P5+1 – ఇరాన్ ల మధ్య చరిత్రాత్మక ఒప్పందం


Foreign ministers at Geneva after agreement

Foreign ministers at Geneva after agreement

ఇరాన్, P5+1 దేశాల మధ్య ఇరాన్ లో చరిత్రాత్మక ఒప్పందం కుదిరింది. ఒప్పందానికి వ్యతిరేకంగా ఇజ్రాయెల్ తీవ్ర స్ధాయిలో సాగించిన లాబీయింగు విఫలం అయింది. ఒప్పందం ఫలితంగా ఇరాన్, 20 శాతం మేర యురేనియం శుద్ధి చేసే కార్యక్రమాన్ని 6 నెలల పాటు నిలిపేస్తుంది. దానికి ప్రతిఫలంగా ఇరాన్ పై విధించిన వాణిజ్య ఆంక్షలను 6 నెలల పాటు పాక్షికంగా ఎత్తేస్తారు. ఇది తాత్కాలిక ఒప్పందమే అయినప్పటికీ భవిష్యత్తులో మరిన్ని చర్చలు జరగడానికి తగిన భూమిక ఏర్పడడానికి దోహదం చేస్తుందని భావిస్తున్నారు.

కొద్ది నెలల క్రితం వరకు ఈ మాత్రం ఒప్పందం కూడా కుదురుతుందన్న సంగతి ఊహకు అందని విషయం. గత ఫిబ్రవరిలో కజకిస్ధాన్ లో ఇరు పక్షాల మధ్య జరిగిన చర్చలు సానుకూలంగా జరిగాయన్న ప్రకటన వెలువడిన దగ్గర్నుండి ప్రపంచవ్యాపితంగా చర్చలపై ఆశలు రేకెత్తాయి. గత జూన్ లో జరిగిన ఎన్నికల్లో హార్డ్ లైనర్స్ స్ధానంలో మోడరేట్లు ప్రభుత్వం ఏర్పరిచారు. హాసన్ రౌహాని అధ్యక్షరికంలో అమెరికాతో సంబంధాలను మెరుగుపరుచుకునే దిశలో ప్రయత్నాలు సాగాయి.

ఐరాస జనరల్ అసెంబ్లీ సమావేశాల కోసం న్యూయార్క్ వెళ్ళిన హాసన్ రౌహాని అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామాకు స్వయంగా ఫోన్ చేయడం ప్రపంచ రాజకీయాల్లో పెను సంచలనానికి దారి తీసింది. 1971 లో అమెరికా అనుకూల షా ప్రభుత్వాన్ని కూలదోసిన ఇస్లామిక్ విప్లవం తరువాత ఇరు దేశాల అధినేతలు నేరుగా ఫోన్ లో మాట్లాడుకోవడం అదే మొదటిసారి. దానితో ఇరాన్ అణు చర్చలలో పురోగతి ఉంటుందని సహజంగానే పలువురు భావించారు.

ప్రపంచ భౌగోళిక రాజకీయాల్లో వస్తున్న గుణాత్మక మార్పులు కూడా ఇరాన్-P5+1 దేశాల ఒప్పందానికి మార్గం సుగమం చేశాయి. P5 అంటే ఐరాస భద్రతా సమితిలో శాశ్వత (పర్మినెంట్) సభ్యత్వం ఉన్న ఐదు దేశాలు: అమెరికా, చైనా, బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా. +1 అంటే జర్మనీ అని అర్ధం. జర్మనీ, ఇరాన్ కు కీలక వాణిజ్య భాగస్వామి. ఇరాన్ అణు పరిశ్రమ ప్రధానంగా జర్మనీ కంపెనీల ఉత్పత్తులపై ఆధారపడి ఉంది. వందలాది జర్మనీ కంపెనీలు ఇరాన్ లో వాణిజ్యం నిర్వహిస్తున్నాయి. యూరోపియన్ యూనియన్ అనధికారిక నాయకుడుగానూ యూరో జోన్ ఎకనమిక్ పవర్ హౌస్ గానూ జర్మనీ ఉంటోంది. ఈ కారణాల రీత్యా ఇరాన్ చర్చల్లో జర్మనీ కూడా అనివార్యంగా భాగం అయింది. (P5+1 ను ఐరోపా దేశాలు E3+3 గా పిలుచుకుంటాయి. మూడు ఐరోపా దేశాలు + అమెరికా, రష్యా, చైనా అని దాని అర్ధం.)

