మార్కెట్ శక్తులకు ఇక పూర్తిస్ధాయిలో పగ్గాలు అప్పజెప్పడానికి చైనా కమ్యూనిస్టు పార్టీ కేంద్ర కమిటీ నిర్ణయం తీసుకుంది. దేశ ఆర్ధిక వృద్ధికి వెన్నెముకగా నిలిచిన ప్రభుత్వరంగ సంస్ధలను ఇక క్రమంగా మార్కెట్ శక్తులకు అప్పగించేందుకు తగిన రోడ్ మ్యాప్ ను నాలుగు రోజుల పాటు జరిగిన కేంద్ర కమిటీ సమావేశం రూపొందించినట్లు ప్రకటించింది. మావో మరణానంతరం సోషలిస్టు పంధాను విడనాడి పెట్టుబడిదారీ పంధాను చేపట్టిన చైనా కమ్యూనిస్టు పార్టీ పేరులో మాత్రమే కమ్యూనిస్టు పార్టీగా మిగిలింది. చైనా కమ్యూనిస్టు పార్టీని ఇప్పటికీ కమ్యూనిస్టు పార్టీగా గుర్తిస్తున్న భారతీయ మిత్రులకు తాజా నిర్ణయంతోనైనా భ్రమలు దూరం అవుతాయో లేక మొండిగా తమ నమ్మకాన్ని కొనసాగిస్తారో తెలియాల్సి ఉంది.
గతేడు బాధ్యతలు చేపట్టిన నూతన నాయకత్వ బృందం త్వరలో ‘మున్నెన్నడూ ఎరుగని స్ధాయిలో ‘కీలక సంస్కరణలు’ చేపట్టనున్నట్లు చెబుతూ అటు చైనా ధనికవర్గాలను ఇటు అంతర్జాతీయ బహుళజాతి కంపెనీలను ఊరిస్తూ వచ్చింది. చెప్పినట్లుగానే కీలకరంగాలలో ప్రభుత్వరంగ కంపెనీల ఆధిపత్యాన్ని క్రమంగా తగ్గించేసి మార్కెట్ శక్తుల నియంత్రణ పెంచేందుకు చర్యలు చేపట్టనున్నట్లు నూతన నాయకత్వంలోని కేంద్ర కమిటీ బృందం ప్రకటించింది. నూతన చర్యల పూర్తి స్వరూపం ఇంకా వెల్లడి కాలేదు. రానున్న రోజుల్లో వీటిని బహిర్గతం చేస్తారని విశ్లేషకులు ఊహిస్తున్నారు.
నాలుగు రోజుల పాటు రహస్యంగా (తలుపులు మూసుకుని) సమావేశమైన 376 మంది సభ్యుల చైకపా (వైకపా అనుకునేరు!) కేంద్ర కమిటీ, సమావేశం అనంతరం ఒక అధికార ప్రకటన (కమ్యూనిక్) జారీ చేసింది. “వనరుల కేటాయింపులో ఇక నుండి మార్కెట్ శక్తులకే నిర్ణయాత్మక పాత్ర ఇవ్వడానికి నిర్ణయించాము” అని ఈ ప్రకటన పేర్కొంది. 1992 సంస్కరణల దరిమిలా ఇప్పటిదాకా ‘ప్రాధమిక పాత్ర’ మాత్రమే పోషిస్తోంది’ అని చైకపా చెప్పుకుంటూ వచ్చిన మార్కెట్ శక్తులు ఇక పూర్తిస్ధాయిలో మరింత శక్తివంతమైన, శాశ్వత పాత్ర పోషిస్తాయని ఈ ప్రకటన ద్వారా చైకపా స్పష్టం చేసింది.
