అందరికీ సచిన్ జ్వరం, భారత రత్నకు కూడా


సచిన్ క్రికెట్ క్రీడా జీవితం నేటితో ముగిసింది. 40 యేళ్ళ సచిన్ టెండూల్కర్ నెలరోజులు ముందుగానే తన రిటైర్మెంట్ ప్రకటించడంతో అప్పటినుండీ దేశంలో క్రికెట్ జ్వరం అవధులు దాటి పెరిగిపోయింది. సచిన్ రిటైర్కెంట్ కోసమే అన్నట్లుగా వెస్టిండీస్ తో రెండు టెస్టుల సిరీస్ ను బి.సి.సి.ఐ ఏర్పాటు చేయడంతో అనేకమంది కలలు గనే ఒక అందమైన క్రీడా జీవితానికి అందమైన ముగింపు పలికినట్లయింది. రెండు మ్యాచ్ లు ఇన్నింగ్స్ తేడాతో గెలవడం ద్వారా జట్టు సహచరులు సచిన్ కు అద్భుతమైన కానుక ఇచ్చారని పత్రికలు వ్యాఖ్యానిస్తున్నాయి.

సచిన్ జ్వరం ఎంతమందికి ధర్మా మీటర్లను బద్దలు చేసిందో గానీ చివరికి భారత ప్రభుత్వం కూడా ఆయన రిటైర్మెంట్ రోజునే ‘భారత రత్న ప్రకటించింది. క్రీడాకారులకు భారత రత్న ఇవ్వరాదన్న సూత్రాన్ని భారత ప్రభుత్వం సవరించుకుని మరీ ఆయనకు భారత దేశ అత్యున్నత పురస్కారాన్ని ప్రకటించింది. సొంత జీవితం కోసం కాకుండా దేశం కోసం, దేశ ప్రజల కోసం జీవితాన్ని అర్పించిన వారికి మాత్రమే ఇవ్వాల్సిన భారత రత్న బిరుదుకు కూడా ఆ విధంగా సచిన్ జ్వరానికి లొంగిపోయింది. సమీప భవిష్యత్తులో కాకపోయినా ఎప్పటికైనా ఈ నిర్ణయం వివాదాస్పదం కావడానికి అవకాశాలు లేకపోలేదు.

మ్యాచ్ ముగిసిన అనంతరం బహుమతి ప్రదానం ముగిశాక సచిన్ స్టేడియంను ఉద్దేశిస్తూ ప్రసంగించాడని పత్రికలు చెప్పాయి. తన క్రికెట్ క్రీడా జీవితం దివ్యంగా విలిగిపోవడానికి సహకరించిన మిత్రులకూ, కుటుంబానికి ఆయన తన ప్రసంగంలో కృతజ్ఞతలు చెప్పారని తెలుస్తోంది. క్రికెట్ క్రీడలో సమకాలీన ఆటగాళ్లలో సచిన్ ను మించిన ఆటగాడు లేరని తరచుగా పత్రికలు చెబుతుంటాయి. ఆయనకు వెస్టిండీస్ ఆటగాడు లారాకు తరచుగా పోలికలు తెచ్చి వివాదపడిన సందర్భాలు కూడా పత్రికల్లో చోటు చేసుకున్నాయి.

మచ్చలేని క్రీడా జీవితం సచిన్ సొంతం అని కొందరంటే కాదనేవారు కొందరున్నారు. ఆయన రిటైర్మెంట్ ప్రకటించాక ఆస్ట్రేలియా ఆటగాళ్లు గిల్ క్రిస్ట్, రికీ పాంటింగ్ లు వెంటనే హర్భజన్ సింగ్ వివాదాన్ని గుర్తు చేశారు. తమ జట్టు సభ్యుడు ఒకరిని హర్భజన్ ‘మంకీ’ అని పిలిచాడని, అది విని కూడా వినలేదని సచిన్ అబద్ధం చెప్పాడని వారు ఆరోపించారు. ఎన్నడో జరిగిన వివాదాన్ని వాళ్ళు రిటైర్మెంట్ సందర్భంగా గుర్తు తెచ్చారంటే అర్ధం సచిన్ మచ్చలేనివాడేమీ కాదని వారు చెప్పదలచుకోవడమే కారణమా?

ఇంతమంది చెబుతున్నప్పుడు క్రికెట్ ఆట పరంగా, ఆయన సృష్టించిన అనేక రికార్డుల దృష్ట్యా, సచిన్ టెండూల్కర్ గొప్ప ఆటగాడే కావచ్చు. కానీ ఇంతగా జ్వరం పట్టి పీడించే గొప్పతనం అతనికి నిజంగానే ఉన్నదా? వ్యక్తి ఎన్నడూ తాను భాగం అయిన వ్యవస్ధకంటే మించిన గొప్పతనాన్ని ఎన్నడూ సొంతం చేసుకోజాలాడు.

సచిన్ టెండూల్కర్ క్రికెట్ అనే వ్యవస్ధలో ఒక పాత్రధారి. ఆట ఆయనకు ముందూ ఉంది, తర్వాతా ఉంటుంది. అందువల్ల క్రికెట్ కంటే అతను గొప్ప వాడు కాదు.

సచిన్ కి తన జీవితం అంటూ ఒకటుంది. అది క్రికెట్ కి ముందూ ఉంది, తర్వాతా ఉండబోతోంది. కాబట్టి సచిన్ జీవితం కంటే సచిన్ క్రికెట్ జీవితం గొప్పది కాబోదు.

భారత క్రికెట్ జట్టులో సచిన్ కంటే ముందు అనేక మంది గొప్ప ఆటగాళ్లు ఉన్నారు. తర్వాతా ఉంటారు. కనుక జట్టు కంటే సచిన్ గొప్ప వ్యక్తి కాజాలాడు.

క్రికెట్ కు మించిన జీవితం ఈ దేశానికి ఉన్నది. 120 కోట్లమంది జీవితాలు ఈ దేశాన్ని నిర్మిస్తున్నాయి. సచిన్ ఆడే క్రికెట్ కూడా అనేకమంది జనం అనేక రకాలుగా శ్రమించి సృష్టించే ఉపకరణాలు లేకుండా మనలేదు.

ఆయన పట్టుకునే బ్యాట్ దగ్గర్నుండి, ఆయన ఆడే మైదానం వరకూ ఎంతోమంది శ్రమజీవులు స్వేదం చిందించి నిర్మిస్తున్నారు. వారి గురించి ఆలోచించకుండా సచిన్ ఎంత గొప్ప ఆటగాడైనా కావచ్చు గానీ గొప్ప వ్యక్తి మాత్రం కాజాలాడు. 

