‘గుడ్డొచ్చి కోడిని వెక్కిరించినట్టు’ అంటాం కదా! కార్టూనిస్టు ఇక్కడ కోడి పిల్లే వచ్చి కోడి తల్లిని వెక్కిరిస్తోందని సూచిస్తున్నారు. అన్నా హజారే కష్టపడి ‘అవినీతి వ్యతిరేక ఉద్యమం’ అనే గుడ్డును పొదిగిన తర్వాత అందులోంచి ‘ఆమ్ ఆద్మీ పార్టీ’ కోడి పిల్లగా బైటికి వచ్చిందని, ఆ కోడి పిల్ల ఇప్పుడు అన్నా హజారేను వెక్కిరిస్తోందని కార్టూన్ సూచిస్తోంది.
అరవింద్ కేజ్రీవాల్, అన్నా హజారేల మధ్య రెండు రోజులుగా ఒక కొత్త వివాదం నడుస్తోంది. అన్నా హజారే, మరో కార్యకర్తల మధ్య జరిగిన ఒక సంభాషణను ఎవరో రికార్డు చేసి వీడియో విడుదల చేయడంతో ఈ వివాదం తలెత్తినట్లు తెలుస్తోంది. వీడియోకు తోడు అన్నా హజారే తాజాగా చేసిన వ్యాఖ్యలు ఈ వివాదానికి ఆజ్యం పోశాయి.
‘ఇండియా ఎగెనెస్ట్ కరప్షన్’ ఉద్యమం సాగుతున్న సందర్భంగా బిలియన్ల కొద్దీ రూపాయలు (అనగా వందల కోట్ల రూపాయలని అర్ధం) చందాలుగా వసూలు చేశారని, అందులో 5 రూపాయలు కూడా (సాధారణంగా ‘రూపాయి కూడా’ అంటారు కదా?!) తాను ముట్టుకోలేదని అన్నా చెబుతున్న దృశ్యం వీడియోలో ఉన్నదట! (ఈ వీడియో ఉన్న దృశ్యం ఎప్పటిదోనని అన్నా చెబుతున్నారు.)
ఇది కాకుండా ఉద్యమం జరుగుతుండగా తన పేరుతో అనేక సిమ్ కార్డులు తీశారని, వాటిని ఉపయోగించి ఇప్పుడు చందాలు వసూలు చేస్తున్నారని అన్నా తాజాగా ఆందోళన వ్యక్తం చేశారు. ఇలా తన పేరుతో తనకు తెలియకుండా నిధులు వసూలు చేస్తే ఆ చెడ్డ పేరంతా తాను భరించాల్సి వస్తుందన్నదే తన ఆందోళ అని ఆయన తెలిపారు.
దీనికి అరవింద్ కేజ్రీవాల్ వెంటనే స్పందించారు. ఉద్యమంలో వసూలయిన నిధుల విషయంలో వెంటనే విచారణ చేయించాలని, ఈ విచారణ రెండు మూడు రోజుల్లో పూర్తి చేస్తే, ఆ విచారణలో తాను దోషిగా తేలితే ఎన్నికల్లో పోటీ నుండి ఉపసంహరించుకుంటానని అరవింద్ ప్రకటించారు. ఒకవేళ తన నిర్దోషిత్వం రుజువైతే అన్నా తమ పార్టీ తరపున ప్రచారం చేపట్టాలని కూడా ఆయన షరతు పెట్టారు. ఆ రకంగా అయినా అన్నా ప్రచారం పొందవచ్చని అరవింద్ ఆశ కాబోలు!
అయితే అన్నా హజారే తన పేరు గురించి పదే పదే ఆందోళన చెందడమే మహా ఎబ్బెట్టుగా ఉంటోంది. అవినీతి వ్యతిరేక ఉద్యమం అనేది నిజంగా ఉద్యమం అయితే అది ప్రజల ఉద్యమమే తప్ప ఏ ఒక్కరికో చెందినది కాదు. మనకు బొచ్చెడు అవినీతి నాయకులు, పార్టీలు ఉన్నారు. ప్రజల్లో వారి అవినీతికి బోలెడు వ్యతిరేకత కూడా ఉంది. ఈ వ్యతిరేకతను ఒక ఉద్యమంగా మార్చి రాజకీయ ఫలితంగా కూడా మార్చుకుని అవినీతి లేని ప్రభుత్వాన్ని నడుపుతానంటే ఎవరైనా ఎలా కాదనగలరు?
