హలో తెహెల్కా! ఏమిటీ పని?


తెహెల్కా ఎడిటర్-ఇన్-చీఫ్ తరుణ్ తేజ్ పాల్ వ్యవహారంలో దృశ్యాలు శరవేగంగా మారుతున్నాయి. తెహెల్కా పత్రిక గోవాలో జరిపిన ‘THiNK ఫెస్టివల్’ సందర్భంగా తమ పత్రికలో పని చేసే ఒక యువ మహిళా జర్నలిస్టుపై లైంగిక అత్యాచారం జరపిన ఆరోపణలు రావడంతో పత్రికా ప్రపంచంతో పాటు అనేకమంది నిర్ఘాంతపోయారు. అణచివేతకు గురవుతున్న వర్గాల తరపున పని చేయడంలో ప్రశంసాత్మక కృషి చేసిన తెహెల్కా ఎడిటర్ తాను కూడా మురికిలో భాగం అని ప్రకటించుకున్న సందర్భం అభ్యుదయ కాముకలను తీవ్రంగా నిరాశపరిచింది.

అప్పటి నుండీ పత్రికల్లో వస్తున్న వార్తలు, ఆరోపణలకు తెహెల్కా యాజమాన్యం స్పందిస్తున్న తీరు, గోవా రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వాల విభిన్న స్పందనలు దుర్ఘటనపై తీవ్ర అయోమయాన్ని సృష్టిస్తున్నాయి. తమ కుటుంబాన్ని బెదిరిస్తున్నారంటూ బాధితురాలు తాజాగా ది హిందు పత్రికకు లేఖ రాయడం సంచలనంగా మారింది. తమ కుటుంబ సభ్యులపై ఒత్తిడి తేవడానికి ప్రయత్నాలు వస్తున్నాయని, ఈ ప్రయత్నాలు వెంటనే ఆపాలని బాధితురాలు ది హిందూ పత్రికా ముఖంగా కోరారు.

“నవంబర్ 22, 2013 తేదీ రాత్రి తేజ్ పాల్ కి చెందిన తక్షణ కుటుంబ సభ్యులు న్యూ ఢిల్లీ లోని మా అమ్మగారి ఇంటికి వచ్చారు. తేజ్ పాల్ ను కాపాడాలంటూ వారు మా అమ్మని కోరారు. 1) న్యాయం సహాయం ఎవరినుండి కోరుతున్నారనీ 2) తెహెల్కా యాజమాన్యానికి లైంగిక ఆరోపణల గురించి ఫిర్యాదు చేయడం ద్వారా ఏమి ఆశిస్తున్నారో చెప్పాలనీ డిమాండ్ చేశారు.

“ఈ సందర్శన, తీవ్ర వేదన అనుభవిస్తున్న ఈ తరుణంలో, నా పైనా, నా కుటుంబ సభ్యుల పైనా తీవ్రమైన భావోద్వేగపరమైన ఒత్తిడి తెచ్చింది. మమ్మల్ని మరింతగా వేధించడానికీ, ఇబ్బంది పెట్టడానికి చేస్తున్న ప్రయత్నాలలో ఇది ప్రారంభమేమో అని నేను భయపడుతున్నాను.

“నన్ను గానీ, మా కుటుంబ సభ్యులను గానీ సమీపించడానికి ఎటువంటి ప్రయత్నమూ చేయవద్దని నేను ఈ సందర్భంగా, తేజ్ పాల్ కు సంబంధించిన వ్యక్తులనూ, వారి సహాయకులనూ కోరుతున్నాను” అని బాధితురాలి లేఖ పేర్కొందని ది హిందు తెలిపింది.

హలో, తరుణ్ తేజ్ పాల్! ఏమిటీ పైశాచిక మదోన్మత్త చేష్టలు? మీరు వల్లించిన నీతిసూత్రాలకు మీరే మంగళం పలకడం ఎలాంటి నీతి? బాధితురాలు కోరినట్లుగా ఆమె జోలికి పోకుండా న్యాయ, చట్ట వ్యవస్ధలు పని చేయనివ్వడం మీ కనీస బాధ్యత! పోలీసులకు పూర్తిగా సహకరిస్తానన్న మీ మాటకు కట్టుబడి ఉండడం ఎలాగో మీకు ప్రత్యేకంగా చెప్పాలా?

