క్లుప్తంగా… 21.11.2013


Afghan Loya Jirgaఅమెరికా-ఆఫ్ఘన్ ఒప్పందం కుదిరింది

ఆఫ్ఘన్ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ ను దారికి తెచ్చుకోడంలో అమెరికా సఫలం అయింది. 2024 వరకు అమెరికా సైన్యాలు ఆఫ్ఘనిస్ధాన్ లో కొనసాగడానికి ఉద్దేశించిన ఈ ఒప్పందంపై ఒక అంగీకారం కుదిరిందని అమెరికా విదేశీ మంత్రి జాన్ కెర్రీ ప్రకటించాడు. గత 24 గంటల్లో జాన్ కెర్రీ రెండు సార్లు ఆఫ్ఘన్ అధ్యక్షుడు కర్జాయ్ కు ఫోన్ చేశారని, కర్జాయ్ అనుమానాలను కెర్రీ నివృత్తి చేసిన ఫలితంగా ఒప్పందం సాధ్యమయిందని తెలుస్తోంది.

అమెరికా రూపొందించిన ఒప్పందంలో రెండు అంశాలకు కర్జాయ్ అభ్యంతరం తెలిపాడు. అవి: ఆఫ్ఘన్ పౌరుల ఇళ్లలోకి చొరబడి దాడులు చేసే హక్కు అమెరికా సైనికులకు ఇవ్వడం, ఆఫ్ఘన్ చట్టాల నుండి అమెరికా బలగాలకు మినహాయింపు ఇవ్వడం. వీటిని అంగీకరించేది లేదని కర్జాయ్ రెండు రోజుల క్రితం ప్రకటించాడు. అసాధారణ పరిస్ధితుల్లో మాత్రమే పౌరుల ఇళ్లపై దాడులు చేస్తామని ఆల్-ఖైదా ఉగ్రవాదులను మట్టు పెట్టాలంటే ఇది అవసరమని కెర్రీ నచ్చజెప్పినట్లు తెలుస్తోంది. అసాధారణ పరిస్ధితుల పేరుతో అమెరికా బలగాలు దుర్వినియోగం చేస్తాయని కర్జాయ్ ప్రతినిధులు అనుమానం వెలిబుచ్చారు. ఎట్టి పరిస్ధితుల్లోనూ దుర్వినియోగానికి పాల్పడబోమని కెర్రీ హామీ ఇవ్వడంతో కర్జాయ్ సంతృప్తి పడ్డారని ఆయన ప్రతినిధులను ఉటంకిస్తూ ఆర్.టి తెలిపింది.

అమెరికా హామీ ఇవ్వడం, దానిని కర్జాయ్ నమ్మడం!? అమెరికా హామీల్లోని బూటకత్వం ఏమిటో కర్జాయ్ స్వయంగా అనేకసార్లు వివరించాడు. ఐనా వారి హామీలను నమ్ముతున్నట్లు చెప్పడం మరో బూటకం. అసలు విషయం బేరసారాలు కుదరకపోవడమే. ఆఫ్ఘన్ ప్రజలను అడ్డం పెట్టుకుని సాధ్యమైనంత ఎక్కువ ఆర్ధిక లబ్ది పొందడం ఆఫ్ఘన్ దళారీ పాలకులకు మామూలు విషయమే. ఆఫ్ఘన్ ప్రజలను మరో పదేళ్ళ పాటు అమెరికా విష కౌగిలికి అప్పగిస్తున్న కర్జాయ్ ఎలాగూ భవిష్యత్తులో సేద తీరేది అమెరికాలోనే.

ఒప్పందాన్ని లోయ జిర్గా, ఆఫ్ఘన్ పార్లమెంటులు ఆమోదించాల్సి ఉంటుంది.

Drone-Attackపాక్ లో మళ్ళీ అమెరికా డ్రోన్ దాడి

ఐక్యరాజ్య సమితి నుండి మానవ హక్కుల సంస్ధల వరకూ తిట్టిపోస్తున్నా పట్టించుకునే పరిస్ధితిలో అమెరికా లేదు. గురువారం తెల్లవారు ఝామున అమెరికా డ్రోన్ పాకిస్ధాన్ లోని ఒక మదరసా పైన దాడి చేసి ఎనిమిది మందిని బలిగొన్నది.  చనిపోయినవారిలో ఆరుగురు విద్యార్ధులని జిన్హువా (చైనా) వార్తా సంస్ధ తెలిపింది. వాయవ్య పాకిస్ధాన్ లోని ఖైబర్ పఖ్తూన్వా రాష్ట్రంలో హంగు జిల్లాలో ఈ దాడి జరిగింది. అమెరికా డ్రోన్ దాడుల వల్ల తాలిబాన్ తో చర్చలు ఆగిపోయాయని పాక్ ప్రభుత్వం ఒక పక్క నిరసిస్తుండగానే తాజా దాడి జరగడం గమనార్హం. దానితో పాక్ ప్రభుత్వ నిరసనలు నామమాత్రమే అని స్పష్టం అవుతున్నాయి.

