పెట్టుబడిదారీ పూర్వ ఉత్పత్తి విధానాలు – భారత దేశం


(భారత వ్యవసాయరంగంలో పెట్టుబడిదారీ మార్పుల గురించి డా.అమితాబ్ చక్రవర్తి రాసిన చిరు పుస్తకం అనువాదంలో ఇది నాలుగవ భాగం. మొదటి మూడు భాగాల కోసం కింది లింకులను చూడగలరు. -విశేఖర్)

భారత వ్యవసాయ రంగంలో మార్పులు – ఒక నోట్

పంపిణీ, పెట్టుబడిదారీ పూర్వ అధిక-వడ్డీ మరియు వర్తక పెట్టుబడులు

వ్యవసాయ సమస్యపై కారల్ కాట్ స్కీ, లెనిన్

భారత వ్యవసాయ రంగంలో మార్పులు – ఒక నోట్ -పార్ట్ 4

Agriculture India

చాప్టర్ II

పెట్టుబడిదారీ పూర్వ ఉత్పత్తి విధానాలు మరియు భారత వ్యవసాయ రంగంలో పెట్టుబడిదారీ అభివృద్ధికి చారిత్రక ఆధారాంశాలు (historical premises)

‘రాజకీయ అర్ధ శాస్త్ర విమర్శకు తోడ్పాటు’ అనే గ్రంధంలో మార్క్స్ ఇలా చెప్పారు, “స్ధూల దృక్పధంలో, ఆసియా తరహా, ప్రాచీన, ఫ్యూడల్ మరియు ఆధునిక బూర్జువా ఉత్పత్తి విధానాలను సమాజ ఆర్ధిక అభివృద్ధిలో పురోగమిస్తున్న యుగాలుగా పేర్కొనవచ్చు.”

మార్క్స్ పేర్కొన్నదాని ప్రకారం ‘ఆసియా తరహా, స్లావోనిక్, ప్రాచీన (ancient classical) మరియు జర్మానిక్’ లు ఆదిమ కమ్యూనిజం నుండి ప్రైవేటు ఆస్తి ఉద్భవించిన పరివర్తనా రూపాలు.

ఏవైతే చైనా, రష్యాలలో వలే ఉప ఉత్పత్తి విధానాల లోకి పరిణామం చెందాయో, అత్యావశ్యంగా అవే ఆసియా తరహా మరియు స్లావోనిక్ తరహా ఉత్పత్తి విధానాలు. ప్రాచీన ఉత్పత్తి విధానం గ్రీసు, రోము ల వలే బానిస ఉత్పత్తి విధానంలోకి పరిణామం చెందగా జర్మానిక్ ఉత్పత్తి విధానం స్కాట్లండ్ లేదా స్కాండినేవియాలలో వలె ఫ్యూడలిజం లోకి పరిణామం చెందింది. ఈ చర్చ, వివరాలలోకి మనం వెళ్ళడం లేదు. కానీ “ఆసియా తరహా” ఉత్పత్తి విధానం అనేది ప్రాచ్య (oriental) దేశాల గుత్తస్వామ్యం కాదని ఒకసారి చెప్పు కోడానికే ఈ ప్రస్తావన. ‘జర్మానిక్ మరియు స్లావోనిక్ ఉత్పత్తి విధానాల గురించి మార్క్స్, గ్రాండిసే లో ప్రస్తావించినపుడు ఆయన అవి కేవలం జర్మన్లు లేదా స్లావ్ లలో మాత్రమే ఉన్నాయన్న అర్ధంలో సూచించలేదు’ అని హాబ్స్ బామ్ ప్రస్తావించిన విషయం గమనార్హం.

భూ యాజమాన్య పద్ధతులు అనేక రూపాల్లో ఉండడం వలనా, సామాజికార్ధిక సాయిల్లో ప్రాంతీయంగా తేడాలు ఉండడం వలనా భారత దేశంలో పెట్టుబడిదారీ పూర్వ వ్యవసాయక వ్యవస్ధ తీవ్ర సంక్లిష్టమైనది.

