అత్యాచారాలు: సి.బి.ఐ బాస్ కువ్యాఖ్యలు, ఆనక సారీ


CBI Director Ranjit Sinha

CBI Director Ranjit Sinha

శుభం పలకరా పెళ్లికొడుకా అంటే ఇంకేదో అన్నాట్ట వెనకటికొకరు. క్రికెట్ బెట్టింగ్ అరికట్టడం గురించి చర్చలో పాల్గొనమని పిలిస్తే మహిళలపై జరుగుతున్న లైంగిక అత్యాచారాల గురించి అసంబద్ధంగా మాట్లాడి విమర్శల పాలయ్యారు సి.బి.ఐ బాస్ రంజిత్ సిన్హా! లైంగిక అత్యాచారాలను ఆయన జూదంతో పోల్చారు. జూదం అరికట్టలేని పరిస్ధితుల్లో బెట్టింగ్ లాంటి జూదాలను చట్టబద్ధం చేయడమే మంచిదని సలహా ఇచ్చేశారు. ‘అరికట్టలేని బెట్టింగ్ లను చట్టబద్ధం చేయాలన్న సలహాలాగే అత్యాచారాన్ని నివారించలేకపోతే ఎంజాయ్ చేయడమే బెటర్ అని చెప్పడమే’ అంటు పరస్పర విరుద్ధ వ్యాఖ్యలు చేసారాయన.

రాహుల్ ద్రావిడ్ లాంటివారు హాజరయిన ‘ఆటల్లో నైతికత’ చర్చలో పాల్గొంటూ “నేనేమనుకుంటున్నానంటే… రాష్ట్రాల్లో మనకి లాటరీలు ఉన్నపుడు, కొన్ని టూరిస్టు రిసార్ట్ లలో కేసినోలు ఉన్నపుడు, నల్ల డబ్బును స్వచ్ఛందగా వెల్లడి చేసినవారికి ప్రోత్సాహక పధకాలను ప్రభుత్వం ప్రకటిస్తున్నపుడు, బెట్టింగ్ ను చట్టబద్ధం చేస్తే తప్పేమిటి?” అని రంజిత్ సిన్హా ప్రశ్నించారు.

“వీటన్నింటికి మించి మనకి అమలు చేసే యంత్రాంగం ఉన్నదా?” అని ప్రశ్నించిన రంజిత్ సింగ్ మరింత ముందుకెళ్లి “అమలు చేసే యంత్రాంగం లేదనడం మీకు చాలా తేలిక. అది ఎలా ఉంటుందంటే అత్యాచారాన్ని అడ్డుకోలేకపోతే దాన్ని ఎంజాయ్ చెయ్యండి అని చెప్పినట్లు ఉంటుంది” అని రంజిత్ వ్యాఖ్యానించారు.

ఆయన ఇంకా ఇలా అన్నారు. “ఏదో ఒకటి ఉండడం మంచిది. పూర్తిగా చేతులెత్తేసి అన్నీ యధావిధిగా జరిగిపోయేలా చేసేబదులు దాన్ని చట్టబద్ధం చేయండి, తద్వారా కొంత రెవిన్యూ సంపాదించండి” అని ప్రతిపాదించారు సి.బి.ఐ బాస్. క్రికెట్ బెట్టింగ్ లాంటి జూదాలను చట్టపరంగా నిషేధించి, ఆ నిషేధాన్ని అమలు చేసే యంత్రాంగం లేక బెట్టింగ్ లు నిరాటంకంగా జరిగిపోతున్నా ఏమీ చేయలేక చేతులు ముడుచుకుని కూర్చునే బదులు, అసలు బెట్టింగ్ నే చట్టబద్ధం చేసేసి ఆదాయం పొందవచ్చు కదా అని సి.బి.ఐ అధినేత రంజిత్ గారి భావం.

అంటే ఒక నేరాన్ని అరికట్టే యంత్రాంగం లేనప్పుడు ఆ నేరాన్ని చట్టబద్ధం చేసేస్తే పోలా? అన్నది ఆయన హితబోధ! జాతీయ స్ధాయిలో అత్యంత ఉన్నతస్ధాయి పరిశోధన సంస్ధకు నేతృత్వం వహిస్తున్న వ్యక్తి చెప్పవలసిన మాటలేనా ఇవి?

