లెబనాన్: ఆత్మాహుతి దాడిలో ఇరాన్ రాయబారి దుర్మణం


లెబనాన్ రాజధాని బీరుట్ ను బాంబు పేలుళ్లు కుదిపేశాయి. నిత్యం రగులుతున్న పొయ్యి పైన ఉడుకుతున్నట్లు ఉండే మధ్య ప్రాచ్యంలో, అందునా బీరుట్ లో బాంబు పేలుళ్లు కొత్తకాకపోయినా ఒక దేశ రాయబారి మరణించడం మాత్రం తీవ్ర పరిణామమే. 23 మంది మరణానికి, మరో 146 మంది గాయపడడానికి దారి తీసిన పేలుళ్లకు ఆత్మాహుతి దాడి కారణమని రష్యా టుడే తెలిపింది. పేలుళ్లకు తామే బాధ్యులమని ఒక ఆల్-ఖైదా అనుబంధ సంస్ధ ప్రకటించింది. అయితే ఇరాన్, సిరియాలు మాత్రం ఇజ్రాయెల్, సౌదీ అరేబియాలే పేలుళ్లకు కారణమని ప్రకటించాయి.

బాంబు పేలుళ్లలో ఇరాన్ రాయబార భవన సముదాయంలో 6 భవనాలు బాగా దెబ్బతిన్నాయని రష్యా టుడే తెలిపింది. లెబనాన్ లోని ఆల్-మనార్ వార్తా చానెల్ ప్రకారం 100 కిలోల టి.ఎన్.టి ని ఉపయోగించి పేలుళ్లు జరిపారు. అది పెద్ద పేలుళ్లు రెండు జరిగాయని, ఒకటి ఆత్మాహుతి దాడి ద్వారా మరొకటి మోటార్ సైకిల్ పై వచ్చిన వ్యక్తి ద్వారా జరిగాయని తెలుస్తోంది. కారులో పేలుడు పదార్ధాలు తెచ్చిన వ్యక్తి ఇరాన్ రాయబార కార్యాలయం ఆవరణను ఢీకొట్టి తనను తాను పేల్చుకున్నాడని ఆల్-మనార్ తెలిపింది. ఒకటి-రెండు నిమిషాల తేడాలో రెండు పేలుళ్లు సంభవించాయని తెలిపింది.

పేలుళ్లు జరిగిన ప్రాంతం షియా సంస్ధ హిజ్బోల్లాకు బలీయమైన ప్రాంతం. అంతే కాకుండా ఇరాన్ రాయబారులు, వారి కుటుంబాలు నివసించే ప్రాంతం కూడా. ఇరాన్-హోజ్బోల్లాలే లక్ష్యంగా దాడి జరిగిందని ఈ రెండు వాస్తవాల ద్వారా స్పష్టం అవుతోంది. సున్నీ మద్దతుదారు ఆల్-ఖైదా అనుబంధ సంస్ధ పేలుళ్లకు బాధ్యులుగా ప్రకటించడంతో ఒక కోణంలో వలయం పూర్తయినట్లే.

పేలుళ్లలో ఇరానియన్ సాంస్కృతిక రాయబారి ఇబ్రహిం ఆల్-అన్సారి ఈ పేలుళ్లలో దుర్మరణం చెందాడు. లెబనాన్ ముస్లింలలో షియా మతస్ధులు ఎక్కువ. ఇరాన్ కూడా షియా రాజ్యమే. ఈ నేపధ్యంలో ఇరాన్, హిజ్బోల్లాల మధ్య స్నేహ సంబంధాలు ఉన్నాయి. పరస్పరం మిలట్రీ పరంగానూ సహకరించుకుంటాయి.

ఈ పేలుళ్లను, సిరియా, ఇరాన్ ల ఆరోపణలను కనీసంగా అర్ధం చేసుకోడానికి లెబనాన్-ఇరాన్-ఇజ్రాయెల్ రాజకీయాలను క్లుప్తంగా పరిశీలించాలి.

