ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్ధి ఒకరు అక్రమ పద్ధతుల్లో విరాళాలు సేకరించడానికి అంగీకరించారన్న ఆరోపణలు ముప్పిరిగొన్నాయి. ఒక మీడియా పోర్టల్ జరిపిన స్టింగ్ ఆపరేషన్ లో ఎఎపి అభ్యర్ధి షాజియా ఇల్మి అక్రమ విరాళాలు అంగీకరిస్తూ దొరికిపోయారని ఆరోపణలు రావడంతో బడా పార్టీలు ఎఎపిపై తమ దాడిని తీవ్రం చేశాయి. తమ అభ్యర్ధిపై స్టింగ్ ఆపరేషన్ కుట్రగా అరవింద్ కేజ్రివాల్ కొట్టిపారేస్తూ విచారణకు ఆదేశించారు. కాగా పోటీనుండి తప్పుకోవడానికి అభ్యర్ధి సిద్ధపడ్డారు.
మీడియా సర్కార్ అనే పోర్టల్ స్టింగ్ ఆపరేషన్ నిర్వహించినట్లు తెలుస్తోంది. భూమి కొనుగోళ్లకు సంబంధించిన ఒప్పందాలలో తమ డబ్బు ఇరుక్కుపోయిందని, తమ డబ్బు రికవరీ చేయడానికి సహాయం చేసినట్లయితే పార్టీకి విరాళాలు అందజేస్తామని మీడియా సర్కార్ మనుషులు ఎఎపి నాయకులను కలిశారు. అందుకు పలువురు ఎఎపి నాయకులు సిద్ధపడ్డారని, ఇది అక్రమ విరాళాలు సేకరించడానికి సిద్ధపడడమే అని సదరు పోర్టల్ ఆరోపించింది.
ఢిల్లీ రాష్ట్రంలోని ఆర్.కె.పురం అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్న షాజియా ఇల్మి, మరో పార్టీ నాయకులు కుమార్ విశ్వాస్ లు డబ్బు రికవరీ చేయడానికి, భూ ఒప్పందాలను సెటిల్ చేయడానికి అంగీకరించారని మీడియా సర్కార్ ఆరోపించింది. దానికి సంబంధించి వీడియోను కూడా విడుదల చేసింది. వీడియో విడుదలతో బి.జె.పి, కాంగ్రెస్ లకు పండగే అయింది. ఎఎపి పార్టీ కూడా తమకంటే భిన్నం ఏమీ కాదని చెప్పడానికి ఇది మహదావకాశంగా భావిస్తూ దాడి తీవ్రం చేశాయి.
అయితే భూమి లావాదేవీలు సక్రమమే అయితే, అందులో బాధితులకు సాయం చేయడానికి ఎఎపి పార్టీ నాయకులు సిద్ధపడితే అది తప్పెలా అవుతుంది? బాధితులకు సహాయం చేసిన తర్వాత సహాయం పొందినవారు పార్టీలకు విరాళం ఇవ్వడం అవినీతి కిందకు రాదు కదా! గూండాయిజం చేసి అక్రమ భూ లావాదేవీలలో కలుగ జేసుకుని బలవంతపు సెటిల్మెంట్లకు పూనుకుంటే అది అక్రమం. అలా సంపాదించిన సొమ్ము విరాళమే అయినా అక్రమ విరాళం అవుతుంది. మీడియా సర్కార్ వ్యవహారం ఈ రెండింటిలో దేనికిందకు వస్తుందన్న అంశాన్ని బట్టి ఎఎపి చేసింది తప్పో, ఒప్పో తేల్చాల్సి ఉంటుంది.
కానీ వీడియో పూర్తి భాగాన్ని ఇవ్వడానికి మీడియా సర్కార్ నిరాకరిస్తోందని ఎఎపి నాయకుడు అరవింద్ కేజ్రివాల్ చెపుతున్నారు. ఆరోపణల అనంతరం అత్యవసరంగా సమావేశం అయిన ఎఎపి ఒక విచారణ కమిటీ నియమించింది. రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులయిన యోగేంద్ర యాద్వ, సంజయ్ సింగ్ లు ఈ విచారణ కమిటీ సభ్యులు. బహిరంగపరచబడిన వీడియో భాగాన్ని పరిశీలించి 24 గంటల్లో నిర్ణయం ప్రకటించాలని ఈ కమిటీని నిర్దేశించారు.