మొగలు సామ్రాజ్యం పతనం కావడానికి ముందు వ్యవసాయ ఉత్పత్తి విధానం మూడు రకాల సామాజికార్ధిక నిర్మాణాలు కలిగి ఉంది. అవి:

  • భూములు, కొన్ని నీటిపారుదల ప్రాజెక్టులు రాజ్యం ఆస్తిగా ఉండడం.
  • వ్యక్తిగత భూయజమానుల ఆస్తిగా భూములు ఉండడం. ఇది రాజ్యం యొక్క ఆస్తితో పాటే ఉనికిలో ఉండడం గానీ లేదా రాజ్యం సహాయంతో ఉనికిలోకి రావడం గానీ జరిగింది.
  • గ్రామీణ సమూహాల చేతుల్లో గానీ లేదా ఇతర సూక్ష్మస్ధాయి స్ధానిక యూనిట్ల చేతుల్లో గానీ భూములు ఉండడం లాంటి నానారకాల భూయాజమాన్య రూపాలు.

భూములు రాజ్యం ఆస్తిగా ఉండడమే చివరి ‘తూర్పు నిరంకుశ ప్రభువులు’ (Oriental Despotism) గా పేర్కొబడిన మొగలుల ప్రధాన ఆర్ధిక పునాది. భూముల సాగుదారుల నుండి భూమి శిస్తు రూపంలో ఉత్పత్తులను స్వాయత్తం చేసుకోడానికి ఈ (భూ) ఆస్తి హక్కు దోహదపడింది. ప్రపంచంలో భారీ మొత్తంలో శిస్తు ఆదాయం కలిగినవారిగా మొగలులు పేరు గడించారు.

ఆ కాలంలో వ్యవసాయోత్పత్తి పంపిణీ ఎలా ఉండేదంటే రైతు, అతని కుటుంబానికి తమ శ్రమశక్తిని పునరుత్పత్తి చేసుకోగల మొత్తాన్ని కేటాయించి మిగిలినదంతా తమ వశం చేసుకునేవారు. అనగా పెట్టుబడిదారీ పూర్వ లేదా భూస్వామ్య ఉత్పత్తి విధాన దోపిడి. అత్యధిక మోతాదులో (higher rate) ఫ్యూడల్ దోపిడికి పాల్పడడం ద్వారానే ఈ ఫ్యూడల్ ఉత్పత్తి విధానాన్ని స్ధిరంగా కొనసాగించగలిగారు. తద్వారా సహజసిద్ధమైన భౌగోళిక వాతావరణంలో పెట్టుబడిదారీ ఉత్పత్తి సంబంధాల వైపుకు పరివర్తన జరగకుండా అడ్డుకున్నారు. అయితే ప్రొఫెసర్ హబీబ్ తన ‘మొగల్ ఇండియా ఆర్ధిక వ్యవస్ధలో పెట్టుబడిదారీ అభివృద్ధికి ఉన్న అవకాశాలు’ వ్యాసంలో ఈ వాదనతో విభేదించారు.

మిగులు ఉత్పత్తి అనేదానికి ఉత్పత్తి స్ధాయి ఒక్కటే కొలబద్ద కాదని ప్రొఫెసర్ హబీబ్ అన్నారు. “(ఉత్పత్తి) సంచయం అనేది వ్యవసాయ ఉత్పత్తి ఏ స్ధాయిలో జరుగుతోందన్న ఒక్క అంశం పైనే ఆధారపడి ఉండదు. దోపిడీ విధానం, అంతిమ మిగులు వ్యవసాయ ఉత్పత్తుల పునఃపంపిణీ ఏ విధంగా జరుగుతోంది అన్న అంశాలపై కూడా ఆధారపడి ఉంటుంది.” (Historical Premises For India’s Transition To Capitalism :V I Pavlov నుండి)

ఈ పరిస్ధితీ, రాజ్యం ఆధీనంలో ఆస్తులు ఉండడమూ, భూ సంబంధాలలో ప్రైవేటు ఆస్తి పిండ రూపంలో ఉండడమూ… ఈ మూడూ ఫ్యూడల్ ఉత్పత్తి విధాన చట్రంలోనే ప్రైవేటు ఆస్తి సంబంధాలు ఉద్భవించడానికి ప్రధాన ఆటంకాలుగా వ్యవహరించాయి.

వ్యవసాయంలో ఉత్పత్తి సాధనాలు ఉమ్మడి ఆస్తులుగా ఉండడం వలన మెరుగైన ఆర్ధికాభివృద్ధి పశ్చిమ ఐరోపా కంటే భిన్నంగా ఉంటుందని కారల్ మార్క్స్ నొక్కి చెప్పారు. మొగల్ ఇండియాలో శిస్తు వసూలుదారులు మూడు గ్రూపులుగా ఉన్నారు.

