కొన్ని పరిణామాలను గమనిస్తే, ‘టైమ్’ గురించి పెద్దల పేరుతో జనం చెప్పుకునే మాటలు నిజమేనేమో అని భ్రమింపజేస్తాయి. జరిగిన ఘటన పూర్వాపరాల సమాచారం లేకపోయినా, లేదా అందుబాటులో ఉన్న సమాచారం పైన సంయక్ దృక్పధం లోపించినా ఈ ‘టైమ్’ ట్రాప్ లో పడిపోవడం ఖాయం. ప్రస్తుతం తరుణ్ తేజ్ పాల్ విషయంలో జరుగుతున్న పరిణామాల విషయంలో ‘టైమ్ ఫ్యాక్టర్’ ని దోషిగా తెస్తున్నవారిని చూస్తే ఇదే అనిపిస్తుంది. నిన్న మొన్నటి దాకా ‘పట్టిందల్లా బంగారమే, కన్ను కుట్టిందల్ల సింగారమే’ అని పాడుకున్న తేజ్ పాల్ వ్యవహారం ‘రోజులు (అదే లెండి, టైమ్!) బాగోపోతే తాడే పామై కరుస్తుంది’ అన్నట్లు తయారయింది.
తన కింది ఉద్యోగిని పై లైంగిక అత్యాచారానికి పాల్పడ్డ ఆరోపణలు తరుణ్ తేజ్ పాల్ ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఆరోపణలు తన భవిష్యత్తును దెబ్బ తీయకుండా ఉండడానికి ఆయన చేస్తున్న ప్రయత్నాలన్నీ విఫలం అవుతున్నాయి. చివరికి నెపాన్ని బి.జె.పి పార్టీ పైకి నెడుతున్నా దాన్ని నమ్మేవారు ఇప్పుడు ఎవరూ లేరు. అందుకు క్రెడిట్ అంతా బాధితురాలి సమయస్ఫూర్తి (ది హిందూ సంపాదకీయం దీనిని presence of mind అని పేర్కొంది) కే దక్కాలి. స్వయంగా జర్నలిస్టు కావడం వల్లనేమోగానీ జరిగిన దారుణాన్ని సహ జర్నలిస్టులకు చెప్పడంతో పాటు లిఖిత పూర్వకంగా (పోనీ, ఈ మెయిల్ పూర్వకంగా) తన పై అధికారికి ఫిర్యాదు చేసిన ఫలితంగా తరుణ్ తేజ్ పాల్ ‘కన్నంలో వేలితో దొరికిన దొంగ’ తరహాలో దేశం ముందు దోషిగా దొరికిపోయాడు.
‘ఆరు నెలల పాటు బాధ్యతల నుండి తప్పుకుంటున్నాను’ అంటూ తేజ్ పాల్ తనకు తాను విధించుకున్న హాస్యాస్పద శిక్ష విషయం పత్రికల్లో వచ్చిన వెంటనే గోవా ప్రభుత్వం ఏ మాత్రం ఆలస్యం చెయ్యకుండా సుమోటో గా కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించడంతో నిందితుడికి ఇక తప్పించుకునే దారి లేకుండా పోయింది. పోలీసులకు పూర్తిగా సహకరిస్తానని ప్రకటించిన తేజ్ పాల్ ఆ మాటకు కట్టుబడకుండా ‘ముందస్తు బెయిలు’ కోసం కోర్టును కోరడం బట్టే ఆయన నిజాయితీ ఏపాటిదో తెలుస్తోంది. ముందస్తు బెయిల్ ఇవ్వడానికి కోర్టు నిరాకరించడంతో తేజ్ పాల్ కి కోర్టు దారి మూసుకుపోయింది.
ఇప్పుడు అన్ని దారులూ తరుణ్ తేజ్ పాల్ కు వ్యతిరేక దిశలోనే నడుస్తున్నాయి. సంచలనాత్మక కధనాలతో నలుగురి చేత ‘ఆహా’ అనిపించుకున్న తేజ్ పాల్ అదే నలుగురు చేత ‘ఛీ’ అనిపించుకుంటున్నాడు. మొదట తన కూతురు ‘తియా’ను బాధితురాలి తల్లి వద్దకు పంపిన తేజ్ పాల్ ఆమె ఎవరెవరితో ‘టచ్’ లో ఉన్నదీ తెలుసుకోవడానికి ప్రయత్నించాడు. కానీ ముంబైలో ఉన్న బాధితురాలు ‘తియా’తో ఫోన్ లో మాట్లాడ్డానికి నిరాకరించడంతో అత్యంత దగ్గరి దారి తేజ్ పాల్ కు మూసుకుపోయింది.
