సోనీ సోరి: సుప్రీం కోర్టులో బెయిల్ మంజూరు


ఈ దేశంలో చట్టం ధనికులకు ఒక విధంగా పేదలకు మరో విధంగా పని చేస్తాయని చెప్పేందుకు ప్రబల ఉదాహరణ సోనీ సోరి. పోలీసులు అన్యాయంగా, అక్రమంగా బనాయించిన కేసులో రెండున్నరేళ్ల చిత్రహింసలు, జైలు జీవితం, ఎదురుచూపుల తర్వాత సుప్రీం కోర్టు మంగళవారం (నవంబర్ 12, 2013) బెయిల్ మంజూరు చేసింది. ఇదే కేసులో అరెస్టయిన ఎస్సార్ స్టీల్ కంపెనీ జనరల్ మేనేజర్ రెండున్నర నెలల్లోనే బెయిల్ పై విడుదల కాగా సోనీ సోరి, లింగారాం కొడోపి లకు మాత్రం రెండున్నరేళ్ల తర్వాత గాని బెయిల్ రాలేదు.

సోనీ సోరి ఛత్తీస్ ఘర్ లోని దంతెవాడ జిల్లాలో పనిచేసే ఒక గిరినజ టీచర్. ఆమెను మావోయిస్టుగా ఆరోపిస్తూ ఛత్తీస్ ఘర్ పోలీసులు 2010లో అకస్మాత్తుగా అరెస్టు చేశారు. ఎస్సార్ స్టీల్ కంపెనీ నుండి చందాలు వసూలు చేసి మావోయిస్టులకు ఇవ్వడానికి తీసుకెళ్తుండగా పట్టుకున్నామని చెప్పి కొడోపిని అరెస్టు చేశారు. ఈ కుట్రలో సోని సోరి కూడా భాగస్వామి అనీ కానీ ఆమె తప్పించుకున్నదని చెప్పిన పోలీసులు కొద్దివారాలకు ఆమెనూ అరెస్టు చేశారు. ఈ రెండున్నరేళ్ల జైలు జీవితంలో పోలీసులు ఆమెను ఎన్నిరకాలుగా చిత్రహింసలు పెట్టవచ్చో అన్నిరకాలుగానూ పెట్టారు.

సోనీ సోరి భర్తను కూడా పోలీసులు వదల్లేదు. ఆమె భర్త అనిల్ ఫుటనే చేసిన ఏకైక తప్పు సోనీ సోరి భర్త కావడం. చిన్న జీపు నడుపుకుంటూ పొట్ట పోషించుకుంటున్న అనిల్, మావోయిస్టులకు సహాయం చేస్తున్నాడంటూ అరెస్టు చేశారు. ఆయనను పోలీసులు ఎంత తీవ్రంగా హింసించారంటే పోలీసుల ఆరోపణలకు సాక్ష్యాలు లేక విడుదలయిన కొద్ది రోజులకే నడుము కింది భాగం అంతా చచ్చుబడిపోయింది. ఆ జబ్బుతోనే ఆయన గత ఆగస్టులో చనిపోయాడు. తండ్రి మరణించి, తల్లి జైలుపాలయిన స్ధితిలో వారి ముగ్గురు పిల్లలు అనాధలయ్యారు.

సోనీ సోరి పైన పోలీసులు ఎనిమిది అక్రమ కేసులు బనాయించారు. వీటిల్లో 6 కేసులను ట్రయల్స్ కోర్టే కొట్టేసింది. తప్పుడు సాక్ష్యాలు చూపారని కొన్ని, అసలు సాక్ష్యాలే లేవని కొన్ని కేసులు కొట్టేశారు. అయినా సోనీ సోరి, కొడోపిలకు బెయిల్ ఇవ్వడానికి ట్రయల్ కోర్టు, జిల్లా కోర్టు, ఛత్తీస్ ఘర్ హై కోర్టు నిరాకరించాయి. ఆరు కేసులు అక్రమ కేసులు అని నిర్ధారణ అయ్యాక మిగిలిన కేసులు రెండూ ఎస్సార్ స్టీల్స్ కి సంబంధించినవే. ఈ కేసులు సదరు కంపెనీ జనరల్ మేనేజర్, మరో ఉన్నత ఉద్యోగి పైన కూడా పోలీసులు మోపారు. పైగా జనరల్ మేనేజర్ ఆ కేసులో ప్రధాన ముద్దాయి కాగా సోనీ సోరి, కొడోపిలు తదుపరి ముద్దాయిలు.

