఉన్నారు. కాబట్టి మీ వ్యక్తీకరణ విషయంలో మీరు సందేహించవలసిన అవసరం లేదనుకుంటాను.

  పోతే.. ఇప్పటికీ మీ వాదన లేదా అభిప్రాయంలో ఒక అంశంపై నాకు విభేదమే ఉంది. తేజ్‌పాల్ గత పదిహేనేళ్లుగా తన చుట్టూ నిర్మించుకుంటూ వచ్చిన ఉత్తుంగ శిఖరం నుంచి దభీలున కింద పడినప్పుడు ఆయన భార్య, కుమార్తె అనుభవించిన మానసిక సంక్షోభం బహుశా మనకెవ్వరికి తెలీదు.

  కుటుంబంతో సన్నిహతంగా మెలిగిన మహిళతో అలా ప్రవర్తించవచ్చా అంటూ కన్నకూతురే తేజ్‌పాల్‌ను నిలదీసిందని కూడా వార్తలు విన్నాం. పైగా కుటుంబ బంధాలు ఒక ఘటనతో, (అది ఎంత పెద్దదయినా సరే) చిన్నాభిన్నం అవుతాయని, తెగతెంపులకు దారితీస్తాయని, మనిషి ఉనికిని కూడా తోసిరాజనేంత తారాస్థాయికి చేరుకుంటాయని నాకయితే అనిపించడం లేదు.

  ఈ విషయంలో హిల్లరీ క్లింటన్ నుంచి మన దేశంలోని ఒక సాధారణ స్త్రీ (భార్య, కుమార్తె) వరకూ కూడా అంత మౌలిక పరిణామంలోకి వెళ్లిపోలేరనే నా భావన. దీంట్లో మనం ఆస్తులు, సంపాదన, విద్య, చైతన్యం, ఇంకా వర్గ పరిశీలనకు కూడా వెళ్లి నిర్ధారణకు రాలేమనుకుంటాను.

  మీరే అన్నారు. ద్రౌవది తన భర్తల తప్పులను లోపాలను ఉతికి ఆరేసిన సందర్భాలు భారతంలో ఉన్నాయని. కాని అంత ద్రౌపది కూడా భర్తలను వదిలిపెట్టి వెళ్లిపోలేదు కదా. ఇంకా దాయాది పత్నిని, అన్న భార్యను కూడా బానిసగా లెక్కించి దుర్యోధనుడు ఆమెను సైగ చేసి పిలిచినప్పుడు కూడా అతడి భార్య భానుమతి అతడిని ఛీకొట్టలేదు. దుర్యోధనుడితో బంధాన్ని వదులుకోలేదు.

  ఎక్కడో భారత, రామాయణాల వరకు ఎందుకు? వ్యక్తిగత జీవితంలో మనమే ఒక ఘోర ఘటనకు పాల్పడినప్పుడు (ఊహామాత్రంగా అయినా అలా జరిగిందని భావిద్దాం…) కూడా మన కుటుంబాలు మనల్ని ఛీకొడతాయని, దూరమవుతాయని నాకయితే నమ్మశక్యం కావడం లేదు. కుటుంబ బంధం ఈ ప్రపంచంలో ఇంకా అత్యంత బలంగా పాతుకుపోయి ఉంది. ఆంక్షలతో, నిషేధాలతో, సూత్రీకరణలతో దాన్ని విచ్ఛిన్నం చేయడం ఇప్పటికయితే సాధ్యం కాదనుకుంటాను.

  వ్యక్తిత్వం లేకుండా తేజ్‌పాల్ భార్య ప్రవర్తించిన తీరు ఏమీ బాగా లేదన్నారు మీరు. వ్యక్తిత్వం, ఆత్మాభిమానం అనేవి మన సమాజంలో కోట్లాది మందికి సంబంధించి నేటికీ చాలా పెద్దమాటలుగానే కనబడతాయేమో పరిశీలించగలరు.

  బంగారు లక్ష్మణ్ గారి వయసు, ఆయన చేసిన లక్ష రూపాయల చిన్న తప్పిదంపై మీకూ, నాకు కూడా సానుభూతి ఉండవచ్చు. కాని విషయం కోర్టుల వరకు వెళ్లాక అవి వాటిని గుర్తించవు. చాలా మంది ఘనమైన నేరాలకు కూడా దొరక్కుండా తప్పించుకుంటున్న ప్రపంచంలో ఆయన కెమెరాకు దొరికిపోయారు. ఏ పార్టీకి అధ్యక్షుడిగా పనిచేసినా మన సానుభూతి ఆయనను కాపాడలేదు. దీంట్లో దళిత కోణం, కుల వివక్షతా కోణంపై కూడా గతంలోనే చాలా చర్చ జరిగింది. అది ఇక్కడ అప్రస్తుతం.