  1. మొగలులు/జాగీర్దారులు
  2. హిందూ భూ యజమానులు – వీరికి తమ భూములు వంశపారంపర్య హక్కుగా ఉండిపోయింది
  3. పలుకుబడి కలిగిన భూ యజమానులు – వీరు తమ అధికారిక భూములకు తోడు వివిధ రకాల బంజరు భూములను, కమ్యూనిటీల భూములను సొంత ఆస్తులుగా కలిపేసుకున్నారు. కేంద్ర అధికార వ్యవస్ధకు వారికి మధ్య ఉన్న సంబంధం సంక్లిష్టమైనది.

మొగలు సమాజం విచ్ఛిన్నం అవుతున్న కాలంలో రాజ్యమే భూములను ఆస్తులుగా కలిగి ఉండే విధానానికీ, వ్యక్తిగత భూమి శిస్తు వసూలుదారులకు మధ్య వైరుధ్యం ప్రముఖంగా ముందుకు వచ్చింది. వసూలవుతున్న శిస్తులో భాగం పెంచుకోడానికి (కేంద్రం) చేసిన ప్రయత్నాలను ఉన్నత వర్గాలు, భూములను తమ చేతుల్లో ఉంచుకున్న వర్గాలు ప్రతిఘటించారు.

ఈ విషయంలో పంజాబ్ లోని సిక్కులు శక్తివంతంగా వ్యవహరించారు. అయితే ఇది కేంద్రం నుండి దూరంగా ఉన్న ప్రాంతాల్లో భూస్వామ్య దోపిడి మరింత శక్తివంతం కావడానికి కూడా దోహదపడింది.

దీనితో పాటు ఉత్పత్తుల (products) సరుకు స్వభావం గురించీ, ఉత్పత్తి ప్రక్రియ (production) యొక్క సరుకు స్వభావం గురించి, అనగా వ్యాపారీకరణ (commercialization) గురించి కూడా చర్చించాలి. వ్యవసాయంలో అత్యధిక స్ధాయిలో అదనపు ఉత్పత్తి పోగు పడడం వలనా, దానిని భూమి శిస్తు ద్వారా స్వాయత్తం చేసుకోవడం వలనా వ్యవసాయ ఉత్పత్తిలో అత్యధిక భాగాన్ని సరుకులుగా మార్చగలిగారు. ఇలా సరుకులుగా మార్చే పని శిస్తు వసూలుదారుల (tax farmer) ద్వారా జరిగింది. వ్యాపారులుగానూ, అధిక వడ్డీ దోపిడీదారులుగానూ అవతరించిన ఈ శిస్తు వసూలుదారులు రైతులు, ఫ్యూడల్ ప్రభువులు పన్నులు చెల్లించడానికి తామే డబ్బు అప్పుగా ఇచ్చేవారు. అందుకు బదులుగా వారినుండి పంటలను సేకరించి పట్టణాల్లోనూ, ఇతర చోట్లా అమ్మేవారు. కానీ ‘శిస్తులు మరియు అధిక వడ్డీ మార్గాల ద్వారా వ్యవసాయ ఉత్పత్తులు వ్యాపారీకరణ చెందే ప్రక్రియ’, అసలు ‘వ్యవసాయంలో ఉత్పత్తి ప్రక్రియ వ్యాపారీకరణ’ ప్రయోజనాలకే విరుద్ధం. ఎందుకంటే వ్యాపారీకరణ చెందిన అదనపు ఉత్పత్తిని ఉత్పత్తిదారుడే స్వయంగా వ్యాపారీకరణలో మారకం చేసుకునే అవకాశాన్ని కోల్పోయాడు. ఈ అవకాశం అతనికి దక్కినట్లయితే తన అదనపు ఉత్పత్తిని ఉత్పత్తి సాధనాలతో మారకం చేసుకుని ఉండేవాడు. అలా సంపాదించిన ఉత్పత్తి సాధనాలను తన ఉత్పత్తిని మరింత విస్తరించడానికి ఉపయోగించుకుని ఉండేవాడు.

మళ్ళీ అలాంటి వ్యాపారంలో ఇమిడి ఉన్న పెట్టుబడి పెద్దమొత్తంలో ఉండేది. ఎందుకంటే ఉత్పత్తిదారుడయిన రైతు చాలా అరుదుగా వినియోగదారుడితో నేరుగా సరుకు సంబంధంలోకి వచ్చేవాడు. ఇలాంటి మార్కెటింగ్ లో పట్టణ పెట్టుబడి పాత్ర మరింత తీవ్రంగా ఉండేది.