సచిన్ వీడ్కోలు సందర్భంగా ఈనాడు పత్రిక  తన వెబ్ సైట్ లో సచిన్ ఫోటో గ్యాలరీని ప్రచురించింది. సచిన్ అనేకమంది ప్రముఖులతో ఉండగా తీసిన ఫోటోలు ఇందులో ఉన్నాయి. సచిన్ అభిమానులకు ఈ గ్యాలరీ కనువిందు చేస్తుంది. ఆసక్తి ఉన్నవారు ఈ లింకులో వెళ్ళి చూడవచ్చు.

23 thoughts on “అందరికీ సచిన్ జ్వరం, భారత రత్నకు కూడా

 1. “క్రీడాకారులకు భారత రత్న ఇవ్వరాదన్న సూత్రాన్ని భారత ప్రభుత్వం సవరించుకుని మరీ…”, “సొంత జీవితం కోసం కాకుండా దేశం కోసం, దేశ ప్రజల కోసం జీవితాన్ని అర్పించిన వారికి మాత్రమే ఇవ్వాల్సిన భారత రత్న”

  నాదో సందేహామండీ! గాయకులూ, సంగీతకారులూ, రాజకీయనాయకులూ (వాళ్లకి ఇతరేతర ఆదాయమార్గాలున్నా) భారతరత్నకి అర్హులైనప్పుడు, వారి ఆయా అర్హతలమీద ఎవరికీ సందేహాలు లేనప్పుడూ క్రీడాకారులు మాత్రమే ఒక exception అవుతారు? ఒక సైనిక జనరల్‌కూడా జీతమివ్వడమ్మానితే పనిచేయడానికి ఇష్టపడరు. అలాంటప్పుడు ఒక వ్యక్తి దేశప్రజలకోసమ్మాత్రమే జీవించారని ఎలా చెప్పగలం?

  P.S. : నేను సచిన కాదు కదా, కనీసం క్రికెట్ అభిమానినికూడా కాను. ఇంతవరకూ నేను ఒఖ్ఖ క్రికెట్‌మ్యాచ్ కూడా చూడలేదు. సచిన్‌గారి ఫ్రారీ కారు ఉదంతం మొ|| నాకు నిక్షేపంగా జ్ఞాపకమున్నాయి.

 2. అవును. మీ అనుమానంలో న్యాయం ఉంది. గాయకులు, సంగీతకారులు, రాజకీయ నాయకులు మాత్రం దేశానికి చేస్తున్న ప్రయోజనం ఏముంది గనక?

  సంగీతం ఇప్పుడు జనం నుండి దూరంగా వెళ్లిపోయింది గానీ, అది పుట్టినపుడు జనంతోనే పుట్టింది. ‘పనీ-పాటా’ అంటారు. అంటే పనితోనే పాట పుట్టింది అని. కాలక్రమేణా పనికి దూరమైన పాట సవాలక్షా నిబంధనల్ని చేర్చుకుని మామూలు జనానికి అందకుండా పోయింది.

  అయితే జనంతో మిగిలిన పాట కూడా ఉంది. ప్రజల శ్రమ సంస్కృతిలో భాగంగా ఉన్నంతవరకూ అది ప్రజలతో కలిసి మెలిసి ఉంది. పాటను జనం కోసం వెచ్చించిన గద్దర్ లాంటివారు గానాన్ని ప్రజల కోసం ఎలా ఉపయోగించవచ్చో చూపించారు. అలాంటివారు, ప్రజా జీవితంలో ఉన్నంతవరకూ, నిస్సందేహంగా దేశానికి రత్నాలే. కానీ రత్నాలుగా గుర్తించబడుతున్నవారు జనం నుండి వేరుగా ఉండడమే ఆక్షేపణీయం.

  రాజకీయ నాయకులు కూడా ప్రజలకు అంకితం అయితే వారూ రత్నాలే. కానీ అలాంటివారు మనకు లేరు కదా! అందువల్ల ఉన్నవారికే ఇచ్చి సంతృప్తిపడుతున్నారు కాబోలు!

 3. 1)సచిన్ తన ఆటతోనే కాదు .తన వ్యక్తిత్వంతోను అభిమానులను సంపాదించుకున్నాడు..”ఇంతగా జ్వరం పట్టి పీడించే గొప్పతనం అతనికి నిజంగానే ఉన్నదా? ” అని సందేహపడాల్సిన అవసరం లేదు .దేశం లో క్రికెట్ కి ఆదరణ పెరిగిందే ఈ క్రికెట్ దేవుడి వలన…..
  2) “వెస్టిండీస్ ఆటగాడు లారాకు తరచుగా పోలికలు తెచ్చి వివాదపడిన సందర్భాలు కూడా పత్రికల్లో చోటు చేసుకున్నాయి.?”
  ఇక్కడ ముఖ్యంగా గమనించవలసినది “పోలికలు తెచ్చి” పెద్ద వివాదం చేసి మీడియా పండగ చేసుకుంది. కానీ ఏ రోజు తన ఆటను …ఏకాగ్రతను దేబ్బతెయలేకపోయింది.
  ౩)*వినోదాన్ని అందించడం ఆటల ముఖ్య లక్షణం : 24 సంవత్సరాలుగా ఎన్నో సాధక బాధకాలను పడి ..నిలబడి ఆడటం చిన్న విషయం కానే కాదు .. ఇన్ని ఏళ్ళు ఒక ఆటలలో నిబద్దతతో వుండటం అసలు సామాన్యమైన విషయమే కాదు…. అలాంటి అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ఒకే ఒక్కడు సచిన్. సచిన్ కి ముందు ఎంతో మంది వచ్చారు తరువాత ఎంతో మంది వస్తారు కానీ సచిన్ ని బర్తి చేయడం బహుశా ఇంకో వెయ్యి ఏళ్ళయిన కుదరదనేన్ని రికార్డులు సృష్టించి ఇంతటి అభిమానాన్ని గెలుచుకున్నాడు.
  4)సచిన్ టెండూల్కర్ క్రికెట్ అనే వ్యవస్ధలో ఒక పాత్రధారి. ఆట ఆయనకు ముందూ ఉంది, తర్వాతా ఉంటుంది. అందువల్ల క్రికెట్ కంటే అతను గొప్ప వాడు కాదు?
  *క్రికెట్ కి ప్రాచుర్యం లభించి నేటి భారత టీం లో ఎంతో మంది ఆటగాళ్ళకు ..రేపటి తరం ఆటగాళ్ళకు స్ఫూర్తి ప్రదాత సచిన్. సచిన్ అవుట్ ఐటీ టి.వి లు కట్టి ఆటను చూడటం మనేసేన్తటి గొప్ప వ్యక్తి .
  5)ఆయన రిటైర్మెంట్ ప్రకటించాక ఆస్ట్రేలియా ఆటగాళ్లు గిల్ క్రిస్ట్, రికీ పాంటింగ్ లు వెంటనే హర్భజన్ సింగ్ వివాదాన్ని గుర్తు చేశారు. తమ జట్టు సభ్యుడు ఒకరిని హర్భజన్ ‘మంకీ’ అని పిలిచాడని, అది విని కూడా వినలేదని సచిన్ అబద్ధం చెప్పాడని వారు ఆరోపించారు.
  *ఆస్ట్రేలియా ఆటగాళ్ళ చరిత్రలు చూస్తేయ్ కొత్త వివాదాలకు ఎప్పుడు కేంద్ర బిందువులు..ఈ సోకాల్డ్ పీపుల్ వారి పుస్తకాల ప్రచారానికి వాడుకునే విలువలేని సిగ్గుమాలిన వ్యాక్యాలు .