“స్టింగ్ ఆపరేషన్ కు సంబంధించిన వీడియోను ఎడిటింగ్ చేయని పూర్తి భాగాన్ని ఇవ్వాలని గురువారం మీడియా సర్కార్ ను అడిగాము. తద్వారా వాస్తవం నిర్ధారించుకుని తగిన చర్యలు తీసుకోడానికి మాకు అవకాశం ఉంటుంది. కానీ వీడియో ఇవ్వడానికి వారు నిరాకరించారు. వీడియోను పూర్తిగా చూడకుండా మేము ఎలా నిర్ణయం తీసుకోగలం?” అని అరవింద్ కేజ్రివాల్ ప్రశ్నించారు.
షాజియా ఇల్మి పూర్వాశ్రమంలో టి.వి యాంకర్ గా పని చేసినట్లు తెలుస్తోంది. ఆమె ఆమ్ ఆద్మీ పార్టీలో చేరిన తర్వాత కాంగ్రెస్ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ కు సన్నిహితంగా మెలిగే ఆమె సోదరుడు కూడా ఆమెకు వ్యతిరేకంగా మారాడని, దానితో ఆమె కుటుంబ వ్యవహారాలను రచ్చకు ఈడ్చి ఆమెపై బురద జల్లడానికి అనేక ప్రయత్నాలు జరిగాయని పత్రికల ద్వారా తెలుస్తోంది. ప్రచారం సందర్భంగా అనేకసార్లు బెదిరింపులు ఎదుర్కొన్న షాజియా స్టింగ్ ఆపరేషన్ కు లక్ష్యంగా ఉండడంలో ఆశ్చర్యం లేదు.
నలువైపుల నుండి దాడులు ఎదురుకావడంతో పోర్టల్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎఎపి భావిస్తున్నట్లు తెలుస్తోంది. వీడియోలో ఉన్న ప్రతి ఒక్కరూ అసలు ఏమి జరిగింది చెప్పాలని పార్టీ కోరింది. రాజకీయాలను ప్రక్షాళన చేసే లక్ష్యంతో తాము ముందుకు వచ్చామని, అవినీతి వ్యతిరేక ఉద్యమం ఆధారంగా ఉనికిలోకి వచ్చిన తమ పార్టీ ప్రజా జీవితంలో ఉన్నత విలువలు నెలకొల్పే విషయంలో రాజీ పడేది లేదని ఎఎపి ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. తాము నిలబెట్టిన 70 మంది అభ్యర్ధుల్లో ఎవరిపై ఆరోపణలు రుజువైనా ఉపసంహరించుకోడానికి వెనకాడబోమని సదరు ప్రకటనలో తెలిపారు.
“ఈ ఆరోపణలను మేము తీవ్రంగా పరిగణిస్తున్నాము. గత వారం రోజులుగా మాపై పలు ఆరోపణలు చేస్తున్నారు. ఆరోపణలు వచ్చిన సమయం, వాటి స్వభావాన్ని బట్టి ఒక లక్ష్యంతో అవి చేస్తున్నట్లు అర్ధం అవుతోంది. రాజకీయాల్లో నైతిక ప్రమాణాలను పునర్నిర్వచించడానికి పూనుకున్న పార్టీని శక్తివంతమైన స్వార్ధ శక్తులు ఉమ్మడిగా లక్ష్యం చేసుకోవడం ఆశ్చర్యకరం ఏమీ కాదు” అని ఎఎపి ప్రకటన పేర్కొంది. అయితే ఉద్దేశ్యం ఏమయినప్పటికీ ఆరోపణల పైన విచారణ చేయకుండా ఉండం అని తెలిపింది.
