అమెరికా గొంతెమ్మ కోర్కెలకు కర్జాయ్ ససేమిరా


Hamid Karzai

దశాబ్దం పైగా ఆఫ్ఘనిస్తాన్ లో తలదూర్చి ఇల్లూ, ఒల్లూ గుల్ల చేసుకున్నా తగిన ఫలితం దక్కని పరిస్ధితిని అమెరికా ఎదుర్కొంటోంది. ఇరాక్ లో వలెనే ఆఫ్ఘనిస్ధాన్ నుండి కూడా తమ బలగాలు పూర్తిగా ఉపసంహరించుకోవలసిన అగత్యం అమెరికా ముందు నిలిచింది. అమెరికా గొంతెమ్మ కోర్కెలను ఆఫ్ఘన్ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ ససేమిరా నిరాకరించడమే దానికి కారణం. ఆఫ్ఘన్ ఇళ్ళల్లో చొరబడి దాడులు చేసే అధికారం ఇవ్వాలనీ, ఆఫ్ఘన్ చట్టాల నుండి అమెరికా సాయినికులకు మినహాయింపు ఇవ్వాలని అమెరికా కోరుతోంది. వీటికి కర్జాయ్ ససేమిరా అనడంతో 2014 తర్వాత కూడా ఆఫ్ఘన్ లో అమెరికా బలగాలు కొనసాగించే వ్యవహారం అనుమానంలో పడింది. ఇరాక్ లాగానే ఆఫ్ఘన్ ని కూడా ఖాళీ చేయాల్సిన పరిస్ధితి వస్తే అమెరికా కి అది మరో భౌగోళిక రాజకీయ తలవంపులు కానున్నది.

2014 డిసెంబర్ తో తమ బలగాలను పూర్తిగా ఉపసంహరించుకుంటామని అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా 2009లో మొదటిసారి అధ్యక్షుడు అయినప్పుడు వాగ్దానం ఇచ్చాడు. పూర్తి ఉపసంహరణ అని పైకి చెప్పినప్పటికీ వాస్తవంలో పెద్ద మొత్తంలో బలగాల కొనసాగింపే బారక్ ఒబామా లక్ష్యం. అమెరికా బహుళజాతి కంపెనీల చేతుల్లో ఒబామా కేవలం ఒక పనిముట్టే కాబట్టి, ఒబామా లక్ష్యం అనడం కంటే అమెరికా సామ్రాజ్యవాద ప్రయోజనాల లక్ష్యం అనడమే సముచితం.

ఇరాక్ లో కూడా బుష్ ప్రభుత్వం ఇలాగే గొంతెమ్మ కోర్కెలు కోరింది. ఇరాక్ చట్టాల నుండి అమెరికా సైనికులకు మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేసింది. సదరు మినహాయింపు ఇవ్వడానికి ఇరాక్ నిరాకరించింది. పైగా ఇరాక్ యుద్ధంలో అమెరికా బలగాలు పాల్పడిన నేరాలకు సాక్ష్యాలు ఉంటే ప్రాసిక్యూట్ చేసి శిక్షిస్తామని కూడా చెప్పింది. దానితో అమెరికా సైనికులు మూటా, ముల్లె సర్దుకుని ఇరాక్ ఖాళీ చేయాల్సి వచ్చింది. ఈ అవమానకర పరిస్ధితిని అమెరికా ఎప్పుడూ ఒప్పుకోదు. చావు తప్పి కన్ను లొట్టపోయినా అద్వితీయ విజయం అనే చెప్పుకుంటుంది. యుద్ధ నేరాలకు శిక్షలు వేయడం మొదలు పెడితే అమెరికా సైనికులు తప్పనిసరిగా దోషులుగా తేలతారని అమెరికా ఆవిధంగా పరోక్షంగా అంగీకరించింది.