 4. ఇక్కడ నా ఉద్దేశం ప్రతి రంగం లో ఒకరుంటారు .ఆ ఒక్కడు ఇక్కడ సచిన్…..అదనపు విషయం ఇక్కడ గుర్తిన్చావలసింది .ఎంత ఎదిగిన ఒదిగి వుండటం …. పునాదుల్ని మర్చిపోకపోవడం.. ఇంట మంది అభిమానుల్ని సపదించింది కేవలం ఆటతోనే కాదు… మంచి వ్యక్తిత్వం తో ? సచిన్ నీకు సలాం

  వాంఖడే స్టేడియంలో సచిన్ రిటైర్మెంట్ వేడుక ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా సచిన్ ఉద్వేగ భరితంగా మాట్లాడాడు. ఆ మాటల్లోని ముఖ్యాంశాలు…

  ”ఇంత అద్భుతమైన ప్రయాణం ముగిసిందంటే ఆశ్చర్యంగా ఉంది. ఈ సందర్భంగా అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నా జీవితంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తి.. నా తండ్రి. ఆయన నాకు చిన్నతనంలోనే స్వేచ్ఛనిచ్చి, కోరుకున్న కెరీర్ ఎంచుకొమ్మన్నారు. నేను ఆయన అడుగుజాడల్లోనే నడిచాను. ఆయన అద్భుతమైన వ్యక్తి కూడా. ఆయన ఆశీస్సుల వల్లే ఇంత స్థాయికి ఎదిగాను. నన్ను పెళ్లి చేసుకోవడం అంత సులభం కాదు. కానీ అంజలి చాలా ఓర్పు, సహనంతో వ్యవహరించింది. ఆమె తన ఇద్దరు బిడ్డలతో పాటు.. నన్ను కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంది. గడిచిన 24 ఏళ్లుగా దేశం కోసం ఆడాను. ఆమె ఎప్పుడూ ప్రార్థస్తూ ఉంది. ఆ ప్రార్థనల ఫలితం వల్లే నేను బాగా ఆడగలిగాను.

  మా పెద్ద అన్నయ్య ఎప్పుడూ నాకు వెన్నంటి ఉండి ప్రోత్సహించారు. అందుకే నేను దృష్టి పెట్టగలిగాను. మా సోదరి సబిత నాకు మొదటి బ్యాట్ కొనిచ్చింది. అందుకు చాలా కృతజ్ఞతలు. మా సోదరుడు అజిత్ గురించి ఎంత చెప్పినా తక్కువే. రమాకాంత్ ఆచ్రేకర్ సార్ దగ్గరకి తనే తీసుకెళ్లాడు. ఆయన నాకు అన్నీ చెప్పకపోతే నేను క్రికెట్లో చాలా కిందిస్థాయిలో ఉండేవాడినేమో.

  1990లో నేను అంజలిని కలవడం నా జీవితంలో చాలా అద్భుతమైన క్షణం. నేను అలా అడుగులో అడుగు వేసుకుంటూ తనవద్దకు వెళ్లాను. ఆమె ఓ డాక్టర్. తాను నన్ను క్రికెట్ ఆడమంది, తాను కుటుంబ బాధ్యతలు తీసుకుంటానంది. నా తప్పులు, ఒత్తిళ్లు తట్టుకున్నందుకు చాలా థాంక్స్. జీవితంలోని ఎత్తుపల్లాలన్నింటిలో తోడున్నందుకు థాంక్స్. (ఈమాట అనగానే అంజలి కంటివెంట కన్నీరు వచ్చింది). జీవితం నాకిచ్చిన రెండు వరాలు.. సారా, అర్జున్. ఇప్పుడు ఇప్పటికే పెరిగారు. వాళ్లకు కూడా నేను చాలా థాంక్స్ చెప్పాలి. వాళ్ల పుట్టినరోజులు, స్పోర్స్ట్ డేలు, ఏం జరిగినా ఎప్పుడూ నేను ఉండేవాడిని కాను. వాళ్లు నాకు ఎంత ప్రత్యేకమో వాళ్లు ఊహించలేరు. ఇన్నాళ్లుగా నేను మీకు సమయం కేటాయించలేకపోయాను. కానీ రాబోయే 16 ఏళ్లు పూర్తిగా మీతోనే ఉంటాను.

  చిన్నతనంలో నాకు చాలామంది స్నేహితులుండేవారు. వాళ్లను నెట్స్లోకి పిలిచి నాకు బౌలింగ్ చేయమనేవాడిని. సెలవులు వచ్చినప్పుడల్లా నేను సరిగా ఆడుతున్నానో లేదోనని వాళ్లను వేధించేవాడిని. తెల్లవారుజామున మూడు గంటలకు కూడా నాతోపాటు వాళ్లు వచ్చి, నీ కెరీర్ అయిపోలేదని ప్రోత్సహించేవాళ్లు. వాళ్లందరికీ చాలా థాంక్స్. నేను 11 ఏళ్ల వయసులో క్రికెట్ కెరీర్ మొదలుపెట్టాను. ఆచ్రేకర్ సార్ నా కోచ్ అయిన తర్వాత జీవితం చాలా మారింది. ఆయనను చూసినప్పుడు చాలా ఉద్వేగానికి లోనయ్యాను. సార్ నన్ను స్కూటర్ మీద ఎక్కించుకుని ముంబై మొత్తం మ్యాచ్ల కోసం తిప్పేవారు. గత 29 ఏళ్లుగా ఆయన నన్ను నడిపిస్తూనే ఉన్నారు. ఇక జీవితంలో మ్యాచ్లు చూడటమే తప్ప ఆడటం ఉండదు!! ముంబైలో.. ఇదే మైదానంలో నా ఆట మొదలైంది. అందుకే ఇప్పుడు కూడా ఇక్కడే ఆడాలనుకున్నాను.