జిన్హువా ప్రకారం డ్రోన్ దాడిలో 6 గురు చనిపోయారు. అయితే 8 మంది మరణించారని ది హిందు తెలిపింది. ‘మదరసా దార్-ఉల్-ఉలూమ్’ అనే పాఠశాలపై డ్రోన్ నాలుగు క్షిపణులు ప్రయోగించిందని, ఇందులో నలుగురు విద్యార్ధులు, ఇద్దరు స్కాలర్లు చనిపోయారని జిన్హువా తెలిపింది. ఇద్దరు స్కాలర్లకు పాకిస్తాన్ తాలిబాన్ కు చెందిన హక్కాని నెట్ వర్క్ తో సంబంధాలు ఉన్నాయని తెలిపింది. తాలిబాన్ తో సంబంధాలు ఉంటే చట్ట విరుద్ధంగా చంపేయొచ్చా అన్నది ప్రశ్న! ఇక తాలిబాన్ తో చర్చలు అంటూ నాటకాలు ఎందుకు? అమెరికా, పాక్ లు రెండూ ఒక పక్క తాలిబాన్ తో చర్చలు అని చెబుతూ మరోపక్క అదే తాలిబాన్ పై దాడులు చేస్తున్నాయి.

అమెరికా డ్రోన్ దాడి వల్ల తాలిబాన్ తో సంబంధాలు తెగిపోయాయనీ, దానివల్ల చర్చలకు ఆటంకం ఏర్పడిందని పాక్ ప్రభుత్వం ఇటీవలే తీవ్ర స్ధాయిలో విమర్శించింది. నవంబరు 1 తేదీన జరిగిన డ్రోన్ దాడిలో హక్కానీ గ్రూపు నాయకుడు సిరాజుద్దీన్ హకాని చనిపోయాడు. ఈ దాడి పట్ల పాక్ పార్లమెంటు కూడా తీవ్రంగా నిరసిస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిరసనల వేడి కొనసాగుతుండగానే మరో దాడి జరిగింది. హకాని గ్రూపుకు చెందిన సీనియర్ నాయకుడు ఇటీవలే ఈ మదరసాను సందర్శించారని తెలుస్తోంది. హకాని గ్రూపు ఫైటర్లకు ఈ మదరసా స్కాలర్లు మతపరమైన శిక్షణ ఇస్తున్నారని స్ధానిక పోలీసు అధికారి చెప్పాడు.

డ్రోన్ దాడిని తెహెరిక్-ఏ-ఇన్సాఫ్ పార్టీ నేత ఇమ్రాజ్ ఖాన్ ఖండించాడు. ఈ దాడి పాక్ ప్రజలపై యుద్ధం ప్రకటించడమే అని అభివర్ణించాడు.

తెహెల్కా తరుణ్ తేజ్ పాల్ కూడానా…?!

సంచలన పత్రిక తెహెల్కా వ్యవస్ధాపక ఎడిటర్ తరుణ్ తేజ్ పాల్ ఆరు నెలల పాటు తన పదవీ బాధ్యతల నుండి తప్పుకుంటున్నట్లు తన పత్రికా సిబ్బందికి లేఖ రాశాడు. మహిళా జర్నలిస్టు పట్ల అసభ్యంగా ప్రవర్తించినందుకు తనకు తాను ఈ శిక్ష వేసుకుంటున్నట్లు ఆయన పత్రిక మేనేజింగ్ ఎడిటర్ సోమ చౌదరి కి పంపిన ఈ మెయిల్ లో పేర్కొన్నాడు. సదరు ఈ మెయిల్ ను సోమా చౌదరి తమ సిబ్బందికి ఫార్వర్డ్ చేశారని పత్రికలు తెలిపాయి. ఈ మెయిల్ పూర్తి పాఠం కూడా కొన్ని పత్రికలు ఆన్ లైన్ లో ప్రచురించాయి.