నీతిగా బతకడం, అతున్నతమైన నైతిక ప్రమాణాలను కలిగి ఉండడం నేటి పరిస్ధితుల్లో ఎంత కఠినంగా మారిందో తరుణ్ తేజ్ పాల్ ఉదంతం తెలియజేస్తోంది. అత్యద్భుతమైన, ఆశ్చర్యకరమైన, సంభ్రమాశ్చర్యాలకు గురి చేసే వార్తా కధనాల ద్వారానూ, అసమాన పరిశోధనాత్మక జర్నలిజం ద్వారానూ భారత దేశపు పత్రికా వ్యాసంగ యవనికపై దూసుకొచ్చిన తెహెల్కా బృందం దేశంలోని ప్రగతి కాముకలకు అనేక ఆశలు రేకెత్తించింది.

భారత దేశ రాజకీయ రంగంలో అత్యంత శక్తివంతమైన కుటుంబాలతో నేరుగా ఢీకొన్న ధైర్య స్ధైర్యాలను తెహెల్కా బృందం ప్రదర్శించింది.  గుజరాత్ మారణకాండ బాధితులకు న్యాయం చేయడంలో తీస్తా సెతల్వాద్ నేతృత్వంలోని బృందం న్యాయ పోరాటం సాగించగా తరుణ్ తేజ్ పాల్ నేతృత్వంలోని బృందం అత్యంత సాహసోపేతమైన స్టింగ్ ఆపరేషన్లను మోడి అనుచరగణాల ఇళ్ల డ్రాయింగ్ రూముల్లోకీ, వారి ఆఫీసు కార్యాలయాల్లోకీ తీసుకెళ్లిన ఘనత తెహెల్కా సొంతం.

బి.జె.పి మాజీ అధ్యక్షుడు బంగారు లక్ష్మణ్ కు అవినీతి కేసులో శిక్ష పడిందన్నా, నరేంద్ర మోడి అనుచరులు మాయా కొడ్నాని, బాబూ భజరంగి లకు యావజ్జీవ కఠిన కారాగార శిక్ష పడిందన్నా అందులో తెహెల్కా విలేఖరుల ప్రశంసాత్మక పాత్ర, సాహసోపేత కృషి అనివార్యమైన భాగం అంటే అతిశయోక్తి కాదు.

అలాంటి బృందానికి నేతృత్వం వహించిన తరుణ్ తేజ్ పాల్ కడకు ఇటువంటి దారుణమైన స్ధితికి దిగజారడం భారత దేశ మహిళకు రక్షణ లేని సమక్షమే లేదా అన్న తీవ్ర అనుమానం కలిగిస్తోంది. భారత స్త్రీ ఎంతటి కఠిన పరిస్ధితిని ఎదుర్కొంటోందో కూడా తెలియజేస్తోంది.

తరుణ్ తేజ్ పాల్ తన పత్రికా బాధ్యతల నుండి 6 నెలల పాటు తప్పుకుంటున్నట్లు ప్రకటించడం ద్వారానే ఈ అంశం దేశవ్యాపితంగా పతాక శీర్షికలకు ఎక్కింది. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయనప్పటికీ గోవా ప్రభుత్వం తనంతట తానుగా (సుమోటో గా) తరుణ్ తేజ్ పాల్ పై అత్యాచారం కేసు నమోదు చేసి విచారణ చేపట్టింది.

“ఒకసారి గోవాలో ప్రవేశించడం అంటూ జరిగాక ఎవరు ఎవరితోనైనా పడుకోవచ్చు” అని గతేడు ‘THiNK ఫెస్టివల్ సందర్భంగా తరుణ్ తేజ్ పాల్ వ్యాఖ్యానించాడని ఒక ఎన్.జి.ఓ సంస్ధలో పనిచేసే వ్యక్తి చెప్పినట్లుగా ది హిందూ తెలియజేసింది. బహుశా అందుకే గోవాలోనే ఫెస్టివల్ ఏర్పాటు చేశారా అన్న అనుమానం కలిగితే తప్పు అనుమానించినవారిది కాబోదు. గోవాలో అలాంటి వాతావరణం సృష్టించినందుకు అక్కడి రాజకీయ పార్టీలన్నీ బాధ్యత వహించాల్సి ఉండడం ఒక విషయం అయితే, అలాంటి వాతావరణాన్ని ఖండించి బాధ్యులను వెల్లడి చేయడం మాని, తాను కూడా అందులో భాగం కావడానికి ప్రయత్నించడం తరుణ్ తేజ్ పాల్ కి తగునా?

