అమెరికా ప్రతినిధుల సభలో మోడి వ్యతిరేక తీర్మానం


Modi

నరేంద్ర మోడికి అమెరికా వీసా కష్టాలు కొనసాగుతున్నాయి. భాజపా అధ్యక్షుడు రాజ్ నాధ్ సింగ్ అమెరికా పర్యటించినపుడు మోడి వీసా గురించి ప్రత్యేకంగా చర్చించినప్పటికీ ఫలితం దక్కినట్లు లేదు. అమెరికా ప్రతినిధుల సభ (House of Representatives)లో సోమవారం ప్రవేశ పెట్టబడిన తీర్మానం చూస్తే ఈ అనుమానం రాక మానదు. రిపబ్లికన్, డెమోక్రటిక్ పార్టీలకు చెందిన ప్రతినిధులు ఉమ్మడిగా ప్రతిపాదించిన ఈ తీర్మానం, మోడీకి వీసా ఇవ్వరాదన్న నిర్ణయానికి కట్టుబడి ఉన్నందుకు అమెరికాను ప్రశంసించింది. మరో వంక, 2014 ఎన్నికలు సమీపిస్తున్న నేపధ్యంలో, మత విభేదాలను స్వప్రయోజనాలకు వినియోగించకుండా అడ్డుకోవాలని భారత ప్రభుత్వాన్ని కూడా కోరింది.

‘హౌస్ రిజొల్యూషన్ 417’ గా పేర్కొంటున్న ఈ తీర్మానం నరేంద్ర మోడి ప్రధాని పదవి ఆశలకు కళ్ళెం వేసేదే అని పలువురు భావిస్తున్నారు. మోడి మళ్ళీ వీసాకు దరఖాస్తు చేసుకున్నట్లయితే పరిశీలిస్తామని అమెరికా అధికారులు చెప్పినట్లు ఇటీవల వచ్చిన వార్తలు అసలు నిజమేనా అన్న అనుమానాన్ని ఈ తీర్మానం కలిగిస్తోంది. మరీ ముఖ్యంగా ద్వైపాక్షిక తీర్మానం (bipartisan risolution) గా ఇది ముందుకు రావడం గమనార్హం. ఇరు పార్టీల నుండి 14 మంది సభ్యులు ఈ తీర్మానాన్ని ప్రాయోజితం చేశారని ది హిందు తెలిపింది. దానర్ధం, ఇది ఇరు పార్టీల ఉమ్మడి తీర్మానం అని. అనగా ఆమోదానికి ముందే సగం గ్యారంటీ లభించినట్లే. ఇక ఆమోదమే తరువాయి అన్నట్లు! ఆమోదం లభించకపోవడానికి కూడా అవకాశాలు లేకపోలేదు.

భారత దేశంలో మైనారిటీల హక్కులను కాపాడాలని భారత ప్రభుత్వానికి పిలుపు ఇచ్చిన ఈ తీర్మానం నరేంద్ర మోడిని ప్రత్యేకంగా ప్రస్తావించింది. గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ అమెరికాలో ప్రవేశించకుండా వీసా నిరాకరించడానికి తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉన్నందుకు అమెరికా ప్రభుత్వాన్ని ప్రశంసించింది. “మతపరమైన తేడాలను స్వార్ధ ప్రయోజనాలకు ఉపయోగించడాన్ని, మతపరమైన మైనారిటీలను వేధింపులకు, హింసలకు గురి చేయడాన్ని బహిరంగంగా వ్యతిరేకించాలి. ముఖ్యంగా 2014లో సాధారణ ఎన్నికలు జరగనున్నందున ఇది వెంటనే జరగాలి” అని భారత ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు తీర్మానం పేర్కొంది.

“హిందూ విశ్వాసం సహన పూర్వకమైనదని, బహుళ విశ్వాస సాంప్రదాయాలతో కూడుకున్నదని అందరు భావిస్తారు. ఈ నమ్మకానికి విరుద్ధంగా హిందూ జాతీయవాద ఉద్యమంలోని కొన్ని విభాగాలు (strands) ప్రజల్ని విభజించే హింసాత్మక ఎజెండాను ముందుకు తెచ్చాయి. ఇది భారత దేశ సామాజిక అల్లికకు హాని చేస్తోంది” అని తీర్మానం పేర్కొంది.