Tarun Tejpalతరుణ్ తేజ్ పాల్ ఏమి చేసిందీ వివరాలు తెలియలేదు. తెహెల్కా పత్రిక కూడా చెప్పలేదు. అది తమ అంతర్గత వ్యవహారమని సోమా చౌదరి వ్యాఖ్యానించారని ఒక పత్రిక తెలిపింది. వివరాలు కోరుతూ మెయిల్ పంపినప్పటికి సోమా చౌదరి బదులు ఇవ్వలేదని మిడ్-డే తెలిపింది. తన ప్రవర్తన పట్ల ఇప్పటికే మహిళా జర్నలిస్టుకు బేషరతుగా క్షమాపణలు చెప్పాననీ, అయినప్పటికీ తన తప్పుకు అది సరిపోదని భావిస్తూ 6 నెలల పాటు పత్రికకు దూరంగా ఉండడానికి నిర్ణయించుకున్నానని తరుణ్ తేజ్ పాల్ తన లేఖలో పేర్కొన్నారు. అణచివేతకు గురవుతున్న వారి తరపున అనేకసార్లు పోరాడిన తెహెల్కా ప్రతిష్ట నిలపడానికి తాను ఈ నిర్ణయం తీసుకున్నానని తరుణ్ తెల్పారు.

నవంబర్ 7 తేదీ నుండి కొన్ని రోజుల పాటు తెహెల్కా పత్రిక ‘ధింక్ ఫెస్టివల్’ నిర్వహించింది. గోవాలోని ఒక హోటల్ లో జరిగిన ఈ ఫెస్టివల్ సందర్భంగా తేజ్ పాల్ తమ పత్రికకు చెందిన ఒక మహిళా జార్లనిస్టు పట్ల అసభ్యంగా ప్రవర్తించారని ఔట్ లుక్ పత్రిక ద్వారా తెలుస్తోంది. వరుసగా రెండు రోజుల పాటు తరుణ్ అసభ్యంగా ప్రవర్తించాడని, సదరు జర్నలిస్టు తమ మేనేజింగ్ ఎడిటర్ సోమా చౌదరికి చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారని ఔట్ లుక్ తెలిపింది. గోవా ప్రభుత్వం ఈ వ్యవహారంపై విచారణ జరపడానికి ఉపక్రమించినట్లు కూడా పత్రిక తెలిపింది. తమ పార్టీని అనేకమార్లు ఇబ్బంది పెట్టిన తెహెల్కా ఎడిటర్-ఇన్-చీఫ్ ను ఇబ్బంది పెట్టే అవకాశం బి.జె.పి ఎందుకు వదులుకుంటుంది?

ఇండియన్ ఎక్స్ ప్రెస్, ఔట్ లుక్ పత్రికల్లో పని చేసిన తరుణ్ తేజ్ పాల్ 13 సం. క్రితం తెహెల్కా పోర్టల్ స్ధాపించారు. ఎన్నో సంచలనాత్మక స్టింగ్ ఆపరేషన్లు నిర్వహించడం ద్వారా తెహెల్కా పేరు ప్రతిష్టలు సంపాదించింది. గుజరాత్ మారణకాండ విషయంలోనూ స్టింగ్ ఆపరేషన్లు నిర్వహించింది. ఎం.ఎల్.ఏ మాయా కొడ్నాని, భజరంగ దళ్ నేత బాబూ భజరంగి లకు యావజ్జీవ శిక్ష పాడడానికి తెహెల్కా నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్ దోహదపడింది. ఇటువంటి ప్రతిష్టాత్మక పత్రికను నిర్వహిస్తున్న తరుణ్ తేజ్ పాల్ కూడా మహిళ జర్నలిస్టు పట్ల అసభ్యంగా ప్రవర్తించడం ఆందోళనకరమైన సంగతే. స్వయంగా బాధ్యతల నుండి తప్పుకోవడం ద్వారా ఒక మైలు రాయి లాంటిది ఏర్పరిచ్చినప్పటికీ అసలలాంటి ప్రవర్తనకు పూనుకోవడమే ఆందోళనకారకం.

One thought on “క్లుప్తంగా… 21.11.2013

  1. అగ్ర రాజకీయంలో అమెరికాది అందెఏసిన చెయ్యి. చేతులు ముడుచుకున్నవారిని సైతం అవసరమనుకుంటే చావగొట్టి చెవులు మూస్తుంది. ఆఫ్గన్ అద్యక్షుడు కర్ణాయ్ కర్ణభేరిని బద్దలుకొట్టి మొత్తానికి చెవిటివాడిని చేశారు. ఉగ్రవాదులను మట్టుపెట్టాదంలో సామన్య ప్రజలను ఏరి వేరుచేసి రక్షించే ప్రక్రియ వంకతో ఉగ్రవాదుల ఉపేక్షచేసే అవకాశం అమెరికా జారవిడుచుకుంటుందా? దళారి రాజకీయాలకు ప్రజా జీవితాలు ఎడారి కాకమానవు. రాజద్రోహుల వలసకు అమెరికా ఎప్పుడు విశ్రాంత కేంద్రమే.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s