సమస్య రాహుల్-మోడీ కాదు, టాటా-అంబానీలది -అరుంధతి


arundhatiroy2

ప్రధాన మంత్రి అభ్యర్ధిత్వ పోటీని రాహుల్ గాంధీ, నరేంద్ర మోడిల వరకే పరిమితం చేయడం సరైంది కాదని ప్రఖ్యాత రచయిత్రి, సామాజిక కార్యకర్త అరుంధతి రాయ్ అన్నారు. రాజకీయ పార్టీల కూటములు రాజ్యం ఏలుతున్న కాలంలో ప్రధాని ఎవరు అవుతారన్న విషయం ఇద్దరు పోటీదారుల కంటే విస్తృతంగా విస్తరించి ఉన్న అంశం అని ఆమె పేర్కొన్నారు.

ఈ నేపధ్యంలో నరేంద్ర మోడీయా లేక రాహుల్ గాంధీయా అన్న ఊబిలో పడవద్దని ప్రజలను హెచ్చరించారు. దేశాన్ని పాలిస్తున్నది కార్పొరేట్ కంపెనీలే కాబట్టి అసలు సమస్య రాహులా లేక మోడియా అన్నది కాదని, టాటానా లేక అంబానీయా అన్నది తేల్చడానికే ఎన్నికలని ఆమె వ్యాఖ్యానించారు.

నరేంద్ర మోడి ప్రధాని అయ్యే అవకాశాలు లేవని అరుంధతి రాయ్ కుండ బద్దలు కొట్టడం విశేషం. అలాగని రాహుల్ గాంధీ వైపు కూడా మొగ్గలేదు. “మోడి ప్రధాని అయ్యే అవకాశం లేదు. రాహుల్ గాంధీ యేమో అనుభవం లేని వ్యక్తి” అని ఆమె స్పష్టం చేశారు. సాహిత్య పత్రిక నిసాన్, భువనేశ్వర్ లో నిర్వహించిన ఒక సదస్సు సందర్భంగా విలేఖరులతో మాట్లాడుతూ ఆమె ఈ మాటలు చెప్పారు.

దేశాన్ని వాస్తవంగా పాలిస్తున్నది కార్పొరేట్ కంపెనీలే అన్న సంగతి అరుంధతి గుర్తు చేశారు. ప్రధాన మంత్రి ఎవరు కావాలి అని చర్చించే బదులు ‘టాటా కంపెనీయా లేక రిలయన్స్ కంపెనీయా, ఏది గెలుస్తుంది’ అన్న అంశాన్ని చర్చించడం ఉత్తమం అని ఆమె వ్యాఖ్యానించారు. “టాటానా లేక రిలయన్సా – ఏ కంపెనీ నెగ్గుతుంది అని మనం మాట్లాడుకోవాలి” అని ఆమె అన్నారు.

నియమగిరి గిరిజనల ప్రజల ఉద్యమానికి అరుంధతి రాయ్ నీరాజనాలు పలికారు. నియమగిరి కొండలను కాపాడుకోవడంలో డోంగ్రియా కోంధ్ గిరిజనులు చేసిన పోరాటం వెలకట్టలేనిదని పేర్కొన్నారు.

నియమగిరి కొండలను తవ్వి బాక్సైట్ ఖనిజాన్ని వెలికి తీయడానికి బ్రిటన్ కి చెందిన వేదాంత కంపెనీ అనేక యేళ్లుగా ప్రయత్నిస్తోంది. నియమగిరికి సమీపంలో వేదాంత బాక్సైట్ రిఫైనరీ కంపెనీని కూడా స్ధాపించింది. అయితే వేదాంత ప్రయత్నాల వలన అక్కడ నివసించే అత్యంత ప్రాచీన తెగ డోంగ్రియా కోంధ్ ఉనికికే ప్రమాదం వచ్చిపడింది. వేదాంత కంపెనీకి తమ కొండలను అప్పగించడానికి డోంగ్రియా కోంధ్ గిరిజనులు ససేమిరా ఒప్పుకోలేదు. సంఖ్యలో తక్కువే అయినప్పటికీ అప్పటి నుండి వేదాంతకు వ్యతిరేకంగా అలుపెరుగని పోరాటం చేస్తున్నారు. వారి పోరాటానికి జాతీయంగా, అంతర్జాతీయంగా అనేక సంస్ధలు మద్దతు ప్రకటించాయి.

గిరిజనుల పోరాటం వల్ల విషయం సుప్రీం కోర్టు వరకు వెళ్లింది. అటవీ హక్కుల చట్టం ప్రకారం గిరిజనుల గ్రామ సభ అనుమతి లేకుండా వారి భూములను గానీ, అడవిని గానీ ముట్టుకోడానికి వీలు లేదు. ఈ చట్టాన్ని తుంగలో తొక్కి నియమగిరి కొండలను అడిగిందే తడవుగా వేదాంతకు కట్టబెట్టడానికి నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని ఒడిశా ప్రభుత్వం సిద్ధపడింది. మొదట గ్రామ సభలు నిర్వహించి వారి అనుమతి తీసుకోవాలని, వారు ఏది కోరితే అది అమలు చేయాలని సుప్రీం కోర్టు తీర్పు చెప్పడంతో 12 గ్రామాలను ఒడిశా ప్రభుత్వం ఎంపిక చేసింది.