అధికారిక ప్రకటన ఇంకా పూర్తి వివరాలు ఇవ్వలేదు. రానున్న కొద్ది రోజుల్లో ఈ వివరాలు క్రమంగా బైటికి వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వ పత్రికలు, కమ్యూనిస్టు పార్టీ పత్రికలు సాధారణంగా విశ్లేషణల రూపంలో ఇలాంటి విధానాలను ప్రకటిస్తుంటాయి. తాము చేపట్టిన విధానాలు ఇంకా సోషలిస్టు నిర్మాణ బాధ్యతనే ఎలా నిర్వహిస్తున్నాయో వివరించేందుకు ఈ విశ్లేషణల్లో ఒక (వ్యర్ధ) ప్రయత్నం జరుగుతుంది. మార్కెట్ శక్తుల నాయకత్వంలోనే సోషలిజం నిర్మిస్తున్నామని చెప్పడం చైకపా మాత్రమే నిర్వహించగల ఒక వినూత్న, విచిత్ర, మోసపూరిత ప్రక్రియ. ఒకవైపు సంస్కరణల విధానాలకు బలై నానాటికీ జీవన స్ధాయి కొడిగడుతూ అనివార్యంగా జరిగే లక్షలాది కార్మికుల ఆందోళనలు సంవత్సరం పొడవునా కొనసాగుతున్నప్పటికీ తాము కార్మికవర్గ సోషలిజమే నిర్మిస్తున్నట్లు చెప్పడం, చైనా ప్రత్యేక పరిస్ధితులకు అనుగుణంగా సోషలిజం నిర్మిస్తున్నామని చెప్పడం చైకపా వంచనాశిల్పానికి పరాకాష్ట!
“కీలక రంగాల్లో నిర్ణయాత్మక ఫలితాలు రాబట్టడం అత్యవసరం” అని కమ్యూనిక్ పేర్కొంది. 2020 నాటికల్లా (విజన్ 2020?) ఆర్ధిక వృద్ధికి తగిన “ప్రక్రియ-ఆధారితమైన ప్రభావశీలమైన ఫ్రేమ్ వర్క్” ఆచరణలోకి దిగడానికి తయారుగా ఉండాలని పిలుపు ఇచ్చింది. అంటే అప్పటికల్లా మార్కెట్ శక్తుల ఆధిపత్యానికి ఇంక ఎలాంటి అడ్డంకులూ ఉండకూడదన్నమాట! ఇది సాధించడానికి వీలుగా “సమగ్ర, లోతైన సంస్కరణలను” చేపట్టడానికి ఒక కేంద్ర నాయకత్వ బృందాన్ని చైకపా నియమిస్తుంది. ఈ బృందం “సంస్కరణలను సమన్వయపరుస్తూ, సంస్కరణల పధకాల అమలును పర్యవేక్షిస్తుంది” అని కమ్యూనిక్ తెలిపింది.
చైకపా నూతన కేంద్ర కమిటీ మూడవ సమావేశంలో తాజా సంస్కరణలను ప్రకటించింది. చైనాలో మూడవ ప్లీనంలకు ఒక ప్రత్యేక గుర్తింపు ఉన్నది. చారిత్రకంగా చైనా ఆర్ధిక వ్యవస్ధలను మూల మలుపు తిప్పే పరిణామాలు మూడో ప్లీనంలోనే జరిగాయి. మావో మరణానంతరం అశేష చైనా శ్రామిక ప్రజల జీవితాలను దిగజార్చుతూ, కోట్లాది చైనా ప్రజలు అనేక కష్టాలకూ, త్యాగాలకు ఓర్చి సాధించుకున్న ‘నూతన ప్రజాస్వామిక విప్లవ’ కలను నిలువునా కూల్చివేస్తూ, చైకపా సోషలిస్టు నిర్మాణ కర్తవ్యాన్ని వెనక్కి తిప్పిన ప్రధమ పెట్టుబడిదారీ సంస్కరణలు ‘డెంగ్ గ్జియావో పింగ్’ నేతృత్వంలోని రివిజనిస్టు ముఠా ప్రవేశపెట్టింది 1978 నాటి కేంద్రకమిటీ మూడవ ప్లీనంలోనే కావడం గమనార్హం. తాజా నూతన నాయకత్వం కూడా 1978 నాటి పరిణామాలను గుర్తుకు తెస్తూ అప్పటిలాగే ఇప్పుడు కూడా తీవ్ర సంస్కరణ చర్యలు తీసుకోనున్నట్లు సమావేశాలకు ముందు చెప్పడం విశేషం.