అరవింద్ కేజ్రీవాల్ కూడా అవినీతి వ్యతిరేక ఉద్యమ సారధుల్లో ఒకరు. అన్నాకు దాదాపు కుడి భుజంగా ఆయన వ్యవహరించారు. లోక్ పాల్ బిల్లు కోసం వారు చేపట్టిన ఉద్యమం ఫలవంతం కాలేదు. రాజకీయ నాయకులు తమ అధికారం ద్వారా ఉద్యమాన్ని పక్కదారి పట్టించడంలో సఫలం అయ్యారు కాబట్టి తాను రాజకీయ అధికారంతోనే అవినీతితో తలపడతానని అరవింద్ ప్రకటించారు. రాజకీయాల ప్రక్షాళన కోసం ఏర్పాటు చేసిన పార్టీ కనుక మురికిని ప్రక్షాళనం కావించే చీపురును తమ గుర్తుగా ఎంచుకున్నారు.
ఇంతవరకు తప్పు పట్టడానికేమీ లేదు. కానీ ఎఎపి పార్టీని పోషిస్తున్నది కూడా కొన్ని పారిశ్రామిక సంస్ధలు, కార్పొరేట్ కంపెనీలే అని ఆరోపణలు ఉన్నాయి. అసలు అవినీతి వ్యతిరేక ఉద్యమమే కార్పొరేట్ల కనుసన్నల్లో జరిగిందని కూడా ఆరోపణలు ఉన్నాయి. అప్పట్లో నీరా రాడియా టేపుల ద్వారా 2జి కుంభకోణంలో ఈ దేశంలోని ప్రధాన కార్పొరేట్ అధిపతులయిన టాటా, రిలయన్స్ ల పాత్ర బైటికి వస్తున్న ప్రమాదం ముంచుకొచ్చింది. ఈ పరిస్ధితి నుండి ప్రజల దృష్టినీ, కొన్ని మీడియా సంస్ధల దృష్టిని మరల్చడానికే అన్నా, అరవింద్ తదితర అనేక ఎన్.జి.ఓ సంస్ధల నాయకుల చేత అవినీతి వ్యతిరేక ఉద్యమానికి అంకురార్పణ చేయించారని బలమైన ఆరోపణలే ఉన్నాయి.
కాబట్టి అవినీతి వ్యతిరేక ఉద్యమంలో మైనస్ ఏమన్నా ఉంటే అది అరవింద్ కీ, ప్లస్ ఏమన్నా ఉంటే అది అన్నా హజారేకు అంటగట్టడం ఎంతవరకు సమంజసం? మంచయినా, చెడయినా ఇద్దరూ బాధ్యత వహించాల్సి ఉంటుంది గానీ రెండింటిని వేరు చేసి ఒక్కొక్కరికి అంటగట్టడం అన్యాయం.
అన్నా, అరవింద్, ఇంకా అనేక మంది ఎన్.జి.ఓ నేతలు అవినీతి వ్యతిరేక ఉద్యమాన్ని పొదిగారు. వారి సమిష్టి కృషి ఫలితమే ఎఎపి. అన్నా హజారేకు గుర్తుంటే రాజకీయ పార్టీ ఏర్పాటును ఆయన కూడా మొదట సమర్ధించారు. ఆ తర్వాత కిరణ్ బేడీ ప్రభావంతో ఆయన వైదొలిగారు గానీ, రాజకీయ ప్రవేశంలో మొదట ఆయన ఆలోచన కూడా కలిసే ఉంది. ఎంతవరకు నిజమో తెలియదు గానీ కిరణ్ బేడీ బి.జె.పి మద్దతుదారు అనీ, ఎఎపి వల్ల బి.జె.పి కి కూడా నష్టం కనుక ఆ పార్టీ ఏర్పాటును ఆమె అంగీకరించలేదని ప్రచారం ఉన్నమాట వాస్తవం.
