తూ.చై సముద్రం: చైనా అమెరికా మధ్య ఉద్రిక్తతలు


అంతర్జాతీయ భౌగోళిక రాజకీయాల్లో చైనా తనదైన నిర్ణయాత్మక చర్యలు తీసుకుంటోందా? వాణిజ్య, దౌత్య చర్యల వరకే ఇన్నాళ్లూ పరిమితమైన చైనా ఇక తన మిలట్రీ శక్తిని కూడా ప్రదర్శించడానికి సిద్ధపడుతోందా? గత శనివారం చైనా చేసిన ప్రకటన ఈ ప్రశ్నలకు జన్మనిచ్చాయి. తూర్పు చైనా సముద్రంలో వివాదాస్పద దియోయు/సెంకాకు ద్వీపకల్పం పైన ‘వాయు రక్షణ మండలం’ (Air Defence Zone) ఏర్పాటు చేస్తున్నట్లు చైనా ప్రకటించడం పెను సంచలనం కలిగించింది. చైనా ప్రకటనను జపాన్, అమెరికాలు తిరస్కరించాయి. మాటలతో సరిపెట్టుకోని అమెరికా రెండు బాంబర్ విమానాలను సైతం ద్వీపకల్పంపై ప్రవేశపెట్టి చైనా ప్రకటనకు సవాలు విసిరింది. ఫలితంగా తూర్పు చైనా సముద్రం మరోసారి ఉద్రిక్తభరితంగా మారిపోయింది.

అనుమతి తీసుకోవాలి

‘వాయు రక్షణ మండలం’ ప్రకటించడం అంటే ఈ ద్వీపకల్పంపై ఎగిరే విమానాలు మొదట చైనా అనుమతి తీసుకుని ప్రవేశించాల్సి ఉంటుంది. అనుమతి తీసుకోకుండా ప్రవేశిస్తే ‘తగిన రక్షణ చర్యలు’ తీసుకుంటామని చైనా స్పష్టం చేసింది. తమ ‘ఎయిర్ స్పేస్’ ను కాపాడుకోవడానికి ‘వాయు రక్షణ మండలం’ ఏర్పాటు చేయడం అంతర్జాతీయంగా అన్ని దేశాలు తీసుకునే మామూలు చర్యే అనీ, సాధారణ చర్యగానే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని చైనా ప్రకటించింది.

“వాయు రక్షణ మండలం ఏర్పాటు చేయడంలో చైనా సాధారణ అంతర్జాతీయ సాంప్రదాయాలనే పాటించింది. చైనా తన భూభాగాలపైనా, ప్రాదేశిక మరియు వాయుతలం పైనా ఉన్న సార్వభౌమాధికారం కాపాడుకోవడమే దీని లక్ష్యం. విమానాల ప్రయాణాలను క్రమబద్ధీకరించడానికి ఉద్దేశించినది. స్వయం రక్షణ హక్కులను కాపాడుకోవడానికి ఈ చర్య అవసరం అయింది. మేము ఎవరినీ టార్గెట్ చేసుకోలేదు. సంబంధిత వాయుతలంలో స్వేచ్ఛగా ప్రవేశించడాన్ని ఇది ఆటంకపరచదు” అని చైనా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి యాంగ్ యుజున్ ప్రకటించారని చైనా వార్తా సంస్ధ జిన్ హువా తెలిపింది.

‘తూర్పు చైనా సముద్ర వాయుతల రక్షణ గుర్తింపు మండలం’ (East China Sea Air Defence Identification Zone -ECSADIZ) గా పేరు పెట్టిన చైనా, ఇక్కడికి తమ వాయుసేన విమానాలతో అప్పుడే కాపలా కూడా ప్రారంభించింది. తమ కాపలా కూడా అంతర్జాతీయ ప్రమాణాలకు లోబడే జరుగుతోందని, ప్రయాణీకుల విమానాలకు ఆటంకాలు ఉండవని చైనా వాయుసేన ప్రతినిధి షెన్ జింకే ప్రకటించాడు. తమ మండలానికి ఎవరి నుండయినా ప్రమాదం ఏర్పడితే తమ వాయుసేన జవాబు చెబుతుందని షెన్ స్పష్టం చేశాడు.

