రష్యాకు మరో దౌత్య విజయం, ఇ.యుకు ఉక్రెయిన్ నో


పశ్చిమ దేశాల ఆధిపత్యాన్ని గేలి చేస్తూ రష్యా మరో దౌత్య విజయం నమోదు చేసింది. ‘మాస్టర్ స్ట్రోక్’ లాంటి ‘సిరియా రసాయన ఆయుధాల వినాశనం’ ద్వారా మధ్య ప్రాచ్యం రాజకీయాల్లో అమెరికాను చావు దెబ్బ తీసిన రష్యా ఇప్పుడు ఉక్రెయిన్ విషయంలో మరో పంజా విసిరింది. తాజా పంజా దెబ్బ ఫలితంగా యూరోపియన్ యూనియన్ తో వాణిజ్య సాపత్యం కోసం జరుపుతున్న చర్చలను సస్పెండ్ చేస్తూ ఉక్రెయిన్ ప్రధాని డిక్రీపై సంతకం చేశారు. ఉక్రెయిన్ చర్యతో వివిధ ఇ.యు దేశాల నేతలు దిగ్భ్రాంతికి గురయ్యారు. రష్యా హర్షం ప్రకటించింది. ఇ.యు-ఉక్రెయిన్ ల ఒప్పందానికి తాము పూర్తి వ్యతిరేకం కాదని, కానీ త్రైపాక్షిక చర్చలకు తాము అనుకూలం అని పుతిన్ ప్రకటించడం కొసమెరుపు!

యూరోపియన్ యూనియన్ తో వాణిజ్య, రాజకీయ ఒప్పందం కుదుర్చుకోవడానికి జరుగుతున్న చర్చలను వెంటనే నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేస్తూ ఉక్రెయిన్ ప్రధాని మికోల అజరోవ్ గురువారం ఒక డిక్రీపై సంతకం చేశాడు. “ఉక్రెయిన్, యూరోపియన్ యూనియన్ ల మధ్య అసోసియేషన్ అగ్రిమెంట్ కోసం జరుగుతున్న ఏర్పాట్ల ప్రక్రియను నిలిపివేయాలి” అని సదరు డిక్రీ పేర్కొందని రష్యా టుడే తెలిపింది.

ఈ చర్యతో ఉక్రెయిన్, భవిష్యత్తులో ఇ.యు లో చేరే అవకాశాలు బాగా సన్నగిల్లాయి. ఇ.యులో చేరడానికి సదరు కూటమి విధించిన షరతును ఉక్రెయిన్ పార్లమెంటు తిరస్కరించిన తర్వాత ఈ పరిణామం చోటు చేసుకుంది. ఇ.యు, ఉక్రెయిన్ ల మధ్య ‘అసోసియేషన్ అగ్రిమెంట్’ కుదురడం కోసం వచ్చేవారం లిధుయేనియా నగరం విలినియస్ లో శిఖరాగ్ర సమావేశం జరగాల్సి ఉంది. ఈ సమావేశానికి ముందు నెరవేర్చాలంటూ ఇ.యు ఒక షరతు విధించింది.

ఉక్రెయిన్ మాజీ ప్రధాని యులియా తిమోషెంకో వైద్య చికిత్స కోసం విదేశాలకు వెళ్ళేందుకు అనుమతించాలన్నదే ఆ షరతు. ఆమె పదవిలో ఉండగా పశ్చిమ దేశాల కోసం ఎంతగా శ్రమించిందీ ఈ షరతు స్పష్టం చేస్తోంది. కానీ దీనిని ఉక్రెయిన్ పార్లమెంటు తిరస్కరించింది. దానితో విలియస్ చర్చల భవితవ్యం అనుమానంలో పడింది. ప్రధాని తాజా డిక్రీతో ఈ చర్చలు ఇక జరగనట్లే.

“ఇది ఇ.యుకు మాత్రమే ఆశాభంగం కాదు. ఉక్రెయిన్ ప్రజలకు కూడా ఆశాభంగమేనని మేము నమ్ముతున్నాం” అని ఇ.యు విదేశాంగ విధాన అధిపతి కేధరిన్ యాష్టన్ యాష్టపోయింది. ఇ.యు ఇవ్వజూపిన బ్రహ్మాండమైన బహుమతిని ఉక్రెయిన్ కాలదన్నుకుందని కేధరిన్ వ్యాఖ్యానించింది. ఈ ఒప్పందం ఉక్రెయిన్ ఆర్ధిక వ్యవస్ధకు గొప్పగా తోడ్పడి ఉండేదని ఆమె ఒక ప్రకటనలో తెలిపింది.

