తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కిరణ్ కుమార్ రెడ్డి పాత్ర ఏమిటో ఒక పట్టాన కోరుకుడు పడడం లేదు. ఆయన ఆధిష్టానం ఆదేశాల్నే పాటిస్తున్నారా లేక ఎదురు తిరుగుతున్నారా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా తయారయింది. సీమాంధ్ర ప్రాంతంలో కాంగ్రెస్ ప్రయోజనాలని కాపాడడానికే ఆయన పార్టీ అధిస్టానం పన్నిన వ్యూహంలో భాగంగానే ఎదురు తిరుగుతున్నారా లేక నిజంగానే సీమాంధ్ర ధనికవర్గాల కోసం తిరుగుబాటు బావుటా ఎగురవేశారా అన్నది తేలడం లేదు.
నిజంగానే ఎదురు తిరిగే పనైతే కిరణ్ కుమార్ రెడ్డిని కాంగ్రెస్ నాయకత్వం ఇన్నాళ్ళు ఎలా సహించి ఊరుకుంటుంది? తమ నిర్ణయాన్ని అమలు చేసే వ్యక్తిని ముఖ్యమంత్రిగా ఈపాటికి నియమించుకుని ఉండేది కదా? ప్రస్తుతం ముఖ్యమంత్రి రచ్చబండ కార్యక్రమం పేరుతో రాష్ట్ర విభజన వ్యతిరేక ప్రచారాన్ని చేస్తున్నారు. అంటే ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలను ఒక ప్రాంత ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా వినియోగిస్తున్నారు. ఆయన ఇంత చేస్తున్నా ప్రధాన తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వం కిరణ్ ని పల్లెత్తు మాట అనకపోవడం ఒక మిస్టరీ!
సీమాంధ్రను పూర్తిగా వైకపాకు వదిలిపెట్టే ఆలోచనలో కాంగ్రెస్ లేదని, సమైక్య ఛాంపియన్ గా కిరణ్ కుమార్ ను ముందు నిలిపి సీమాంధ్రలో కూడా సాధ్యమైనన్ని ఎక్కువ సీట్లు రాబట్టుకోడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ఒక వాదన బలంగానే వినిపిస్తోంది. రచ్చబండ కార్యక్రమాల్లో మాట్లాడుతూ రాష్ట్ర విభజనకు ప్రధాన కారకుడు చంద్రబాబు నాయుడే కారణం అని కిరణ్ వ్యాఖ్యానించడం ఈ వాదనకు మద్దతుగా వస్తోంది. ఇతర పార్టీలన్నీ ఆమోదించాకనే కాంగ్రెస్ విభజన నిర్ణయం తీసుకుందని కిరణ్ చెబుతున్నారు. విభజన నెపాన్ని చంద్రబాబు నాయుడు, వైకపాల పైకి నెట్టి కాంగ్రెస్ పై వ్యతిరేకత పెరగకుండా ఉండడానికే ఈ ప్రయాసా?
ఈ కార్టూన్ మాత్రం అలాంటి అభిప్రాయాన్ని తిరస్కరిస్తున్నట్లుగా ఉంది. తెలంగాణ బిల్లు ఆమోదం పొందడానికి కాంగ్రెస్ అధిష్టానం ఏరి కోరి ఎంచుకున్న కిరణ్ కుమార్ రెడ్డే ఆటంకంగా పరిణమించారని సూచిస్తోంది. కానీ కిరణ్ ఎంపికకు ముందే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అనుకూల నిర్ణయాన్ని ప్రకటించిన సంగతి మరువరాదు. 2009 లోనే తెలంగాణ ప్రక్రియ ప్రారంభం అయిందని ప్రకటించాక కాంగ్రెస్ నాయకత్వం తెలంగాణ విషయంలో కిరణ్ అవగాహన ఏమిటో తెలుసుకోకుండా ఉంటుందా? కిరణ్ అవగాహన తెలియకుండానే ఆయన్ని ముఖ్యమంత్రిగా నియమించి ఉంటుందా?