కానీ అప్పటికీ ఇప్పటికీ చాలా తేడా ఉంది. 1978 సంస్కరణలు అసలు సోషలిస్టు నిర్మాణాన్నే వెనక్కి తిప్పితే, ప్రస్తుత సంస్కరణలు దేశంలో ఆధిపత్యంలో ఉన్న ప్రభుత్వరంగాన్ని పూర్తిగా మార్కెట్ శక్తుల పరం చేయబోతున్నాయని కమ్యూనిక్ ద్వారా అర్ధం అవుతోంది. చైకాపాలోని అతున్నతస్ధాయి వర్గాలు, వారి వంశాంకురాలు గత మూడున్నర దశాబ్దాలుగా ప్రభుత్వరంగాన్ని మేసి తెగబలిశారు. వారికి ఇప్పుడు తమ సంపదలను మరింత పెంచుకోడానికి ఆ ప్రభుత్వరంగమే అడ్డంకి అయింది. ఆ అడ్డంకిని తొలగించుకోడానికే తాజా ‘మూల మలుపు సంస్కరణలు’ ఉద్దేశించబడ్డాయని మార్క్సిస్టు-లెనినిస్టు శక్తులు అర్ధం చేసుకోవాల్సిన విషయం! మావోకాలంలో అమలయిన సహకార వ్యవసాయ వ్యవస్ధలో మిగిలి ఉన్న అవశేషాలు కూడా చైనా బడా పెట్టుబడిదారీ వర్గాలకు అడ్డంకిగా మారాయి. స్ధానిక గ్రామ పాలనా వ్యవస్ధ చేతుల్లో ఉన్న గ్రామీణ భూములను లాక్కోవడానికి ఇంకా అనేక చట్టాలు అవరోధంగా ఉన్నాయి. ఈ చట్టాలను బలహీనపరిచి గ్రామాల భూములను చట్టబద్ధంగానే బడా రియల్ ఎస్టేట్ తిమింగలాలకు అప్పజెప్పే కార్యక్రమం ఇక మరింత ఊపు అందుకుంటుంది.
సంపదల హక్కులను మరింత సరళీకరించడానికి రెండు ప్రధాన రంగాలను చైకపా గుర్తించినట్లు తెలుస్తోంది.
ఒకటి: గ్రామాల్లో రైతులకు తమ భూములను ప్రైవేటుగా అమ్ముకునే సౌకర్యం కల్పించడం. ఇప్పటివరకు రైతులకు తమ భూములను అమ్ముకునే హక్కులేదు. ఉమ్మడి భూములుగా ఉన్న వ్యవ్సాయ భూములను రైతులు లీజుకు ఇవ్వవచ్చు గానీ అమ్మరాదు. ఈ నిబంధన ద్వారా భూములు పెద్ద మొత్తంలో ప్రైవేటు తిమింగలాల పరం కాకుండా చట్టాలు నిరోధించాయి. పట్టణీకరణకు అడ్డంకిగా ఉన్న ఈ అవరోధం తొలగించాలని బడా పెట్టుబడిదారులు, రియల్ ఎస్టేట్ వర్గాలు అనేక యేళ్లుగా డిమాండ్ చేస్తున్నారు. విచిత్రంగా పట్టణాలు-గ్రామాల ఆదాయాల మధ్య అంతరాలు పెరగడానికి ఇవి దోహదం చేస్తున్నాయని వాదించారు. రైతులకు మేలు చేకూర్చే పేరుతో ఈ అవరోధం తొలగించి భూముల పెట్టుబడిదారీ కేంద్రీకరణకు ఇక బాటలు పరుస్తారు. ఈ విషయాన్ని కమ్యూనిక్ నేరుగా చెప్పలేదు. ‘సంపదల హక్కుల పరిరక్షణను మరింత మెరుగుపరుస్తామని, పట్టణ, గ్రామీణ ప్రాంతాలకు ఒకేవిధమైన ఐక్య భూ మార్కెట్ ఏర్పాటు చేస్తామని చెప్పింది. అంటే వ్యవసాయ భూముల అమ్మకంపై నియంత్రణలు ఎత్తేస్తామని అర్ధం.