అయితే ఉక్రెయిన్ పార్లమెంటు సభ్యుల అభిప్రాయం వేరే విధంగా ఉంది. వారికి ఇ.యు ఒప్పందం కంటే రష్యన్ ఫెడరేషన్ తో వాణిజ్యమే ముఖ్యం. అంతేకాదు. ఇది వారికి జాతీయ భద్రతకు సంబంధించిన సమస్య కూడా. “ఉక్రెయిన్ జాతీయ భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నాం. రష్యా ఫెడరేషన్ తో మేము కోల్పోయిన భారీ వాణిజ్యాన్ని పునరుద్ధరించుకోవడానికి ఇది అవసరమైంది. మాస్కోతో వాణిజ్య సంబంధాలు మాకు ముఖ్యం” అని పార్లమెంటు సభ్యులు అన్నారని ఆర్.టి తెలిపింది. 

ఉక్రెయిన్ నిర్ణయంతో ఇ.యు ప్రతినిధులు దాదాపు షాక్ లో ఉన్నారు. “ఈ మిషన్ ఇక మూసిగినట్లే… విలినియస్ లో ఒప్పందంపై సంతకం చేయడం ఇక సాధ్యం కాదు… ఈ ఏకపక్ష నిర్ణయం పట్ల తీవ్ర దిగ్భ్రాంతితో ఉన్నాము” అని ఇ.యు ప్రతినిధి, పోలాండ్ రాజకీయవేత్త అలెగ్జాండర్ క్వాస్నియెవ్స్కీ అన్నాడు. ఇతర ఇ.యు దేశాల నేతలు సైతం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. “ఉక్రెయిన్ ప్రభుత్వం అకస్మాత్తుగా రష్యా ముందు మోకరిల్లింది. క్రూరమైన రష్యా ఒత్తిడి దీనికి కారణం” అని స్వీడిష్ విదేశీ మంత్రి కారల్ బిల్ట్ అన్నారు. రష్యా బదులు ఇ.యు ముందు మోకరిళ్ళితే కారల్ బిల్ట్ కు నచ్చి ఉండేది కాబోలు!

“ఒక అవకాశం తప్పిపోయింది” అని బ్రిటిష్ విదేశీ మంత్రి విలియం హేగ్ వ్యాఖ్యానించాడు. ఎవరికి అవకాశం అన్నదే ఇక్కడి ప్రశ్న.

అయితే జర్మనీ విదేశీ మంత్రి మాత్రం కాస్త మర్యాదగా వ్యాఖ్యానించారు. “ఏ దారిలో వెళ్లాలనేది నిర్ణయించుకోవడం ఉక్రెయిన్ సార్వభౌమాధికార హక్కు” అని జర్మనీ విదేశీ మంత్రి గిడో వెస్టర్ వెల్లే అన్నారు.

ఉక్రెయిన్ తీవ్రమైన ఆర్ధిక సమస్యలతో సతమతం అవుతోంది. మరో 2 నుండి 6 నెలల్లో అప్పులు చెల్లించలేక దివాలా తీసే పరిస్ధితిని ఎదుర్కొంటోంది. మార్కెట్ లో అప్పులు పుట్టడం లేదు. పుట్టినా చెల్లించలేని వడ్డీలను డిమాండ్ చేస్తున్నారు. భారీ లోటు బడ్జెట్ ఆర్ధిక వ్యవస్ధకు భారంగా మారింది. నిరుద్యోగం, దరిద్రం గురించి మాట్లాడుకోకపోవడమే మేలు. కరెన్సీ విలువ అధఃపాతాళంలో తీసుకుంటోంది.

ఈ పరిస్ధితుల్లో ఉక్రెయిన్ కు కావాల్సింది డబ్బు. ఋణ పీడిత యూరో జోన్ దేశాలకు ఇస్తున్నట్లుగా సరసమైన వడ్డీ రేట్లకు డబ్బు ఇవ్వాలని ఉక్రెయిన్ ఆశీస్తోంది. అయితే ఇ.యు మాత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’ అని తేల్చేసింది. గ్రీసు, పోర్చుగల్, ఐర్లాండ్, స్పెయిన్, ఇటలీ తదితర దేశాలకు ఇస్తున్నట్లుగా ఇ.యు ఋణ నిధి నుండి కొన్ని వందల బిలియన్ల డాలర్లు ఇ.యు+ఐ.ఏం.ఎఫ్ లు మంజూరు చేశాయి. కానీ ఉక్రెయిన్ కి ఇచ్చేంత సొమ్ము ఇ.యు వద్ద లేదు. ఇప్పటికే కూటమిలో ఉన్న దేశాలకు ఇవ్వడానికే తలకు మించిన భారం నెత్తిన వేసుకోగా కొత్తగా చేరే ఉక్రెయిన్ కి ఎలా ఇవ్వాలన్నది వారి నిస్సహాయత. కేవలం 1 బిలియన్ డాలర్లు మాత్రమే ఇ.యు, ఉక్రెయిన్ కు ఇవ్వజూపింది.

