సి.బి.ఐ రక్షతి రక్షితః -కార్టూన్


guwahati high court

‘సి.బి.ఐ ని మనం కాపాడితే మనల్ని సి.బి.ఐ కాపాడుతుంది’ అన్నది రాజకీయ నాయకుల ప్రగాఢ విశ్వాసం. ముఖ్యంగా కాంగ్రెస్ నాయకులకు ఈ సూత్రం తెలిసినంతగా మరెవ్వరికీ తెలియదు. ఎన్.డి.ఏ హయాంలో కూడా సి.బి.ఐని స్వప్రయోజనాలకు, ప్రత్యర్ధులను దారిలో తెచ్చుకోడానికి వినియోగించారని ఆరోపణలు ఉన్నాయి. కానీ యు.పి.ఏ హయాంలో అది వికృతరూపం దాల్చింది. వరుస కుంభకోణాల్లో యు.పి.ఏ మునిగిపోవడం, కూటమి రాజకీయాల్లో చట్టసభల సీట్లు మునుపు ఎన్నడూ లేనంతగా లెక్కలోకి రావడంతో సి.బి.ఐ రాజకీయ పాత్ర నూతన స్ధాయికి చేరింది.

ఇంతా చేసి సి.బి.ఐ ఏర్పాటే చట్టబద్ధం కాదు పొమ్మని గౌహతి హై కోర్టు తీర్పు ఇవ్వడంతో దేశంలో పెను సంచలనం చెలరేగింది. హోమ్ శాఖ తీర్మానం ద్వారా సి.బి.ఐ ఉనికిలోకి వచ్చిందని, ఆ తీర్మానం ఎన్నడూ రాష్ట్రపతి ముందుకు వెళ్లలేదని, రాష్ట్రపతి ఆమోదం లేని సి.బి.ఐ కి చట్టబద్ధత లేదని గౌహతి హైకోర్టు ద్విసభ్య బెంచి తీర్పు ఇచ్చింది. పోలీసింగ్ అనేది రాష్ట్రాల పరిధిలో ఉన్న అంశం అని ఢిల్లీ ప్రత్యేక పోలీసు చట్టం పరిధిలో సి.బి.ఐ ఏర్పాటయిందన్న విషయాన్ని కేంద్రం రుజువు చేయలేకపోయిందని గౌహతి కోర్టు అభిప్రాయపడింది. ఈ తీర్పు పర్యవసానాలేమిటో ప్రభుత్వ పెద్దలకు అర్ధమయ్యే లోపు కోర్టు గుమ్మాల వద్ద సి.బి.ఐ కేసులు ఎదుర్కొంటున్న పలువురు రాజకీయ నాయకుల తొక్కిడి మొదలయింది.

సి.బి.ఐ ఏర్పాటుకు చట్టబద్ధత లేదు కనుక అది నిర్వహిస్తున్న కార్యకలాపాలన్నింటికీ చట్టబద్ధత లేదని, అవి రాజ్యాంగ విరుద్ధమని గౌహతి హై కోర్టు తీర్పు పేర్కొంది. దానితో వివిధ కుంభకోణాసురులకు క్యాలండర్ లో లేని పండగ వచ్చిపడింది. తమపై సాగుతున్న సి.బి.ఐ కోర్టు విచారణలను, కేసులను వెంటనే ఆపాల్సిందిగా కోరుతూ వివిధ కేసుల్లోని నిందితుల లాయర్లు వివిధ చోట్ల దావాలు దాఖలు చేశారు.

2జి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎ.రాజా, సిక్కులను ఊచకోత కోసిన కేసులో నిందితుడయిన సజ్జన్ కుమార్ తదితరులు తమపై సి.బి.ఐ ట్రయల్ కోర్టుల విచారణ రద్దు చేయాలని పిటిషన్లు వేశారు. దానితో కేంద్ర ప్రభుత్వం మేలుకుంది. ఉరుకులు పరుగుల మీద సుప్రీం కోర్టులో పిటిషన్ వేసింది. గౌహతి హై కోర్టు తీర్పుపైన స్టే ఇవ్వాలని కోరింది. తీర్పుపై కేంద్రం ఎంత హడావుడి చేసిందంటే సెలవుల్లో ఉన్న సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ సదాశివం ఇంటిలోనే విచారణ నిర్వహించారు. పరిస్ధితి తీవ్రత దృష్ట్యా గౌహతి హైకోర్టు తీర్పుపై స్టే మంజూరు చేస్తున్నట్లు జస్టిస్ సదాశివం, జస్టిస్ రంజన దేశాయ్ లతో కూడిన బెంచి పేర్కొంది.