ఆఫ్ఘనిస్ధాన్ లోనూ ఇరాక్ అనుభవమే పునరావృతం అవుతోంది. రాయిటర్స్ వార్తా కధనం ప్రకారం అమెరికా ప్రతిపాదించిన ‘ద్వైపాక్షిక భద్రతా ఒప్పందం’ (Bilateral Security Agreement -BSA) లోని కొన్ని అంశాలను ఆఫ్ఘన్ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ వ్యతిరేకించాడు. 2014 లో సో కాల్డ్ బలగాల ఉపసంహరణ అనంతరం కూడా మిగిలి ఉండే అమెరికా సైనికులకు  ఆఫ్ఘనిస్ధాన్ లో ఏకపక్షంగా ప్రజల ఇళ్లపై పడి దాడులు చేసే అధికారం ఉండాలని బి.ఎస్.ఏ లో అమెరికా ప్రతిపాదించింది. పౌరుల ఇళ్లను ఎప్పుడంటే అప్పుడు తనిఖీ చేసే అధికారం తమ బలగాలకు ఉండాలని కోరింది. దీనిని ఆఫ్ఘన్ ప్రభుత్వం తిరస్కరించింది.

ఆల్-ఖైదా నాయకులను టార్గెట్ చేయాలంటే పౌరుల ఆవాసాల్లో చొరబడి తనిఖీ చేసే విస్తృతాధికారం తమకు ఉండాలన్నది అమెరికా వాదన. ఈ ఉగ్రవాద పోరాట యోధులే లిబియాలో గడాఫీ సెక్యులర్ ప్రభుత్వాన్ని కూలదోసి ఆల్-ఖైదా నాయకుల్ని ప్రతిష్టించింది. ఈ ఉత్తమోత్తములే సిరియాలో మరో సెక్యులర్ బాత్ పార్టీ ప్రభుత్వాన్ని కూలదోయడానికి గత రెండున్నరేళ్లుగా అలుపు, సొలుపూ లేకుండా ఆల్-ఖైదా బలగాలకు జోర్డాన్, టర్కీలలో శిక్షణ ఇస్తున్నది. అలాంటి దురాక్రమణపూరిత దుర్మాదాంధులు ఆఫ్ఘన్ లో ఆల్-ఖైదా నాయకుల్ని టార్గెట్ చెయ్యడానికి ఆఫ్ఘన్ పౌరుల ఇళ్ళల్లో చొరబడి తనిఖీ చేస్తారట. ఉగ్రవాదంపై యుద్ధం పేరుతో తమ దేశ పౌరుల వ్యక్తిగత సమాచారాన్నే కాక ప్రపంచ ప్రజల సెల్ ఫోన్, ఇంటర్నెట్ సమాచారాన్ని, సంభాషణలను సైతం నిఘా పెట్టి సేకరించే వినాశకారులు ఇంత అడ్డగోలు వాదన చేయడం చెల్లవచ్చు!

ఇలాంటి సిగ్గూ ఎగ్గూ లేని బాపతు సూత్రాలను తిరస్కరించాలన్న తెలివిడి ఆఫ్ఘన్ అధ్యక్షుడు కర్జాయ్ కి ఉండడం కొంతలో కొంత నయం. వచ్చే గురువారం అధ్యక్షుడు కర్జాయ్ లోయ జిర్గా (దేశవ్యాపిత రాజకీయ, గిరిజన తెగల నాయకుల సమావేశం) నిర్వహించి బి.ఎస్.ఏ లోని అంశాలను చర్చకు పెట్టనున్నారని రష్యా టుడే తెలిపింది. ఈ సమావేశంలో తమ కోర్కెలను అంగీకరించకపోతే తమ బలగాలను పూర్తిగా ఉపసంహరించడానికే అమెరికా నిర్ణయించుకుందని తెలుస్తోంది. పీడా బోతే సరి!