తూర్పు చైనా సముద్రంలోని 8 దీవుల సముదాయాన్ని చైనా ‘దియోయు’ అని పిలుస్తుంది. జపాన్ ‘సెంకాకు’ అని పిలుస్తుంది. దియోయు ద్వీపకల్పానికి సమీపంలో ఎగిరే జపాన్ విమానాలు విధిగా తమ ‘వాయు ప్రయాణ వివరాలను’ (ఫ్లయిట్ ప్లాన్స్) చైనా విదేశాంగ శాఖకు గానీ, పౌర విమానయాన విభాగానికి గానీ సమర్పించాలని చైనా ప్రకటన నిర్దేశించింది. చైనా అధికారులతో రేడియో సంబంధం కూడా కలిగి ఉండాలని పేర్కొంది. అంటే జపాన్ విమానాలు దియోయు ద్వీపకల్పం పైన ఉండే వాయుతలంలోకి ఎప్పుడు ప్రవేశించేది, ఎప్పుడు వెళ్లిపోయేది, ఏవైపు నుండి ఎటు వెళ్ళేది తదితర వివరాలు చెప్పాలని చైనా నిర్దేశించింది. ఈ ప్రయాణాలను పర్యవేక్షించే చైనా అధికారులతో రేడియో కమ్యూనికేషన్ జరపాలని కూడా నిర్దేశించింది.

ఏకపక్షం, గౌరవించేది లేదు

చైనా ప్రకటనను జపాన్, అమెరికాలు వెంటనే తీవ్ర స్ధాయిలో ఖండించాయి. తూర్పు చైనా సముద్రంలోని ద్వీపకల్పంపై హక్కులు తమవే అని జపాన్ కూడా వాదిస్తోంది. ఈ వివాదాన్ని దౌత్య మార్గాల్లో పరిష్కరించుకోవాలి తప్ప ఏకపక్ష చర్యలు తగవని జపాన్ ప్రకటించింది. చైనా ప్రకటించిన ‘వాయు రక్షణ మండలాన్ని’ గౌరవించాల్సిన అవసరం లేదని తమ ప్రభుత్వ, ప్రైవేటు విమాన సర్వీసుల కంపెనీలకు ఆదేశాలు జారీ చేసింది. “చైనా చర్య పూర్తిగా అసంబద్ధం. ఏ విధంగానూ ఆమోదనీయం కాదు. ఇది తీవ్ర విచారకరం” అని జపాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటన పేర్కొంది. “అలాంటి వాయుమండలాన్ని ఏకపక్షంగా ఏర్పాటు చేయడం, విమాన ప్రయాణాలను నియంత్రించడం తీవ్ర ప్రమాదకరం. ఈ ప్రాంతంలో అది తప్పుడు సంకేతాలకు తావిస్తుంది కనుక మండలం ఏర్పాటు తగదు” అని సదరు ప్రకటన పేర్కొంది.

“చైనా తీసుకున్న చర్యకు జపాన్ దృష్టిలో ఏ విలువా లేదు. అంతర్జాతీయ వాయుతలంలో స్వేచ్ఛగా ప్రవేశించే హక్కును నిరాకరించే చర్యలను ఉపసంహరించుకోవాలని చైనాను డిమాండ్ చేస్తున్నాం” అని జపాన్ ప్రధాని షింజో అబే స్వయంగా ప్రకటించాడు. విదేశీ మంత్రి ఫుమియో కిషిడ చైనా చర్యను ‘ఎకపక్షం’గా అభివర్ణించాడు. ‘ఇది అనూహ్య ఘటనలకు దారి తీయొచ్చు’ అని హెచ్చరించాడు.