సుప్రీం కోర్టు ద్విసభ్య బెంచి ప్రకారం దేశంలో 9,000 క్రిమినల్ కేసుల్లో సి.బి.ఐ ట్రయల్ కోర్టులు ట్రయల్ నిర్వహిస్తున్నాయి. మరో 1,000 కేసుల్లో సి.బి.ఐ విచారణ సాగుతోంది. గౌహతి హైకోర్టు తీర్పు ప్రకారం సి.బి.ఐ కి పరిశోధన చేసి నివేదికలు ఇచ్చే హక్కు ఉంది తప్ప చార్జి షీటు వేసి ప్రాసిక్యూట్ చేసే అధికారం లేదు. దానితో ఈ 10,000 కేసుల్లో విచారణ, ట్రయల్స్ ప్రమాదంలో పడ్డాయి. ఈ ప్రమాదం నివారించడానికి స్టే ఇస్తున్నట్లు సుప్రీం బెంచి తెలిపింది.

‘సందట్లో సడేమియా’ గా సి.బి.ఐ స్వతంత్రంగా వ్యవహరిస్తుందేమోనని కేంద్ర ప్రభుత్వం భయపడినట్లుగా ఈ కార్టూన్ సూచిస్తోంది. సి.బి.ఐ కి స్వతంత్రత ఇవ్వాలని ఇప్పటికే డిమాండ్లు వస్తున్నాయి. ఈ మేరకు చట్టం చేయాలని సుప్రీం కోర్టు కూడా కోరింది. ఈ నేపధ్యంలో తాజా పరిణామాలు కేంద్ర ప్రభుత్వ పెద్దలకు సహజంగానే ఆందోళన కలిగించాయి. కనీసం ఈ సందర్భంగా అయినా సి.బి.ఐ ని నిస్పాక్షిక విచారణ సంస్ధగా తీర్చిదిద్దాలని, రాజకీయ నాయకుల అధికార పరిధినుండి తప్పించాలని పత్రికలు, వివిధ రంగాల ప్రముఖులు కోరుతున్నారు.

కానీ చాలామంది ఒక సంగతి విస్మరిస్తున్నట్లు కనిపిస్తోంది. బ్యూరోక్రసీ అనేది ఎప్పటికీ నిరంకుశ స్వభావాన్నే కలిగి ఉంటుంది. ఐ.ఎ.ఎస్, ఐ.పి.ఎస్ అధికారులు, జ్యుడీషియల్ అధికారులు, రాయబార అధికారులు… ఇలాంటి వారందరిని ఎన్నుకునేది ప్రజలు కాదు. వారి వారి విద్యార్హతలను బట్టి, పోటీ పరీక్షల్లో ప్రతిభను బట్టి వారు ఎన్నుకోబడతారు. అలాంటి అధికారుల స్వభావం ప్రజాస్వామ్యయుతంగా ఉండే అవకాశం తక్కువ. వారి దృష్టిలో చట్టాలే సుప్రీం. సామాజిక వాస్తవాలు, ప్రజల దైనందిన అవసరాలు, కాలానుగుణంగా వాటిలో వచ్చే మార్పులు వారి దృష్టిలో ఉండడం తక్కువ. అందువల్ల చట్టాలను అమలు చేసే ధోరణిలో వారు నిరంకుశ స్వభావాన్ని కలిగి ఉంటారు. అలాంటివారికి పూర్తిస్ధాయి స్వతంత్రత ఇవ్వడం అంటే ప్రజాస్వామిక స్వభావానికి, ప్రజల అధికారానికి దూరంగా జరగడమే.