ఇక్కడ ఒక ముఖ్యమైన సంగతి ప్రస్తావించుకోవాలి. ఋణగ్రస్త రైతుల భూములు వడ్డీ వ్యాపారుల చేతుల్లోకి వెళ్లకుండా భూ యాజమాన్య కులాల సంఘటిత నిర్మాణం నిరోధించింది. బ్రిటిష్ వారు ఇండియాను ఆక్రమించేనాటికి రైత్వారి ప్రాతిపదికన వ్యాపారులు మరియు వడ్డీ వ్యాపార కులాల ఆధీనంలోకి భూములు చేరడం చాలా అరుదుగా మాత్రమే జరిగింది.

పెట్టుబడిదారీ పూర్వ ఇండియాలో వర్తక మరియు అధిక వడ్డీ పెట్టుబడి: వీటి నిర్మాణం మరియు నిర్వహణ నాలుగు అంశాలపై ఆధారపడ్డాయి

  1. శ్రమ యొక్క సామాజిక విభజనా స్వభావం మరియు పరిధి
  2. వ్యక్తిగత ఉత్పత్తి మరియు వినియోగాల పరుధుల మధ్య అంతర్గత సంబంధం
  3. అదనపు ఉత్పత్తి సంగ్రహణ మరియు పునఃపంపిణీ పద్ధతులు
  4. పునరుత్పత్తి యొక్క నిర్దిష్ట లక్షణాలు.

అదనపు ఉత్పత్తిని దాని సొంతదారు నుండి వస్తురూపేణా చెల్లించబడిన కౌలు పన్ను రూపంలో వేరు చేయడంలో వర్తక పెట్టుబడి ప్రత్యక్ష పాత్ర పోషించింది. శిస్తువసూలుదారులు వాటిని (వస్తువులను) డబ్బుగా మార్చేవారు. పన్ను సొమ్మును వారు ముందుగానే డబ్బు రూపంలో (రాజ్యానికి) చెల్లించేవారు. దీనినే టాక్స్ ఫార్మింగ్ గా అందరికి వాడుకలోకి వచ్చింది.

(సమాచార, రవాణా సౌకర్యాలు అభివృద్ధి చెందని కాలంలో ఫ్యూడల్ ప్రభువులు తమ తరపున పన్నులు వసూలు చేసే హక్కును ప్రైవేటు వ్యక్తులకు బదలాయించడం ఆసియా, ఐరోపాలలో జరిగింది. ఇరాన్ లో ఇది క్రీ.పూ 6వ శతాబ్దంలోనే ఉండేది. గ్రీసు, రోమన్ సామ్రాజ్యాలలోకి క్రీ.పూ 4 వ శతాబ్దంలోను, ఫ్రాన్సు, హాలండ్, స్పెయిన్, ఇంగ్లాండ్ లలో క్రీ.శ 13వ శతాబ్దంలోనూ 16వ శతాబ్దం చివర ఒట్టోమన్ సామ్రాజ్యం (టర్కీ) లోనూ ఈ పద్ధతి ప్రవేశించింది. రష్యాలో 15, 16 శతాబ్దాలలోనూ ఇండియాలో 13, 14 శతాబ్దాలోనూ ప్రవేశించింది. పెట్టుబడిదారీ పూర్వ వ్యవస్ధలలో అదనపు విలువ పెద్ద ఎత్తున పోగుబడడం టాక్స్ ఫార్మర్స్ ద్వారా చాలా పెద్ద ఎత్తున జరిగింది. రాజ్యానికి చెల్లించాల్సిన పన్ను మొత్తం కంటే రెండు మూడు రెట్లు ఎక్కువగా వీళ్ళు వసూలు చేసేవారు. రాజ్యానికి చెల్లించిన పన్నును కోశాగారానికి జమ చేసి మిగిలింది తమ వద్ద ఉంచుకున్నారు. తద్వారా వ్యక్తులకు, ఫ్యూడల్ ప్రభువులకు కూడా వడ్డీలకు అప్పులు ఇచ్చే స్ధాయికి ఎదిగారు. ఒక ప్రాంతానికి గానీ, ఒక విభాగానికి గానీ వీరిని నియమించుకునేవారు. ప్రాధమిక స్ధాయిలో పెట్టుబడి పోగుబడిన మార్గాలలో టాక్స్ ఫార్మింగ్ ముఖ్యమైనది. –అనువాదకుడు, ది గ్రేట్ సోవియట్ ఎన్ సైక్లోపీడియా నుండి.)