ఇటువంటి పరిస్ధితుల్లో, ఇటీవల సంవత్సరాలలో ఇరు దేశాల ద్వైపాక్షిక సహకారం పురోగమించడానికి కీలక సాధనంగా మారిన ‘అమెరికా-ఇండియా వ్యూహాత్మక చర్చల’లో మత స్వేచ్ఛ, తత్సంబంధిత మానవ హక్కులను పరిరక్షించే అంశాన్ని చేర్చాలని తీర్మానం కోరింది. ఇటువంటి అంశాన్ని ఫెడరల్ (జాతీయ) ప్రభుత్వ స్ధాయిలోనే కాకుండా రాష్ట్రాల స్ధాయిలోనూ నేరుగా లేవనెత్తాలని (అమెరికాను) కోరింది.

తీర్మానాన్ని రిపబ్లికన్ పార్టీ సభ్యుడు జోసెఫ్ పిట్స్ (పెన్సిల్వేనియా) ప్రవేశపెట్టగా, 14 మంది ఇతర సభ్యులు సహ ప్రతిపాదకులుగా సంతకాలు చేశారు. డెమోక్రటిక్ పార్టీ సభ్యులు కీత్ ఎలిసన్, జాన్ కనిర్స్ లు రిపబ్లికన్ సభ్యుడు స్టీవ్ ఛాబోట్ లు ఉన్నారు. స్టీవ్ ఛాబోట్, ఆసియా మరియు పసిఫిక్ ప్రాంతాల విదేశీ వ్యవహారాల హౌస్ సబ్ కమిటీ (Foreign Affairs Subcommittee on Asia and Pacific) కి ఛైర్మన్ కావడం గమనార్హం. ఆసియా విదేశీ వ్యవహారాలను పర్యవేక్షించే సబ్ కమిటీ చైర్మనే ఈ తీర్మానానికి ప్రతిపాదకుడుగా ఉన్నందున దానికి మరింత ప(బ)రువు వచ్చి చేరింది.

2002 నాటి గుజరాత్ మారణకాండను కూడా తీర్మానం ప్రస్తావించింది. గోధ్రా దుర్ఘటనలో రైలు బోగీకి నిప్పు అంటుకుని 58 మంది హిందువులు సజీవంగా దహనం అయ్యారని పేర్కొంటూ 2003లో ‘అమెరికా అంతర్జాతీయ మత స్వేచ్ఛ నివేదిక’ ను ప్రస్తావించింది. తదనంతర కాలంలో అమెరికా విదేశాంగ మంత్రిత్వ శాఖ విచారణలో తేలిన అంశాలను కూడా ప్రస్తావించింది. “2002 ఫిబ్రవరి, మార్చి నెలల్లో గుజరాత్ లో ముస్లింలపై హిందువులు సాగించిన అత్యంత హీనమైన మత హింస చోటు చేసుకుంది. ఇందులో 2,000 మంది చనిపోగా లక్ష మంది వరకు పునరావాస శిబిరాలకు తరలించాల్సి వచ్చింది” అని అమెరికా విదేశాంగ శాఖ పేర్మోన్న సంగతి ప్రస్తావించింది.

“ఒక వైపు లెక్కలేనంత మంది వేలాదిగా తమ ప్రియ కుటుంబీకులను పోగొట్టుకుని న్యాయం దక్కని పరిస్ధితుల్లో ఉండగా భారత ప్రభుత్వం భవిష్యత్తులో కూడా తాము మత స్వేచ్ఛ, మానవ హక్కుల విషయంలో గొప్పగా పురోగమిస్తామని చెప్పుకోజాలదు” అని తీర్మానం ప్రతిపాదించిన రిపబ్లికన్ ప్రతినిధి జోసెఫ్ పిట్స్ అన్నారని ది హిందు తెలిపింది.