  విశేఖర్ గారూ,
  మోడీపై మీ వ్యాఖ్య చిన్నదైనా అర్థవంతంగానే ఉంది. దీన్ని మోడీ అభిమానులు ఎన్నటికీ స్వీకరించలేరనే నా అభిప్రాయం. ఏదేమైనా. పన్నెండేళ్ల క్రితం, గోద్రా అనంతర మారణ కాండ నేపథ్యంలో, మోడీ రాజధర్మాన్ని సరిగా నిర్వర్తించలేదని నాటి ప్రధాని వాజ్‌పేయి అన్న మాటలు నా చెవుల్లో ఇంకా గింగురుమంటూనే ఉన్నాయి. మోడీని జీవితకాలం ఆ వాఖ్య వెంటాడుతూనే ఉంటుందనేది నా నమ్మకం.

  మీ వెబ్‌సైట్‌లో ఎక్కువ స్పేస్‌ను తీసుకుంటున్నాం.. క్షమించాలి…

  (ఈ వ్యాఖ్య సోమవారం రాత్రే సిద్ధపర్చినా, ఇంటర్నెట్ క్లోజ్ కావడంతో పోస్ట్ చేయడం కుదర్లేదు. సమయం మీరినప్పటికీ, చర్చ కొనసాగింపులో భాగంగానే ఇప్పుడు దీన్ని ఇక్కడ పొందుపరుస్తున్నా.)

 11. *బంగారు లక్ష్మణ్ గారి వయసు …. దళిత కోణం *
  రాజుగారు,
  ఆ వ్యాఖ్యరాయటానికి ప్రధాన కారణమైన లింక్ ఇవ్వటం మరచాను. మొదటి ఆరు నిముషాలు భారతదేశంలో దళితులు,మైనారిటిలకు జరిగే అన్యాయం గురించి షోమా చౌదరిగారు చెప్పింది వినండి. దాని ఆధారంగా అలా రాయవలసివచ్చింది.

  బహుశా వీరిని వామపక్ష భావజాలం వారు అని అనే కంటే వేరే ఎదైనా పేరుతో సంభొదిస్తే సరిగ్గా ఉంట్టుందేమో అని అనిపించింది! వామపక్ష భావజాలంగల వారు పట్టణ ప్రాంతానికి చెందిన పేద, మధ్యతరగతి వర్గాల వారికి చెందిన వారై ఉంటారు. అందులో కొందరు నిజాయితి పరులు ఉంటారు. అదే ప్రొగ్రెసివ్ వాదులైతే డిల్లి, బాంబే లాంటి మెట్రో సిటికి చెందిన ఎగువ మధ్యతరగతి కి చెందిన వారు. మంచి స్కుల్స్, కాలేజిలలో చదివి నోటి నిండా ఇంగ్లిష్ , కేరీర్ మైండ్ గల కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన వారై ఉంటారు. దేశం గురించి తెలిసింది తక్కువైనా ఎక్కువగా మాట్లాడటం.

  *ఉత్తుంగ శిఖరం నుంచి దభీలున … మానసిక సంక్షోభం బహుశా మనకెవ్వరికి తెలీదు.*

  మీరన్నది నిజమే. కాని అతన్ని చూస్తే ఒక మొండి ధైర్యం, ప్రపంచం అంటే లెక్కలేనితనం పుట్టుకతో వచ్చినట్లు ఉంది. ఆ స్వభావం/ గుణం స్టింగ్ ఆపరేషన్ లో హీరో ని చేస్తే, ఈ విషయం లో విలన్ ని చేసింది. బహుశా కుటుంబ సభ్యులు, ఇతను ఇటువంటి చిక్కుకు ఎప్పుడో ఒకప్పుడు తీసుకొని వస్తాడని ఊహించి ప్రిపేర్ అయి ఉంటారేమో!

