మీడియాపై యుద్ధం ప్రకటించిన పశ్చిమ ప్రజలు


పశ్చిమ దేశాల ప్రజలు ఏకంగా మీడియాపైనే యుద్ధం ప్రకటించారు. ప్రధాన స్రవంతి మీడియా తమకు వాస్తవ వార్తలు అందించడం లేదని ఆరోపిస్తూ వందలాది మంది ఆయా మీడియా సంస్ధల ముందు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. నిరసనలను ఎదుర్కొన్న మీడియా సంస్ధల్లో ‘నిస్పాక్షిక వార్తా ప్రసారానికి చిరునామాగా’ తమ భుజాలు తామే చరుచుకునే ప్రఖ్యాత మీడియా సంస్ధలు ఉండడం విశేషం. బి.బి.సి, ఎన్.బి.సి, ఫాక్స్ న్యూస్, ఎబిసి, సి.బి.ఎస్, సి.ఎన్.ఎన్ తదితర కార్యాలయాల ఎదుట అమెరికా, ఐరోపా, ఆస్ట్రేలియాల వ్యాపితంగా శనివారం నిరసన ప్రదర్శనలు జరిగాయి.

నిరసనకారులు MARCH AGANIST MAINSTREAM MEDIA (MAMSM) అనే సంస్ధను ఏర్పరుచుకుని, దాని ఆధ్వర్యంలో వెబ్ సైట్ కూడా నిర్వహిస్తున్నారు. తమ కార్యాలయాల ముందే జరిగిన నిరసనలను తమ వార్తా ప్రసారాల్లో కవర్ చేయకుండా ఉండాలని ఈ వెబ్ సైట్ ద్వారా సవాలు విసిరారు. తమ ఉద్యమం నిరసన కంటే ఎక్కువేనని, ప్రధాన స్రవంతి మీడియా విశ్వసనీయతపై దాడి చేయడానికే తమ ఉద్యమమని వారు తెలిపారు.

శ్రోతలు, వీక్షకులు ఇక ప్రధాన స్రవంతి మీడియా ప్రచారం చేసే అబద్ధాలను నమ్మడానికి సిద్ధంగా లేరని, అవి ప్రసారం చేయని వాస్తవాల కోసం ప్రత్యామ్న్యాయ మీడియాకోసం వెతుకుతున్నారని వారు తమ వెబ్ సైట్ లో తెలిపారు. MSM (MainSteam Media) ప్రసారం చేయని అనేక ముఖ్యమైన ఘటనలు, పరిణామాలు ప్రజల దృష్టికి రాకుండా పోతున్నాయని, అలాంటివేమీ జరగనట్లుగా ప్రధాన స్రవంతి మీడియా నటించడమే దానికి కారణమని సదరు వెబ్ సైట్ చెబుతోంది.

ఆస్ట్రేలియా బ్రాడ్ కాస్టింగ్ కార్పొరేషన్(ఎ.బి.సి), బ్రిటిష్ బ్రాడ్ కాస్టింగ్ కార్పొరేషన్ (బి.బి.సి), నేషనల్ బ్రాడ్ కాస్టింగ్ కంపెనీ (ఎన్.బి.సి), కేబుల్ న్యూస్ నెట్ వర్క్ (సి.ఎన్.ఎన్), ఫాక్స్ న్యూస్… ఈ వార్తా సంస్ధల పేర్లను MAMSM వెబ్ సైట్ పేర్కొంది. ఈ సంస్ధల ముందు రెండే రెండు ప్రత్యామ్నాయాలు ఉన్నాయని తమ కార్యాలయాల ముందు వేలాది మంది చేస్తున్న నిరసనలను ప్రసారం చేయడమా లేక అలాంటివేమీ జరగనట్లు నటించడమా అన్న విషయాన్ని వారే నిర్ణయించుకోవాలని సవాలు విసిరారు.