తీర్మానం సంగతి ఎలా ఉన్నా, దీనిని అమెరికన్లు ప్రతిపాదించి ఆమోదించబూనడమే ఒక జోక్! తమ కంపెనీల ప్రయోజనాల కోసం బలహీన దేశాలపై దాడులు చేస్తూ, దేశాధ్యక్షులను, ఇతర నేతలను కూడా చంపేయడానికి నిర్ణయాలు తీసుకునే అమెరికా ప్రతినిధుల సభ భారత దేశంలో మత స్వేచ్ఛ గురించి, మానవ హక్కుల గురించి వాపోవడం వింతల్లోకెల్లా వింత! శ్రీలంక తమిళుల మానవ హక్కుల గురించి వగచే నైతిక సాధికారత లేనట్లే గుజరాత్ ముస్లింల హక్కుల గురించి వాపోయే నైతిక సాధికారత కూడా అమెరికాకు లేదు గాక లేదు. “మోడి సంగతి చూసుకుంటే మేము చూసుకోవాలి గానీ అమెరికాకి ఏం పని?” అని భారత ప్రజలు అమెరికాను నీలదీయాలి.

4 thoughts on “అమెరికా ప్రతినిధుల సభలో మోడి వ్యతిరేక తీర్మానం

  1. భారతదేశపు సార్వభౌమాధికారాన్ని ఒక అగ్రరాజ్యం కేవలం వీసా విషయంలో కాలికింద తొక్కిపెట్టడం అరాచకత్వ విశృంఖలతకు తార్కాణం. భవిష్యత్తులో మోడిని పదవి వరిస్తే వీసాను ఆపి మీసాలు దువ్వే అమెరికా రేపు మోడి గడ్డానికి సంపెగనూనెను రాసి బుజ్జగిస్తుందా? అతి తెలివితేటలు మూర్ఖత్వానికి దారితీయడమంటే ఇదే!

  2. mana deshapuy mata samrasyanni velu chupe hakke evariki ledu mukshyanga america asalu ledu..middle east lo idi chestunna vikarapu aatalanu pakkana petti manaki nitulu cheepdam tagadu..oka muslim america lo airport lo enni securtiy check la ku gurautadoo vadiki kuda teledu anta prashistaru ..alanti velu matham ane mata matladam vinta..modi vishayam pakkaki pedite ee teermannani ma deshiyulanta kandichalii

  3. “…“మోడి సంగతి చూసుకుంటే మేము చూసుకోవాలి గానీ అమెరికాకి ఏం పని?” అని భారత ప్రజలు అమెరికాను నీలదీయాలి…….”
    ప్రజలు ఎలా నిలదీస్త్రారు.. ఆ పని పాలకులు చెయ్యాలి… వాళ్ళు ఎలగో ఆపని చెయ్యరు… అమెరికానే తీర్మానం చేసిందంటే మోడి కి వ్యతిరెకంగా మనకి ఎన్నికల్లొ చెప్పుకోవడానికి ఇంకొక ఆయుధం దొరికిందని చంకలు గుద్దుకుంటారు. ప్రతిపక్షాల వాళ్ళేమో దానిని అడ్డం పెట్టుకుని సానిభూతికి ఎమైనా అవకాసం ఉందేమో అని వెతుకుతారు…

  4. నా.శ్రీ గారూ అవున్నిజమే. ప్రజలు స్వయంగా నిలదీయాలనుకున్నా వారికా అవకాశం లేదు. ప్రజల భావోద్వేగాలు, వారి అవసరాలు ఎప్పటికప్పుడు రాజ్యాధీశులకు తెలిపే అవకాశం లేకపోవడం ఆధునిక ప్రజాస్వామ్యాల విచిత్ర లక్షణం. ఆ ఐదేళ్లకొకసారి వచ్చే ఎన్నికల్లో కూడా పాలకుల్ని మార్చుకునే అవకాశం ఉన్నదే తప్ప విధానాల్ని మార్చే అవకాశం ప్రజల చేతుల్లో లేదు. ఇలాంటి వ్యవస్ధ ప్రజాస్వామ్యం ఎలా అవుతుంది అన్న ప్రశ్న ఎలాగూ ఉంది. అయితే నేను ఇక్కడ చెప్పింది అలంకారప్రాయంగానే. నిజంగా కాదు. నిలదీయాల్సిన సందర్భం ఇది అనీ, మోడిని దెబ్బతీసే అవకాశం వచ్చింది కదా అని సంతోషించాల్సిన సందర్భం కాదనీ చెప్పడం.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s