అమెరికా కూడా చైనా ప్రకటనను నిరసించింది. పరిస్ధితిపై ఆందోళన చెందుతున్నట్లు అమెరికా విదేశీ మంత్రి జాన్ కెర్రి ప్రకటించాడు. “ఇలాంటి ఏకపక్ష చర్య తూర్పు చైనా సముద్రంలో యధాతధ పరిస్ధితిని సవాలు చేస్తోంది. తీవ్రతను పెంచే చర్యలు ఉద్రిక్తలు పెరగడానికి మాత్రమే దోహదం చేస్తాయి. ఏదైనా ఘటన జరిగే అవకాశమూ లేకపోలేదు” అని జాన్ కెర్రి హెచ్చరించాడు. “బీజింగ్ ఆదేశాలను పాటించని విమానాల పైన తమ రక్షణ విమానాలు చర్య తీసుకుంటాయన్న బెదిరింపును చైనా అమలు చేయరాదని కోరుతున్నాము” అని కేర్రీ ప్రకటించాడు.

అమెరికా రక్షణ మంత్రి చక్ హెగెల్ “ఇది యధాతధ పరిస్ధితిని అస్ధిరీకరించే చర్య” అని ప్రకటించాడు. చైనా ప్రకటన తర్వాత కూడా ఈ ప్రాంతంలో అమెరికా తన మిలట్రీ చర్యలను కొనసాగిస్తుందని, ఆపేది లేదని స్పష్టం చేశాడు. జపాన్, అమెరికాలతో సహా ప్రపంచంలో దాదాపు 20 దేశాలు ఈ తరహాలో ‘వాయు రక్షణ మండలా’లను అమలు చేస్తున్నాయని తెలుస్తోంది. అయితే ఇవి ప్రధానంగా తమ తమ భూభాగాల వరకు పరిమితమై ఉన్నాయని, వివాదాస్పద ప్రాంతాలపై వాయు రక్షణ మండలం ప్రకటించడం మాత్రం ఇదే మొదటిసారని రష్యా టుడే పత్రిక ద్వారా తెలుస్తోంది. ఒక దేశం యొక్క వాయు రక్షణ మండలంలోకి ప్రవేశించేటప్పుడు ఏ విమానం అయినా తాను ఎవరయిందీ, ఎందుకు అక్కడ ఉన్నదీ సంబంధిత అధికారులకు గుర్తింపు ఇవ్వాలి.

తలదూర్చొద్దు

అమెరికా స్పందనను చైనా ఆదివారం తీవ్రంగా గర్హించింది. చైనా-జపాన్ ల మధ్య ఉన్న ప్రాదేశిక వివాదాల్లో తలదూర్చవద్దని హెచ్చరించింది. అమెరికా మంత్రుల ప్రకటనలపై చైనాలో అమెరికా రాయబారిని వివరణ కోరింది. అమెరికా తన తప్పులను వెంటనే సవరించుకోవాలని డిమాండ్ చేసింది. దియోయు/సెంకాకు వివాదంలో ఒక పక్షం తీసుకోవడం మానుకోవాలని కోరింది. “దియోయు ద్వీపకల్పం విషయంలో అప్పుడే ఒక పక్షం తీసుకోవద్దని అమెరికాను కోరుతున్నాం. అనవసరంగా మాట్లాడుతూ జపాన్ ప్రమాదకర ప్రవర్తనను ప్రోత్సహించవద్దని కోరుతున్నాం. చైనా చర్యల ఉద్దేశం జాతీయ సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక వాయుతల భద్రతను కాపాడుకోవాడానికి మాత్రమే అని మళ్ళీ చెబుతున్నాము. ఇది కేవలం మా స్వయం రక్షణ హక్కు వ్యక్తీకరణ మాత్రమే” అని చైనా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి కల్నల్ యాంగ్ యుజున్ ప్రకటించాడు. (రష్యా టుడే)