చైనాలో స్ధానిక ప్రభుత్వాల ప్రధాన ఆదాయ వనరు భూముల అమ్మకమే. అందువలన రైతులకు భూమి పట్టాలు ఇవ్వడానికి అవి నిరాకరిస్తూ వచ్చాయి. ఈ నిరాకరణ వలన పెద్ద మొత్తంలో భూములు వృధాగా పడిఉన్నాయని చైకపా ప్రభుత్వం భావిస్తోంది. చైకపా ప్రకటించిన భూసంస్కరణల నిర్ణయానికి రెండు ప్రధాన ఉద్దేశ్యాలున్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రైతులకు ఆర్ధిక లబ్ది చేకూర్చడం ఒకటి కాగా అధికధరలతో వేడెక్కిన రియల్ ఎస్టేట్ మార్కెట్ కు మరిన్ని భూములు సరఫరా చేయడం ద్వారా చల్లబరచడం రెండోదని వారు చెబుతున్నారు. మొదటి లక్ష్యం నామమాత్రమే. రెండో లక్ష్యం ఒక ముసుగు. ఆ ముసుగు వెనుక ఉన్న లక్ష్యం వ్యవసాయ భూములను పెట్టుబడిదారీ ధనికవర్గాల పరం చేయడం.
రెండు: సంపన్నవంతమైన, ప్రభావశీలమైన ప్రభుత్వరంగాన్ని సంస్కరించడం. చైనా ప్రభుత్వరంగం ఒక పెద్ద అవినీతి పుట్ట. కమ్యూనిస్టు పార్టీలోని ఉన్నతస్ధాయి కుటుంబాలు అలవిగాని సంపదలు కూడబెట్టడానికి ఇవే ముఖ్య సాధనం. కానీ జనానికి కొద్దోగొప్పో ఉపాధి కల్పిస్తున్నది కూడా ఇదే. కార్మికవర్గానికి ఉపాధి ఇవ్వడంతో పాటు ధనికవర్గాలకు బంగారు గుడ్లు పెట్టే బాతుగా కూడా ప్రభుత్వరంగం ఉపయోగపడింది. అనేక ఉత్పత్తిరంగాలు ఇంకా ప్రభుత్వ పరిశ్రమల చేతుల్లో ఉన్నాయి. ప్రైవేటు ధనికుల సంపదలు పెరిగేకొద్దీ వారి వ్యాపార విస్తరణకు సహజంగానే ప్రభుత్వ రంగం ఆటంకం అయింది. “ఆధునిక కార్పొరేట్ ప్రాక్టీస్ లకు కట్టుబడి ఉండేలా ప్రభుత్వరంగాన్ని సంస్కరిస్తాము” అని కమ్యూనిక్ పేర్కొంది. అంటే అర్ధం స్పష్టమే. ప్రభుత్వరంగ కంపెనీలను క్రమంగా స్టాక్ మార్కెట్లలో లిస్టెడ్ కంపెనీలుగా మార్చేసి ఆ కంపెనీల షేర్లను ప్రైవేటు ధనికులకు కట్టపెడతారు. తద్వారా ప్రభుత్వరంగ పరిశ్రమలపై ప్రైవేటు ఆధిపత్యాన్ని సుస్ధిరం చేస్తూ అంతిమంగా పూర్తిగా ప్రైవేటుపరం చేసేస్తారు.
చైనాలో ప్రభుత్వరంగ కంపెనీల మొత్తం ఆస్తులు 7.35 లక్షల కోట్ల డాలర్లని ఒక అంచనా. అనగా దాదాపు 460 లక్షల కోట్ల రూపాయలకు సమానం. ఇది 2012లో చైనా జి.డి.పి (7.32 ట్రిలియన్ డాలర్లు) కంటే కొద్దిగా ఎక్కువ. ఇంత భారీ ఆస్తుల కోసం చైనా ధనికవర్గాలతో పాటు పశ్చిమ బహుళజాతి కంపెనీలు కూడా లొట్టలు వేస్తున్నాయి. చైనాలో రాజకీయ సంస్కరణలు ప్రవేశపెట్టాలని బహుళ పార్టీలకు అనుమతి ఇచ్చి ఎన్నికలను చేపట్టాలని అమెరికా తదితర పశ్చిమ దేశాలు డిమాండ్ చేయడానికి కూడా ఈ గనిపై వారు కన్ను వేయడమే.
