ఇటీవల ఫిలిప్పైన్స్ లో సభవించిన సూపర్ టైఫూన్ హైయన్ ధాటికి అతలాకుతులం అయిన సమర్, లేటే రాష్ట్రాలు ఇంకా కోలుకోలేదు. మరణాల సంఖ్య పూర్తిగా అంచనా వేయడం ప్రభుత్వం చేతుల్లో లేకుండా పోయింది. బడా మాల్స్ నుండి జనం లూటీలకు పాల్పడకుండా భారీ భద్రత అయితే ఇచ్చారు గానీ జనం ఆకలి, అవసరాలు తీర్చడంలో మాత్రం ఫిలిప్పైన్స్ ప్రభుత్వం ఇంకా వెనుకబడే ఉంది.
హైయాన్ ధాటికి బాగా దెబ్బ తిన్న నగరం టాక్లోబన్. 220,000 మంది నివసించే ఈ నగరంలో కాంక్రీటు కానిదంతా నేలమట్టం అయింది. చాలా చోట్ల కాంక్రీటు కూడా పాక్షికంగా దెబ్బతిన్నది. పచ్చగా నిలబడ్డదంతా కూకటివేళ్ళతో పెకలించబడింది. దానితో ఆకాశం నుండి చూసేవారికి నేల, శిధిలాలు తప్ప మరొకటి కనిపించడం లేదు.
కింద ఇవ్వబడిన శాటిలైట్ చిత్రాలను గూగుల్, డిజిటల్ గ్లోబ్ సంస్ధలు సంయుక్తంగా అందించినవి. ఓడరేవు నగరం అయిన టాక్లోబన్ నగరాన్ని 2012 లో తీసిన శాటిలైట్ చిత్రం, హైయాన్ తుఫాను సంభవించిన తర్వాత రోజు తీసిన చిత్రం ఒకే ఇమేజ్ లో పొందుపరిచి గిఫ్ ఇమేజ్ గా తయారు చేశారు. తద్వారా జరిగిన నష్టం ఏమిటో స్పష్టంగా అర్ధం అవుతోంది. 2012లో కనపడిన పడవలు, భవనాలు, చెట్లు అన్నీ రెండో ఇమేజ్ లో తుడిచిపెట్టుకోవడాన్ని గమనించవచ్చు.
(గమనిక: బొమ్మపై క్లిక్ చేస్తే ఆ బొమ్మ ఒక్కటే వేరే పేజీలో ఓపెన్ అవుతుంది. అలా ఓపెన్ అయ్యాక బొమ్మకు పైన రిజోల్యూషన్ ని సూచించే అంకెలు, ఉదా: 1588 x 811, ఉంటాయి. ఆ అంకెల పైన క్లిక్ చేస్తే GIF ఇమేజి ఓపెన్ అవుతుంది.)
ఇది టాక్లోబన్ నగరం:
ఇది టాక్లోబన్ లోని అనిబొంగ్ జిల్లా భాగం. తీరం వెంట ఉన్న ఇళ్ళు, పడవలు ఆగే డాక్ లు అన్నీ నాశనం కావడం చూడవచ్చు.
అనిబాంగ్ జిల్లాలో పనలారన్ అఖాతం యొక్క తీరం ఇది. హైయన్ పెను తుఫాను తీవ్రతకు సముద్రంలో ఉన్న సరుకు ఓడలు తీరం దాటి కొట్టుకువచ్చాయి. తుఫానుకు ముందు భవనాలు, ఇళ్ళు ఉన్న చోట తుఫాను తర్వాత ఓడలు, పడవలు వచ్చి చేరాయి.