ఫిర్యాదు ద్వారా బాధితురాలు ఏమి సాధించదలుచుకున్నది చెప్పాలని తియా, బాధితురాలి తల్లిని కోరడం విడ్డూరం. మరో మహిళతో ఇదే విధంగా తన తండ్రి ప్రవర్తింస్తుండగా చూశానని బాధితురాలితో చెప్పిన తియా, తన స్నేహితురాలికి ఏమి కావాలో అర్ధం చేసుకోలేని అమాయకురాలా? తెహెల్కా సంస్ధ యజమానిగా తన అధికారాన్ని వినియోగించి కూతురు వయసు ఉద్యోగినిని శారీరకంగా ఉపయోగించుకోడానికి ప్రయత్నించిన వ్యక్తులకు ఈ దేశ చట్టాలు నిర్దిష్ట శిక్షలను నిర్దేశించాయి. మరో మాటకు తావు లేకుండా ఆ శిక్షను అనుభవించడమే కాదా తేజ్ పాల్ ప్రస్తుతం చేయాల్సింది? అది మాని తనను ఇరికిస్తున్నారని, దీని వెనుక బి.జె.పి పార్టీ ఉన్నదని ఆరోపించడం అంటే బాధితురాలిని మరింత మానసిక హింసకు గురి చేయడం కాదా?
తన మేనేజింగ్ ఎడిటర్ సోమా చౌదరి ద్వారా జరిగిన తప్పును చిన్నదిగా చేసి చూపడానికీ, ఒట్టి క్షమాపణతో సరిపుచ్చడానికీ, ఆరు నెలలు పదవికి దూరంగా ఉండే స్వయంశిక్షతో ఊరడించడానికి తేజ్ పాల్ ప్రయత్నించాడు. కానీ బాధితురాలి సమయస్ఫూర్తి వల్లా, అసమాన మానసిక స్ధైర్యం వల్లా ఆ మార్గమూ మూసుకుపోయింది. పైగా దానికి తగిన మూల్యాన్ని సోమా చౌదరి ప్రస్తుతం అనుభవిస్తోంది. తరుణ్ తేజ్ పాల్ అసహ్యకరమైన పనిని కేవలం ‘జరగకూడని ఘటన’గా మాత్రమే పేర్కొంటూ దానికి ప్రాయశ్చిత్తంగా తేజ్ పాల్ ఆరు నెలలపాటు ‘ఎడిటర్-ఇన్-చీఫ్’ పదవికి దూరంగా ఉంటారని తన ఉద్యోగులకు చెప్పిన సోమా చౌదరి, ఢిల్లీ బస్సు అత్యాచారం జరిగిన తర్వాత తమ పత్రికలో చేసిన సంపాదకీయ వ్యాఖ్యలు గమనించదగ్గవి.
కేవలం ఒక తెల్ల బస్సులోని హింసోన్మాదులే రేపిస్టులు కానవసరం లేదు: తండ్రులు, భర్తలు, సోదరులు, బాబాయిలు, స్నేహితులు వీరు కూడా. తమ సొంత ఇళ్లలోనే, నాలుగు గోడల మధ్య తమను అసహ్యంగా తాకిన, అభిమానాన్ని భంగపరిచిన, చెప్పలేని విధంగా వేధించిన, అత్యాచారానికి గురయిన కధ –చెప్పినవి, చెప్పనివీ- దాదాపు ప్రతి ఇద్దరిలోనూ ఒక స్త్రీకి ఉంటుంది. దాని గురించి వారు ధైర్యం చేసి చెప్పడం అంటూ జరిగితే, దాన్ని సమాధి చేసి భరించి ఊరుకొమ్మని చెప్పి నోరు మూయిస్తారు. స్త్రీ జీవితంలో అదొక భాగంగా మారిపోయింది. అంకుల్ తనను వేధిస్తున్నాడని ఒక మైనర్ బాలిక పేరు పెట్టి చెప్పడం అంటే అది కుటుంబాన్ని బజారుకి ఈడ్చడమే. ఇక వైవాహిక అత్యాచారాల సంగతి చెప్పుకోవాలంటే అది మన ఊహా శక్తిని దాటిపోతుంది. మహిళలకు సంబంధించి మన పశుత్వ భావనలు ఎంతదూరం వెళ్తాయంటే సమాజం చీదరించుకునే ఒంటరి బతుకుకంటే రేపిస్టును పెళ్లి చేసుకోవడమే ఉత్తమమైన విముక్తి మార్గం అని న్యాయమూర్తులే తరచుగా సలహా ఇస్తున్నారు.