బహుళపార్టీల వ్యవస్ధ ఏర్పడితే తమకు అనుకూలంగా ఉండే పార్టీలను పోషించడం పశ్చిమ దేశాలకు సులువు అవుతుంది. దేశ సంపదలను పంచుకుతినడంలో చైనా బడా పెట్టుబడిదారుల మధ్య ఉన్న ఐక్యతా ఒప్పందాలను బద్దలుకొట్టి వారిలో చొరబడడానికి అవకాశం చిక్కుతుంది. గూగుల్ లాంటి కంపెనీలు కూడా మూడేళ్ళ క్రితం ‘సమాన హక్కులు, మానవ హక్కులు’ పేరుతో రాజకీయ యుద్ధానికి దిగడానికి వెనుక ఉన్న కారణం ఈ కోవలోనిదే. చైనాలో బైదు సర్చ్ ఇంజన్ ఆధిపత్యాన్ని ఎదుర్కోలేక ‘చైనా ప్రజల ఇంటర్నెట్ హక్కులు హరిస్తున్నారంటూ’ గూగుల్ వాదన మొదలు పెట్టింది.
పోర్నోగ్రఫీతో పాటు ఫలూన్ గాంగ్ లాంటి కమ్యూనిస్టు పార్టీయేతర రాజకీయ శక్తుల గురించి చైనా జనం వెతకకుండా చైనా ప్రభుత్వం విధించిన నిషేధాన్ని ఎత్తివేయకపోతే తాను చైనా నుండి వెళ్లిపోతానని గూగుల్ బెదిరించింది. ఆ బెదిరింపులను చైనా ఏ మాత్రం లెక్కచేయలేదు. ‘చైనా చట్టాలకు లోబడి పని చేసుకుంటే చేసుకో, లేకపోతే మూటాముల్లే సర్దుకుటానంటే అభ్యంతరం లేదు’ అని తెగేసి చెప్పింది. గూగుల్ కు మద్దతు ఇవ్వాలని అప్పటి అమెరికా విదేశీ మంత్రి హిల్లరీ క్లింటన్ యాహూ, మైక్రోసాఫ్ట్ లను కోరినా అవి పట్టించుకోలేదు. చైనాలో చౌక శ్రమ ద్వారా దక్కుతున్న భారీ లాభాలను వదులుకోడానికి అవి సిద్ధపడలేదు. దానితో గూగుల్ తోకముడిచి యధావిధిగా షరతులకు లోబడి వ్యాపారం సాగిస్తోంది.
సామాజిక భద్రతను కాపాడడానికి మరిన్ని చర్యలు తీసుకుంటామని కమ్యూనిక్ తెలిపింది. ‘స్టేట్ సెక్యూరిటీ కమిటీ’ ఏర్పరిచి దాని ఆధ్వర్యంలో సామాజిక స్ధిరత్వం నెలకొల్పుతామని తెలిపింది. ‘సామాజిక వివాదాలను నిర్ణయాత్మకంగా పరిష్కరించడానికి’ ఈ కమిటీ కృషి చేస్తుందని తెలిపింది. ఈ అంశంపై వివరాలు లేకపోయినా తన సంస్కరణ చర్యలు సామాజిక అశాంతికి దారితీస్తాయని చైకపా కేంద్ర కమిటీ అంచనా వేస్తోందని భావించవచ్చు. సామాజిక భద్రత, సామాజిక వివాదాల పరిష్కారం లాంటి పదాడంబరాల మాటున ప్రజల అశాంతిని, ఆందోళనలను కఠినంగా అణచివేస్తామని పార్టీ స్పష్టం చేసింది. పార్టీ ఆధ్వర్యంలో నడిచే కోర్టులను కూడా సంస్కరిస్తామని కమ్యూనిక్ తెలిపింది. చైనాలో కోర్టులను కమ్యూనిస్టు పార్టీయే నిర్వహిస్తుంది. దాదాపు తీర్పులన్నీ పార్టీ పెద్దలు రాస్తే వాటిని జడ్జిలు చదువుతారు. మిగిలినదంతా ఒక ప్రహసనం.