ఈ యేడు ఒకవైపు THiNK ఫెస్టివల్ వేదికపై అత్యాచార బాధితుల చేత సాక్ష్యాలు చెప్పిస్తూ, వారి దారుణ అనుభవాలను దేశం ముందు ఉంచుతూనే మరోవైపు సరిగ్గా అదే దారుణాలకు అదే వేదిక ఉన్న హోటల్ లో పూనుకోవడం పరమ జుగుప్స కలిగిస్తోంది. ఈ దేశంలో ప్రగతికాముకత సైతం డబ్బు జబ్బులో మునిగి తేలుతూ బాధితుల పక్షాన నిలబడడాన్ని ఒక ఫ్యాషన్ గా మార్చివేసిన ఫలితమేనా ఈ విపరీత పరిస్ధితికి కారణం అని తర్కించుకోవాల్సిన అగత్యం ఏర్పడింది.

తరుణ్ తేజ్ పాల్ పై కేసు నమోదు చేస్తున్నట్లు గోవా ప్రభుత్వం ప్రకటించిన తర్వాత బాధితురాలి ఫిర్యాదు లేకుండా కేసు నమోదు చేసినందున వారికి సహకరించేది లేదంటూ పత్రిక మేనేజింగ్ ఎడిటర్ సోమా చౌదరి ప్రకటించారు. ఈ ప్రకటనపై సర్వత్రా విమర్శలు వెల్లువెట్టడంతో ఆమె తన ప్రకటనను సవరించుకున్నారు. బాధితురాలు సిద్ధపడకుండా కేసు నమోదు చేస్తే అది ఆమె ఏకాంతానికి భంగకరమని మాత్రమే తాను భావించానని, ఆమె సిద్ధపడితే తాము పోలీసులకు అన్నీ విధాలుగా సహకరిస్తామని ఆమె తెలిపారు.

బాధితురాలి డిమాండ్ మేరకు, విశాక కేసులో పని స్ధలాలలో లైంగిక అత్యాచారాల నిరోధానికి కమిటీలు వేయాలన్న సుప్రీం కోర్టు తీర్పును అనుసరించి ప్రముఖ ఫెమినిస్టు ఊర్వశి బుటాలియా నాయకత్వంలో వెంటనే కమిటీ వేస్తున్నట్లుగా సోమా చౌదరి పత్రికా ముఖంగా ప్రకటించారు.

ఇంతకీ తరుణ్ తేజ్ పాల్ నిర్వాకానికి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడి కాలేదు. కాగ్నిజబుల్ నేరానికి ఆయన పాల్పడ్డాడని గోవా పోలీసులు ప్రకటించారు. అత్యాచారం, మహిళా గౌరవ భంగం సెక్షన్లకు వర్తించే నేరాలకు ఆయన పాల్పడ్డాడని తెలిపారు. ‘తాగిన మత్తులో ఉన్న ఒక వదరుబోతు ప్రేలాపనలను తీవ్రంగా తీసుకోవడం తగునా?’ అని తేజ్ పాల్ తనను ప్రశ్నిస్తున్నారనీ, కానీ తాగిన మత్తులో ఉన్న వ్యక్తి శారీరకంగా ఎలా దాడి చేస్తారనీ’ బాధితురాలు సోమా చౌదరికి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారని పత్రికల ద్వారా తెలుస్తోంది.

విషయం ఏదయినా బాధితురాలు తీవ్రవేదనకు గురయిన విషయం స్పష్టం అవుతోంది. అందునా బాధితుల పక్షాన నిలిచే పత్రికగా ప్రతిష్ట పొందిన తెహెల్కా అధిపతి ఇలాంటి దుష్కార్యానికి పాల్పడడం ఇంకా ఘోరం. చట్టం ప్రకారం ఎలాంటి శిక్షకు అర్హుడో అంత శిక్షా తరుణ్ తేజ్ పాల్ ఎదుర్కోక తప్పదు. లేదంటే తెహెల్కా పత్రిక ఉనికికే అర్ధం ఉండబోదు.

15 thoughts on “హలో తెహెల్కా! ఏమిటీ పని?