జపాన్ 1960ల నుండి తన సొంత వాయు రక్షణ మండలం కలిగి ఉన్న సంగతిని యుజున్ గుర్తు చేశాడు. ఐరాస ఛార్టర్, అంతర్జాతీయ చట్టాలకు లోబడే చైనా వాయు రక్షణ మండలం ఏర్పాటు చేసిందని స్పష్టం చేశాడు. చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ కూడా అమెరికా అభ్యంతరాన్ని తోసిపుచ్చింది. తమ చర్య ఎవరిని ఉద్దేశించింది కాదని, విమానాల ప్రయాణ స్వేచ్ఛకు భంగకరం కాదని పేర్కొంది. జాన్ కేర్రీ అభ్యంతరాల గురించి అమెరికా రాయబారి గ్యారీ లాకే ను వివరణ కోరింది. అమెరికా తన తప్పులు సవరించుకోవాలని కోరింది. జపాన్ రాయబారిని కూడా చైనా విదేశీ మంత్రిత్వ శాఖ పిలువనంపింది.

అమెరికా బాంబర్ల ప్రవేశం

అమెరికా మాటలతో సరిపెట్టలేదు. చైనా ‘వాయు రక్షణ మండలం’ ని గౌరవించేది లేదని చేసి మరీ చూపింది. చైనా కోరిన విధంగా ఎటువంటి అనుమతి తీసుకోకుండా రెండు B-52 బాంబర్ విమానాలను దియోయు/సెంకాకు ద్వీపకల్పంపైన వాయుతలంలో సోమవారం ఎగిరించింది. ఈ విషయం అమెరికాయే స్వయంగా ప్రకటించింది. “సెంకాకు ద్వీపకల్పం ప్రాంతంలో మేము ఆపరేషన్ నిర్వహించాం. ఎప్పటిలాగే సాధారణ ప్రక్రియనే మేము అనుసరించాం. ఎవరికీ మా ఫ్లైట్ ప్లాన్ సమర్పించుకోలేదు. ముందుగా ఎవరితోనూ రేడియో సమాచారం ఇవ్వలేదు. మా ఫ్రీక్వెన్సీ లను కూడా ఎవరి వద్దా రిజిస్టర్ చేయలేదు” అని అమెరికా మిలట్రీ ప్రతినిధి కల్నల్ స్టీవ్ వారెన్ చెప్పారని రాయిటర్స్ వార్తా సంస్ధ తెలిపింది.

B-52 బాంబర్ యుద్ధ విమానాలు ఆయుధాలు ఏమీ లేకుండానే దియోయు/సెంకాకు ద్వీపకల్పంపై ఎగిరినట్లు తెలుస్తోంది. చైనా ప్రకటనను సవాలు చేయడమే అమెరికా చర్య ఉద్దేశ్యం అన్నది స్పష్టమే. అమెరికా యుద్ధ విమానాల ప్రవేశాన్ని తాము కూడా గుర్తించామని చైనా రక్షణ శాఖ చెప్పినట్లు తెలుస్తోంది. అయితే చైనా అంతకు మించి ఏమీ చెప్పకపోవడం గమనార్హం. బి-52 బాంబర్లు గువామ్ మిలట్రీ స్ధావరం నుండి వచ్చాయని వాల్ స్ట్రీట్ జర్నల్ పత్రిక సమాచారం ద్వారా తెలుస్తోంది.