  బీసీసీఐ నన్ను 16 ఏళ్ల వయసులో ఎంపిక చేసింది. అప్పుడు నన్ను తీసుకున్న సెలెక్టర్లందరికీ చాలా చాలా కృతజ్ఞతలు. మీ అందరి మద్దతు నాకు చాలా ఉంది. గాయపడినప్పుడు కూడా దగ్గరుండి చికిత్సలు చేయించి మళ్లీ భారత్ తరఫున ఆడేలా చేశారు. రాహుల్, లక్ష్మణ్, సౌరవ్… ఇలా వీళ్లందరూ నేను కుటుంబానికి ఊదరంగా ఉన్నప్పుడు డ్రస్సింగ్ రూంలో నాతో ఉండేవారు. వాళ్ల సాహచర్యం నాకు చాలా స్పెషల్. ఎంఎస్ ధోనీ నాకు 200 టెస్టు మ్యాచ్ క్యాప్ ఇచ్చినప్పుడు టీమ్ కోసం ఓ సందేశం ఇచ్చాను. మనమంతా భారత క్రికెట్ జట్టులో భాగమైనందుకు ఎంతో గర్వపడాలి. మీరు మీ పూర్తి సామర్థ్యంతో జాతికి సేవలు అందిండచం కొనసాగిస్తారని ఆశిస్తున్నా. నా డాక్టర్లు, ఫిజియోలు, ట్రైనర్లు.. వాళ్లను ప్రస్తావించకపోతే పెద్ద తప్పు చేసినట్లే. వాళ్లు చేసిన ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. నేను ఎక్కడున్నా గాయపడినప్పుడు వెంటనే వచ్చి, తీసుకెళ్లి మళ్లీ మామూలు సచిన్ను చేసేవారు. వినోద్ నాయుడు గత 14 ఏళ్లుగా మా కుటుంబంతో ఉన్నాడు. తన వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేసి నా కోసం పనిచేశాడు. స్కూలు సమయంలో ఆడుతున్నప్పటి నుంచి ఇప్పటివరకు నన్ను ప్రోత్సహించిన మీడియాకు కృతజ్ఞతలు. ఫొటోగ్రాఫర్లు నావి మంచిమంచి ఫొటోలు తీశారు.

  చివరిగా ఒక్కమాట.. ప్రపంచంలోని నలుమూలల నుంచి వచ్చిన ప్రేక్షకులు కూడా నన్ను చాలా చాలా ప్రోత్సహించారు. వాళ్ల ప్రోత్సాహమే లేకపోతే ఇదంతా ఉండేది కాదు. వాళ్లకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. సాచిన్.. సాచిన్.. అని అరుస్తుంటే నా గుండెల్లోంచి ఉద్వేగం పొంగుకొచ్చేది. థాంక్యూ వెరీమచ్. మీరంతా అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. థాంక్యూ…

 5. వ్యక్తివాదం జడలు విప్పుకొని నర్తించే సమాజం లో ఇవన్ని చూసి హశ్చర్య పడాల్సిన అవసరం లేదు. ఇక్క డ ఆత్మ వంచనా పరవంచన సహజమే! పని పాట అనె నానుడితో పాటు, ఆటా పాట అని కూడ అన్నారు కనుక ఆటలను చిన్నపుచ్చాల్సిన అవసరమూ లేదు. అన్నీ ఆటలకంటే ఈ క్రికెత్‌ ఆటకే ఎందుకు ప్రాధాన్యత వచ్చిందో ఈ క్రికెట్‌ పిచ్చోల్లకు తెలుసో లేదో? తెలిసి మాత్రం ఏం చేస్తార్లెండి!
  మనం గ్రామర్‌ చుదువుకొనే టపుడు కాంపారెటివ్‌ సూపర్లేటివ్‌ విశేషానాలు అని కొన్ని రావటం మనకు తెలుసు. సచ్చిన్‌ కాంపారెటివ్‌ గా చూస్తే ఉన్న ఆట గాల్లలో మంచి ఆట గాడా ? లేక భారత సమాజంలో పౌరలందరికంటే మంచి ఆట గాడా? భారత పౌరలందరికంటే (సూపర్లెటివె) మచి ఆటగాడైనట్లైతే ఆయనకు భారతరత్న ఇవ్వటం లో ఎలాంటి తప్పు లేదు. ఈలాంటి సచిన్‌ లు ఎంతమంది భారత సమాజంలో ఎంతమంది తెరవెనుక ఉన్నరో ఆలోచించే వారికి తెలుస్తుంది! అభం శుభం తెలియని అమాయకులను పిచ్చివాల్లను చేసే వారికి భారత రత్న ఇచ్చి గౌరవించారంటే మనం ఎలాంటి సమాజంలో ఉన్నామో తెలుసు కోవచ్చు.