 1. నిర్భయాచట్టఅమలు తీరుతెన్నులమాటటుంచి, చట్టబద్ధమైన అమలు వచ్చిన తరువత ఈ చట్టం ముందు కాముకుల నిర్భయత,విచ్చలవిడితనం, విశృంఖలస్థాయిలో మహిళలపట్ల వయోబేధంలేకుండా విజృంభిస్తోంది. ఈ చట్ట బాధితులను ఓదార్చే తీరుతెన్నులు భగవంతుడికెరుక, ఇకపోతే వార్తపత్రికలు మాత్రం ఈ శీర్షిక కింద ఒక పేజీని కేటాయించి మారుమూల కుగ్రామాలలోని లైంగిక అత్యచారాలకు విశేష ప్రాచూర్యాన్ని కల్పించి పాఠకులలో ఆందోళస్థాయిని పెంచి మనశ్శాంతిలేకుండా చేస్తోంది. కీచకులను పట్టి నిర్భయచట్టం కింద నమోదు చేసిన సంఘటనల పర్యవసాన కధ కంచికి మనం మరో సంచికకి ఈ దౌర్భాగ్య వార్తలకోసం ఎదురుచూడటం, షరా మాములే. న్యాయపరిధిలో సాక్ష్యాల కధనాలతో కాలయాపంచేసే ప్రక్రియ ముందు చట్టం చట్టుబండలవడం తప్ప చంకనెత్తుకోదు. పాలకులు చట్టబద్ధం చేస్తే రాజకీయాలు ఆడుకుంటున్నాయి, న్యాయదేవత కళ్ళకు కట్టిన గంతలతో ముసి ముసిగా నవ్వుకుంటోంది.

 2. పింగ్‌బ్యాక్: హలో తెహెల్కా! ఏమిటీ పని? | ugiridharaprasad

 3. అంతా చేసి క్షమాపణ అడగటం విచిత్రం! ఈ పని ఈ పెద్దపనిషి అచేతనలో చేసినట్లా ? లేక చేతనలో చేసినట్లా? చేతనలోనే చేసిన ఇతను ఎంత అభ్యదయ వాది అయితే మాత్రం ఎవరూ నోరు తెరవకుండ వుండాలా? తప్పు దుర్మార్గులు అనేవారు చేసిన దాని కంటే సన్మార్గులు చేస్తేనే మరింత తప్పువుతుంది? కాధంటారా?

 4. ఏమైనప్పటికి లైంగికపరమైన ఆరొపనలు వరుసగా పత్రికలలోనికి ఎక్కుతున్నయి.ఇరుపక్షాలవారు అంగీకరించినపుడు ఈ విషయాలు బైటపడవు!లేదా నయానొ,భయనో ఒప్పించగలిగినపుడూ బైటపడవు!బలవంటం చేసినపుడు కొన్నికొన్ని సందర్భాలలో మాత్రమే ఎటువంటివి బైటపడతాయి!కనుక పైన పేర్కొన్న సందర్భాలు అక్రమం కాదా!మరి ఆ సందర్భాలలో న్యాయం జరిగేదెలా?

 5. తోటి జర్నలిస్టుగానే కాదు… చివరకు తన భార్య, కుమార్తెతో దీర్ఘకాలంగా స్నేహ సంబంధాలలో ఉన్న యువతితో అంత నిర్భీతిగా.. అలా వ్యవహరించడానికి వెనుక తాగుడు మాత్రమే కారణమని చెప్పవచ్చా? గోవాపై చెడు వ్యాఖ్యకు గాను.. ‘గోవా నిన్ను గుర్తుపెట్టుకుంటుంది తేజ్‌పాల్’ అంటూ రెండేళ్ల క్రితమే గోవా ప్రముఖులు చేసిన వ్యాఖ్య ఇన్నాళ్లకు ఫలించినట్లుందని వార్తలొచ్చాయి కూడా.

  తాగిన క్షణాల్లో వదరుబోతుతనంతో చేసిన చర్యగా పశ్చాత్తాపం అక్షరాల్లో ప్రకటించినంత సులువుగా లేదీ ఘటన. బాధితురాలి ఉత్తరం చూస్తే వరుసగా రెండు రోజులు రెండు సార్లు తేజ్‌పాల్ ఆమెతో అలా వ్యవహరించినట్లు తెలుస్తోంది. ఇది క్షంతవ్యం కాని నేరమే.. ‘గోవాలో ఎవరు ఎవరితోనయినా పడుకోవచ్చు’ అని జోక్‌గా అయినా సరే తెహల్కా ఎడిటర్ స్థాయి వ్యక్తి వాగడం ఏ మేరకు సబబో…

  తాను 13 సంవత్సరాల పాపగా ఉన్నప్పుడు కూడా కన్నతండ్రి ఇలాగే చేశాడని తేజ్‌పాల్ కుమార్తే స్వయంగా బాధితురాలితో చెప్పినట్లు తెలుస్తోంది. ఎంత గొప్పగా పవర్ రాజకీయాలు నడిపినా, పవర్‌పుల్ వ్యక్తులుగా ఘనత సాధించినా మహిళను శరీర దృష్టినుంచి చూడకుండా నిగ్రహం పాటించడం మగాడికి సాధ్యం కాదేమో…

  ”ఇంతకీ తరుణ్ తేజ్ పాల్ నిర్వాకానికి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడి కాలేదు.”