ప్రభుత్వరంగ కంపెనీల వరకు చూస్తే భారత దేశానికీ చైనాకీ పోలికలను మనం గమనించవచ్చు. భారత దేశంలో 1947 నాటి అధికార మార్పిడి కాలం నాటికి మన జాతీయ స్ధాయి పెట్టుబడిదారులకు పెద్దగా ఆస్తులు లేవు. ‘ఏ చెట్టూ లేని చోట ఆముదం చెట్టే మహా వృక్షం’ అన్నట్లు అప్పట్లో రు. 10 కోట్ల ఆస్తులున్న టాటా, బిర్లా లాంటివారే మహా పెట్టుబడిదారులు వారి అభివృద్ధి అంతా ప్రధానంగా మన దేశ ప్రభుత్వరంగంపై ఆధారపడి జరిగినదే. ప్రజలకు ఉపాధి కల్పించడం ద్వారా వారి కొనుగోలు శక్తి పెరగడానికి దోహదపడిన మన ప్రభుత్వరంగ పరిశ్రమలు మరోవైపు భారత భూస్వాములకు, పెట్టుబడిదారులకు ప్రజల పొదుపును పెట్టుబడిగా సమకూర్చి పెట్టాయి. 1980ల చివరికల్లా వారు ఒక స్ధాయికి వచ్చేనాటికి సోవియట్ యూనియన్ కుప్పకూలింది. దాంతో అమెరికా, ఐరోపాలపై ఆధారపడాల్సివచ్చింది. ఫలితంగా డంకేల్ ఒప్పందాన్ని అంగీకరించడం, నూతన ఆర్ధిక విధానాల పేరుతో ప్రభుత్వరంగాన్ని ప్రైవేటీకరించే కార్యకలాపాలు ఊపందుకోవడం జరిగింది. చైనాలోనూ ఇదే పరిస్ధితి పార్టీ అధినాయకులు ప్రభుత్వరంగ కంపెనీలు ఆలంబనగా నూతన సంపన్నవర్గంగా అవతరించారు.
అయితే చైనాకూ మన దేశానికి ఉన్న తేడా అమెరికా, ఐరోపాల ఒత్తిడిని తిరస్కరించే స్ధితిలో చైనా ఉంటే మనవాళ్లు లేరు. సంస్కరణలు ప్రవేశపెడుతూనే అవి తమ ప్రయోజనాలను తాకట్టుపెట్టే విధంగా వారు అమలు చేయలేదు. అనేక సెజ్ లు (స్పెషల్ ఎకనమిక్ జోన్) స్ధాపించినా విదేశీ కంపెనీలకు భూములపై హక్కులు ఇవ్వలేదు. అశేష మానవ వనరులే పెట్టుబడిగా చౌక శ్రమను అందుబాటులోకి తేవడం, పర్యావరణ చట్టాలు గాలికి వదిలేయడం, ఏకపార్టీ వ్యవస్ధ అందించిన రాజకీయ స్ధిరత్వం ప్రధాన ఆకర్షకాలు అయ్యాయి. ఫలితంగా అనేక పశ్చిమ బహుళజాతి కంపెనీలు చైనాకు వరుసకట్టాయి. ఆర్ధిక, రాజకీయ సార్వభౌమత్వాన్ని వదులుకోని చైనా సెజ్ ల ద్వారా సమకూరిన వాణిజ్య మిగులుతో క్రమంగా అమెరికాకు పోటీగా ఎదిగింది.
China innovation
Is China a global innovation powerhouse?
http://www.economist.com/debate/days/view/1041
చైనా మేధాశక్తి ముందు అమెరికా కుయోక్తి కుదేలుగా మారింది. ప్రపంచ విపణివీధిలో చైనా ఆధిపత్యం అమేరికాకు మింగుపడని విషయం. ఒబామాను బామ్మను చేసి ఒణికిస్తోంది. ఉత్పాదక పారదర్శకతతో ముందుకు సాగే చైనాను ఇతర దేశాల మాదిరిగా (ముఖ్యంగా భారతదేశ రీతిలో) తన గుప్పిటలో చేజిక్కునే ప్రయత్నం చైనా పోటి మనస్థత్వాన్ని మరింతగా పెంపుచెయ్యడం ఒబామాకు తెలియని విషయం కాదు. అనర్ధ రాజకీయాలకు లొంగని చైనాను చిక్కబట్టుకునే ప్రయత్నమే ఇటీవల కాలంలో మొదలుపెట్టిన చైనా పొగడ్తల కార్యక్రమం. మన్మోహన్ని ముఖప్రీతి శుష్కవాక్యాలు వార్ధక్యాన్ని ఉత్తేజపర్చవచ్చేమో కాని, పొగడ్తలు మాత్రం చైనాను లొంగదీసుకోవలనే విషయం లోగుట్టు పెరుమాళ్ళకెరుక.