 6. goppa vyatkitvam kala vade oka gopa aata gadu kavachu….bhrata deshanii 24 yrs sambaraparichi manani vinodimpacheydam matalu kaadu..ataniki bharata ratna ivvalsinde ..endukanaga sachin ani peru teliste chalu ee praapanchamlo cricket ante teliyani deshalu kuda ohooo itadu indian ani ankunntaruu..lata mangeshkar garu oka gayani matrame ante devudu tana galanni ala srustinchaka pointe ame matram enta kasta padda inta phalitham lekapoyedi kani sachin tanakai tanu kastapadi aata ki deshaniki vanne techadu……mangeshkar gariki bharat ratna iste tendulkar gariki kuda ivalsinde…ika asutrlia lo jathi vipakshata chala undi vallu manani ela takuva cheyalo alochistuntaru ..bradman garu sachin goppa aata gadu annapudu ponting inka tana sahacharulu tattukolekapoyaru …ilantapudu aussie vallu edaina cheduga matladatam pattinchukovalsina vishayam kadu….aina asalu australia vare tana desham lo attyunata pursakram ORDER OF AUSTRALIA
  ichinapudu , manam biddaki manamu BHARATA RATNA ivvdam samanjasameee…

 7. సంపాదనే ధ్యేయంగా అత్యుత్తమ పురస్కారాలకు తావులేదు. పురస్కారం ప్రతిభాసామర్ధ్యాలకు గుర్తింపు, ప్రోత్సాహం, భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకం. కానీ, నేటి పరిస్థితులలో రాజకీయ సహకారంతో ప్రభుత్వ పాలనా యంత్రాగం పై విషయాలను పరిగణలోకి తీసుకోక సిఫార్సులకు పెద్దపీట వేసి సహకరిస్తోందనే అపవాదును నెత్తిన వేసుకుంది. ఫలితంగా వీటిని సామాజిక వ్యవథకు అనుసంధానం చేసే గుర్తింపులుగా జమకట్టారు. ధరఖాస్తులు మస్తు, సిఫార్సులకు శిస్తు, అర్హతదారులు పస్తు. సచిన్ విషయంలో ప్రజాభిప్రాయనుసారంగా భారతరత్న ఇచ్చినట్లుగానే ఇతర అత్యుత్తమ పురస్కారాలకు ఇదే తరహాను ప్రతిబింబింప చేసినప్పుడు వాటి విలువలకు సంస్కారం ఎన్నిక విధానంలో పరిష్కారానికి సరైన విధానం.

 8. తిరుపాల్ గారు ఇది వ్యక్తీ వాదం ఎలా అవ్తుతుంది ఏ రంగం లో అయిన తనదైన ప్రత్యేకత చూపించెయ్ వాళ్ళు గొప్పవారిగా కొనియాడబడతారు ….ఇలా తెర వెనక ఎంతో మంది గొప్పవాళ్ళు వున్నారు వాళ్ళకు గుర్తింపు లబించడం లేదు అనడం లో సందేహం లేదు , కానీ ప్రతి రంగము లో తన రంగానికి సేవ చేసి ఆ రంగానికే గుర్తింపు తెచ్చిన కొద్ది మంది ఆణిముత్యాలు బావితరాలకు , ఆ రంగం లో ప్రవేశించడానికి స్పూర్తి ప్రదాతలు . అందుకే సచిన్ అందరితో కొనియదబడతారు. ఎంతమందిని ఆనంద పరచాకపోతేయ్ ఇంతలా ప్రేమచుపిస్తారు అతని పై.

  క్రికెట్ తో పాటు అన్ని క్రేడాలని ప్రోత్సహించి ప్రజలలోకి తెసుకేల్లడం ఇక్కడ మనం మర్చిపోయిన ముక్య విషయం . అందుకే ఒలింపిక్స్ లో మనం ఎంతో వెనకబదిపోయం…

  పైపెచ్చు భారతరత్న విషయానికి వస్తే పక్క దేశాలు సచిన్ ని వారి వారి దేశాల అత్యున్నత పురస్కారాల్ని అందిచినపుడు మనం మన ఆణిముత్యాన్ని ఇలా కించపరచడం ఎంతవరకు సముచితం సర్ .24 ఏళ్ళు దేశానికీ తన అట ద్వారా పేరు తెచ్చి ఇప్పుడు మొదటి స్థానం లో దేశాన్ని నిలిపిన వ్యక్తిని మరిచిపోతే సచిన్ మన దేశం లో పుట్టడం తన ధవ్ర్భాగ్యం .

 9. *సచిన్ మచ్చలేనివాడేమీ కాదని వారు చెప్పదలచుకోవడమే కారణమా?*

  సచిన్ కి ఇవ్వటం వలన భారతరత్న కు విలువ పెరిగింది. మచ్చలేని వాడి లో మచ్చలు వెతకటం అనే పని పెట్టుకొన్న వారు చాలా మంది ఉంటారు. ఎదో ఒక మచ్చ అంట్ట గట్టి వివాదం చేసి, సొమ్ము చేసుకోవటానికి వారు నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటారు. అది పాశ్చ్యత్య సంస్కృతి లో అంతర్భాగం. అటువంటి వారు మనదేశ చరిత్రలో నిలబడలేరు. కాలక్రమేణా సచ్చిన్ లాంటి వారి గొప్ప తనం పెరిగేదే తప్ప తగ్గేది ఎమి ఉండదు.

 10. శ్రీరాం గారూ, భజన్ ‘మంకీ’ అని తిట్టడం విన్నా వినలేదని సచిన్ చెప్పిన మాట నిజమే కదా? అలాంటప్పుడు అంటగట్టడం అవ్వదేమో?

 11. v.శేకర్ గారు “మంకీ” అనే వివాదం లో సచిన్ ప్రమేయం లేదు అది నిజం కాదు ….దేనిని మీరు ప్రామాణికం తెసుకున్నారో బహుశా పాంటింగ్ వ్యాక్యాల పై ఆదారపడి వుంటారు ….ఇంకో రెండు నెలల్లో అనిల్ కుంబ్లే తన బుక్ లో వివరిస్తారు ….

 12. సచిన్ వ్యక్తిత్వం నిజంగానే గొప్పదేనండి.

  చిన్న వయసులోనే దేశానికి అడి గొప్ప ఆటగాడిగా గుర్తింపు పొందినా , చుట్టూ కవ్వించే వాతావరణం ఉన్నా ఏరోజూ ప్రలోభాలకి లొంగిపోలేదు. కొంతమంది సినిమా నటులలాగా బహిరంగంగా ధూమపానం మద్యపానం లాంటివి చెయ్యలేదు.

  కొంతమంది తోటి ఆటగాళ్ళలాగా ఫిక్సింగ్ లాంటి నీచపుపనులు చేయ్యలేదు. శీతలపానియాలకి ప్రచారం చేసిన మాట నిజమే,అంతిమలక్ష్యం డబ్బేకావచ్చు కాని తన 24 సంవత్సరాల కెరియర్లో ఏనాడూ ఎంత డబ్బు ఇస్తామన్నా మద్యం కంపెనిలకి ప్రచారం చెయ్యలేదు.ఆవిషయంలో అతను చలామందికి ఆదర్సప్రాయుడు.

  తనమాట చెల్లుబాటు అయ్యె అవకాశం ఉన్నా ఏనాడూ తోటి ఆతగాళ్ళని విమర్సించడానికి ప్రయత్నించలేదు.