P5+1 and Iran talks in Geneva

P5+1 and Iran talks in Geneva

ఇరాన్ పై అమెరికా, ఐరోపా దేశాలు విధించిన ఆంక్షలు ఒక్క ఇరాన్ కే కాకుండా ఇండియా లాంటి అనేక దేశాలకు చమురు కష్టాలు తెచ్చిపెట్టాయి. అమెరికా, ఐరోపాలు ఇజ్రాయెల్ కోసం ఇరాన్ పై సాగిస్తున్న దాష్టీకాన్ని తిరస్కరిస్తూనే ఏమీ చేయలేని పరిస్ధితిని ప్రపంచ దేశాలు ఎదుర్కొన్నాయి. ఈ నేపధ్యంలో అమెరికా-ఇరాన్ సంబంధాలు మెరుగుపడతాయన్న ఆశ కలగడం మొత్తం ప్రపంచానికే శుభవార్త అయింది. అమెరికాతో శత్రు సంబంధాలను సమీక్షించడానికి హాసన్ రౌహాని సంసిద్ధంగా ఉన్నారన్న సందేశం ఈ ఫోన్ కాల్ ద్వారా ప్రపంచానికి అందినట్లయింది.

వారం రోజుల క్రితమే ఒప్పందం కుదరనున్నదని అందరూ అనుకున్నారు. అయితే ఫ్రాన్స్ చివరి నిమిషంలో సైంధవ పాత్ర పోషించడంతో చర్చలను వారం రోజులు వాయిదా వేశారు. మూడు రోజుల క్రితం ప్రారంభం అయిన మలి విడత చర్చలు ఆదివారం తెల్లవారు ఝామున ఒప్పందం కుదరడంతో ముగిశాయి. ఈ ఒప్పందం తాత్కాలికమే.

సిరియాలో పశ్చిమ దేశాలు రెచ్చగొట్టిన కిరాయి తిరుగుబాటు రష్యా దౌత్య ఎత్తుగడల ఫలితంగా అమెరికాకు ప్రతికూలంగా మారింది. స్వదేశాలలోని ఆర్ధిక సంక్షోభ పరిస్ధితులు అమెరికా, ఐరోపాలకు మునుపటిలా ఆధిపత్య ఆదేశాలను కొనసాగించలేని పరిస్ధితిని కల్పించాయి. ఇరాన్ ను అన్యాయంగా శిక్షిస్తున్నారన్న ప్రపంచ దేశాల అభిప్రాయాన్ని కాదని ఏకపక్షంగా ఆధిపత్యాన్ని చెలాయించుకునే పరిస్ధితి క్షీణించడంతో ఇరాన్ నూతన అధ్యక్షుడు చాచిన స్నేహ హస్తాన్ని అయిష్టంగానే స్వీకరించాల్సిన పరిస్ధితికి అమెరికా, ఐరోపాలు నెట్టబడ్డాయి.

ఈ విధంగా అమెరికా, ఐరోపా దేశాలలో నెలకొన్న జాతీయ ఆర్ధిక సంక్షోభ పరిస్ధితులు, ప్రపంచ బౌగోళిక రాజకీయ రంగంలో వచ్చిన మార్పులు ఇరాన్ అణు కార్యక్రమాన్ని పాక్షికంగా అయినా అంగీకరించక తప్పని పరిస్ధితి అమెరికా, ఐరోపాలకు కల్పించింది. ఒప్పందం ప్రకారం పశ్చిమ దేశాలు తమ ఆంక్షల ద్వారా స్తంభింపజేసిన 4.2 బిలియన్ డాలర్ల విదేశీ ఖాతాల డబ్బు ఇరాన్ కు అందుబాటులోకి వస్తుంది. అందుకు ప్రతిఫలంగా యురేనియంను 20 శాతం వరకు శుద్ధి చేసే పనిని ఇరాన్ నిలిపేస్తుంది. కేవలం 5 శాతం వరకు మాత్రమే శుద్ధి చేస్తుంది. 20 శాతం దాటి శుద్ధి చేస్తే ఇక అక్కడి నుండి అణ్వాయుధాలకు అవసరమైన 90 శాతం శుద్ధిని చేరుకోవడం తేలిక. అందువల్ల 20 శాతం వద్ద ఆపాలని అమెరికా, ఐరోపాలు డిమాండ్ చేశాయి.