లెబనాన్ లో ప్రభుత్వం ప్రధానంగా మూడు మతాల మధ్య పంపకం చేయబడి ఉంటుంది. అధ్యక్ష పదవి క్రైస్తవులకు, పార్లమెంటు పదవి షియా ముస్లింలకు, ప్రధాన మంత్రి పదవి సున్నీ ముస్లింలకు కేటాయించబడి ఉంటుంది. పార్లమెంటు సీట్లు కూడా క్రైస్తవులు, ముస్లింలకు చెరిసగం కేటాయించబడి ఉంటాయి. అధికారాలు ఎక్కువగా అధ్యక్షుడు చేతుల్లో ఉన్నప్పటికీ పార్లమెంటు అధికారాలూ తక్కువ కాదు. అనగా లెబనాన్ లో రాజ్యమే మూడు మతాల మధ్య నిలువుగా చీలి ఉంటుంది. ఈ నేపధ్యంలో లెబనాన్ నిత్యం మతపరమైన సెక్టేరియన్ తగాదాలకు కేంద్రంగా ఉంటోంది. దానికితోడు ఇజ్రాయెల్ ద్వారా పశ్చిమ దేశాల జోక్యం వలన ఉద్రిక్తతలు నిత్యాగ్నిహోత్రంలా మండుతూ ఉంటాయి.

లెబనాన్ లో షియా ముస్లింల తరపున హిజ్బోల్లా సంస్ధ అత్యంత చురుకైన, ప్రభావశీలమైన పాత్ర పోషిస్తుంది. మధ్యప్రాచ్యంలో ఇజ్రాయెల్ జాత్యహంకార దాడులకు ఎదురొడ్డి నిలిచిన ఏకైక శక్తి హిజ్బోల్లా. 2006లో మధ్యప్రాచ్యంలో తమ పట్టును స్ధిరీకరించుకోడానికి, సిరియా-ఇరాన్ ల ప్రాబల్యాన్ని క్షీణింపజేయడానికి అమెరికా మద్దతుతో ఇజ్రాయెల్, లెబనాన్ పై దాడి చేసింది. ఈ దాడిని వీరోచితంగా తిప్పికొట్టడం ద్వారా ఇజ్రాయెల్ కు అవమానకరమైన ఓటమిని రుచి చూపింది హిజ్బోల్లాయే. అప్పటి ఓటమి నుండి ప్రతీకారం కోసం ఇజ్రాయెల్ ఎదురు చూస్తూనే ఉన్నదని విశ్లేషకుల అభిప్రాయం. (ఆ అవమానాగ్నిని చల్లబరచుకోడానికే 2008 డిసెంబర్-2009 జనవరి లో గాజాపై ఇజ్రాయెల్ దాడి చేసిందని పలువురి అభిప్రాయం. గాజా ప్రజలు ఎన్నుకున్న హమాస్ ప్రభుత్వం కూడా షియాకు చెందినదే.)

ఇరాన్ షియా రాజ్యం. హిజ్బోల్లా యే కాకుండా సిరియా పాలకుడు బాషర్ ఆల్-అస్సాద్ కూడా షియా ముస్లిం మతంలో ఒక ఉప తెగకు చెందిన వ్యక్తి. కానీ బషర్ ప్రభుత్వం ఎన్నడూ మత వివక్ష చూపలేదు. మధ్యప్రాచ్యంలో ప్రస్తుతం ఏకైక సెక్యులర్ రాజ్యం సిరియాయే. గతంలో లిబియా కూడా ఉండేది. కానీ ఆల్-ఖైదా-అమెరికా-ఐరోపా-ఇజ్రాయెల్ ల అపవిత్ర కూటమి పుణ్యమాని మధ్య ప్రాచ్యంలోని ముస్లిం మత ఛాందస పాలనకు ప్రత్యామ్న్యాయంగా నిలిచిన గడాఫీ ప్రభుత్వం కూలిపోయింది. సిరియా మాత్రమే మిగిలింది. సిరియా ప్రభుత్వాన్ని కూడా కూల్చడానికి అదే అపవిత్ర కూటమి శాయశక్తులా ప్రయత్నిస్తూ విఫలం అవుతోంది.

