బ్యాంకుల నికర నిరర్ధక ఆస్తులు 1.3 లక్షల కోట్లు!


NPAs

ప్రభుత్వ పధకాల కింద కూడా సామాన్యులకు అప్పులు నిరాకరించే బ్యాంకులు కోటీశ్వరులకు మాత్రం పిలిచి అప్పులిస్తాయి. ఆ అప్పులు వసూలు కాక తామే ఋణ గ్రహీతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తాయి. చివరికి ప్రభుత్వాలు ప్రకటించే స్కీముల క్రింద తీరని అప్పులను నిరర్ధక ఆస్తుల (Non-Performing Assets -NPAs) కింద నెట్టేస్తాయి. ఇలా వసూలు కానీ బాకీల విలువ 2013-14 ఆర్ధిక సంవత్సరంలోని మొదటి అర్ధ భాగంలో 38 శాతం పెరిగి 1,28,533 కోట్లకు చేరిందని ఎన్.పి.ఏ సోర్స్ పోర్టల్ తెలిపింది. ఏప్రిల్-సెప్టెంబర్ మధ్య కాలంలోనే 35,424 కోట్ల మేర పెరిగిన ఎన్.పి.ఏ లు వచ్చే మార్చి నాటికి 1.5 లక్షల కోట్లకు చేరవచ్చని ఎన్.పి.ఏ సోర్స్ అంచనా వేస్తోంది.

నిరర్ధక ఆస్తులు పెద్ద మొత్తంలో పేరుకుపోవడం దానికదే పెద్ద కుంభకోణం. బోఫోర్స్ కుంభకోణం విలువ కేవలం 60 కోట్లు. 2జి కుంభకోణం విలువ 1.7 లక్షల కోట్లు కాగా బొగ్గు కుంభకోణం విలువ 1.8 లక్షల కోట్లు. అంటే ఎన్.పి.ఏ కుంభకోణాన్ని 2జి, బొగ్గు కుంభకోణాల సరసన చేర్చవచ్చన్నమాట!

ఈ లెక్క కేవలం మొదటి 40 స్ధానాల్లో ఉన్న బ్యాంకులది మాత్రమే. మొత్తం బ్యాంకులను కలుపుకుంటే ఎన్.పి.ఏ లు ఇంకెంత ఉంటాయో తెలియదు. టాప్ 40 బ్యాంకుల్లో 14 బ్యాంకుల నిరర్ధక ఆస్తులు ఈ 6 నెలల్లో (ఏప్రిల్ 2013 నుండి సెప్టెంబర్ 2013 వరకు) 50 శాతం పెరిగినట్లు రిపోర్టు చేశాయని ఎన్.పి.ఏ సోర్స్ అధ్యయనం తెలిపింది.

“మొత్తం ఎన్.పి.ఏ లలో టాప్ 10 బ్యాంకుల వాటా మార్చి 2013 నాటికి 70 శాతం కాగా అది సెప్టెంబర్ 2013 నాటికి 67.8 శాతానికి తగ్గింది. 7 బ్యాంకుల ఎన్.పి.ఏ లు మార్చిలో అసలేమీ లేవు. కానీ సెప్టెంబర్ నాటికి వాటి ఎన్.పి.ఏ లు కూడా 3.5 శాతం పెరిగాయి” అని ఎన్.పి.ఏ సోర్స్ తెలిపింది. సున్న నిరర్ధక ఆస్తులు కలిగిన బ్యాంకులు బహుశా తోటి బ్యాంకులను చూసి సిగ్గుపడి ఉండాలి.”

“వచ్చే మార్చి నాటికి బ్యాంకింగ్ వ్యవస్ధలో నిరర్ధక ఆస్తుల విలువ 1.5 లక్షల కోట్లకు చేరుకుంటుంది. ఎందుకంటే ఈ ఆర్ధిక సంవత్సరం పూర్తి కావడానికి ఇంకా రెండు త్రైమాసికాలు మిగిలే ఉన్నాయి. ఒక్కో త్రైమాసికం గడిచే కొద్దీ పరిస్ధితి మెరుగుపడడానికి బదులు ఇంకా ఇంకా దిగజారుతోంది” అని ఎన్.పి.ఏ సోర్స్ ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ దేవేంద్ర జైన్ అన్నారని ది హిందు తెలిపింది.