రష్యా టుడే వార్తా సంస్ధ ప్రకారం అమెరికా, బ్రిటన్ లలో ప్రదర్శకులు ఫాక్స్ న్యూస్, బి.బి.సి, ఎన్.బి.సి తదితర వార్తా సంస్ధల ముందు నిరసనలు నిర్వహించారు. ప్రపంచ పరిణామాలను తమ ఇరుకు దృక్పధం నుండి కవర్ చేయడం పట్ల వారు నిరసన వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వెబ్ సైట్ల ద్వారా వారు ప్రపంచ వ్యాపితంగా నిరసనలను ఆర్గనైజ్ చేశారు. ఎన్నాళ్లుగానో పాతుకుపోయిన ప్రధాన స్రవంతి మీడియా కార్యాలయాల ముందు అమెరికా వ్యాపితంగా MAMSM కార్యకర్తలు నిరసనలు నిర్వహించారు. “మీడియాను బహిష్కరించండి” అని కాలిఫోర్నియా నిరసనల్లో ఒక బ్యానర్ పేర్కొనగా, “అమెరికాకు నిజాలు తెలియాలి” అని కన్సాస్ నగరంలో ప్రదర్శకులు నినదించారని ఆర్.టి తెలిపింది.

2011 మార్చి 11 తేదీన జపాన్ లో ఫుకుషిమా అణు కర్మాగారం వద్ద జరిగిన భారీ అణు ప్రమాదం గురించి ప్రధాన స్రవంతి మీడియా నిజాలను ప్రసారం చేయడం లేదన్న అంశాన్ని నిరసనకారులు ప్రధానంగా ఎత్తి చూపారు. “ఆ అణు కర్మాగారం నుండి విడుదల అయిన రేడియేషన్ మనదాకా రాబోతోంది. మనపై కూడా ప్రభావం వేయబోతోంది. ఒక్క కాలిఫోర్నియాలోనే కాదు ప్రపంచవ్యాపితంగా ఆ ప్రభావం ఉండబోతోంది. ఆ ప్రభావం మనపై ఎలా ఉంటుంది, మనం తాగే నీటిపై ఏ ప్రభావం ఉండబోతోంది, మన ఆహార సరఫరా పైనా, మన జీవన విధానం పైనా ఎలాంటి ప్రభావం కలగజేస్తుంది? ఇవేవీ మనకు చెప్పేవారు లేరు” అని కాలిఫోర్నియాలో ఓ నిరసనకారుడు పేర్కొన్నాడని ఆర్.టి. తెలిపింది.

లండన్ లో బి.బి.సి కార్యాలయం ముందు ప్రదర్శకులు ధర్నా నిర్వహించినట్లు తెలుస్తోంది. “ప్రధాన స్రవంతి మీడియా మేము చెప్పేది వినాలి. చివరికి జనం అంతా ఒక్కటై తమకు కావలసిన మార్పేమిటో వారికి చెప్పనున్నారు” అని లండన్ లో ఒక ప్రదర్శకుడు పేర్కొన్నారు. విలేఖరుల సమగ్రతను పునరుద్ధరించడానికి, కాపాడడానికి తాము పోరాడుతున్నామని ప్రదర్శకులు తెలిపారు.

అమెరికా ప్రధాన స్రవంతి మీడియా పైన ప్రజల విశ్వాసం క్రమంగా విశ్వాసం సన్నగిల్లుతోందని వివిధ సర్వేలు చెబుతున్నాయి. 44 శాతం అమెరికన్లు మాత్రమే మాస్ మీడియా ను నమ్ముతున్నారని 2012 సెప్టెంబర్ లో నిర్వహించిన ఒక సర్వేలో వెల్లడి కాగా అది ఈ యేడు 40 శాతానికి పడిపోయిందని ఆర్.టి తెలిపింది. అంటే 60 శాతం అమెరికన్లు మీడియాపై విశ్వాసం కోల్పోయారన్నమాట. 2005 నుండి అమెరికాలో ఈ విధంగా మీడియాపై విశ్వాసం సన్నగిల్లుతూ వస్తోందని ప్రెస్ టి.వి తెలిపింది.

7 thoughts on “మీడియాపై యుద్ధం ప్రకటించిన పశ్చిమ ప్రజలు

  1. ఇదేదో బాగుందే మరి ….

    స్వతహా గానే కొన్ని దేశాల ప్రజలకు బయట ప్రపంచం గూర్చి తెలుసుకుందామనే అభిలాష చాలా తక్కువ, ఇహ ఆ కొద్దిపాటి తెలిసేది కూడా (Mental Krishna పోసాని Mark) filtered News అయితే ఇక వాస్తవం గ్రహించే వీలు ఎక్కడ ఉంటుంది?

    జగత్తు మిథ్య అనుకునే వేదాంతం follow అయ్యేవారి పరిస్థితి ok
    మనం ఎదో వాస్తవం లో జీవిస్తున్నాం అనుకునే వారికి ”ముసుగు” తోడుగులే నిజాలని తెలిస్తే….