బీరుట్ పేలుళ్లకు తామే కారణమని సున్నీ టెర్రరిస్టు సంస్ధ, ఆల్-ఖైదా అనుబంధ సంస్ధ కూడా అయిన అబ్దల్లా ఆజమ్ బ్రిగేడ్స్ (ఎఎబి) ప్రకటించడాన్ని ఈ నేపధ్యంలో అర్ధం చేసుకోవాలి. సిరియాలో ఉన్న ఇరాన్ బలగాలు వెనక్కి వెళ్లిపోయేవరకు తాము ఇరాన్ వసతులపై దాడులు సాగిస్తామని ఈ సంస్ధ వివిధ సందర్భాల్లో ప్రకటించడం గమనార్హం. సిరియాలో తమ సలహాదారులు ఉన్నారు తప్ప బలగాలు లేవని ఇరాన్ ఆయా సందర్భాల్లో చెప్పింది కూడా. ఇజ్రాయెల్-సౌదీ అరేబియాలు పోషిస్తున్న కిరాయి సైనికులే పేలుళ్లకు కారణమని సిరియా, ఇరాన్ లు ఆరోపించాయి. ఈ రెండు ప్రకటనలు (ఎబిబి ప్రకటన, సిరియా-ఇరాన్ ల ప్రకటన) వేరు వేరు సంస్ధలను వేలెత్తి చూపిస్తున్నట్లు కనిపిస్తున్నప్పటికీ ఇరువురూ ఒకటే. ఎఎబి ని పోషించేది సౌదీ అరేబియా. వారికి సలహాలు ఇచ్చేదీ, దాడులకు పురమాయించేది ఇజ్రాయెల్. కాకపోతే ఇజ్రాయెల్ పాత్రకు ఎప్పుడూ రుజువులు ఉండవు. ఇజ్రాయెల్-ఇరాన్ ల మధ్య మధ్యప్రాచ్యంలో జరుగుతున్న ఆధిపత్య పోరులో అక్కడి ప్రజలు నిత్యం బలవుతుంటారు.

ఇరాన్-సిరియా-హిజ్బోల్లా లను ప్రతిఘటన అక్షం (Axis of resistance) అని పరిశీలకులు పిలుస్తారు. ఇజ్రాయెల్ ప్రాంతీయ దురహంకార ఆధిపత్యాన్ని, విస్తరణవాద ఆక్రమణలను ప్రతిఘటిస్తున్న రాజ్యాలు కనుక వాటిని అలా పిలుస్తారు. మధ్య ప్రాచ్యంలో తమ బౌగోళిక-రాజకీయ ప్రయోజనాల కోసం ఇజ్రాయెల్ కు అమెరికా, ఐరోపాలు పూర్తిగా మద్దతు ఇస్తాయి. ఇంతటితో అసలు వలయం (సర్కిల్) పూర్తయింది.

ఏమిటా వలయం? మధ్య ప్రాచ్యంలో అమెరికాకు సామ్రాజ్యవాద ప్రయోజనాలు ఉన్నాయి. అనగా అమెరికాకి చెందిన బహుళజాతి చమురు కంపెనీలు, ఆయుధ కంపెనీలకు ఇక్కడ ప్రయోజనాలు ఉన్నాయి. ఇక్కడ చమురు తీసే కాంట్రాక్టులు వారికే దక్కాలి. అలాగే నిత్యం తగాదాలతో రగులుతూ ఉంటే ఆయుధాలు అమ్ముకోవాలి. అంటే మధ్య ప్రాచ్యంలో అశాంతి అమెరికా కంపెనీలకు లాభాలు సమకూర్చుతాయి. ఈ లాభాల్లో ఐరోపా రాజ్యాలకు కూడా వాటా ఉంటుంది.