నైతిక విలువల పట్ల బాధ్యత వహిస్తున్నట్లు చెప్పుకుంటున్నపుడు అలాంటి వ్యక్తులు, పార్టీలను సహజంగానే వేలాది కళ్ళు నిత్యం పహారా కాస్తుంటాయి. తప్పు చేసినట్లు కనపడితే సంతోషంతో ‘చూసారా వీళ్లూ మాలాంటివారే’ అని సంతోషించే కళ్ళూ అందులో ఉంటాయి. “అయ్యో, వీళ్లూ అలాంటి వారేనా” అని బాధపడే కళ్ళూ ఉంటాయి. వారందరికి “మేము అలాంటివాళ్లం కాదు” రుజువు చేయాల్సిన బాధ్యత తప్పనిసరిగా ఎఎపి లాంటి పార్టీలపై ఉంటుంది.
ఎఎపి కూడా అవినీతి పార్టీ అని తేలితే కాంగ్రెస్, బి.జె.పి, ఎస్.పి, బి.ఎస్.పి, టి.డి.పి, ఎల్.జె.పి, ఆర్.ఎల్.డి ఇత్యాది పార్టీలకు సంతోషం. స్వచ్చమైన, అవినీతి రహిత పార్టీ అని తేలితే ప్రజలకు సంతోషం. జనాన్ని తక్కువ అంచనా వేస్తూ ‘ఎవరు చూడొచ్చారులే’ అనుకుంటే ఎప్పుడో ఒకప్పుడు రంగు బైటపడడం మాత్రం ఖాయం.
అవినీతి ఒక్క విరాళాలలోనే ఉంటుందనుకుంటే పొరబాటు. డబ్బులోనే అవినీతి ఉండాల్సిన అవసరం లేదు. సామాజిక సంబంధాలు, నైతిక వర్తన, ప్రజా పాలన, ప్రజా సంబంధాలు వీటన్నింటిలోనూ అవినీతికి సంబంధించిన అనేక రూపాలు దాగి ఉంటాయి. ఈ రూపాలన్నింటినీ అధిగమిస్తేనే నికార్సయిన అవినీతి రహిత పార్టీ అవుతుంది. కానీ సర్వత్రా సామాజిక అంటురోగాలు వ్యాపించి ఉన్న వ్యవస్ధలో నుండి స్వచ్చమైన రాజకీయాలు ఉద్భవించడం సాధ్యమా? సామాజిక వ్యవస్ధను సమూలంగా మార్చుకోకుండా స్వచ్చమైన రాజకీయాలు స్ధాపించడం ఎఎపి కే కాదు. ఎవరికీ, ఎక్కడా సాధ్యం కాదు.
నేషన్ బాగుపడాలనే అరులు చాచే ఆమ్ ఆద్మి పార్టీ ఆదిలోనే హంసపాదనే రీతిలో ఇలా డొనేషన్ స్థాయిలో కక్కుర్తి మొదలైతే వీరు ఎన్నికలో గేలిచి ఉద్ధరించేదేముంది? నలుగురితో పాటు నారాయణా!
శివరామకృష్ణ గారు ..ఆప్పుడే ఒక నిర్ణయానికి వచ్చెయ్యకండి…కనీసం నిర్ఢారణ అయ్యె వరకు
తమకు అంటిన బురద ఇతరులకు కూడా అంటించాలని కాంగ్రెస్ తదితర రాజకీయ పార్టీలు ఎప్పుడూ ఆరాటపడుతుంటాయి. అలాగే కొంచెం నీతి, నిజాయతీలు ఎవరిలో కనిపించినా వారిని కూడా తమ జాబితాలో కలిపే దాకా…అవి నిద్రపోవు.
లంచాలకు అలవాటుపడి , కుంభకోణాలతో మునిగిపోయిన పార్టీలు తమకు వ్యతిరేకంగా…ఏ పార్టీ వచ్చినా దాని గొంతు పిసికేయాలని ప్రయత్నిస్తుంటాయి. బహుశా ఆమ్ ఆద్మీ పార్టీ విషయంలోనూ అటువంటి కుట్రకు అవకాశం లేదనలేము.