  వామపక్ష సిద్దాంతం లో లోపాలు ఉన్నాయి. కొందరు మంచి వ్యక్తులు దానికి ఆకర్షితులు అవటం వలన, దానిని మంచి సిద్దాంతం అని పొరపడుతూంటారు. నాకు మహాకవి శ్రీ శ్రీ అంటే ఇష్ట్టం. అలాగే కొకు గారంటే కూడాను! ఆధారం లేకుండ మటుకు విమర్శించను. నేను రాసే భిన్నభిప్రాయాలను విమర్శించాలను కొంటే తప్పక చేయవచ్చు. తిప్పికొట్టవచ్చు. ఈ రోజు తరుణ్ తేజ్ పాల్ తప్పుచేసి చిక్కాడు కదా అని అతనిని విమర్శించటంలేదు. 90% పైన జాతీయ ఇంగ్లిష్ మీడీయా వారు ఈ దేశప్రజలతో సంబంధం లేకుండా వారి లోకంలో వారు ఉంట్టు, ప్రజలని తప్పు తోవపట్టిస్తున్నరని అనుకొంట్టాను. అదేపని గా ఒక దానిని పట్టుకొని వేలాడుతూంటే వ్యక్తులు భవిషత్ మార్పులకు సన్నద్దం కాలేరు. అదే విధంగా అమేరికా శక్తిని, కేపిటలిజాన్ని ఎక్కువ గా ఊహించుకొంటే కూడ పెద్ద లాభం, మనదేశ పౌరులకు లేదు. అన్ని దేశాలు, వ్యవస్థలు ఎన్నో మార్పులకు లోనౌ తున్నాయి. ఇంఫర్మేషన్ టెక్నాలజి /ఇంటర్నెట్ ఏజ్ నుంచి మెషిన్ ఏజ్ (రోబో) లో కి వచ్చే పదేళ్లలో అడుగు పెడుతున్నాం. కొంచెం ఆ దిశలో కూడా ఆలోచించాలి. మీకు విపులంగా తెలుసుకోవాలనుకొంటే ఈ క్రింది వీడీయోలను చూడండి.

  The End of Growth

  Michio Kaku: What does the future look like

  (ఈ వ్యాఖ్య రాసి పెట్టి పోస్ట్ చేయటం మరచాను. ఆలస్యంగా ప్రచూరిస్తున్నందుకు సారి.)

 12. DO NOT PUBLISH MY COMMENT

  శేఖర్ గారు,

  అన్ని లింకులు ఇస్తే, చాలా మంది ఆ ఇప్పుడు వీలు పడదు,సమయం లేదు, మళ్ళీ చూద్దాము లే అని అనుకొంటారు. ఒక్కటి కూడా చూడరని, ముఖ్యమైనవి అక్కడ ఇచ్చాను. ఎందుకంటే అవి సుమారు 2:30 గం||. ఒక సినేమాను చూసినంత సమయం తీసుకొంట్టుంది. మీకు ఆర్ధిక శాస్త్రం పైన అవగాహన, ఆసక్తి ఉన్నాయి కనుక మీరు ఈరేండు విడీయోలను చూసేది.

  The End of Trust. Satyajit Das

  Satyajit Das – The Australian Dream

 13. శ్రీరాం గారు,
  “బహుశా వీరిని వామపక్ష భావజాలం వారు అని అనే కంటే వేరే ఎదైనా పేరుతో సంభొదిస్తే సరిగ్గా ఉంట్టుందేమో అని అనిపించింది!”

  మీ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నా.. వామపక్షవాదులు, వామపక్ష భావజాలం అనే పదాలు, భావనలు వాటికవే ఒక బ్రహ్మపదార్థంగా మారిపోయిన ప్రస్తుత కాలంలో ఎవరిని ఆ కేటగిరీలో చేర్చాలో అర్థం కాదు. మన దేశంలో పైకి చెబుతున్న, ప్రచారంలో ఉన్న వామపక్షవాదమంతా ఆచరణతో ఏమాత్రం సంబంధంలేని పడికట్టుపదజాలమే అనేది నా ప్రగాఢాభిప్రాయం.

  తేజ్ పాల్‌పై మీరు చెప్పిన పాయింట్‌పై చిన్న వివరణ. తేజ్‌పాల్ వంటి మేధో జీవులు కమ్యూనిస్టులు కారనుకుంటాను. “ఇది గోవా. ఇక్కడ మీకు నచ్చింది తినొచ్చు. నచ్చింది తాగొచ్చు. నచ్చిన వారితో పడుకోవచ్చు” అంటూ ఒక నగర జీవితం మీద అంత వల్గర్ కామెంట్ చేసిన వ్యక్తి కమ్యూనిస్టు, లేదా కమ్యూనిస్టు భావజాలం గల వ్యక్తి అని నేనయితే అనుకోవడం లేదు. పైగా ఆయన తల వెనుక పొట్టి జడలాంటి ఆహార్యం ఆయనేంటో, ఎలాంటి జీవితానికి ఆయన ప్రతినిధో చెబుతూనే ఉంది. వేషం బట్టి మనిషిని అంచనా వేయకూడదన్నది నిజమే కాని నాకెందుకో ఆయన ఆహార్యం లేని సందేహాలను కలిగిస్తోంది.