ఒడిశా ప్రభుత్వం ఎంపిక చేయడంతో గ్రామసభలను ప్రభావితం చేయడానికి కుట్ర జరుగుతోందని పలువురు అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ అనుమానాలను పటాపంచలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసిన 12 గ్రామాల గ్రామ సభలు వేదాంతకు అనుమతి ఇవ్వడానికి ఏకగ్రీవంగా నిరాకరించాయి. దానితో నియమగిరి తవ్వకాలకు దారి శాశ్వతంగా మూసుకుపోయింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం మరేవో అభ్యంతరాలు లేవనెత్తే ప్రయత్నాల్లో మునిగిపోయింది. కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి జయంతి నటరాజన్, గ్రామీణ మంత్రి జైరాం రమేష్ గిరిజనులకే మద్దతు ప్రకటించారు.

ఈ నేపధ్యంలోనే డోంగ్రియా కోంధ్ గిరిజనుల పోరాట పటిమను, రాజీలేని వైఖరిని అరుంధతి కొనియాడారు. అయితే నియమగిరి కొండలను కాపాడుకోవడంలో విజయం  సాధించినప్పటికీ విశ్రమించడానికి వీలు లేదని వేదాంత ఫ్యాక్టరీ అక్కడ ఉన్నంతవరకూ కార్పొరేట్ కంపెనీలు మళ్ళీ మళ్ళీ ప్రయత్నాలు చేస్తారని ఆమె హెచ్చరించారు. కాబట్టి వేడాంత ఫ్యాక్టరీని తమ మధ్య లేకుండా చేయడానికి పోరాటం మొదలు పెట్టాలని కోరారు. డోంగ్రియా కోంధ్ లకు పోరాటం ఎలా చేయాలో ఎవరూ నేర్పనక్కర్లేదనీ, వారి సంగతి వారు చూసుకోగలరని ఆమె ఈ సందర్భంగా అన్నారు.

“మన ప్రపంచంలో పుస్తకాలు రాసి బుకర్ ప్రైజ్ గెలవడం కంటే ఒక కొండను (పోరాటం ద్వారా) కాపాడుకోవడమే అతి పెద్ద విషయం. మీకు నా సెల్యూట్. రిఫైనరీ ఫ్యాక్టరీ ఇంకా నియమగిరి పర్వత పాదాల చెంతనే ఉంది. మునుముందు సుదీర్ఘ పోరాటమే ఉంది… విజయం అనంతరం మనం సంతోషించడానికి లేదు. మరింతగా పోరాడడానికి కార్పొరేట్ ప్రపంచం ఇంకా ఏర్పాట్లలో ఉంది. బాక్సైట్ ను రిఫైనరీ వద్దకు తేవడానికి వారు అన్నీ విధాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు మన లక్ష్యం రిఫైనరీని మూసివేయడం” అని అరుంధతీ రాయ్ పేర్కొన్నారు.

డోంగ్రియా కోంధ్ గిరిజనులు ప్రతిఘటించడం ఎలాగో లోకానికి నేర్పారని రాయ్ కొనియాడారు. తమ బ్రతుకు తెరువు కాపాడుకోవడానికి నిరంతరం పోరాటంలో మునిగి ఉన్న స్ధానిక తెగలకు  ఎలా పోరాడాలో ‘సో కాల్డ్ మేధావులు’ నిర్దేశించాల్సిన అవసరం లేదని చెబుతూ ఆమె “తమ పోరాటం ఎలా చేసుకోవాలో వారినే నిర్ణయించుకోనివ్వండి” అని చెప్పారు. పోరాటానికి మద్దతు ఇస్తాం అనీ, సహాయం చేస్తామనీ అనేక ఎన్.జి.ఓ సంస్ధలు జొరబడడం నేడు నిత్యకృత్యంగా మారింది. విదేశీ నిధులతో పని చేసే ఈ ఎన్.జి.ఓ ల అసలు లక్ష్యం పోరాటాలను ముద్దుబార్చి కంపెనీలకు అనుకూలంగా ఫలితాన్ని రాబట్టమే. అందువలన అరుంధతి రాయ్ హెచ్చరిక బహుధా అవశ్యం.

మరి కొన్ని వివరాలకు ఈ లింక్ చూడగలరు:

భారత ‘అవతార్’ నివాసులకు మోడి మద్దతు ఇవ్వగలరా?

 

3 thoughts on “సమస్య రాహుల్-మోడీ కాదు, టాటా-అంబానీలది -అరుంధతి

  1. విశేఖర్ గారు సోని సొరి సుప్రిం కోర్టుకు, దేశ ప్రజలకు రాసిన ఉత్తరాలను మీకు వీలైతే అనువాధించి మీ సైట్లో పెట్టండి. సోని సోరి గురించిన ఇంకోన్ని నిజాలు వెలుగులోకి వస్తాయి.

  2. డేవిడ్ గారూ, ఆ లేఖలు నెట్ లో ఉన్నాయా? నేను ఒక లేఖనే చూశాను. అది ఇప్పటికే అనువదించాను. ఇతర లేఖల విషయం నాకు తెలియదు.

  3. ఈ కధనానికి ప్రత్యక్ష నిదర్శనం కొంతకాలం క్రితం అంబానీ కె.జి.గ్యాసు వాటాలలోని లొసుగుల విషయంలో ఆనాటి పెట్రోలియం శాఖ (ఆంధ్రా) మంత్రిగారిని రాత్రికి ఆ రాత్రే శాఖనుంచి తప్పించి ఆయనకున్న శారీరక లోపాయికారితనానికి తోడు రాజకీయంగా అవిటివాడిని చేసి వేరొక ప్రాముఖ్యతలేని శాఖను కేటాయించి అంబా ని అరుపుతో తన ఉనికి విలువలను దేశ రాజకీయాలలో ప్రభావితం చేసిన ఘనాపాటి. సోనియమ్మయినా మోహనయ్యయినా అంబాని సోదరులంటే అంత వ్యామోహం.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s