ఫలితంగా ఉక్రెయిన్ రాజకీయవేత్తలకు విషయం ఏమిటో నసాలానికి అంటింది. తమను కేవలం రాజకీయ ఉపకరణంగా మాత్రమే ఇ.యు పరిగణిస్తోందని వారికి తెలిసి వచ్చింది. రష్యా నుండి దూరం చేసి ఆ దేశాన్ని ఏకాకి చేయడంలోనే ఇ.యు ఆసక్తి తప్ప నిజంగా ఆడుకునే ఉద్దేశ్యం లేదని అర్ధమయింది.

రష్యా స్వయంగా కస్టమ్స్ యూనియన్ పేరుతో ఒక వాణిజ్య యూనియన్ ఏర్పాటు చేసింది. కజకిస్తాన్, రష్యాలు సభ్యులుగా ఉన్న యూనియన్ లో ఉక్రెయిన్ చేరితే మూడు దేశాల మధ్య జరిగే వాణిజ్యంపై ఇక సుంకాలు ఉండవు. ఒకవైపు కస్టమ్స్ యూనియన్ లో చేరడానికి చర్చలు జరుపుతూనే ఇ.యులో చేరడానికి కూడా తలుపులు తెరవడం రష్యాకు నచ్చలేదు.

రష్యా భయాలు అర్ధం చేసుకోదగ్గవే. ఇ.యు ఒప్పందం ద్వారా దాదాపు 90 శాతం సరుకులపై సుంకాలు ఉండవు. ఫలితంగా ఇ.యు దేశాల సరుకులు ఉక్రెయిన్ ను ముంచెత్తుతాయి. ఉక్రెయిన్ ను కస్టమ్స్ యూనియన్ లో కూడా చేర్చుకుంటే ఆ సరుకులన్నీ ఉక్రెయిన్ ద్వారా రష్యా, కజకిస్తాన్ లను కూడా ముంచెత్తుతాయి. అనగా దొడ్డిదారిన రష్యా మార్కెట్ లో ప్రవేశించడానికి ఇ.యు పధకం రచించింది.

ఇది గ్రహించిన రష్యా ఇ.యు, ఉక్రెయిన్, రష్యాలు త్రైపాక్షిక చర్చలు జరగాలని ప్రతిపాదించింది. అంతకంటే ఎవరు ఎక్కువ ఇస్తారు? కానీ రష్యా ప్రతిపాదనను ఇ.యు పట్టించుకోలేదు. దానితో ఇ.యు తో చర్చలు జరుపుతూ మాతో చర్చలు ఏమిటని ప్రశ్నిస్తూ ఉక్రెయిన్ కు తలుపులు మూసేసింది. దానితో ఉక్రెయిన్ రష్యా తో భారీ వాణిజ్య అవకాశాలను కోల్పోయే పరిస్ధితి ఏర్పడింది. పొదలో పక్షుల కోసం చేతిలో ఉన్న పక్షిని ఎవరు వదిలేస్తారు? ఇ.యుతో ఒప్పందం సహజ తర్కానికి విరుద్ధం అని గ్రహించింది. పైగా ఇ.యు విధించిన రాజకీయ షరతులు ఉక్రెయిన్ పార్లమెంటు ఎలాగూ తిరస్కరించింది. ఇక ప్రధానికి మిగిలిన దారి ఒకటే.

2 thoughts on “రష్యాకు మరో దౌత్య విజయం, ఇ.యుకు ఉక్రెయిన్ నో

  1. రష్య్యాఉమ్మడిగా ప్రాచీన వైభవంతో వుంటే అమెరికా అగ్రాధిపత్యం దమ్మిడికి పనికిరాకుండాపోయేది. భారత్ మాత్రం గతంలోని రష్య్యా మైత్రిని అమెరికా మైకంలో పక్కకుపెట్టి పరువుకోసం పరుగులు తీస్తోంది. అరవై దశకంలో అమెరికా పాకిస్తాన్ వెన్నుదన్నివుండి వెన్నుపోటుకు ప్రయత్నించినపుడు గుండెనిబ్బరం కలిగించింది రాష్య్యా మైత్రనే విషయం చరిత్రపుటలలో ఏనాడో చోటుచేసుకుంది. అప్పటి ప్రధాని ఈ విషయంలో కృష్ణమీనన్ను ప్రశంసించడం మరువలేని విషయం.

  2. పింగ్‌బ్యాక్: రష్యాకు మరో దౌత్య విజయం, ఇ.యుకు ఉక్రెయిన్ నో | ugiridharaprasad

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s