జపాన్ కూడా అమెరికాను అనుసరించింది. జపాన్ కు చెందిన రెండు అతి పెద్ద పౌర విమానయాన కంపెనీలు చైనాకు సమాచారం ఇవ్వకుండానే దియోయు/సెంకాకు ద్వీపకల్పం వాయుతలంలోకి మంగళవారం ప్రవేశించాయి. ఎ.ఎన్.ఎ హోల్డింగ్స్, జపాన్ ఎయిర్ లైన్స్ అనే ఈ రెండు కంపెనీలు మొదట చైనా ఆదేశాన్ని పాటించాయి. చైనా కోరినట్లు తమ ఫ్లైట్ ప్లాన్ లను సమర్పించాయి. రేడియో సంబంధం పెట్టుకుని తమను తాము గుర్తించుకున్నాయి. అయితే జపాన్ ప్రభుత్వం అలా చేయనవసరం లేదని చెప్పడంతో ఇక సమాచారం ఇవ్వడం మానేశాయి. అమెరికా బాంబర్ల ప్రవేశంతో మరింత ధైర్యం పుంజుకుని చైనా ఆదేశాలను బేఖాతరు చేయనారంభించాయి.

చైనా ప్రకటనకు ప్రతిగా దియోయు/సెంకాకు ప్రాంతంలో డ్రోన్ విమానాలను తిప్పడానికి అమెరికా, జపాన్ లు యోచిస్తున్నట్లు కూడా తెలుస్తోంది. ఈ మేరకు జపాన్ అధికారులను ఉటంకిస్తూ జపాన్ పత్రిక నిక్కి ఒక వార్త ప్రచురించింది.

దియోయు/సెంకాకు ద్వీపకల్పం విషయంలో చైనా, జపాన్ ల మధ్య దశాబ్దాలుగా వివాదం నలుగుతోంది. ఎనిమిది ద్వీపాలతో కూడి ఉన్న ఈ ద్వీపకల్పం మానవ నివాస యోగ్యం కావు. కానీ అపార మత్స్య సంపదకు ఇవి నిలయం. చమురు నిల్వలు, సహజవాయు నిల్వలు కూడా అపారమేనని భావిస్తున్నారు. దానితో వీటికి సొంతదారులు ఎవరు అన్న విషయంలో సహజంగానే వివాదం నెలకొంది.

వివాదాన్ని చర్చల ద్వారా పరిష్కరించుకుందామని కోరుతున్నట్లు జపాన్ చెబుతుంది. అలా చెబుతూనే కొద్ది నెలల క్రితం ఉన్నట్లుండి వీటిలో రెండు ద్వీపాలను తమ దేశ పౌరుడు ఒకరి నుండి కొనుగోలు చేసినట్లు ప్రకటించింది. జపాన్ పౌరుడొకరు రెండు ద్వీపాలకు సొంతదారు అనీ, వాటిని తమ ప్రభుత్వం కొనుగోలు చేసిందని చెబుతూ ఒక అద్వితీయమైన నాటకానికి జపాన్ తెరతీసింది. కొనుగోలు పేరుతో అడ్డదారిలో సార్వభౌమ హక్కులు తనను తానే కల్పించుకోడానికి ఎత్తు వేసింది. జపాన్ ఏకపక్ష ప్రకటనతో చైనా ఆగ్రహించింది. అప్పట్లో జపాన్ లో జరిగిన ప్రపంచ బ్యాంకు-ఐ.ఏం.ఎఫ్ సమావేశాలకు తమ సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ ని పంపకుండా నిరసన తెలియజేసింది. కానీ అమెరికా మాత్రం ‘జపాన్ ప్రకటన ఏకపక్షం’ అని ప్రకటించలేదు. పైగా ‘శాంతియుతంగా ఉండాలని’ నీతులు వల్లించింది. అదే పని చైనా చేసేసరికి యుద్ధ విమానాలకు పని పెట్టింది.

మునుముందు దియోయు/సెంకాకు ద్వీపకల్పం కేంద్రంగా జరిగే పరిణామాలను ఒక కంట పరిశీలించడం ఇపుడు ఒక అత్యవసరం. ఇరాన్, సిరియాల విషయంలో ఉద్రిక్తతలు చల్లబడుతున్న నేపధ్యంలో తూర్పు చైనా సముద్రం ప్రపంచ భౌగోళిక రాజకీయాలకు కేంద్రంగా అవతరించినా ఆశ్చర్యం లేదు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s