ప్రాయశ్చిత్త భావనను నాటకంగా కూడా సోమా చౌదరి అప్పట్లో కొట్టిపారేశారు.
….ఒక ప్రక్రియ నడక అనగానే భారతీయులను స్వాభావికమైన అసహనశీలత పట్టి పీడిస్తోంది. తక్షణ దండన, ప్రాయశ్చిత్తం అనే నాటకం పైనే మనం ఎక్కువ మొగ్గు చూపుతాము: దాన్ని కోసేయాలనీ, ఉరి శిక్ష వేయాలనీ… ఇలా. మరణ శిక్షలకు వ్యతిరేకంగా జరుగుతున్న విస్తృత వాదనలను కాసేపు పక్కన పెట్టి, అసలీ కేసులను (ఏదో ఒక) తీర్పు వచ్చేదాకా అయినా ఎవరు తీసుకెళ్తారు అని అడగడమే మనం మర్చిపోతున్నాం….
[సోమా చౌదరి సంపాదకీయం పూర్తి పాఠం కోసం ఈ లింకు చూడండి: మాటల్లో చెప్పలేని దారుణం జరిగితేతప్ప మనలోని క్రోధం నిద్రలేవదా?]
అక్షరాల్లో ఇంతగా ఆవేదననీ, నిప్పులనూ, సునిశిత విచక్షణను ప్రదర్శించిన సోమా చౌదరి తమ పత్రికాధిపతి విషయానికి వచ్చేసరికి తాను విమర్శించిన బలహీనతలోనే ఎందుకు ఉండిపోయారు? సమాధానం చెప్పుకోవలసిన పరిస్ధితిలో ఆమె ప్రస్తుతం ఉన్నారు. ఆ పరిస్ధితి తనకు రావడానికి కారణం తానేనా, లేక తరుణ్ తేజ్ పాలా లేక బాధితురాలా? అన్న ప్రశ్నకు సోమా చౌదరి ఏ సమాధానం ఇస్తారో తెలుసుకోవడం ఆసక్తికరం కాగలదు. సోమా చౌదరి తానే స్వయంగా సమాధానం చెప్పుకోవలసిన పరిస్ధితిలో ఉండడంతో బహుశా ఆ దారి కూడా తేజ్ పాల్ కు మూసుకుపోయింది.
అంతటితో అయిపోలేదు. ఈరోజు బాధితురాలి తల్లి ఢిల్లీ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారని తెలుస్తోంది. తేజ్ పాల్ కూతురు తియా నవంబర్ 22 తేదీన తమ ఇంటికి వచ్చారని, బాధితురాలి విషయమై ఎంక్వైరీలు చేశారనీ తద్వారా ఆమె తమను ఇబ్బంది పెట్టిందని ఈ ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలుస్తోంది. తేజ్ పాల్ కుటుంబ సభ్యులు తన తల్లి వద్దకు వెళ్ళి ఇబ్బంది పెడుతున్నారని, తాను ఎవరి ద్వారా న్యాయ సహాయం పొందుతున్నదీ తెలుసుకోగోరారనీ అసలు తనకు ఏమి కావాలో చెప్పాలని డిమాండ్ చేశారని బాధితురాలు ది హిందూ తదితర పత్రికలకు తెలిపిన సంగతి విదితమే. ఇవే అంశాలను బాధితురాలి తల్లి ఢిల్లీ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలుస్తోంది.