  తామేదో గొప్ప ప్రవర్తన గలవాళ్ళలాగా సచిన్ను అనడానికి రడీ అయిపోతున్న ఆస్ట్రేలియా ఆటగాళ్ల భాగవతం తెలియనిది ఎవరికి. వాళ్ళ మాటలు ఎంత నీచంగా ఉంటాయో చిన్నపిల్లవాడిని అడిగినా చెప్పెస్తారు. అసలు ఆటలో నిజాయితీగా గెలవలేక స్లెడ్జింగ్ అని ముద్దుపేరు పెట్టుకుని ప్రత్యర్ధి ఆటగాణ్ణి దూషిస్తూ ఎన్నొ మ్యాచ్ లు గెలిచిన చరిత్ర వారిది.

  ఉదాహరణకి బ్యాటింగ్ చేసే ఆటాగాడి వెనుక ఉండే ఫీల్డర్లు “ఎంటి బాస్ ఇంటి దగ్గర మీఆవిడా నా పిల్లలు ఎలా ఉన్నారు” అని అనేవారుట. ఆమాటలకి ఉక్రోషపడిన ఆటగాడు కాన్సంట్రేషన్ చేడి అవుట్ అయిపోయేవాడు.అంపైర్లు కూడా ఆస్ట్రేలియా ఆటగాళ్ల మాటలు విననట్లు నటిస్తూ , ఆసియా ఆటగాళ్ళవైపు ఏమాత్రం తప్పు కనిపించినా వెంటనే శిక్షలు విధించేవారు.
  అటువంటి మాటలు ఎన్ని అతనిని బాధపెట్టి ఉంటాయో మంకిగేట్ వివాదంలో సచిన్ హరిభజన్నే సపోర్ట్ చేసాడు.

  కనుక ఆస్ట్రేలియా ఆటగాళ్లని వారి విమర్శలని ఏమాత్రం పట్టించుకోవలసిన అవసంలేదు. అసలు వారి మిడియా కూడా ఆసియా ఆటగాళ్ళ విషయంలో ఒకవిధంగాను మిగిలిన దేశాల విషయంలొ మరొక విధంగాను రియాక్ట్ అవుతుంది.

  ఇటువంటి వాతావరణంలో ఉండికూడా కోట్లాదిమంది భారతీయ అభిమానుల మనసులనేగాక అనేకమంది ప్రత్యర్ధి ఆటగాళ్ళ అభిమానంకూడా సంపాదించుకున్నాడంటే సచిన్ గొప్ప ఆటగాడే కాదు నిస్సందేహంగా గొప్ప వ్యక్తి…

 13. శివ గారూ, అవును. సచిన్ రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత రోజే పాంటింగ్, గిల్ క్రిస్ట్ లు ఆ ఆరోపణ చేసారు. హర్భజన్ ‘మంకీ’ అనడం ఆ పక్కనే ఉన్న సచిన్ విన్నాడనీ, విని కూడా వినలేదని మ్యాచ్ రిఫరీ వద్ద అబద్ధం చెప్పాడని వారు ఆరోపించారు.

  ఆస్ట్రేలియన్ల రికార్డు అందరికీ తెలిసిందే. కాని వారి తప్పులు ఎన్ని కలిసినా సచిన్ చేసిన తప్పును, అది ఎంత చిన్నదైనా, ఒప్పును చేయలేవు కదా! బహుశా ఆ సమయంలో సచిన్ తీసుకున్న స్టాండ్ (విని కూడా, వినలేదని చెప్పడం), ఆస్ట్రేలియన్ల చెడ్డ చరిత్ర నేపధ్యంలో, కరెక్టే కావచ్చు. సచిన్ కూడా మనిషే అని గుర్తిస్తే ఆయన తీసుకున్న స్టాండ్ సవ్యతను అర్ధం చేసుకోగలం. కాని అతన్ని ఎక్కడో కూర్చోబెట్టడం వలన ఆయన చేసిన (చేయతగ్గ) తప్పును కూడా ఉన్నది ఉన్నట్లు చూడలేకపోతున్నామనుకుంటాను.

  నాగశ్రీనివాస గారు చెప్పిన మంచి లక్షణాలు ఇంకా చాలా మంది ఆటగాళ్లకు ఉన్నాయి. మద్యం, ఫిక్సింగ్ లాంటివి. కానీ బాడ్మింటన్ క్రీడాకారుడు పుల్లెల గోపి చంద్ కోటిన్నర ఇస్తామని చెప్పినా పెప్సీ ని ఎండార్స్ చేయడానికి నిరాకరించాడన్న సంగతిని మనం సరిగ్గా గుర్తించగలిగితే సచిన్ తప్పును కూడా సరిగ్గా గుర్తించగలుగుతాము.

  కూల్ డ్రింక్స్ లో అతిగా హానికర రసాయనాలు ఉన్నాయని ఒక స్వచ్ఛంద సంస్ధ ప్రకటించినపుడు విలేఖరులు సచిన్ నే నేరుగా అడిగారు. అలాంటి హానికర కూల్ డ్రింక్ ని మీరు ఎలా ఎండార్స్ చేస్తారు? అని. దానికి సచిన్ “అదంతా నాకు తెలియదు” అని చెప్పాడే తప్ప తన ఎండార్స్ మెంట్ ని సమర్ధించుకోవడమో లేక మానేయడమో చేయలేకపోయాడు. సచిన్ ఏమన్నా చిన్న పిల్లాడా అలా చెప్పడానికి? ఆయనకి తెలియకుండా ఏమీ లేదు. కాకపోతే డబ్బును వద్దనుకోలేకపోయాడంతే.

  మనిషిగా సచిన్ కూడా అందరిలాంటివాడే. అలా గుర్తిస్తేనే ఆయన కూడా కొన్ని తప్పులు చేసాడు అని అంగీకరించగలం. లేకపోతే చాలామంది కంటే బెటర్ కదా అన్న వాదన ముందుకు వస్తుంది.

  మా అబ్బాయి కూడా సచిన్ కు వీరాభిమాని. ఈ సంగతి తనతో అంటే ‘అవును. అది ఒక చేదు వాస్తవం’ అని ఒప్పుకున్నాడు. ఎవరైనా ఆ సంగతి గుర్తించాలన్నది నా అభిప్రాయం. క్రీడాకారుడుగా సచిన్ గొప్పవాడే కావచ్చు. కాని వ్యక్తిగా అతనికి అందరిలా అనేక లోపాలున్నాయి. దేశ ప్రజల పట్లా, వారి ఆరోగ్యం పట్లా బాధ్యత వహించడానికి అతను నిరాకరించాడు. అలాంటి వ్యక్తి ‘భారత రత్న’ కు తగడని నా అభిప్రాయం. బాధాకరంగా అనిపించినా అది ‘చేదు వాస్తవం’ మరి!