కంపెనీ అధికారులిద్దరికి రెండున్నర నెలల్లోనే బెయిల్ ఇచ్చిన క్రింది కోర్టు అదే కేసుల్లో తదుపరి ముద్దాయిలయిన సోనీ సోరి, కొడోపిలకు మాత్రం బెయిల్ నిరాకరించింది. ఇంతకంటే హాస్యాస్పదమైన, పరమహీనమైన, పక్షపాతంతో కూడిన న్యాయం మరొకటి ఉంటుందా అన్నది అనుమానమే. ‘కేసుల తీవ్రత’ అన్నదే బెయిల్ నిరాకరించడానికి ట్రయల్ కోర్టు, హైకోర్టులు చెప్పిన కారణం. కేసు అంత తీవ్రమైనదయితే ప్రధమ ముద్దాయి అయిన జనరల్ మేనేజర్ కి బెయిల్ ఎలా ఇచ్చారన్నది భారత న్యాయస్ధానాలు ఎప్పటికీ సమాధానం ఇవ్వని, ఇవ్వలేని ప్రశ్న.

ఇంతకీ ఈ కేసు ఎంత తీవ్రమయినదంటే ఆ కేసుల తీవ్రత తెలియజేసే సాక్ష్యాన్ని పోలీసులు సుప్రీం కోర్టు ముందు ఉంచలేనంత పరమ నాసిరకమైన తీవ్రత! కోర్టు నిర్దేశించిన సమయానికి పోలీసులు సాక్ష్యాలను సుప్రీం కోర్టు ముందు ఉంచలేకపోయారు. సుప్రీం కోర్టు ఏమీ దోషిత్వాన్ని రుజువు చేసే సాక్ష్యాలు ఇమ్మనలేదు. ఆ పని చూసేదీ ట్రయల్ కోర్టు. బెయిల్ నిరాకరించడానికి తగిన సాక్ష్యాలు మాత్రమే సుప్రీం కోర్టు అడిగింది. అవి కూడా పోలీసుల వద్ద లేవు. దానితో ఇరువురికీ మధ్యంతర బెయిల్ ఇస్తూ సుప్రీం కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

మరో రెండు రోజుల్లో రెండున్నరేళ్ల నిరీక్షణ, అలవిగాని చిత్రహింసల అనంతరం సోనీ సోరి, లింగారాం లు స్వేచ్ఛావాయువులు పీల్చబోతున్నారు. ప్రపంచంలోనే అత్యంత భారీ ప్రజాస్వామిక వ్యవస్ధ అయిన భారత దేశపు మూలవాసుల స్వేచ్ఛావాయువుల ఖరీదు అక్రమ కేసులతో రుద్దిన రెండున్నరేళ్ల చిత్రహింసల బందిఖానా! ఎస్సార్ స్టీల్స్ జనరల్ మేనేజర్ కూ సోనీ సోరి, కొడోపిలకు ఉన్న ఏకైక తేడా కేవలం వారి ఆర్ధిక స్ధితి, దేశంలో అత్యున్నత స్ధానాలను ప్రభావితం చేయగల పలుకుబడి మాత్రమే. అంతకు తప్ప తేడా ఏమీ లేదు. నలుగురిపై ఉన్నదీ ఒకే కేసు. ఇంకా మాట్లాడితే జనరల్ మేనేజరే ప్రధమ ముద్దాయి. ఈ దేశంలో సౌకర్యాలే కాదు, న్యాయాన్ని కూడా డబ్బుతో కొనుక్కోవచ్చు అనడానికి ఇంతకు మించి ఏ ఉదాహరణ కావాలి?