అలాగే సర్వత్రా అవినీతిమయమైన దేశంలో….ఒక పార్టీ కార్యకర్తలు మాత్రం పవిత్రంగా ఉంటారనుకోవడం, ఉండాలని ఆశించడం అత్యాశే అవుతుంది. వ్యవస్థలోని లేని నిజాయతీ కేవలం పార్టీలో మాత్రం ఎక్కన్నుంచి వస్తుంది…. కాబట్టి ఒక్క అవినీతి పరుడు దొరకగానే పార్టీ మొత్తాన్ని ఒక్క గాటన కట్టేయలేం కదా.
ఏదేమైనా ఆమ్ ఆద్మీ పార్టీ తీసుకునే తదుపరి చర్యలు, నిజాయతీ నిరూపించుకునే ప్రయత్నాన్ని బట్టే ఆ పార్టీ భవిష్యత్ ఉంటుంది.
100% correct… passing the buck…pacha kamerlodiki antha pacha ga kanipistundata…!!
ఆమ్ ఆద్మీ పార్తీ ఉన్నా కాంగ్రెస్‌కి లాభమే. కాంగ్రెస్‌వాదులు ఎలాగూ అటు వైపు వెళ్ళరు. కాంగ్రెస్‌ని వ్యతిరేకించేవాళ్ళలో కొంత మంది బిజెపిని వదిలి ఆమ్ ఆద్మీ పార్తీలోకి వెళ్తారు. అప్పుడు ఓడిపోయేది బిజెపియే కదా. మన రాష్ట్రంలో సామాజిక న్యాయం పేరుతో పెట్టిన ప్రజారాజ్యం వల్లే జరిగినది ఇదే కదా.
అవినీతిని వ్యతిరేకించేవాళ్ళలో ఎక్కువ మంది బిజెపి అభిమానులు. గ్లోబలైజేషన్‌పై తమ అభిప్రాయం ఏమిటో బిజెపివాళ్ళు స్పష్టంగా చెప్పలేదు కానీ NDA అధికారంలో ఉన్నప్పుడు గ్లోబలైజేషన్ విధానాలని పక్కాగా అమలు చెయ్యడం జరిగింది. అందుకే గ్లోబలైజేషన్‌వాదులకి బిజెపి అంటే అభిమానం. కాంగ్రెస్‌ని దెబ్బతియ్యాలంటే అవినీతి వ్యతిరేకతే అందుకు ఏకైక ఆయుధం. అందుకే బిజెపివాళ్ళు ముందు నుంచో, వెనుక నుంచో ఆమ్ ఆద్మీ పార్తీ లాంటి పార్తీలకి మద్దతు ఇస్తారు. దీని వల్ల బిజెపికి నష్టం కూడా ఉంది. కాంగ్రెస్‌వాళ్ళు ఎవరూ ఆమ్ ఆద్మీ పార్తీలో చేరరు. కొందరు బిజెపివాళ్ళు అందులో చేరడం జరుగుతుంది, దాని పరిణామంగా బిజెపికి పడాల్సిన వోట్లు చీలడం జరుగుతుంది. కోస్తా ఆంధ్రలో ప్రజారాజ్యం & లోక్ సత్తాలు తెలుగు దేశం వోట్లు ఎలా చీల్చాయో, ఉత్తర భారత దేశంలో ఆమ్ ఆద్మీ పార్తీ అదే పని చేస్తుంది. దీని వల్ల చివరికి కాంగ్రెసే గెలుస్తుంది కాబట్టి ఎన్నికలు దగ్గర పడినప్పుడు బిజెపివాళ్ళకి భయం పట్టుకుంతుంది. సామాజిక సంబంధాల గురించి మాట్లాడకుండా కేవలం అవినీతి వ్యతిరేకతే లక్ష్యంగా పెట్టుకున్న ఏ ఉద్యమాన్నైనా మొదట్లో బిజెపి, తెలుగు దేశం లాంటి పార్టీల అభిమానులు హైజాక్ చేస్తారు. ఈ ఉద్యమాల నుంచి కొత్త పార్టీలు పుట్టి బిజెపి, తెలుగు దేశం లాంటి ఉన్న పార్టీల అస్తిత్వాన్ని ప్రశ్నించే స్థాయికి ఎదుగుతాయి. ఎన్నికలలో అవి వోట్లని చీల్చి చివరికి కాంగ్రెస్‌కే లాభం కలిగిస్తాయి.