    ఇక్కడ ఒక్కో రాజకీయనాయకుడి ఒక్కో మైక్ (టీవీ & ప్రింట్) ఉంది.

    మనవాళ్ళకు ఇంతటి చైతన్యం రావాలంటే ఎన్ని దశాబ్దాలు శత సహస్రాబ్దాలు పడుతుందో మరి

  2. ప్రపంచవ్యాప్తంగా ప్రసారణా మాధ్యమాలు వాణిజ్య పోకడలుతో, రాజకీయబలాలతో ముడిపడి తమ కర్తవ్యాన్ని మరిచిపోయి ప్రవర్తిస్తున్నారు. భారతదేశం ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యం. కొన్ని రాజకీయ పార్టీలు స్వయంగా వారి చానళ్ళను సృష్టించుకుని స్వయం ప్రచారసాధనకు అడ్డగోలుగా వాడుకోవడం మొదలైన తరువాత వాటియొక్క విశిష్టత, విజ్ఞానం కోల్పోయి ఇంగితజ్ఞానం లేకుండా ప్రవర్తిస్తున్నాయి. భవిష్యత్తులో ఇదొక అంటురోగం కింద ప్రబలకముందే ప్రజానిరోధత అవశ్యం. ప్రజలకు అందుబాటులో ఊపిరిపోసుకోవలసిన మాధ్యమాలు వాణిజ్య ఆదాయ సాన్నిధ్యంలో కులుకుతూ తమ పబ్బం గడుపుకుంటున్నాయి.

  3. నిజంగా అబినందించి అనుసరించాదగ్గ విషయం…. అప్పటికైనా పైడ్ న్యూస్ , సొంత డబ్బా గోల తగ్గుతుందేమో ….. పార్టీ కో పేపర్ ,పేపర్ మొత్తం జోకులు .

  4. ఇదొక శుభ పరిణామం. మొన్ననే శ్రీలంకలో బ్రిటన్ ప్రధాని పర్యటనను ఆకాశానికి ఎత్తు బ్రిటిష్ పత్రికలు ప్రచూరించాయి. అవి ఇలా ప్రచూరించటానికి ప్రధానకారణం, సామాన్య బ్రిటిష్ ప్రజల ప్రస్తుత పరిస్థితి ఘోరంగా ఉన్నా, ప్రభుత్వం ఎమీ చేయలేకపోతున్నా, పరోక్షం గా వాళ్ల గత ఘన చరిత్రను ప్రజలకు గుర్తు చేస్తూ, ఫీల్ గుడ్ ఫాక్టర్ ఇవ్వటానికి చేసిన ప్రయత్నం. పాపం, ఎంత ఫీల్ గుడ్ ఫీలింగ్ కలిగేలా అక్కడి పత్రికలు ప్రయత్నిస్తున్నా, ప్రజలు మీడీయాను పట్టించుకోవటంలేదని తెలుసుతున్నాది. బ్రిటిష్ ప్రధాని గారు శ్రీలంక సమస్యను నెత్తినేసుకొని పరిష్కరించే బదులు, వారి స్వంత ప్రజల సమస్యలను పరిష్కరించటానికి ప్రయత్నిస్తే బాగుంట్టుంది. అలాగే పక్కదేశంలో ఉండే శ్రీలంక తమిళ సమస్య పైన ప్రేమను ,కరుణను కురిపించే తమిళనాడు ఓవర్ యాక్షన్ ప్రజలు, పక్క ఊరిలో ఉండే దళితుల పైన జరిగే దాడులను, దుష్ప్రచారాని అడ్డుకొనేందుకు పోరాడితే ఎంతో ఉత్తమం. ఇతర దేశాల వారి కి నీతులు చెప్పే ముందు వారిని వారు పరిశీలించుకొంటే ఎంతో ఉత్తమం.
    కాని మీడీయావారు స్వదేశంలో ధర్మదేవత నాలుగు పాదల మీద నడుస్తున్నట్లు, పక్కదేశంలో చాలా జరగరాని అన్యాయం జరిగిపోతున్నట్లు, ఈ గోల చేసే ముఠాలకు టివి లో మాట్లడటానికి అవకాశమిస్తాయి. శ్రీలం తమిళ సమస్య,చోగం సదస్సు , ప్రధాని పర్యటన గురించి ఎన్నో చర్చలు చేసిన ఇంగ్లిష్ మీడీయావారికి తమిళ నాడులో జరిగిన దళితులపై దాడి గురించి, అన్యాయం గురించి ఎప్పుడైనా చర్చించారా?

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s