ఇది ‘నికర’ నిరర్ధక ఆస్తుల లెక్క. మొత్తం నిరర్ధక ఆస్తులు ఇంకా ఎక్కువ. సెప్టెంబర్ 2013 త్రైమాసికం ముగిసేనాటికి మొత్తం నిరర్ధక ఆస్తుల (Gross NPAs) విలువ 2,29,007 కోట్లని తెలుస్తోంది. గత మార్చి (2013) నెల నాటికి ఈ విలువ 1,79,891 కోట్లు. అనగా 49,116 కోట్ల పెంపుదల.

బ్యాంకుల రుణాల ఖాతాలో ఉన్న మొత్తాన్ని Gross NPAs అంటారు. ఈ మొత్తంలో 1. ఇంకా వసూలుకావలసిన కానీ వసూలు కాని వడ్డీ చెల్లింపులు 2. ఎన్.పి.ఏ లుగా మారతాయన్న అంచనా ఉన్న ఆస్తులు 3. ఎన్.పి.ఏ లుగా భావించి ఇంకా నిర్ధారించబడనివి కూడా కలిసి ఉంటాయి. ఈ మూడింటిని తీసేయగా మిగిలేదే నికర నిరర్ధక ఆస్తులు.

ఈ మూడు అంశాల కింద లెక్కించబడే ఎన్.పి.ఏ లు (సాధారణంగా) వసూలయితే ఏదో అద్భుతం జరిగినట్లే భావించాలి. Gross NPAs ని లెక్కలోకి తీసుకుంటే ఎన్.పి.ఏ కుంభకోణం 2జి, బొగ్గు కుంభకోణాల కంటే భారీ కుంభకోణం అని చెప్పుకోవచ్చు. ఇంకా చెప్పుకోవాలంటే 2జి, బొగ్గు కుంభకోణాలు రియలైజ్ కాని కుంభకోణాలు. కాగ్ అప్రమత్తత వలన 2జి కుంభకోణం మధ్యలో కత్తిరించబడితే బొగ్గు కుంభకోణం ప్రారంభంలోనే పసిగట్టబడింది. బొగ్గు బ్లాకుల్లో కొన్నింటిని ప్రభుత్వం వెనక్కి తీసేసుకుంది కూడా. కాని ఎన్.పి.ఏ ల విషయం అలా కాదు. అవి పూర్తిగా కుంభకోణం నిర్మాతల చేతుల్లోకి వెళ్ళిపోయిన డబ్బు. నిరర్ధక ఆస్తులుగా బ్యాంకులు నిర్ధారించుకున్న డబ్బు.

ప్రభుత్వాలు ఇప్పటికి అనేకసార్లు ఎన్.పి.ఏ లను బ్యాంకుల బ్యాలెన్స్ షీట్ల నుండి మాయం (write-down) చేసేశాయి. అంటే మొండి బాకీలుగా నిర్ధారించి రద్దు చేసుకున్నాయి. ఋణ గ్రహీతలు సదరు రుణాలు చెల్లించాల్సిన పనిలేదని బ్యాంకులు, ప్రభుత్వాలు చెప్పేశాయన్నమాట! ఇంతకుమించిన నిలువు దోపిడి ఇంకేం ఉంటుంది? చిత్రం ఏమిటంటే ఈ మొండి బాకీదారుల వివరాలు చెప్పమంటే ప్రభుత్వం చెప్పదు. జాతీయ భద్రతకు ప్రమాదం అని చెప్పి తప్పించుకుంటుంది. ఏ పార్టీ ప్రభుత్వంలో ఉన్నా అదే జరుగుతుంది. పాలక, ప్రతిపక్షాలు రెండింటి పోషకులు ఒకే ధనికవర్గాలు అయినప్పుడు ఇంకెలా జరుగుతుందని సరిపెట్టుకోవడమే.

ఎన్.పి.ఏ సోర్స్ ప్రకారం గత రెండేళ్లలో (సెప్టెంబర్ 2011 నుండి సెప్టెంబర్ 2013 వరకు) టాప్ 40 లిస్టెడ్ బ్యాంకుల మొత్తం నిరర్ధక ఆస్తులు రెట్టింపు కాగా నికర నిరర్ధక ఆస్తులు 140 శాతం పెరిగాయి. గత సంవత్సరం రీ షెడ్యూల్/రీ స్ట్రక్చర్ చేసిన రుణాలు ఇంకా వసూలు కాకపోతే వాటిని బ్యాంకులు మూడో త్రైమాసిక నుండి ఎన్.పి.ఏ లుగా మార్చడం ప్రారంభిస్తాయి. కాబట్టి ఈ ఆర్ధిక సంవత్సరంలో మిగిలిన అర్ధభాగంలో ఎన్.పి.ఏ లు భారీగా పెరగొచ్చు.

