ఒక అద్భుతమైన అంతరిక్ష దృశ్యాన్ని నాసా (National Aeronautic Space Agency) మన ముందు ఉంచింది. అంతరిక్షంలో శనిగ్రహానికి దాదాపు 2.2 మిలియన్ల కి.మీ దూరం నుండి తీసిన శనిగ్రహ చిత్రాలను నాసా విడుదల చేసింది. నాసా, యూరోపియన్ స్పేస్ ఏజన్సీ, ఇటాలియన్ స్పేస్ ఏజన్సీలు సంయుక్తంగా అంతరిక్షంలో ప్రవేశపెట్టిన కాసిని ఉపగ్రహంలో అమర్చిన శక్తివంతమైన కెమెరా ఈ దృశ్యాలను బంధించింది.
కాసిని-హుజీన్స్ అంతరిక్ష ఓడ 1997 నుండి అంతరిక్షంలో ప్రయాణిస్తోంది. 2004 నుండి శనిగ్రహం చుట్టూ తిరుగుతున్న ఈ ఉపగ్రహానికి జులై 19 తేదీన శనిగ్రహంతో పాటు దాని చుట్టూ ఆవరించే ఉండే వలయాలను, శని ఉపగ్రహాలు, సూర్య కుటుంబంలోని ఇతర గ్రహాలయిన అంగారకుడు (మార్స్), వీనస్, భూమి, చంద్రుడు లను ఒకే దృశ్యంలో బంధించే అవకాశం వచ్చింది.
జులై 19 తేదీన కాసిని అంతరిక్ష ఒడకు, శనిగ్రహానికి మధ్య సూర్యగ్రహణం లాంటిది సంభవించింది. అనగా కాసిని, సూర్యుడులకు మధ్య శనిగ్రహం అడ్డంగా వచ్చింది. దీనివలన కాసిని లోని కెమెరాలకు నేరుగా సూర్యుడిని చూసే అవసరం లేకుండా శనిగ్రహాన్ని దృస్యీకరించే అవకాశం లభించింది. కెమెరా నేరుగా సూర్యుడి ముందు ఎక్స్ పోజ్ అయినట్లయితే కెమెరాలో ఉండే సున్నిత కటకాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది. కానీ సూర్యుడు శనిగ్రహం వెనక్కి వెళ్లిపోవడం వలన విశాల అంతరిక్షంలో లక్షల మైళ్ళ మేర విస్తరించి ఉండే శనిగ్రహాన్ని, దాని వలయాలను అద్భుతంగా చిత్రీకరించే అవకాశం లభించింది.
ఈ ఫోటోలో ఉన్న దృశ్యాలు అంతరిక్షంలో కాసిని ఉన్న చోటి నుండి మనిషి తన కంటితో చూసినట్లయితే శని, అంగారకుడు, వీనస్, భూమి, చంద్రుడు, శని వలయాలు ఎలా కనిపిస్తాయో సరిగ్గా అవే అని నాసా తెలిపింది. నవంబర్ 12 తేదీన వాషింగ్టన్ లో విడుదల చేసిన ఈ ఫోటోలు సామాన్యులకు అందుబాటులోకి వచ్చిన సౌరమండలానికి సంబంధించిన అద్భుత దృశ్యాలుగా పేర్కొనవచ్చు.
“శనికి హాయ్ చెప్పండి” (Wave to Saturn) పేరుతో జులై 19 తేదీన నాసా ప్రపంచవ్యాపితంగా ఒక ప్రచారం నిర్వహించింది(ట). ఈ ప్రచారంలో భాగంగా శని గ్రహాన్ని చూస్తూ హాయ్ చెప్పినట్లు ఫోటోలు దిగి తమకు పంపాలని నాసా కోరింది. ఇలా సేకరించిన 1600 ఫోటోలను సరిగ్గా కాసిని అందజేసిన శని, వలయాలు, ఇతర గ్రహాలతో కూడిన ఫోటో తరహాలోనే నాసా ఒకదాని పక్కన ఒకటి పేర్చింది. అలా పేర్చిన ఫోటోను కూడా కింద చూడవచ్చు.
కొన్ని ఫోటోలు భారీ రిజల్యూషన్ కలిగినవి. కాబట్టి డౌన్ లౌడ్ కావడానికి సమయం పడుతుంది. ఓపికతో వేచి చూస్తే కనుక మనిషి కంటితో శనిగ్రహాన్ని చూస్తే ఎలా ఉంటుందో ఆ దృశ్యాన్ని చూడవచ్చు.
వీనస్ గ్రహం ఎడమ పక్క పైభాగంలో ఒక చిన్న చుక్క తరహాలో ఉండడం చూడవచ్చు. దానికి పైన కొద్దిగా ఎడమకు వెళ్తే మాసిబారిన ఎరుపు రంగులో మార్స్ గ్రహాన్ని చూడవచ్చు. కుడిపక్క కింద నీలం రంగులో భూగ్రహాన్ని, దాని పక్కనే కనపడీ కనపడకుండా ఉన్న చంద్రుడిని చూడగలం. మరో ఫోటోలో భూగ్రహాన్ని శని చుట్టూ ఉన్న బాహ్య వలయంలోపల ఉండడం గమనించవచ్చు.
కాసిని మిషన్ నాసా తలపెట్టగా హుజీన్స్ మిషన్ యూరోపియన్ స్పేస్ ఏజన్సీ తలపెట్టింది. జనవరి 14, 2005 తేదీన హుజీన్స్ ప్రోబ్ శని గ్రహ చంద్రుడు టైటాన్ పై దిగింది. కాసిని ప్రయాణం జూన్ 2008లో ముగిసినప్పటికీ అదింకా సజీవంగానే ఉంటూ భూమికి అంతరిక్ష దృశ్యాలను ఇప్పటికీ పంపుతోంది.
శని చుట్టూ ఉన్న వలయాలు శాస్త్రజ్ఞులకు ఇప్పటికీ ఒక మిస్టరీయే. ఈ వలయాల గురించి తమకు తెలిసింది తక్కువేననీ, తెలియవలసింది చాలా ఉందని శాస్త్రజ్ఞులు చెబుతారు. ఈ నేపధ్యంలో నాసా అందించిన ఈ చిత్రాలు మన ముందు ఒక కొత్త వాస్తవ లోకాన్ని ఉంచుతున్నాయి. ఈ ఫోటోలు నాసా వెబ్ సైట్ నుండి సేకరించినవి.
(పూర్తి రిజొల్యూషన్ లో ఫొటోలు చూడాలంటే రిజొల్యూషన్ ని తెలిపే అంకెలపైన గానీ లేదా ‘View full size’ అని ఉన్నచోట గానీ క్లిక్ చేయాలి. కేరోసల్ పద్ధతిలో ఇమేజ్ గ్యాలరీ ఓపెన్ అయితే ‘View full size’ అని కనిపిస్తుంది. ప్రతి ఇమేజ్ ఇండివిడ్యువల్ గా ఓపెన్ అయితే రిజల్యూషన్ అంకెలు కనిపిస్తాయి.)
(
అంతారిక్షయానంలో భారత విజ్ఞానవేత్తల సాహసం బహు అభినందనీయం.