“నవంబర్ 22 రాత్రి గం. 8:30 లకు తియా తన ఇంటికి వచ్చారని ఫిర్యాదుదారు తెలిపారు. ఆమె తనన కూతురు స్నేహితురాలుగా తెలిసిన వ్యక్తి కావడంతో లోపలికి అనుమతించారు. అనంతరం తన కూతురు ఎవరి సలహాలు తీసుకుంటున్నదీ చెప్పాలని కోరారని ఫిర్యాదుదారు పేర్కొన్నారు. ఫిర్యాదు వెనుక వేరే ఎవరన్నా ప్రోద్బలం ఉన్నదా అని ఎంక్వైరీ చేశారు. బాధితురాలికి అసలు ఏం కావాలో చెప్పాని కూడా అడిగారని చెప్పారు” అని బాధితురాలి ఫిర్యాదు గురించి పాండవ్ నగర్ పోలీసులు తెలిపారు.
గోవా పోలీసులు మరో చర్య కూడా తీసుకున్నారు. తరుణ్ తేజ్ పాల్ పైన వారు ఇమ్మిగ్రేషన్ అలర్ట్ వారంట్ జారీ చేశారు. ఈ వారంట్ విషయం అన్ని పోర్టులకు తెలియజేశామని తెలిపారు. ఎయిర్ పోర్టులు, ఓడరేవులన్నింటిని అప్రమత్తం చేశామని తరుణ్ తేజ్ పాల్ విదేశాలకు పారిపోకుండా అడ్డుకోవడమే ఈ అలర్ట్ లక్ష్యమని తెలిపారు. తరుణ్ తేజ్ పాల్ కాంగ్రెస్ పెద్దలకు సన్నిహితుడు అని పేరున్న సంగతి తెలిసిందే. బహుశా కాంగ్రెస్ ప్రభుత్వం సాయంతో విదేశాలకు వెళ్లిపోవచ్చని గోవా బి.జె.పి పెద్దలు అనుమానించారేమో తెలియదు. ఒకవేళ అదే నిజమైతే ఆ మార్గం కూడా తేజ్ పాల్ కు మూసుకుపోయిందని అనుకోవాలి.
కాబట్టి ఇప్పుడు అన్ని దారులూ తరుణ్ తేజ్ పాల్ కు వ్యతిరేక దిశలోనే నడుస్తున్నాయి. దీనికి కారణం తరుణ్ తేజ్ పాల్ మాత్రమే అని వేరే చెప్పనవసరం లేదు. ఏ విలువలకైతే తమ పత్రిక ప్రాతినిధ్యం వహిస్తున్నదని తేజ్ పాల్ చెబుతూ వచ్చారో అదే విలువల బోధనల మధ్య బాధితురాలి చైతన్యం వృద్ధి చెందింది. ఆ చైతన్యమే ఆమెకు తగిన సమయస్ఫూర్తిని నేర్పింది. తగిన ధైర్యం ఆమెకు సమకూర్చిపెట్టింది. ఒకవేళ ఆమెకు బి.జె.పి సహకారం ఉంటే అది ఆమె తప్పు మాత్రం కాబోదు. రెండు దశాబ్దాలుగా జర్నలిస్టు వృత్తిలో ఉంటూ ప్రతి అవకాశాన్ని, చివరికి అభ్యుదయ భావాలను కూడా, తన ఎదుగుదలకు సోపానంగా వినియోగించుకోవడమే కాకుండా రాజకీయ, వాణిజ్య, ఆర్ధిక పలుకుబడి కూడా సంపాదించిన తరుణ్ తేజ్ పాల్ ను ఢీ కొట్టి తగిన న్యాయం పొందాలంటే బాధితురాలికి ఆ సాయం తప్పకపోవచ్చు.
కానీ ఈ పరిస్ధితికి కారణం పూర్తిగా తరుణ్ తేజ్ పాల్ మాత్రమే. తియా చెప్పింది నిజమే అయితే ఈ ప్రవర్తన తేజ్ పాల్ కు కొత్త కాదు. ఈసారి తాను పాల్పడిన నేరం చుట్టూ నెలకొన్న పరిస్ధితులు, పాత్రలు అన్నీ నేరం జరిగిందన్న నిజాన్ని పక్కాగా రుజువు చేసే పొజిషన్ లో ఉన్నాయి. కాబట్టి తేజ్ పాల్ పరిస్ధితికి టైమ్ ని నిందించడం తేజ్ పాల్ కి తగునేమో గానీ ఇంకెవ్వరికీ తగదు.