అందువల్ల అన్నా కోడి తల్లీ కాదు, ఎఎపి కోడి పిల్లా కాదు. ఇండియా ఎగేనెస్ట్ కరప్షన్ ఉద్యమం కోసం వందల కోట్లు వసూలు చేసింది నిజమే అయితే వాటికి అన్నా, అరవింద్ లు ఇద్దరూ బాధ్యులే. తనకు తెలియకుండా జరిగిందని అన్నా తప్పించుకోలేరు. నిజంగానే తెలియకపోయినా లెక్కలు చెప్పించాల్సిన బాధ్యత ఆయనకి ఉంది.
ఎన్.జి.ఓ అంటేనే కార్పొరేట్ కంపెనీల పెంపుడు సంస్ధలు. ప్రజల్లో ఉండే అసంతృప్తిని భద్రంగా ఆర్గనైజ్ చేసి తీసుకెళ్లి బంగాళాఖాతంలో కలపడం వారి రహస్య లక్ష్యం. ఈ లక్ష్యం కార్పొరేట్ కంపెనీలు నిర్దేశించినదే. అందుకే అవి ఎన్.జి.ఓ లకు నిధులు సమకూర్చిపెడతాయి. చెయ్యాల్సిందంతా చేసేసి ఇప్పుడు చెడ్డపేరు గురించి ఆందోళన చెందడం అసంబద్ధం.
కొసమెరుపు: అన్నా హజారే ఆ తర్వాత తన ఆరోపణలను సవరించుకున్నారు. అరవింద్ అవినీతి చేశాడని తాను ఎప్పుడూ అనలేదని, తన బాధంతా ఎఎపి తన పేరు ఉపయోగించుకోవడం గురించే అనీ అన్నా ప్రకటించారు. తన పేరు తన సొంతానిది కాదనీ, ఇంకా అనేకీయమంది నాయకులు, ప్రజలు కలిస్తేనే ఆ పేరు వచ్చిందనీ అన్నా గ్రహింపులో ఉన్నదా?
అవినీతి వ్యతిరేక ఉద్యమం నడుపుతున్నది కాంగ్రెస్‌ని వ్యతిరేకించే భాజపా అనుకూల వర్గంవాళ్ళు. రైలు ప్రయాణంలో ఉన్నప్పుడు ఓసారి అవినీతి గురించి చర్చించబోయాను. “అవినీతి పరులు నీ జేబులో చెయ్యిపెట్టి డబ్బులు తియ్యరు కదా” అని మాట్లాడిన వ్యక్తే గుజరాత్‌ని అవినీతి లేని రాష్ట్రం అంటూ పొగిడాడు. దేశంలో సోషలిస్త్ విప్లవం అవసరం లేదనుకునేవాళ్ళకి అవినీతి వ్యతిరేకత ఒక్కటే గొప్ప ప్రగతిలా కనిపిస్తుంది. కొంత మందికైతే అవినీతిపై ఎలాంటి వ్యతిరేకతా ఉండదు.
అవినీతి కడలిలో ఈధుతూ అవినీతిని రూపుమాపాలి అన్నట్టు!
అన్నా హజారే కూడా ఓసారి “గుజరాత్లో అవినీతి తక్కువ” అని అన్నాడు. అందరు భారతీయులలాగే గుజరాతీయులు కూడా బియ్యం, గోధుమలతో చేసిన ఆహారమే తింటారనీ, వాళ్ళేమీ ప్రత్యేకులు కాదనీ ఆయనకి కూడా తెలిసినట్టు లేదు.
పింగ్‌బ్యాక్: కోడి పిల్లొచ్చి కోడిని వెక్కిరించినట్టు! -కార్టూన్ | ugiridharaprasad