నిరర్ధక ఆస్తుల విషయంలో ప్రభుత్వరంగ బ్యాంకులు కాస్త మెరుగ్గా ఉన్నప్పటికీ తక్కువ మాత్రం కావు. ఎస్.బి.ఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్, ఐ.డి.బి.ఐ, యు.బి.ఐ… ఇవి ప్రభుత్వరంగ బ్యాంకుల్లో పెద్దవి. ఈ ఆర్ధిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ఇవన్నీ 30 శాతం పైనే నిరర్ధక ఆస్తులను నమోదు చేశాయి.  నిరర్ధక ఆస్తుల వలన పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల లాభాలు 35 శాతం పైనే పడిపోతున్నాయని తెలుస్తోంది.

రిజర్వ్ బ్యాంకు వడ్డీ రేటు (రెపో రేటు) పెంచినపుడు ఈ నిరర్ధక ఆస్తుల విలువ పెరగడం ఒక సైడ్ ఎఫెక్ట్. వడ్డీ రేటు పెరగడం అంటే బ్యాకులు ఇచ్చిన రుణాలపై వసూలు కావలసిన వడ్డీలు కూడా పెరుగుతాయి. కాబట్టి ఎన్.పి.ఏ లు పెరుగుతాయి. వడ్డీ రేటు తగ్గిస్తే గనక ఎన్.పి.ఏ లు ఆ మేరకు తగ్గుదల చూపిస్తాయి. కాబట్టి ఎన్.పి.ఏ లు తగ్గాయహో అని బ్యాంకులు ప్రకటించినప్పుడు మొండి బాకీలు కొన్ని వసూలయ్యాయి అని భావించనవసరం లేదు. దానికి ముందు రెపో రేటు ఏమన్నా తగ్గించారా అన్నది ఒకసారి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది.

3 thoughts on “బ్యాంకుల నికర నిరర్ధక ఆస్తులు 1.3 లక్షల కోట్లు!

  1. మీరు నాణానికి మరో వైపు చూడటం లేదు. ఇది పైకి కనిపించేదే! లోపాయికారి వ్యాపారాలన్ని ఇలాగే ఉంటాయి.

  2. అధిక మొత్తం రుణాల మంజూరు రాజకీయ ఒత్తిడిలకు లోబడి. బ్యాంకుల నిరర్ధక ఆస్తుల నిర్వాకం ప్రభుత్వ రాజకీయ సార్ధకతకు అద్దంపడుతుంది, రాజకీయం కట్టనీయకుండా అడ్డం పడుతుంది. సామాన్యులు రుణగ్రహితలయితే బ్యాంకులు వసూళ్ళ విషయంలో రుద్ది వసూలుచేస్తుంది. అదే రాజకీయ పలుకుబడి గల వ్యక్తులను మాత్రం బ్యాంకులు మెహర్బాని చూపి తమకు తాము కుర్బాని చేసుకుంటున్నాయి. పలు ప్రభుత్వ రుణ పంపిణీల విషయంలో ఓట్ల చాటు నోట్లను పంపిణీ చేసే దొంగ స్కీములకు చేయూతనిస్తుంది, వసూళ్ళ విషయం వచ్చేసరికి అధికారులను అడ్డగోలుగా విషయించి చివరకు మాఫీలు చేయించడంలో ప్రభుత్వ రాజకీయాలు మరో మాఫియాకు అద్దంపడుతుంది. తుఫాను దెబ్బకు రుణ రాయితీల విషయంలో తాత్సర్యం చేసే ఆంతర్యం మంజూరుల విషయంలో అత్యుత్సాహం ప్రదర్సిస్తుంది. ఒక విధంగా పాము తన గుడ్లను తానే మింగే రీతిలో ప్రభుత్వం బ్యాంకుల పరపతి విషయంలో దేశ ఆర్ధిక వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తోంది.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s