అమెరికా, ఐరోపాల ఆధిపత్యాన్ని ఇరాన్ తిరస్కరిస్తుంది. ఇరాన్ పాలకులు జాతీయ శక్తులు. ఇతర మూడో ప్రపంచ దేశాల పాలకులకు మల్లే పశ్చిమ దేశాలకు లొంగి ఉండడం ఇష్టపడరు. వారు అలా ఉండడం అమెరికా, ఐరోపాలకు సహజంగానే కంటగింపు. వారి తరపున మధ్యప్రాచ్యంలో వారి ప్రయోజనాలను కాపాడేది ఇజ్రాయెల్. అమెరికా ఆధిపత్యం మధ్యప్రాచ్యంలో విస్తరిస్తే, ఇరాన్, సిరియా, హిజ్బొల్లాల ప్రతిఘటన కూలిపోతే ఇక తదుపరి లక్ష్యం చైనా, రష్యాలే. కాబట్టి ప్రతిఘటన అక్షాన్ని కాపాడుకోవడం చైనా, రష్యాల అవసరం.

కనుక రెండు లేదా అంతకన్నా ఎక్కువ సామ్రాజ్యవాద గ్రూపులు మధ్యప్రాచ్యంలో తమ తమ ఆర్ధిక, వాణిజ్య ప్రయోజనాల కోసం ఒకరిపై మరొకరు పై చేయి సాధించడానికి చేస్తున్న ప్రయత్నాలే అక్కడ నిత్యం అలజడి చెలరేగడానికి ప్రధాన కారణం. వీరికి స్ధానిక శక్తుల కారణాలు, ప్రయోజనాలు ఎలాగూ జత కలుస్తాయి. కానీ ప్రధాన సామ్రాజ్యవాద శక్తుల పాత్ర లేకపోతే స్ధానిక తగాదాలు త్వరలోనే ఒక పరిష్కారాన్ని వెతుక్కుంటాయి. అలా పరిష్కారం వెతుక్కుంటే సామ్రాజ్యవాదుల ప్రయోజనాలు నెరవేరక పోగా తమకు కొత్త పోటీదారులు ఉద్భవిస్తారు.

ఇక్కడ రెండు లేదా అంతకన్నా ఎక్కువ సామ్రాజ్యవాద శక్తులు అనడం ఎందుకంటే అమెరికా, ఐరోపాలు ఒక వైపే ఉన్నా మళ్ళీ వారి వారి ప్రయోజనాల కోసం తమలో తాము ఘర్షణ పడతాయి. ఉమ్మడిగా కృషి చేస్తూనే వేరు వేరు గ్రూపులను స్ధానికంగా పోషిస్తుంటాయి. అలాగే చైనా, రష్యాలు ఒకవైపే కనపడినా వారి ప్రయోజనాలు కూడా ఘర్షించవచ్చు. ప్రస్తుతం ఈ ఉప ఘర్షణలు ప్రబలంగా పైకి వ్యక్తం అయ్యే స్ధాయిలో లేవు. సరిగ్గా గమనిస్తే అప్పుడప్పుడూ ఆ ఛాయలు కనపడుతుంటాయి.

5 thoughts on “లెబనాన్: ఆత్మాహుతి దాడిలో ఇరాన్ రాయబారి దుర్మణం

  1. పేరుకు ఒకటే మతం అయినా ఇద్దరికీ బద్ధ వైరం. మత వైరుధ్యాలు జనాన్ని కూడగట్టడానికే. అసలు వైరుధ్యం ఆర్ధిక ఆధిపత్యానికి సంబంధించినది. ప్రతి మతంలోనూ అనేక శాఖలు, ఉప శాఖలు ఉండడానికి కూడా అదే కారణం. లెబనాన్ లోనూ అంతే. ఆర్ధిక వైరుధ్యాలను మతం ద్వారా పరిష్కరించుకున్నారు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s