విధానాల్లో తేడా లేదు, ఇక మిగిలింది బురద జల్లుడు -కార్టూన్


Poisonous to health

సోనియా ఎన్నికల హెచ్చరిక: బి.జె.పికి వేసే ఓటు మీ ఆరోగ్యాన్ని విషపూరితం చేస్తుంది.

మోడి ఎన్నికల హెచ్చరిక: కాంగ్రెస్ కి వేసే ఓటు మీ ఆరోగ్యాన్ని విషపూరితం చేస్తుంది.

***

ఎల్.కె.అద్వానీ కొన్ని వారాల క్రితం ఓ మాటన్నారు. ఇప్పుడిక దేశంలో రెండే రాజకీయ శిబిరాలున్నాయని వాటికి నాయకులు కాంగ్రెస్, బి.జె.పిలని ఆయన మాట సారాంశం. గతంలో కాంగ్రెస్ కి ప్రత్యామ్న్యాయమ్ ఉండేది కాదనీ అలాంటి పరిస్ధితుల్లో ప్రత్యామ్నాయం స్ధాయికి బి.జె.పిని అభివృద్ధి చేశానని ఆయన చెప్పుకోదలిచారు.

ఎల్.కె.అద్వానీ చెప్పింది ఒక కోణంలో నిజమే. ఇప్పుడు ఏ పార్టీ ఏ శిబిరం నుండి బైటికి వచ్చినా మూడో శిబిరానికి తావు లేదు. వామ పక్షాలు కూడా ఎన్నికల తర్వాతే మూడో ఫ్రంట్ అంటున్నారు తప్పితే ఎన్నికల ముందు మూడో ఫ్రంట్ సాధ్యం కాదని చెప్పేశారు. రాజకీయ పార్టీలకు విధానాలు ముఖ్యం అయినప్పుడు, ఆ విధానాల ద్వారా ప్రజలకు లబ్ది చేకూరుస్తామన్న నమ్మకాన్ని ప్రజలకు ఇవ్వగలిగినప్పుడు ప్రజల ముందు ఎన్ని పార్టీలున్నా రెండు శిబిరాలు మాత్రమే చూడగల దుర్దశ తప్పుతుంది. కానీ ఆ మాత్రం విశ్వాసం ఏ పార్టీకి లేదు. ఎందుకంటే ఈ పార్టీలన్నీ ఒక తానులో ముక్కలే గనుక!

అందుకే ఎల్.కె.అద్వానీ చెప్పిన ప్రత్యామ్నాయం పై పై రూపానికే పరిమితం తప్ప సారాంశంలో కాదు. వామపక్షాలతో సహా ఏ పార్టీ కూడా నూతన ఆర్ధిక విధానాలకు భిన్నమైన విధానాన్ని అనుసరించిన పాపాన పోలేదు. నూతన ఆర్ధిక విధానాలకు ప్రత్యామ్న్యాయమే లేదన్న తొంభైల నాటి పరిస్ధితి కూడా ఈ రోజుల్లో లేదు. దక్షిణ అమెరికా దేశాలు వెనిజులా, ఈక్వడార్, అర్జెంటినా, బొలీవియా తదితర దేశాలు పశ్చిమ దేశాలు, ఐ.ఏం.ఎఫ్ లు రుద్దిన విధానాలను తిరస్కరించడమే కాకుండా సొంత ఆర్ధిక విధానాలను అమలు చేస్తూ ఉన్నాయి. పశ్చిమ దేశాలను ఎదిరిస్తూ కూడా శుభ్రంగా అభివృద్ధి చెందవచ్చనీ, పైగా ఎదిరిస్తేనే అసలు సిసలు అభివృద్ధి సాధ్యమని రుజువు చేస్తున్నాయి.

కానీ భారత దేశంలో పరిస్ధితి పూర్తిగా భిన్నం, అమెరికా, ఐరోపాలను చూస్తే మనవాళ్ళకి కాళ్ళు గజ గజ వణుకిపోతాయి. చిల్లర వర్తకాన్ని అప్పజెపుతారా లేదా అని ఒబామా అలా గర్జించాడో లేదో ఇలా పార్లమెంటులో బిల్లు పాసైపోయింది. ఇరాన్ ఆయిల్ దిగుమతులు  తగ్గించుకుంటారా లేదా అంటూ హిల్లరీ క్లింటన్ వచ్చి క్లాసు పీకగానే మరే ఇతర దేశం కంటే ఎక్కువగా తగ్గించేసుకున్నారు. బాక్సైట్, ఇనుము గనులను విదేశీ కంపెనీలకు అప్పజెప్పడానికి సల్వా జుడుం లాంటి ప్రైవేటు సైన్యాలను కూడా నడుపుతున్నారు. ఎన్.డి.ఏ ఐదేళ్ల పాలననూ, యు.పి.ఏ పదేళ్ళ పాలనను పోల్చి చూస్తే ఒక్కటంటే ఒక్క తేడా కూడా మనకి కనిపించదు.

ప్రత్యర్ధికి భిన్నమైన విధానాన్ని అనుసరిస్తామని చెప్పే పరిస్ధితి లేనప్పుడు ఏం చేస్తారు? ఏం చేస్తారన్నది రాహుల్, సోనియా, మోడి ఇత్యాదుల ప్రసంగాలే చెబుతున్నాయి. దూషణల పర్వంలో ఒకరికి మించి మరొకరు పోటీ పడుతూ శబ్ద కాలుష్యాన్ని సృష్టిస్తున్నారు. మోడి విషం చిమ్ముతున్నారు అని సోనియా ఆరోపించిన తర్వాత రోజే మోడీ ‘మీరే ఎక్కువ విషం చిమ్ముతున్నారు’ అనడం తప్పితే సోనియా విధానాల్లో ఏ విషం/విషయం ఉందో చెప్పలేకపోయారు. చివరికి వారి జాతీయోద్యమ నాయకుల్ని సైతం వారు గౌరవించుకోలేని దుస్ధితిలో ప్రచారం చేస్తున్నారు.

ఐదు రాష్ట్రాల ఎన్నికలకే పరిస్ధితి ఇలా ఉంటే ఇక సాధారణ ఎన్నికలకు అది ఇంకెంత దిగజారుతుందో?!

One thought on “విధానాల్లో తేడా లేదు, ఇక మిగిలింది బురద జల్లుడు -కార్టూన్

  1. ఐదు సంవత్సరాల ఎన్నికల వరదల్లో రాజకీయ బురదను పార్టీలు ఒకరి మీద ఒకరు చల్లుకోగ మిగిలినదాంట్లో ఓటర్లు తిరిగి ఎన్నికల ఎదురుచూపులతో కూరుకుపోవడం స్వాతంత్ర భారతావనికి కొత్తేమి కాదు. పాలనా సౌలభ్యం ఎలావున్నదనే విషయం లెఖ్ఖలోకి రాకపోయినా ప్రభుత్వం మాత్రం ప్రతిసారి ఓటరుల నంఒదు లెఖ్ఖలు విషయంలో అత్యంత శ్రద్ధచూపుతుంది. ఆతరువాత కొత్తపాలనలో మిగిలేవి శార్ధకర్మ క్రియలే కద!

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s