కానీ రాజకీయ నాయకులు అలా కాదు. వారిని ఎన్నుకోవాల్సింది ప్రజలు. ఐదేళ్లకొకసారి వచ్చే ఎన్నికల్లో నెగ్గడం కోసం వారు ప్రజల వద్దకి వెళ్ళాలి. కాబట్టి అనివార్యంగా వారు ప్రజల బాధలు, సాధకబాధకాలు పట్టించుకోవాలి లేదా పట్టించుకున్నట్లు నటించాలి. ఆ మేరకు నామమాత్రంగానయినా ప్రజల అవసరాలు అనేవి రాజకీయ నాయకుల నిర్ణయాల్లో తొంగి చూస్తుంటాయి. ఎన్నుకోబడిన రాజకీయ నాయకులంతా ప్రజల కోసమే పని చేస్తున్నట్లు చెప్పడం కాదిది. ఈ మాత్రం ప్రజా స్వభావం కూడా అధికార ఉద్యోగుల్లో ఉండదు అని చెప్పడం.

అందువల్ల లోక్ పాల్, సి.బి.ఐ స్వతంత్రత లాంటి విషయాల్లో అధికారులకు సర్వాధికారాలు కట్టబెట్టడం అనేది నియంతృత్వ భావనలు, అధికారాలు పై చేయి సాధించేందుకు అవకాశం కల్పిస్తాయి. రాజకీయ నాయకుల అవదుల్లేని అవినీతి వలన లోక్ పాల్ అనీ, సి.బి.ఐ స్వతంత్రత అనీ ప్రత్యామ్నాయాలపై చూపు పెట్టాల్సి వస్తోంది గానీ, ఇలాంటి అధికారులు కూడా అవినీతికి దూరంగా ఉంటారన్న గ్యారంటీ ఏమీ లేదు. రాజకీయ నాయకుల్లో ఎంత అవినీతి ఉన్నదో బ్యూరోక్రసీ లోనూ అంత అవినీతి ఉన్నది. బ్యూరోక్రసీతో అవినీతి బంధం లేకుండా రాజకీయ అవినీతి ఎలా సాధ్యం? వారి మధ్య బంధం ఎంత సహజమైనదో పదవీ విరమణ అనంతరం రాజకీయాల్లోకి నేరుగా ప్రవేశిస్తున్న పోలీసు అధికారులను, ఆర్మీ అధికారులనూ, బ్యూరోక్రట్లను చూస్తే అర్ధం అవుతుంది.

కాబట్టి రాజకీయ నిరంకుశులకు బ్యూరోక్రాట్ నిరంకుశులు ప్రత్యామ్నాయం కాజాలరు. దోపిడీ వర్గ రాజకీయాల స్ధానంలో కార్మికవర్గ రాజకీయాలను నెలకొల్పుకోవడమే ప్రజల ముందు ఉన్న ప్రత్యామ్నాయం.

One thought on “సి.బి.ఐ రక్షతి రక్షితః -కార్టూన్

  1. ప్రభుత్వ రాజకీయతకు సి.బి.ఐ. ఒక కవచం. ప్రతిపక్ష విమర్సనాస్త్రాలకు ప్రభుత్వ పాలన గాయపడకుండా కాయకల్ప చికిత్సవిధానానికి ప్రభుత్వం నియమించుకున్న రోగ నివారణా మార్గం. వైద్య కళాశాలలో యాజమాన్య కోటాలాగే, ప్రభుత్వ యాజమాన్యానికి వెన్నుదన్నుగా నిలిచే వ్యక్తిని అధికార హోదాలో నిలిపేందుకు నియమనిబంధనలు తుంగలో తొక్కి తమ హక్కులకు భంగంరాని రీతిలో, భంగపడని దారిలో ఏర్పర్చుకున్న రక్షణ కేంద్రం. గతంలో సి.బి.ఐ. అంటే కొద్దో గొప్పో సార్ధకత ఉండేది కానీ, నేటి పాలనాధికారంలో అనర్ధదయాకంగా మారి రాజకీయ నేరలకు కొమ్ముకాస్తూ వారి మోచేతికింద గంజిని తాగుతూ ప్రజాభిమాన దృష్టిలో ఒక ప్రముఖ దద్దమ్మ సంస్థగా నిలిచిందనడానికి ఇటీవల వారి చీఫ్ బెట్టింగులు, సెక్స్ ట్రేడింగుల విషయంలో చీపుగా “ఛీ” కొట్టిన వ్యక్తిగత అభిప్రాయమే ఒక తార్కాణం.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s