  ఇక షోమా చౌదరి. మహిళగా, జర్నలిస్టుగా ఆమెపై అపార గౌరవం ఉంది కాని ఇలాంటి వారి భావజాలం కమ్యూనిజంతో ముడిపడి ఉందని నాకనిపించడం లేదు. ఆమెపై చర్చ ఇక్కడ అవసరం లేదనుకుంటాను.

  “90% పైన జాతీయ ఇంగ్లిష్ మీడియా వారు ఈ దేశప్రజలతో సంబంధం లేకుండా వారి లోకంలో వారు ఉంట్టు, ప్రజలని తప్పు తోవపట్టిస్తున్నరని అనుకొంటాను.”
  మీ ఈ వ్యాఖ్య ఆలోచనాత్మకమే. మొత్తం మీడియానే, ప్రపంచాన్ని తామే ఉద్ధరించేస్తున్నట్లు పోజు కొడుతూ, తమ మైకూ, తమ డెస్కూ, తమ చర్చలూ లేకుంటే ఈ ప్రపంచమే కుప్పకూలిపోయేది అనుకునే ఉష్ట్రపక్షి తరహాలోకి వెళ్లిపోయి ఉంది. ఇంగ్లీష్ మీడియా అయితే ఈ ఔద్ధత్య ప్రదర్శనలో రెండు కాదు.. పదాకులు ఎక్కువే చదివింది మరి.

  “అదేపని గా ఒక దానిని పట్టుకొని వేలాడుతూంటే వ్యక్తులు భవిషత్ మార్పులకు సన్నద్దం కాలేరు. అదే విధంగా అమెరికా శక్తిని, కేపిటలిజాన్ని ఎక్కువగా ఊహించుకొంటే కూడ పెద్ద లాభం, మనదేశ పౌరులకు లేదు. అన్ని దేశాలు, వ్యవస్థలు ఎన్నో మార్పులకు లోనౌ తున్నాయి.”
  విస్తృతార్థంలో మీ వ్యాఖ్యను అంగీకరిస్తాను. అన్ని దేశాలు, వ్యవస్థలు ఎన్నో మార్పులకు లోనవుతున్నాయి. కాని అమెరికా విదేశాంగ విధానం మాత్రం బేసిక్‌గా మారలేదనే అనిపిస్తుంది. ప్రపంచంపై దశాబ్దాలుగా అది విసిరిన పెంట చిన్నది కాదు. ప్రపంచాధిపత్యం విషయంలో అది బొక్క బోర్లా పడుతున్నా దాని సైనిక ప్రయోజనాలు, అహంభావం, కొల్లగొట్టే స్వభావం ఏమాత్రం మారలేదనే నా అభిప్రాయం. తనతో ప్రమేయం లేకుండా జరిగే ఏ అభివృద్దినీ అది సహించలేదు. ఇది తప్పితే అమెరికాపై లేదా ఏ తరహా వ్యవస్థపైన అయినా నాలో గుడ్డివ్యతిరేకత లేదనే అనుకుంటున్నా.

  “ఇంఫర్మేషన్ టెక్నాలజి /ఇంటర్నెట్ ఏజ్ నుంచి మెషిన్ ఏజ్ (రోబో) లో కి వచ్చే పదేళ్లలో అడుగు పెడుతున్నాం. కొంచెం ఆ దిశలో కూడా ఆలోచించాలి.”
  మీ అభిప్రాయాన్ని తప్పనిసరిగా స్వీకరిస్తాను, ఆలోచిస్తాను. కాని మీరంటున్న ఇన్పర్మేషన్ టెక్నాలజీ, మెషిన్ ఏజ్ అనేవి ఏ దేశంలో అయినా ఉత్పత్తి సంబంధాలను మౌలికంగా మార్చగలిగాయా? సంపదల తారతమ్యాన్ని, అసమానత్వాన్ని తగ్గించగలిగాయా? ఇక్కడే సాంకేతిక ఆవిష్కరణల గొప్పదనంపై, సమాజంపై వాటి ప్రభావంపై నాకున్న సందేహాలు అలాగే కొనసాగుతున్నాయి.

  విరుధ్ధ భావాల పంపకం (షేరింగ్) జ్ఞాన విస్తృతికి, జిజ్ఞాసకు అత్యంత ఆవశ్యకమని నా ప్రగాఢ విశ్వాసం.

  ఈ చర్చను ఆదినుంచి కూడా అత్యంత సంయమనంతోటే కొనసాగిస్తున్నందుకు మీకు మరోసారి కృతజ్ఞతలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s