 14. ఏ విషయం గురించయినా అతి గా స్పందిస్తే దాన్ని ‘ అడిక్ట్‌ ‘ లేక ‘ భానిస ‘ అంటారు. క్రికెట్‌ మాత్రమే కాదు ఒక సినిమా కూడా వినోదాన్ని కలిగించేదే. అందుకని దాని మీధ ప్రాణాలు వదిలి పెట్టెంత స్పందించాలా? జీవితం లో అన్ని విషయాల లాగా వినోధం కూడా ఒక విషయమే! దాన్ని కాదనవలసిన అవసరం లేదు. అదే విధంగా కళాభిమానం. కళాభిమానం ఉన్న వాళ్లు భానిసలౌటం లేదు.

  సినిమాలకు లేక క్రికెట్‌ కు స్పందించే వాళ్లు విపరీతమైన స్పందన కలిగి ఉన్నారు. ఇంక తాగుడుకు భానిసలైన వారికి వీల్లకి ఏం తేడా? సాంస్కృతికంగా చూస్తే మనకు పైన ఉధహారించిన మూడు ( సినిమా, క్రికెట్‌ తాగుడు) ప్రజల్ని భానిసల్ని చేయడంలో పాలకులు అతి ఉత్సాహం చూపిస్తారు ఎందు కంటే దీని వల్ల పలు విధాలుగ లాభ పడుతున్న ది వాల్లే! ప్రజలు వాటికి ఎంత భానిసలైతే అంత మంచిది. అనేక విషయాలనుండి మనసు మల్లించడం ఒకతైతే ధనం పోగు చేసు ఖొవడం లో అందె వేసిన చేతులు గా ఉన్నారు. ఎందుకంతే ఏలాంటి సంస్కృతి కావాలో మనకు తెలియక పోవడం. మెజారిటి ప్రజల్ని ఎదో ఒక మత్తులో ముంచితే అదే సంస్కృతి అయిపోతుంది. ఈ అతిగా డబ్బు చేసుకొనేవేవి ఉత్పత్తిలో భాగం కాదు. కేవలం వినోధం కోసం ఇన్నిన్ని కోట్లు లావాదేవీలు జరుతున్నాయి. దీని మనం సమర్దించాలా?

  సచిన్‌ దేశం కోసం ఏం త్యాగం చేశాడో తెలియటం లేదు. ఒక మంచి వ్యక్తి అయినంతమాత్రానా ప్రజా సేవ చేసినట్లేనా? దేశానికి మంచి పేరు తెచ్చాడంటారు. ఆ పేరు వల్ల ఎవరికి లాభం. మన దేశ ప్రజలకా? ఇక్కద ‘ ప్రజలు’ అనడం కూడా మాట్లాడె వ్యక్తిని బట్టి అర్ధం మారి పోతువుంటుంది.ప్రజలు అంటె ఏ ప్రజలో వారికి వారు నిర్ణయించుకో వలసిందే. అందరికి ఒకే అర్దం ఉండదు.

 15. వ్యక్తిగా అతనికి అందరిలా అనేక లోపాలున్నాయి …. తనలోని లోపాల్ని తనే ఒప్పుకుంటూ తనూ సామాన్యుడునే అని సచినే నిన్న తన ప్రెస్ మీట్ లో వివరించారు .కుదిరితేయ్ వాటిని ఓసారి చూడమని మనవి…. ఇది వరకు ఇదే పాయింట్ పై మనం చర్చించాం శీతల పానియాల కి అనుమతి రద్దు చేసి ప్రభుత్వం బాద్యత ఎందుకు తీసుకోదు(కూల్ డ్రింక్స్ లో అతిగా హానికర రసాయనాలు ఉన్నాయని ఒక స్వచ్ఛంద సంస్ధ ప్రకటించినపుడు). ఇక్కడ డబ్బు ఎవరికి చేదు !

 16. ‘డబ్బు ఎవరికి చేదు?’ అని మీరు సచిన్ ను వెనకేసుకొస్తున్నారు. కాని ఆ డబ్బు తనకు చేదే అని గోపి చంద్ చక్కగా చెప్పాడు. భారత రత్న అంటే భారత ప్రజల్లో రత్నంలాంటివాడు అని. కాని భారత ప్రజలకు విషపూరిత కూల్ డ్రింక్స్ తాగమని చెప్పే వ్యక్తి రత్నం కాగలడా?

  ‘నేను తాగనిదానిని, జనాన్ని తాగమని ఎలా చెబుతాను?’ అని ప్రశ్నిస్తూ పెప్సీని ఎండార్స్ చేయడానికి నిరాకరించాడు గోపీ చంద్. ఇది చాలా సింపుల్ లాజిక్. ఈ మాత్రం తెలియడానికి మేధావి కానవసరం లేదు. సచిన్ ఈ మాత్రం కూడా చేయలేకపోయాడు.

  గోపీ చంద్ భారీ ఆస్తిపరుడేమీ కాదు. కానీ అక్రమ డబ్బు తనకి వద్దనుకున్నాడు. సచిన్ అలా ఎందుకు అనుకోలేకపోయాడన్నదే నా ప్రశ్న. జనాన్ని మోసం చేసేందుకు వెనకాడని సచిన్ రత్నమా లేక జనాన్ని మోసం చేయడానికి నిర్ద్వంద్వంగా నిరాకరించిన గోపి చంద్ రత్నమా?

  ప్రభుత్వం బాధ్యత తీసుకోలేదు కాబట్టి సచిన్ కూడా బాధ్యత తీసుకోనవసరం లేదని చెప్పదలిచారా? ప్రభుత్వం కూడా తప్పు చేస్తోందనేగా అర్ధం. ప్రభుత్వంలో ఉన్నవారికి ఏ నీతీ లేదు. మద్యం తాగబోయించి, డబ్బులు పంచి.. ఇలా నానా రకాలుగా జనాన్ని ప్రలోభ పెట్టి అధికారంలోకి వచ్చేవారు అంతకంటే నీతిగా ఎలా ఉంటారు? వారి గురించి కాదుగా మనం మాట్లాడుకునేది. సచిన్ గురించి, ఆయనకు భారత రత్న ఇవ్వడం గురించి, క్రికెట్ గాడ్ అంటూ నెత్తిన పెట్టుకోవడం గురించీ మనం మాట్లాడుకుంటున్నాం.