  24వ తేదీ ‘ది న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌’లో దీనిపై వ్యక్తిగత ఇమెయిల్ సందేశాలతో సహా మొత్తం సమాచారం వచ్చింది. ఈ వ్యాఖ్యను నిన్ననే పంపాలని ప్రయత్నించాను కాని సాంకేతిక సమస్య అడ్డొచ్చింది.

  కింది లింకులు చూడగలరు.

  The victim’s letter to Shoma Chaudhuri
  By Express News Service
  http://newindianexpress.com/thesundaystandard/The-victims-letter-to-Shoma-Chaudhuri/2013/11/24/article1907442.ece

  For once, Tejpal’s words failed him
  By Ravi Shankar
  Published: 24th Nov 2013 09:04:49 AM
  http://newindianexpress.com/thesundaystandard/For-once-Tejpals-words-failed-him/2013/11/24/article1907542.ece

 6. వి.శేఖర్ గారూ…., నాకో సందేహం. వికీలీక్స్ తో అమెరికా నిజ స్వరూపం బట్ట బయలు చేసిన అసాంజే పైనా లైంగిక వేధింపుల ఆరోపణలొచ్చాయి. ఇప్పుడు భారతదేశంలోనూ స్ట్రింగ్ ఆపరేషన్ లతో రాజకీయ వర్గాల్లో కలకలం పుట్టించిన తరుణ్ తేజ్ పాల్ పైనా లైంగిక వేధింపుల ఆరోపణలొచ్చాయి. ( నా ఉద్దేశం అసాంజేను-తేజ్ పాల్ ను పోల్చడం కాదు.) కానీ ఎక్కడో , ఏదో పోలిక కనిపిస్తోంది.

 7. పైన రాజశేఖర రాజు గారు ఇచ్చిన లింక్ లు చూడండి. పోలికలు లేవని అర్ధం అవుతుంది. అసాంజెను ఇరికించింది నిజమే గానీ తేజ్ పాల్ నిజంగానే నేరస్ధుడు. ధింక్ ఫెస్టివల్ లో, అదీ చిన్నప్పుడు నుండి తన ఎదురుగా పెరిగిన అమ్మాయిపైన, తన కూతురు స్నేహితురాలి పైనా ఇలాంటి అఘాత్యానికి తలపడడం ఘోరాతిఘోరం. ఏ మాత్రం తరుణ్ తేజ్ పాల్ క్షమార్హుడు కాడు.

 8. ఒక పెద్ద కాంఫెరెన్స్ జరిపుతూంటే ఎంతో మంది దేశ,విదేశాలనుంచి అథిదులు వచ్చిఉన్నా అవేవి పట్టించుకోకుండా, తనమానాన తాను తన కోరికను తీర్చుకోవటానికి, మానం అవమానం, పరువు ప్రతిష్ట గురించి ఏ మాత్రం చింత లేకుండా, నిర్భయంగా కూతురి మిత్రురాలి పైన అఘాయిత్యానికి పాల్పడటం సామాన్యులు చేసే పని కాదు.
  ఇతరులను యక్స్ ప్లాయిట్ చేయటంలో ఎంతో ఆరితేరిన అవకాశవాది ఐతే తప్ప.

  ఇక రాజశేఖర్ రాజు గారు తాగుడు కారణమై ఉండవచ్చేమో అని అంట్టున్నారు. అతను చేసిన పనికి, మద్యానికి సంబంధమే లేదు
  http://ibnlive.in.com/news/tarun-tejpal-the-friend-i-can-no-longer-recognise/435738-3-253.html

  http://www.outlookindia.com/article.aspx?288640

 9. వి. శేఖర్ గారూ, శ్రీరామ్ గారూ,
  నిన్న నాకు సెలవు కావడంతో ఇక్కడ చర్చను చూడలేకపోయాను. ఇవ్వాళ కూడా ఇంతవరకు ఆఫీసులో పని పూర్తి చేసి ఇప్పుడే చూస్తున్నాను. నా వ్యాఖ్యపై స్పందనలకు కృతజ్ఞతలు.