“ఆఫ్ఘన్ ఇళ్ళలో చొరబడడానికి వీలుగా వారికోసం కిటికీ తలుపులు తెరిచి ఉంచాలట! కానీ అధ్యక్షుడు దానికి అంగీకరించడం లేదు. అమెరికా ఏకపక్ష చొరబాటే కాదు, ఆఫ్ఘన్ సైనికుల చొరబాటుకు కూడా అంగీకరించరు” అని ఆఫ్ఘన్ అధికారులు చెప్పారని రాయిటర్స్ తెలిపింది. ఆఫ్ఘనిస్తాన్ లో భద్రతా అవసరాలను చూసే బాధ్యతను క్రమంగా ఆఫ్ఘన్ బలగాలకు అప్పగించే కార్యక్రమం కొనసాగుతోంది. ఇది జరుగుతుండగానే ఆఫ్ఘన్-అమెరికా సైనికులు సంయుక్తంగా ఆఫ్ఘన్ పౌరులపై దాడులు చేస్తున్నారు. అమెరికా బలగాల దాడులపై తీవ్ర విమర్శలు చెలరేగడమే కాకుండా, అంతర్జాతీయంగా ఒత్తిళ్ళు రావడంతో ఆఫ్ఘన్ సైనికులతో కలిసి దాడులు చేయడం ప్రారంభించింది అమెరికా. దీన్ని దృష్టిలో పెట్టుకునే సంయుక్త దాడులకు కూడా అంగీకరించేది లేదని ఆఫ్ఘన్ అధికారి చెప్పడం.

ఆఫ్ఘన్ చట్టాల నుండి తమ సైనికులకు మినహాయింపు ఇవ్వాలన్నది అమెరికా రెండో గొంతెమ్మ కోరిక. ఆఫ్ఘన్ చట్టాల ప్రకారం విచారణ జరిగితే అమెరికా సైనికులు దోషులుగా తేలడం ఖాయం. వారు ఆఫ్ఘన్ లో చేసిన, చేస్తున్న అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. ఆల్-ఖైదా టెర్రరిస్టుల పేరుతో అర్ధరాత్రి, అపరాత్రి అని లేకుండా పౌరుల ఇళ్ళల్లో చొరబడి విచక్షణారహితంగా కాల్పులు జరపడం, ఆ క్రమంలో వేలాది మంది స్త్రీలు, పిల్లలను సైతం బలిగొనడం వారు ఒక వినోదంగా కొనసాగించారు. ఆఫ్ఘన్ ప్రజల మతనమ్మకాలను ఈసడిస్తూ ఖురాన్ లు తగలబెట్టడం కూడా వారి వీర కృత్యాలలో కొన్ని.

ఇవన్నీ లెక్కకు వస్తే ఒక్కో సైనికుడు శిక్షలు అనుభవించడానికి వారి జీవిత కాలాలు సరిపోవు. అందుకే ఇరాక్ లో వాళ్ళు నోరుమూసుకుని వెళ్ళిపోయారు. సైనికుల దాకా ఎందుకు అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జి బుష్ గానీ, బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ గానీ తమ తమ దేశాలు దాటి వెళ్లరు. ముఖ్యంగా కెనడా లాంటి చోట్లకు అసలు వెళ్లారు. వారికోసం అక్కడ యుద్ధ నేరాల కేసులు ఎదురు చూస్తున్నాయి. వెళితే అరెస్టు తప్పదు. కొంతమంది ఇజ్రాయెల్ నేతలపై కూడా ఐరోపా దేశాల్లో అనేక కేసులు నమోదయ్యాయి. అందుకని వారు ఐరోపా పర్యటనలకు వెళ్లరు.

గురువారం లోపు ఒప్పందం కుదరకపోతే గనుక ఆఫ్ఘన్ అధ్యక్షుడు కర్జాయ్ లోయ జిర్గాలో ప్రసంగిస్తారని, అమెరికా షరతులకు తల ఒగ్గేది లేదని అక్కడ ఆయన ప్రకటిస్తారని ఆఫ్ఘన్ అధికారులు చెబుతున్నారు. అదే జరిగితే మొత్తం ఒప్పందమే ప్రమాదంలో పడుతుందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఆఫ్ఘన్ ప్రజలకు ఇప్పటిలో అంతకు మించిన మేలు మరొకటి ఉండబోదు. అమెరికాను ఎంత త్వరగా, ఎంత పూర్తిగా వదిలించుకుంటే వారికంత మంచిది.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s