ఇతని పేరు మాట్ కృమ్వీడ్. ఆఫ్ఘన్ దురాక్రమణ యుద్ధ బాధితుడే కానీ ఆఫ్ఘన్ కాదు. ఒక యువ అమెరికన్. అమెరికన్ బహుళజాతి బ్యాంకులు, కంపెనీల దురాశా పీడితుడు అంటే సబబుగా ఉంటుంది. వాల్ స్ట్రీట్ బ్యాంకులు, కంపెనీల అనంత దాహాన్ని తీర్చడానికే అమెరికా రాజ్యం ప్రపంచ దేశాలపైకి దండెత్తి వెళుతుందని గ్రహిస్తే మాట్ బలవంతపు వైకల్యానికి కారణం ఎవరో తెలియడానికి పెద్దగా జ్ఞానం అవసరం లేదు. కానీ అమెరికా పత్రికలు మాత్రం ఆఫ్ఘన్ స్వతంత్ర కాంక్షాపరులను టెర్రరిస్టులుగా ముద్ర వేస్తాయి కాబట్టి, ఆ ముద్రను మనం ఎటువంటి అభ్యంతరం లేకుండా స్వీకరిస్తాం కాబట్టి టెర్రరిస్టుల రోడ్-సైడ్ బాంబులే ఇతని వైకల్యానికి కారణం అన్నా ఇట్టే నమ్మేస్తాం.
మాట్ క్రుంవీద్ గత సంవత్సరం (జూన్ 12, 2012) దక్షిణ ఆఫ్ఘనిస్తాన్ లో పెట్రోలింగ్ నిర్వహిస్తూ పేలుడు పరికరంపైన కాలు మోపాడు. దానితో అది పేలిపోయింది. 15 పౌండ్ల బాంబు అతని శరీరాన్ని బదాబాదలు చేసేసింది. కింద పొత్తికడుపు గుండా బాంబు తునకలు దూసుకుపోవడంతో సగం పొత్తికడుపు తొలగించాల్సి వచ్చింది. ఎడమ చేయితోపాటు అతని రెండు కాళ్ళూ ధ్వంసం అయ్యాయి.
మాట్ సహచరులు, వైద్య సిబ్బంది సమీపంలోనే ఉండడంతో అతనికి వెంటనే వైద్యం అందుబాటులోకి వచ్చింది. ఫస్ట్ ఎయిడ్ ఇచ్చిన వెంటనే మెడివాక్ వాళ్ళు మెరుగైన వైద్యం కోసం కాబూల్ కీ, అక్కడి నుండి అమెరికాకి తరలించడంతో అతని ప్రాణం నిలిచింది. కానీ మూడు అవయవాలు అతను కోల్పోయాడు.
మాట్ కోలుకోవడానికి కొన్ని నెలలు పట్టింది. అతని శరీరంపై డాక్టర్లు దాదాపు 40 సర్జరీలు చేశారు. ఇప్పుడతను కృత్రిమ కాళ్లతో నడవడం నేర్చుకుంటున్నాడు. ది అట్లాంటిక్ పత్రిక చెప్పేది నిజమే అయితే అతని లక్ష్యం మళ్ళీ ఆర్మీలో చేరడం?! చనిపోతామని తెలిసికూడా ఆఫ్ఘన్ జాతీయ స్వాతంత్రోద్యమంలోకి దూకే ఆఫ్ఘన్లను టెర్రరిస్టులుగా చెప్పే పశ్చిమ పత్రికలు ఇలాంటివారిని మాత్రం వీరాధివీరులుగా ఆకాశానికేత్తేస్తాయి. అలా ఎత్తకపోతే మరింతమందిని వికలాంగులుగా మార్చే అవకాశం కంపెనీలకు, అమెరికా రాజ్యానికీ దక్కదు మరి!
మాట్ గాయపడిన దగ్గర్నుండి, అతను ఆసుపత్రిలో చికిత్స పొందడం, కృత్రిమ కాళ్లతో నడక ప్రాక్టీస్ చేయడం వరకు రాయిటర్స్ ఫోటోగ్రాఫర్లు అతని ఆఫ్ఘన్ పోరాట జీవితాన్ని దృశ్య గాధ (ఫోటో స్టోరీ)గా మార్చేశారు. జార్జి బుష్ యుద్ధ విధానంలో భాగంగా అమెరికా దురాక్రమణ సైనికుల్లోనే కొంతమంది విలేఖరులను, ఫోటోగ్రాఫర్లను ప్రవేశపెట్టారు. తాము ప్రపంచ వ్యాపితంగా దుష్ట శిక్షణలో ఎన్ని కష్టాలు పడుతున్నది చెప్పుకోవడం ఈ విధానం లక్ష్యం.
లక్ష్యం ఏదయితేనేం? అమెరికా దురాక్రమణ యుద్ధాలకు ఆ దేశ పౌరులే ఎన్ని అవస్ధలు పడుతున్నదీ మాట్ క్రుంవీద్ దృశ్య గాధ మనకు చెబుతోంది. మూడో ప్రపంచ దేశాల ప్రజలతో పాటు అమెరికా ప్రజలను కూడా అమెరికా సామ్రాజ్యవాద దురాక్రమణ యుద్ధాలు ఎంతగా విధ్వంసంలోకి నేడుతున్నదీ వివరిస్తోంది.
(ఫోటోలు: ది అట్లాంటిక్)