  మీరన్నది కరెక్ట్. మహిళ విషయంలో కప్పదాటు వేయడానికి, అడ్డదారి తొక్కడానికి, కట్టు తప్పి నడవడానికి తాగుడు మాత్రమే కారణం కాదన్నది నిజం.

  ఒక భార్యకు ఒక భర్త, ఒక భర్తకు ఒక భార్య అనే రకం పద్ధతి దంపతీ వివాహ వ్యవస్థ రూపంలో సమాజం ఉనికిలోకి వచ్చి కొన్ని వేల సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఈ పద్ధతికి వ్యతిరేకంగా అతిక్రమణ ఇంకా సవాలక్ష రూపాల్లో కొనసాగుతుండటమే ఇక్కడ పరిశీలనాంశంగా ఉంటోంది. అందులోనూ వైవాహికేతర సంబంధాలను అతిక్రమించే వెసలుబాటు, అధికారం, పురుషుడికే ఎక్కువ అనుకూలంగా ఉంటోందేమో చూడాలి.

  సహజంగా మన సామాజిక వ్యవస్థలో మగాడికి ఉన్న అనుకూలతనే తేజ్‌పాల్ ఇక్కడ సావకాశంగా తీసుకున్నాడా? వృత్తిలో అత్యున్నత శిఖరాలను అధిరోహిస్తున్న వ్యక్తులను అవలక్షణాలు కూడా అదే స్థాయిలో వెన్నాడుతూ వస్తున్నాయా? దొరక్కపోతే దొర.. దొరికితే దొంగ అనే సహజ సామెత ఈ వాస్తవాన్నే చాటుతోందనుకుంటా.

  ఇలాంటి ఘటనలు చదివినప్పుడల్లా, వందేళ్లకు ముదు గురజాడ అప్పారావు రాసిన ‘సంస్కర్త హృదయం’ అనే ఆ అజరామరమైన కథానిక గింగురుమంటూనే ఉంటుంది. వేశ్యా వృత్తిలో ఉంటున్న వ్యక్తిని ఉద్ధరిద్దామని బయలుదేరిన ప్రొఫెసర్ రంగనాధ అయ్యర్ చివరకు ఆమె వ్యామోహంలోనే పడి భంగపాటుతో పరిసరాల్లోంచి పారిపోయిన కథ అది.

  తేజ్‌పాల్… ఒక్కరే కాదు.. మగాళ్లంతా ఇలా నేటికీ “మహిళోద్ధారకులు” గానే ఉంటున్నారేమో.. సమాజాన్ని మొత్తంగా ఇలా సాధారణీకరించడం (జనరలైజేషన్) భావ్యం కాదేమో కాని… ఎందుకో గురజాడ కథ పదే పదే వెంటాడుతోంది. మహిళను శరీర దృష్టితో మాత్రమే చూసే అలవాటునుంచి మనం బయటపడేదెప్పుడు?

  ఎందుకో… ఆధునిక తెలుగు సాహిత్యంలో తొలి ఫెమినిస్టు కవిత (సావిత్రి గారు రాసినది 1984?) మళ్లీ మళ్లీ గుర్తుకొస్తోంది.

  పాఠం ఒప్పజెప్పకపోతే
  పెళ్లి చేస్తానని
  పంతులుగారన్నప్పుడే భయం వేసింది
  ఆఫీసులో నా మొగుడున్నాడు
  అవసరమున్నా సెలవివ్వడని
  అన్నయ్య అన్నప్పుడే
  అనుమానం వేసింది
  వాడికేం మహారాజని
  ఆడా మగా వాగినప్పుడే
  అర్థమయిపోయింది
  పెళ్లంటే పెద్ద శిక్షని
  మొగుడంటే స్వేచ్ఛభక్షకుడని
  మేం పాలిచ్చి పెంచిన జనంలో సగమే
  మమ్మల్ని విభజించి పాలిస్తోందని
  – సావిత్రి, ఒక ఆడపిల్ల స్వగతం

  పై కవితలో చివరి రెండు పాదాలూ ఒక మహాకావ్య అర్థాన్ని స్ఫురింపజేస్తున్నాయి.

  తేజ్‌పాల్ అంశ మనందరిలో ఎంతో కొంత స్థాయిలో ఉందా… అంతరంగంలో బుసలు కొడుతూ బలహీన క్షణంలో ఒక్కసారిగా బయటపడుతోందా? ఏమో…!

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s