రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా వివిధ పార్టీల మద్దతు కూడగట్టే ప్రయత్నంలో ఉన్నానని చెబుతున్న జగన్ పార్టీల నాయకుల్ని కలుస్తున్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, ఎన్.సి.పి నేత శరద్ పవార్, జె.డి.(యు) నేత శరద్ యాదవ్ లను ఇప్పటికే కలిశారు.
వీరిలో రాష్ట్ర విభజనకు గట్టిగా వ్యతిరేకిస్తున్నట్లు చెప్పింది ఒక్క మమతా బెనర్జీ మాత్రమే. గూర్ఖాలాండ్ డిమాండ్ ఎదుర్కొంటున్న మమత విభజనకు వ్యతిరేకం అని చెప్పడంలో ఆశ్చర్యంలో లేదేమో. “తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో చెప్పింది. ఈ ఐదేళ్లలో తెలంగాణ ఎందుకు ఏర్పాటు చేయలేదు? ఎన్నికలకు ముందు హడావుడిగా విభజనకు పూనుకుంటే అందులో ఖచ్చితంగా రాజకీయాలు ఉన్నాయనే అర్ధం. రాజకీయ ప్రయోజనాల కోసం మీ నిర్ణయాలను బుల్ డోజ్ చేయడం సరికాదు” అని మమతా బెనర్జీ వ్యాఖ్యానించారని పత్రికలు చెబుతున్నాయి.
ఎన్నికలకు ముందు కాకుండా గతంలోనే విభజన చేసి ఉంటే దానికి మమత మద్దతు ఇచ్చేవారా? నిజానికి 2009లోనే తెలంగాణ ఏర్పాటుకు అనుకూలంగా కాంగ్రెస్ నిర్ణయం ప్రకటించిన సంగతి మమతా బెనర్జీకి గుర్తుందా? రాజకీయ ప్రయోజనాల కోసం నిర్ణయం తీసుకున్నారు అనడానికి ముందు తెలంగాణ ప్రజలు దశాబ్దాలుగా తెలంగాణ రాష్ట్రం కోరుకుంటున్న విషయాన్ని ఎందుకు మర్చిపోతున్నారు?
బుల్ డోజర్ తన పని మొదలు పెట్టింది. ఎన్ని గోడలు అడ్డు వచ్చినా తోసుకు పోవడమే బుల్ డోజర్ చేసే పని. అలాంటి బుల్ డోజర్ పైన వాల్ రైటింగ్ చేస్తే అది ఆగుతుందా? రాజకీయ ప్రయోజనాలకోసమే తెలంగాణ అంటూ వ్యతిరేకిస్తున్నవారు, రాజకీయ ప్రయోజనాల కోసమే జగన్ పర్యటన అని ఎందుకు వ్యతిరేకించకూడదు?
1)నాకో సందేహం ఆంధ్ర వారు దోచుకున్నారు అని విడిపోతున్నాం అంటున్నారు అక్కడ నిల్చున్నఅభ్యర్ధులు తెలంగాణా సోదరులేగా! మంత్రులైంది అక్కడి స్థానికులేగా .
దీనికి ఎవరైనా వివరించండి ఇంకొన్ని ప్రశ్నలు కి జవాబులు తెలుసుకోవాలి .
చరిత్ర కొత్త కోణం.
“జగదైక కుటుంబ నాది, ఏకాకి జీవితం నాది”, జగన్ ఉవాచా! జగన్ మేదోమధనం పర్యవసానం రాజకీయపదసోపానం అర్ధంకాని విషయమని చాల ఊహిస్తే మన మెదడును మనమే దొలుచుకోవడం. పదవికంటే పార్టీని కూడదీసుకోవడంలో సమైక్యతవాదం తప్ప రాష్ట్ర సమైక్యతాభావానికి దోహదపడని విషయం. పలుకుబడి ప్రాధాన్యతను సంతరించుకుంటే పదవి పాదాలు పట్టుకుని పాకులాడుతుందనే నమ్మకానికి కొమ్ముకాచే కుటుంబం రాజన్నది. సి.బి.ఐ. దర్యాప్తును నీరుకార్చిన ధనాపాటికి రాష్ట్రరాజకీయాలు కరతలామలకం. వెన్నంటిఉన్నవాళ్ళకు వెన్నులో చలిపుట్టించడం ఇడుపులపాయవారు ఒడుపుగాపట్టే రాచకార్యం. ఫ్యాషన్ షో లాగే ఇదో పొలిటిచల్ షో.
మురళీ కృష్ణ గారూ…
నిజమే తెలంగాణలో నిలబడింది తెలంగాణ వారే…
రాష్ట్రంలో పరిపాలన కేవలం ఎమ్మెల్యేల చేతిలో ఉండదు. ముఖ్యమంత్రి చేతిలోనో…పార్టీ అధిష్ఠానం చేతిలోనో ఉంటాయి.