సోనీ సోరి భర్త విషయం కూడా కొంత చెప్పుకోవాలి. ఆయన ఆగస్టు 3, 2013 తేదీన చనిపోయాడు. ఆయన మరణానికి కారణం ఏమిటో ఆయన బంధువుల్లో ఎవరికీ తెలియదు. అంతుచిక్కని విధంగా నరాలు క్షీణించిన పరిస్ధితిలో ఆయన చనిపోయాడని డాక్టర్లు చెప్పారు. “ఆయన పెళ్లి చేసుకోకుండా ఉన్నట్లయితే ఆయన శుభ్రంగా ఆరోగ్యంగా ఉండేవాడు. ఆయన చేసిన ఏకైక తప్పు సోనీ సోరికి భర్త కావడమే” అని అనీల్ ఫుటనే బంధువు ఒకరు చెప్పారని ది హిందు తెలిపింది.

అనీల్ ఫుటనే అనేక చేతులు మారిన బోలెరో జీపు అద్దెకు తిప్పుతూ ముగ్గురు పిల్లలని (ఇద్దరు పాపలు, ఒక బాబు) పోషించుకునేవాడు. స్ధానిక కాంగ్రెస్ నాయకుడు అవదేశ్ గౌతమ్ పైన దాడికి పధక రచన చేస్తుండగా ముందే పసిగట్టి ఆయన్ని అరెస్టు చేశామని పోలీసులు చూపించిన కారణం. విచిత్రం ఏమిటంటే ఆయన అరెస్టు కావడానికి కారణం ఆయన బంధువులు సరే, ఆయనకే తెలియదు. “ఆయన ఏ తప్పు చేశాడో, ఆయన అరెస్టయిన చాలా కాలం వరకు మాకు తెలియదు. జిల్లా పోలీసుల్లో ఉన్న స్నేహితుల ద్వారా మాత్రమే తెలుసు… ఆయన సోనీ భర్తే కాకపోయి ఉన్నట్లయితే ఈ పరిస్ధితి వచ్చేదే కాదు” అని అనీల్ బంధువులు చెప్పారు.

అనీల్ లాయర్ కె.కె.దూబే ప్రకారం జులై 2010లో అనీల్ అరెస్టయ్యాడు. “ఏదో దాడికి పధకం వేశాడన్నారు. అదేంటో అనీల్ కి తెలియనే తెలియదు” అని దూబే తెలిపాడు. “చివరికి కోర్టులో ఏదీ రుజువు కాలేదు. మూడేళ్లు జైల్లో ఉన్నాక మే 1, 2013 న విడుదలయ్యాడు. ఆయనతో పాటు ఆ కేసు మోపిన 15 మందీ విడుదల అయ్యారు. సాక్షులు ఎవరూ లేరని, అవదేశ్ గౌతమ్ అనుచరుల చావుకు కారణమైన ఆయుధాలు దొరికింది నిందితుల వద్ద కాదని చెప్పి కోర్టు కేసు కొట్టేసింది” అని దూబే తెలిపాడు.

కానీ అనీల్ విడుదల దగ్గర పడేకొద్దీ ఆయన చెల్లించిన మూల్యం ఏమిటో తెలిసి వచ్చింది. అరెస్టయినపుడు ఎంతో ఆరోగ్యంగా ఉన్న అనీల్ విడుదల అయ్యేనాటికి తీవ్రమైన రోగిస్టిలా, చచ్చుబడిన దేహంతో బయటకు వచ్చాడు. విడుదలయిన ముందు రోజుల్లోనే నడవలేక నడిచిన (అంకురం సినిమా ఎవరన్నా చూసి ఉంటే అందులో సాయిచంద్ పాత్ర గుర్తుకు తెచ్చుకోవచ్చు.) అనీల్ తొడకండరాలు క్రమంగా బలహీనపడి విడుదల అయ్యే నాటికి నడుము కింది భాగం అంతా చచ్చుబడిన పరిస్ధితిలో విడుదల అయ్యాడు. 

తన భర్త అరెస్టయిన కొద్ది నెలలకు సోనీ సోరి కూడా అరెస్టయింది. తల్లిదండ్రులు ఇద్దరూ జైలు పాలు కావడంతో వారి పిల్లలు ముగ్గురూ అనీల్ తండ్రి దగ్గరకు వెళ్లిపోవలసి వచ్చింది. “ఆ విధంగా అనీల్, సోనిల కుటుంబాన్ని క్రమంగా విచ్ఛిన్నం చేసి సర్వనాశనం చేశారు” అని దంతెవాడలో ఒక సామాజిక కార్యకర్త పేర్కొన్నారంటే పరిస్ధితి అర్ధం చేసుకోవచ్చు.