  సచిన్ ప్రెస్ మీట్ నేనూ విన్నాను. తాను భారత రత్నకు తగనని ఎమీ అన్లేదు కదా. రావు గారికీ సచిన్ కీ పోలికే లేదు. రావు గారు అవకాశాలు వచ్చినా విదేశాలకు వెళ్లకుండా తాను చేసిందేదో ఇక్కడే చేశాడు. పత్రికలతో ఆయన చాలా చక్కని మాటలు చెప్పారు. ఆయన దేశం గురించీ, దేశంలో సైన్స్ అవసరం గురించీ, ప్రభుత్వాలు సైన్స్ కు నిధులు ఇవ్వని విషయం గురించీ మాట్లాడారు. సచిన్ ఏం మాట్లాడాడు? ఎంతసేపటికీ క్రికెట్టూ, తానూ, తన కుటుంబమూ, తన తల్లీ, తన సోదరుడూ, తన భార్యా పిల్లలూ వీళ్ల గురించేగా అతను మాట్లాడింది. మొదట భారత రత్న తన తల్లికి అంకితం అన్నాడు. ఆ తర్వాత రోజు భారత తల్లులందరికీ అంకితం అన్నాడు. భారత తల్లులందరికీ అంకితం ఎందుకు ఇచ్చాడో వివరించలేకపోయాడు. ఎందుకంటే అదేంటో అతనికే తెలియదు కనుక.

 17. సచిన్ గొప్పవాడేగాని, మీరు చెప్పిన ప్రకారంచూస్తే శీతలపానియాల ప్రచారం ద్వారా కొంతవరకు తప్పుచేసాడనే అనుకొవచ్చు.. వాటిని తిరస్కరించిన గోపి లాంటి వాళ్ళ ముందు ఇంకా కుచించుకు పొయాదు….

 18. ‘నేను తాగనిదానిని, జనాన్ని తాగమని ఎలా చెబుతాను?’ అని ప్రశ్నిస్తూ పెప్సీని ఎండార్స్ చేయడానికి నిరాకరించాడు గోపీ చంద్ ……దీనికి ఆదారం చూపించగలరా సర్ ….ఎవైన లింక్స్ వుంటే పోస్ట్ చెయ్యమని మనవి.(మీకు వీలుంటే)

 19. శివ గారూ, ఆ విషయం పత్రికలకు తెలుసో లేదో నాకు తెలియదు. కానీ గోపీ చంద్ తో దగ్గరి పరిచయం ఉన్న వ్యక్తి నాకు తెలుసు. ఆయన జాతీయ స్ధాయి షటిల్ మ్యాచ్ లకు రిఫరీగా వెళ్లేవారు. ఆయన నాకు కొలీగ్. ఇప్పుడు రిటైర్ అయ్యారు. జబ్బున పడ్డారు. ఇప్పుడు జాతీయ స్ధాయిలో షటిల్ ఆడుతున్న ప్లేయర్లంతా ఆయనకు తెలుసు. ఆయన ద్వారానే నాకు ఈ సంగతి తెలుసు. మొదట వాళ్లు కోటి ఇవ్వజూపారు. గోపి నిరాకరించారు. మళ్ళీ కోటిన్నర ఆఫర్ తో వచ్చారు. ‘కూల్ డ్రింక్స్ నేను తాగను. నేను తాగనిదాన్ని తాగమని జనానికి చెప్పలేను. సారీ’ అని ఆయన నిరాకరించారు. ఆల్ ఇంగ్లండ్ చాంపియన్ షిప్ గెలుచుకున్నాక ఇది జరిగింది. ఈ సంగతి నేను పత్రికల్లో చూడలేదు గనుక నేను లింక్ ఇవ్వలేను. అప్పట్లో తెలుగు పత్రికల్లో ఈ విషయం వచ్చిందని ఇతర మిత్రులు చెప్పారు. అలా పత్రికల్లో వచ్చిన చాలా రోజుల తర్వాతే నాకీ సంగతి మా కొలీగ్ ద్వారా తెలిసింది.

 20. శివ గారూ, పత్రికలకు కూడా ఈ విషయం తెలుసని నాకిప్పుడే తెలిసింది. గోపీచంద్ టైమ్స్ న్యూస్ నెట్ వర్క్ తోనే ఈ విషయం చెప్పారట. ఈ వాక్యం చూడండి.

  Owning social responsibility, All England badminton champion, Pullela Gopichand recently refused a lucrative endorsement deal offered by a cola major. “I am against aerated drinks as they are not good for health,” he said to Times News Network.

  ఈ వాక్యం కోసం కింద లింక్ లో చూడగలరు.

  http://www.exchange4media.com/e4m/news/printpage.asp?section_id=2&news_id=4848&tag=0

  ఇంకో లింక్ చూడండి.

  http://ibnlive.in.com/news/its-ok-to-drink-once-a-month-saina/215961-60.html

 21. శివగారూ

  గోపి చంద్ స్వయంగా చెప్పిన మాటలు ఇవి:

  ……I don’t want to cheat myself by saying something else, preach something else and doing something different. So, I don’t want to take the responsibility of a small kid going in and saying that I am drinking it because Gopichand wants me to drink it or Gopichand is advertising for it. That is the primary reason why I didn’t take this endorsement.

  నేను పెప్సీ అని చెబుతున్నాను. కానీ ఆయన నిరాకరించింది కొకొ కోలా ఎండార్స్ మెంట్ (ఆఫ్ కోర్స్! ఏ రాయయితేనేం పళ్లూడగొట్టుకోడానికి). గోపిచంద్ చెప్పిన పై మాటల కోసం కింద లింక్ చూడండి. ఆయన ఇంటర్వ్యూలో మొదటి ప్రశ్నగా కోలా ఎండార్స్ మెంట్ గురించి అడిగారు.

  http://www.hriday-shan.org/hriday/gopichand.html

 22. ధన్యవాదాలు శేకర్ గారు …మా గురువు గారు ఆకెళ్ళ రాఘవేంద్ర గారు ఓసారి ఇదే ప్రస్తావన తెచ్చారు కానీ ఇప్పుడు స్వయంగా చూసాక నమ్మకం కుదిరింది .

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s