వెనకబడిన ప్రాంతాలపై శ్రద్ధ చూపి అభివృధ్ది కోసం పోరాడాల్సిన బాధ్యత స్థానిక రాజకీయ నాయకులదే కానీ…వారి కంత చొరవ ఉండదు. ఆ తర్వాత వారికి అంత స్వతంత్రంగా నడుచుకునే అవకాశం ఉండదు. ఉదాహరణకు నల్గొండ జిల్లాలోని దేవరకొండ ప్రాంతంలో….మునుగోడు ప్రాంతంలో చాలా ఫ్లోరైడ్ ఉంటుంది. అక్కడికి నాగార్జున సాగర్ ఓ యాభై కిలోమీటర్లకు మించి ఉండదు. ఐనా అక్కడ స్వచ్ఛమైన తాగునీరు లేక ఫ్లోరైడ్ బారిన పడి ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు. వారి గురించి అక్కడి ఎమ్మెల్యేలు అప్పుడప్పుడు విజ్ఞప్తులు, ధర్నాలు చేస్తారు అంతే. వాస్తవానికి అక్కడ నిధులు కేటాయించాల్సింది ముఖ్యమంత్రి మాత్రమే.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఏం జరిగిందో మనకు చూపించింది కదా. మంత్రులు కేవలం పేరుకే. అంతా వైఎస్, కేవీపీ బ్యాచ్ చూసుకుందని ఆరోపణలున్నాయి కదా. ఆఖరికి వాళ్ల ధాటికి తట్టుకోలేక ఐ.ఎ.ఎస్.లు కూడా కన్నీరు మున్నీరయ్యారు. కటకటాల పాలయ్యారు. ఐ.ఏ.ఎస్. ఆఫీసర్లే మాట్లాడలేని పరిస్థితి ఉంటే ఇక ఐదేళ్లు మాత్రమే ఉండే ఎమ్మెల్యేలు ఏం చేయగలరు….
కనుక చెప్పొచ్చేదేమంటే….తెలంగాణ ప్రాంత ముఖ్యమంత్రులు చాలా తక్కువ కాలం ఉన్నారు, ఉన్న సమయంలోనూ వారికి అనేక ఇబ్బందులు ఎదురయ్యాయి. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన వారే ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా ఉన్నారు కనుక….తమ ప్రాంతం వెనకబడిందని తెలంగాణ వారు అంటున్నారు. ఐతే తెలంగాణ వారు తమను ఆంధ్రోళ్లు దోచుకున్నారని అంటున్నది నిజమే కానీ అలాగని తమ ప్రాంత ప్రజాప్రతినిధులు మంచివారే అని అనడం లేదు. వాళ్లను కూడా చీదరించుకుంటున్నారు. అందుకేగా….ఈ మధ్య జరిగిన చాలా ఉప ఎన్నికల్లో వారికి డిపాజిట్లు కూడా దక్కడం లేదు.
చక్కని వివరణ అందించారు చందు తులసి గారు .. ఇక్కడ నాకో ఉపాయం అనిపించింది . దీనికి ఎవరైనా వివరించండి
ప్రశ్న: తెలంగాణ ప్రాంత ముఖ్యమంత్రులు చాలా తక్కువ కాలం ఉన్నారు, ఉన్న సమయంలోనూ వారికి అనేక ఇబ్బందులు ఎదురయ్యాయి. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన వారే ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా ఉన్నారు కనుక….తమ ప్రాంతం వెనకబడిందని తెలంగాణ వారు అంటున్నారు . పరిష్కారంగా 3 ప్రాంతాలకు ప్రాతినిద్యం లబించే విదంగా ,అన్ని పార్టీలకు వర్తించే విదంగా, ఒక్కో టర్మ్ కి ఒక్కో ప్రాంతం వారు ప్రాతినిద్యం వహించే ఏర్పాటు చేస్తే సరిపోతుందిగా ?
నిజమే శివగారూ…. మీరు చేసిన ప్రతిపాదన లాంటిది తెలంగాణ ఉద్యమం వచ్చిన ప్రారంభంలోనే చేసి ఉంటే ఇలా జరిగి ఉండేది కాదు. ఐతే మీరు చెప్పేలాంటిదే ఒక ఒప్పందం రాష్ట్ర్రం ఏర్పడే ముందే జరిగింది.
” ఒకవేళ సీమాంధ్రకు చెందిన వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉంటే…తెలంగాణ చెందిన వ్యక్తి ఉపముఖ్యమంత్రిగా ఉండాలని”. కానీ ఆతర్వాత ఉప ముఖ్యమంత్రి ‘ఆరోవేలు’ లాంటి వాడని కొందరు ఎద్దేవా చేశారు. అలాగే దానితో పాటే చాలా ఒప్పందాలు జరిగాయి. వాటిని పెద్దమనుషుల ఒప్పందం అని కూడా పిలుచుకుంటారు. అవన్నీ అమలుకు నోచుకోలేదు. ఆఖరికి 610 లాంటి జీవోలు, రాష్ట్రపతి ఉత్తర్వులు, ఏవీ అమలు కాలేదు. అన్నీ ఐపోయాకే ఉద్యమం వచ్చింది. ఇప్పుడు కాలాన్ని వెనక్కు తిప్పలేం కదా.
దాదాపూ అరవై ఏళ్ల తర్వాత కూడా తెలంగాణ-కోస్తా-రాయలసీమ ప్రజల మధ్య ప్రాంతీయ విభేదాలు అలాగే ఉన్నాయంటే ఆ పాపం కచ్చితంగా రాజకీయ నాయకులదే.
” ప్రజల మధ్య ప్రాంతీయ విభేదాలు” రాజకీయ నాయకుల పెట్టుబడి , వారి జన్మ హక్కు అందుకే ఇలాంటి పరిస్తితిలో వున్నాం.