ఈ ఆధునిక సమాజంలోని కుట్రలను కుతంత్రాలను ధనికులు, రాజకీయనాయకులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు అనే విచక్షణ లేకుండా బహిర్గతంచేసి సూక్ష్మ రహస్యాలను ఎండగట్టకలిగే సాహసుడనే పేరొందిన తెహల్కా తేజ్ పాల్ ఇలా లైంగిక కుడితిలో పడ్డ ఎలకలా కొట్టుకోవడం చూస్తే విధి బలీయమని నమ్మాలి. రహస్యాలను ఉతికిఆరేసిన క్రియలో అపహాస్యం మురికితో తన బట్టలనే మలినపరుచుకోవడం ద్వారా అవినీతి,అక్రమ,అసాంఘిక కార్యకలాపాల విషయంలో ఎవరు అతీతులుకాదని నిరూపించాడు. పాము పడగను అదిలించే పాములవాడు కూడా అదే పాము కాటుకు బలవడంలో తన వృత్తికి తన ప్రవృత్తే శత్రువనేది తేటతెల్లమయింది. రహస్యచేధనలో అందరిని నగ్నంగా బహిర్గతంకావించి తన విషయంలో అంతర్గత న్యాయంకోసం పాకులాడటం అవివేకం. భగ్నపడిన నగ్న హృదయాల కడుపుకోత విజృంభించి సమూలంగా తనకు తాను ఆహుతయ్యే సమయం తన చేతులతో తానే కొనితెచ్చుకున్నాడు. భస్మాసుర హస్తానికి ఇదొక చక్కని ఉదాహరణ.
కేవలం సంచనాలతో సంపాదించే డబ్బు, కీర్తి కండూతి చివరికి చేరేది ఇక్కడకే- నిజాయితీ లేనపుడు.
ఇది ఒక మిత్రుడు ఫేస్ బుక్ లో రాసింది.
మధ్య తరగతి బుద్ధిజీవులకు ఈ దేశ ప్రజాస్వామ్యంపై ఈ దోపిడీ దుర్మార్గపు వ్యవస్థపై నమ్మకాన్ని సడలకుండా పోరాడే తత్వాన్ని దూరం చేసేందుకు విదేశీ స్వదేశీ పెట్టుబడిదారుల తొత్తులు అయిన NGO’s, కొన్ని మీడియా సంస్థలు (తెహెల్కా వంటివి) చాలా కృషి చేస్తున్నాయి అని అర్థమవుతోంది కదా! వీళ్ళ వెనక దోపిడీదారుల సొమ్ము పెట్టుబడిగా థింక్ వెస్టివల్స్, మరికొన్ని సాహిత్య సేవలు (రాంకీ వంటివి) పేరిట ఆలోచనలను కుళ్ళబెట్టే పండగలు జరిపి దేశానికి ఉద్దరించేస్తున్నామని డబ్బాలు కొడుతుంటాయి. వీళ్ళ అసలు రంగు ఇలా బయటపడుతుంది అప్పుడప్పుడు. ఈ గ్రీకు వీరుల రంకు చేష్టలు, మహిళలపై దాడులు హీరోలుగా ప్రచారానికీ ఉపయోగపడుతుంటాయి.
ఎదుటి వారికి చెప్పేటందుకే నీతులు ఉన్నాయి…అన్నట్లు, ఇతరుల లోపాలు, అవినీతిని తనదైన శైలిలో స్ట్ర్రింగ్ ఆపరేషన్ల ద్వారా వెల్లడి చేసిన తేజ్ పాల్, తాను ఆ బురదలోనే కూరుకు పోయాడు.
చెప్పటం సులభమే. ఆచరించడమే చాలా కష్టం. ఐతే ఇది తేజ్ పాల్ కే కాదు. చాలామందికి వర్తిస్తుంది.
ఇవాళ ప్రపంచంలో ‘పెద్దమనుషులు’గా చలామణి అవుతున్న చాలామంది కూడా అటువంటి వారే అయి ఉంటారు. బాధితులు బయటకు చెపితే అందరి బండారాలు బయటపడతాయి.
పింగ్‌బ్యాక్: అన్ని దారులూ తేజ్ పాల్ వ్యతిరేక దిశలోనే… | ugiridharaprasad
పరస్పర ఇష్టం లేకుండా ఒక స్త్రీ పట్ల అలా ప్రవర్తించడం కేవలం వేధించడమే,పురుషాహంకారమే కాదు..ఆత్మగౌరవరాహిత్యం కూడా.