సహజంగా ఉద్భవించిన వ్యవసాయ, చేతివృత్తుల యూనిట్లను మార్కెట్ ద్వారా నాశనం చేయడంలో విఫలం అయిన బ్రిటిష్ వర్తక పెట్టుబడి కోశాగార ఉపకరణాలను స్వాధీనం చేసుకోవడం ప్రారంభించింది. ప్రధానంగా భూమి శిస్తు వసూలులో ఇలా చేసింది. చిన్న స్ధాయి సరుకు ఉత్పత్తిదారులను (చేతి వృత్తులవారిని) పోలీసు నియంత్రణకు గురిచేసింది. ఎగుమతి పంటలను పండించినందుకు వ్యవసాయదారుల పైన సుంకాలు రుద్దింది. మొత్తం వ్యవస్ధనే ఆర్ధిక వసూళ్లను బలవంతంగా అమలు చేసేదిగా మార్చివేసింది. సంక్లిష్టమైన మిలటరీ, పోలీసు పాలనా చర్యల ద్వారా బ్రిటిష్ పెట్టుబడిదారీ వ్యవస్ధ సాపేక్షికంగా వెనుకబడి ఉన్న పెట్టుబడిదారీ పూర్వ రంగాలలో జోక్యం చేసుకుంది.

మళ్ళీ, జమీందారుల నియంత్రణలో కౌలు పునఃపంపిణీ జరిగే పద్ధతి భారత సమాజంలో సంప్రదాయ మరియు పరాన్నభుక్త శక్తుల ఉనికిని కొనసాగించింది. వ్యవసాయరంగంలో పెట్టుబడారీ ప్రాధమిక సంచయం జరగడానికి ఫ్యూడల్ మిలట్రీ పరివారం రద్దు కావడం అనేది ముఖ్యమైన షరతు. కానీ బ్రిటిష్ వాళ్ళు ప్రవేశపెట్టిన శాశ్వత సెటిల్మెంటు విధానం మీ ఫ్యూడల్ మిలిటరీ పరివారాన్ని రద్దు చేయలేదు. వ్యవసాయదారులు ఉత్పత్తి చేసిన అదనపు ఉత్పత్తిని సదరు పరాన్న భుక్తులు స్వాయత్తం చేసుకున్నారు.

రైత్వారీ ప్రాంతాల్లో గ్రామాల్లోని ఉన్నతస్ధాయి వర్గాలకు స్వతంత్రంగా వ్యవసాయం చేసుకునే అవకాశం లభించింది. కానీ భారీ భూమి శిస్తుల కారణంగా భూమిసాగుదారులు వడ్డీ వ్యాపారులకు పెద్ద మొత్తంలో బాకీలు పడ్డారు. రైత్వారీ ప్రాంతాలకు పెట్టుబడిదారీ రైతును ఉత్పత్తి చేసే పరిస్ధితులు –స్ధిరంగా డబ్బు చెల్లింపులు పొందగల దీర్ఘకాలిక లీజులు మరియు నిలకడగా పెరుగుతూ పోయే వ్యవసాయ ఉత్పత్తుల ధరలు (కేపిటల్ I, కారల్ మార్క్స్, ప్రోగ్రెస్ పబ్లిషర్స్, మాస్కో 1983, పేజీ 743)- లేకుండా పోయాయి.

2 thoughts on “పెట్టుబడిదారీ పూర్వ ఉత్పత్తి విధానాలు – భారత దేశం

  1. ప్రభుత్వ ఆర్ధికఆలంబనకు దూరంగా, పాత విధానాలకు తీరంగా ప్రభుత్వ దృష్టిలో వ్యవసాయరంగం నిస్సారంగా ఉసూరుమంటోంది. పైగా ఈ మధ్య పులి మీద పుట్రలాగా వచ్చే అకాల తూఫాన్లు సామన్య రైతులపాలీట జీవన్మరణ సమశ్యగా మారి వారి ఉసురు తీస్తున్నాయి. నవీన విధానాలను విశదీకరించే ఓర్పు, ప్రకృతిపరంగా వచ్చే ఈ అకాల మార్పు ఉత్పాదక వినాశనానికి ఎనలేని చేయుతనిస్తోంది. చేయుతనిచ్చి ఆదుకోవలసిన ప్రభుత్వ విధానాలు ఉదాసిన వైఖరికి అద్దంపడుతున్నాయి.

  2. Our scientists should workout to reduce the intensity of the cyclones. so that we can not completely stop them but their intensity can be reduced for less damages. Govt are spending huge amount for explorations of outer earth forgetting the earthly needs.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s