ఇంతా చేసి సోనీ సోరి, అనీల్, కొడోపిలు చేసిన నేరం ఏమీ లేదు. మావోయిస్టులపైన ఉన్న కసి, కోపం తమకు అనుమానం వచ్చిన అమాయకులపై తీర్చుకోవడం భారత దేశంలోని దాదాపు అన్నీ రాష్ట్రాల్లోనూ పోలీసులకు మామూలే. ఈ వ్యవస్ధను కూలదోసి శ్రామికులకు అధికారం దక్కే సమసమాజం నిర్మించాలన్నది మావోయిస్టుల ప్రకటిత లక్ష్యం. ఈ దేశ పాలకులు ఏర్పాటు చేసుకున్న చట్టాల ప్రకారం నేరం జరిగితే, అందుకు సాక్ష్యాలు ఉన్నట్లయితే శిక్ష విధించడానికి ఎవరికీ అభ్యంతరం లేదు.

కానీ ఆ పేరుతో అసలు నేరమే జరక్కుండా, జరిగిన నేరంలో ఏ పాత్రా లేకుండా మావోయిస్టులకు సహకరిస్తున్నారన్న అనుమానంతో పోలీసుల చేత ఎంత తీవ్రంగా అయినా చిత్రహింసలు పెట్టించవచ్చా అన్నది సగటు పౌరుడు ఆలోచించవలసిన ప్రశ్న. ఒకే నేరంలో అనుమానితులయినప్పుడు డబ్బున్నవాడికి ఒక విధంగానూ, డబ్బు లేనివారితో ఒక విధంగానూ వ్యవహరించే స్వేచ్ఛ, అధికారం పోలీసులకు ఏ చట్టం ప్రకారం ఉన్నాయన్నది కూడా ఆలోచించవలసిన ప్రశ్నే. పాలకుల ప్రయోజనాలకు అడ్డు తగిలితే మావోయిస్టులే కాదు, గాంధేయవాదులు కూడా శిక్షార్ధులే అని దంతెవాడలోనే గాంధేయ మార్గంలో గిరిజనులకు సాయం చేయడానికి ప్రయత్నించి, పోలీసుల ధాటికి భయపడి పారిపోయిన హిమాంషు కుమార్ ఉదాహరణ చెబుతోంది.

“ప్రజాస్వామ్యం బతికి బట్టకట్టాలంటే, అది అత్యంత బలహీన పౌరుల కోసం కూడా పని చేయాలి. అలా పని చేయకపోతే అదిక ప్రజాస్వామ్యం కాదు.” అన్న హిమాంషు కుమార్ మాటలను ఎలా నిరాకరించగలం?

2 thoughts on “సోనీ సోరి: సుప్రీం కోర్టులో బెయిల్ మంజూరు

  1. రామలింగరాజుకు 24000కోట్ల రూపాయల కుంభకోణం లో 9 నెలల చక్కని జైలు జీవితమ్..ఇంటిదగ్గర్నుంచి భోజనం,ప్రత్యేక బ్యాడ్మింటన్ కోర్టు,9నెలలకే బెయిల్;;-6-1-2011నాటి టైమ్స్ ఆఫ్ ఇండియా,న్యూ ఢిల్లీ ఎడిషన్ లో మరో నేరం గురించి ఇలా వచ్చింది”వాచ్ మన్ కు కత్తి చూపించి 20రూపాయలు దొంగిలించిన నేరానికి విచారణకోర్టు ఒక వ్యక్తి కి 7సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది.కేసు 20 రూపాయలకు సంబంధించిందైనా నేరతీవ్రత తక్కువ చేసిచూడకూడదని గౌరవనీయులైన కోర్టువారు అన్నారు.ఒక్కొక్కరికీ 2000 రూపాయల జరిమానా వేశారు-ఆహా!నా ఘన ప్రజాస్వామిక సామ్యవాద గణతంత్ర రాజ్యమా!

  2. గణతంత్ర రాజ్య మంటే ‘ ఘనులకు ‘ మాత్రమే రాజ్యం! లేక ఇనుప గనులకు మాత్రమే రాజ్యం. భూ గనులకుమాత్రమే!

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s