అంతేకాదు. ఇప్పటివరకు 20 శాతం వరకు శుద్ధి చేసిన యురేనియం నిల్వలను ఇరాన్ నీరుగార్చడానికి ఇరాన్ అంగీకరించింది. ఈ ఆరు నెలల కాలంలో యురేనియం శుద్ధి చేసేందుకు వినియోగించే సెంట్రిఫ్యూజ్ లను ఇరాన్ కొత్తగా నిర్మించకూడదు. అనగా ఇప్పటికే ఉన్న అణు శుద్ధి సౌకర్యాలను విస్తరించకూడదు. ఆరక్ వద్ద ఉన్న రియాక్టర్ నిర్మాణాన్ని 6 నెలలపాటు నిలిపేస్తుంది.

చర్చలు ఫలవంతం అవడానికి వీలుగా రష్యా విదేశీ మంత్రి సెర్గి లావరోవ్ శనివారం జెనీవా చేరుకున్నారు. అమెరికా విదేశీ మంత్రి జాన్ కెర్రీ ఆదివారం జెనీవా చేరుకున్నారు. కెర్రీ తర్వాత ఫ్రాన్స్ విదేశీ మంత్రి లారెంట్ ఫెబియస్, బ్రిటన్ విదేశీ మంత్రి విలియం హేగ్ లు కూడా జెనీవా చేరుకున్నారు. దానితో శనివారం అర్ధరాత్రి దాటాక కూడా చర్చలు కొనసాగాయి. 18 గంటల సుదీర్ఘ చర్చల అనంతరం ఆదివారం తెల్లవారు ఝాముకు గానీ అవి ఒక కొలిక్కి రాలేదు.

ఒప్పందాన్ని ‘పెద్ద విజయం’గా ఇరాన్ విదేశీ మంత్రి జావద్ జరిఫ్ అభివర్ణించాడు. అమెరికా, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్, చైనా, జర్మనీ దేశాల విదేశీ మంత్రులు కూడా ఈ ఒప్పందం ‘సమగ్ర పరిష్కారం’ వైపుకు పడిన అడుగు అని పేర్కొన్నారు. ఇరాన్ కు శాంతియుతంగా అణు కార్యక్రమం కొనసాగించుకునే హక్కు ఉన్నదనీ దీనిని అమెరికా, ఐరోపాలు గుర్తించాలని ఇరాన్ డిమాండ్ చేస్తోంది. దీనిని ఒప్పందంలో భాగంగా చేర్చారని ఇరాన్ చెబుతోంది. అయితే ఒప్పందానికి ఇరు పక్షాలు తమ తమ అర్ధాలు ఇచ్చుకోవడం గమనార్హం. ఇరాన్ శాంతియుత అణు కార్యక్రమాన్ని ఒప్పందం గుర్తించిందని రష్యా మంత్రి లావరోవ్ పేర్కొనగా ‘ఇది మొదటి అడుగే. దీని ద్వారా యురేనియం శుద్ధి చేసుకునే హక్కు వచ్చినట్లు కాదు” అని అమెరికా మంత్రి జాన్ కెర్రి పేర్కొన్నాడు.

3 thoughts on “P5+1 – ఇరాన్ ల మధ్య చరిత్రాత్మక ఒప్పందం

  1. ఆర్టికల్ చాలా బావుంది. 35 సంవత్సరాలపైగా గడ్డకట్టిన సంబంధాలు కరిగి రాగానపడితే మంచిదే.

    “1971 లో అమెరికా అనుకూల షా ప్రభుత్వాన్ని కూలదోసిన ఇస్లామిక్ విప్లవం తరువాత ఇరు దేశాల అధినేతలు నేరుగా ఫోన్ లో మాట్లాడుకోవడం అదే మొదటిసారి.”

    1971 కాదనుకుంటాను. 1978 లేదా 79 కావచ్చు. నేను రాయచోటిలో ఇంటర్మీడియట్ చదివేటప్పుడు అయతుల్లా ఖొమైనీ తలపెట్టిన ఇస్లామిక్ విప్లవం గెలిచినట్లు గుర్తు.

    ఈ పరిణామాల అంతిమ ఫలితంగా మన దేశంపై చమురు దిగుమతుల చెల్లింపు భారం కాస్త తగ్గుముఖం పడుతందని ఆశించవచ్చేమో!

  2. ఈ ఒప్పందం విఫలమౌతుందోనని అనుమానంకలుగుతోంది!ఈ ఒప్పందం నుండి అమెరిక తప్పుకోవచ్చు!ఈ ఒప్పందం వలన ఇరాక్ ఏ విదంగా ప్రయోజనం పొందుతుందోనన్న విషయం పక్కన పెడితే,అనుశుద్ది కార్యక్రమాన్ని 6 నెలలపాటు ఆపివేయడంవలన ఆ రంగంలో పనిచేస్తున్న కార్మికుల పరిస్తితి ఏమిటి?

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s