పింగ్బ్యాక్: తెలంగాణ: సోనియా పంటి కింద కిరణ్ రాయి? -కార్టూన్ | ugiridharaprasad
ముల్లును ముల్లుతోనే తియ్యాలనే కిరణ్ సిద్ధాంతం అధిష్టాన ఎన్నికల ఆలోచనను తూట్లు పొడిచింది. ఒక విధంగా ఏకపక్ష నిర్ణయాలతో దూకుడుగా వ్యవహరించే సోనియమ్మ శైలికి ఇది ఒక గొడ్డలిపెట్టు. వృద్ధప్య ప్రచారసాధకుల వణుకుడు మాటలలో పొంతనలేక యు.పి.ఏ. కు గర్భస్రావం చేసే చికిత్సకు ఊపిరిపొశారు. దుష్టచతుష్టయ కమిటి ప్రెస్ కాన్ఫరెన్సులు ప్రధాని,సోనియల వ్యక్తిత్వాలను కించపరిచే రీతిలో సాగుతున్నాయి. తీర్మానం రాష్ట్ర శాసనసభలో పెట్టే విషయంపై భిన్నధృక్ఫదాలు, విభజనను ఒక కొలిక్కి తీసుకువచ్చేప్రయత్నాన్ని తప్పుదారి పట్టిస్తున్నారు. ఇకపోతే రాష్ట్ర రాజకీయాలలో ప్రతిపక్ష నేత లేఖను ఎప్పుడు ఏ రీతిలో అందచేసాడనే విషయం గొప్యంగా ఉంచి తన గొయ్యిని తానే తవ్వుకున్న రీతిలో ప్రవర్తించి ఇప్పుడు ఎన్నికల పరివర్తన దిశగా తలపట్టుకుని తంటాలు పడుతున్నాడు. ఒక విధంగా కిరణ్ ఈ అవకాశాన్ని సమయానుకులంగా మలుచుకుని రాజకీయ మనోధైర్యానికి ఊపిరి పొసుకున్నాడు. నిజం చెప్పాలంటే తెలుగు దేశం ప్రతిపక్ష హోదా రాబోయే కాలంలో కూడా తప్పేటట్లు లేదు. అధిగమించాలనే బాబు ప్రయత్నానికి కుటుంబ అంతఃకలహాలు, ఆయన పాలనాధికార ఊహలకు గొడ్డలిపెట్టు. కేంద్రంలో దిశగానే తన కొడుకును రాజకీయ ఆరంగ్రేటం చేసి ఆరాటంతో పోరాటం చేస్తున్నాడు. చివరకు కొడుకుల ధర్మామాని యు.పి.ఏ. తల్లికి, తెలుగు తండ్రికి ఇతి బాధలు తప్పవు. కుటుంబ పాలన విషయంలో గొంతు చించుకుని ఒండొరులు విమర్శనాస్త్రాలు సంధించినా చివరకు సంధిప్రాలాపనలుగా మిగిలిపోతాయి. తెలంగాణ నేతలు మాత్రం ఈ కోతి కొమ్మచ్చి ఆటలను చూస్తూ అడవిలో మానులుగా మిగిలిపోయారు. విభజనకు సూత్రప్రాయమైన బిల్లు కల్లు కుండలో దాచి, రాజకీయాలను తాడిచెట్టు నీడలో ఆటలాడించే అధిష్టాన పరాకాష్ట కొండను తవ్వి ఎలకను పట్టే రీతిలో నడుస్తోంది. శీతాకాల సమావేశాలలో బిల్లు పాసవడం తధ్యం. ఆ తర్వాత ఇదే ప్రభుత్వం పాలనా పగ్గాలు చేతపడితే అమలుకు అవకాశం, ప్రభుత్వం మారితే మాత్రం సమీకరణల అస్తవ్యస్థంలో అభివృద్ధి కుంటుబడి ఆర్ధిక వ్యవస్థ చిన్నాభిన్నం అవుతుందనడంలో సందేహం లేదు.
రోశయ్య తర్వాత ఇరు ప్రాంతాలకు ఆమోదయోగ్యమైన వ్యక్తి ఎవరని కాంగ్రెస్ అదిష్ఠానం ఆరా తీస్తుంటే…
నాది హైదరాబాదేనని…నన్ను ముఖ్యమంత్రిగా నియమిస్తే తెలంగాణ ప్రాంతం వారు కూడా అంగీకరిస్తారని చెప్పి సీఎం పదవి పొందాడని చెబుతారు. పలు సార్లు సీఎం తాను హైదరాబాదీనేనని…, నిజాం కాలేజీలో చదువుకున్నాని చెబుతాడు. నిజంగా సమైక్యాంధ్రకోసమే పోరాడైటట్లైతే….పదవికి రాజీనామా చేసి జనాల్లోకి వెళ్లవచ్చు కదా…? కానీ సమైక్యాంధ్ర కన్నా కూడా సీఎం పదవి ముఖ్యం. ఐనా కాంగ్రెస్ పార్టీ చిదంబర రహస్యాలు ఒక పట్టాన అర్థం కావు.