అది సరే! తాను చెప్పదలుచుకుంది ఏదో చెప్పి ఊరుకోక మధ్యలో మహిళల అత్యాచారాలను లాగవలసిన అవసరం ఆయనకు ఏమిటో అర్ధం కాలేదు. ఒకపక్కేమో మీకు నిషేధం అమలుచేసే యంత్రాంగం లేదు కదా అంటారు. యంత్రాంగం లేదు కాబట్టి బెట్టింగ్ ని చట్టబద్ధం చేయమని సలహా ఇస్తారు. మళ్ళీ ‘యంత్రాంగం లేదని ఎత్తిచూపడం చాలా తేలిక’ అని తన ఎత్తిచూపుడుని తానే తేలిక చేసుకుంటారు. తన వ్యాఖ్యల్ని తానే తేలిక చేసుకోవడంతో ఆగకుండా ‘అదెలా ఉందంటే నీపై జరుగుతున్న అత్యాచారాన్ని ఆపలేకపోతే దాన్ని ఆనందించు’ అని చెప్పినట్లుంది అని పోల్చడం పూర్తిగా అసంబద్ధం, అసంగతం, తన స్ధాయిని తానే దిగజార్చుకోవడం.

ఇక్కడ రెండు అంశాలు కనిపిస్తున్నాయి. ఒకటి: తన మాటల్ని తానే తేలిక చేసుకోవడం. రెండు: చేయకూడని పోలిక చేసి అత్యాచారాల బాధిరాళ్ళ వేదనను తేలిక చేయడం. గతంలో 1980ల్లో ఒక కాంగ్రెస్ పెద్దాయన ‘మానభంగం చేయడం పెద్ద పనా? సిగరెట్ కాల్చడం కంటే చాలా తేలిక’ అని వ్యాఖ్యానించారు. అది కూడా ఒక సభలో. అప్పటికీ, ఇప్పటికీ పరిస్ధితిలో ఏ మార్పూ లేదని రంజిత్ సింగ్ వ్యాఖ్య చెబుతోంది.

లైంగిక అత్యాచారం అనేది బాధితురాలి శరీరంపై జరిగే భౌతిక దాడి, మానసిక దాడి కూడా. ఎదుటివాడు చెయ్యెత్తితేనే పౌరుషపడి పోతుంటాం. లేదా మీద చెయ్యేసి నెడితేనే దాడి చేశాడని, కొట్టాడని ఫిర్యాదు చేస్తాం. లేదా ఒంటిమీద చొక్కా లేకుండా రోడ్డు మీదికి రావాలంటే సిగ్గుపడతాం. శత్రువు దగ్గరో, పోలీసు స్టేషన్ లోనో బలవంతంగా చొక్కా విప్పాల్సివచ్చిన పరిస్ధితి వస్తే అవమానపడతాం. అలాంటిది, అనేక రకాల నిబంధనలు, సూత్రాలు, మర్యాదలు రుద్దబడిన సమాజంలోని ఒక మహిళపై భౌతికంగా దాడి చేయడమే కాక ఆమె వ్యక్తిగత సమగ్రతకు తీవ్రంగా భంగం కలిగించే లైంగిక అత్యాచారాల గురించి ఇంత తేలికగా ఎలా మాట్లాడగలరు?

రంజిత్ సింగ్ మామూలు వ్యక్తి కాదు. దేశంలోనే అత్యున్నత నేరపరిశోధనా సంస్ధకు నేత ఆయన. నేరపరిశోధనతో పాటు ప్రాసిక్యూషన్ అధికారాలు కూడా సి.బి.ఐ అధికార పరిధిలో ఉన్నాయి. తన సుదీర్ఘ సర్వీసులో ఎన్నో అత్యాచారాల కేసులను ఆయన పరిశోధించి ఉంటారు. బాధితురాళ్ళ మానసిక, శారీరక ఆవేదనను, అవమానాన్ని స్వయంగా చూసి ఉంటారు. వారి ఆవేదనను పంచుకుని కూడా ఉంటారు. అలాంటి ముఖ్యమైన వ్యక్తి అత్యాచారాల గురించి సందర్భంగాని చోట పోలిక తెచ్చి తేలికగా వ్యాఖ్యానించడం చాలా ఘోరం.

అంతేకాకుండా నేరాన్ని నివారించలేనపుడు దాన్ని చట్టబద్ధం చేసి ఆదాయం పొందాలని సలహా ఇవ్వడం మరో విచిత్రం. ఆయన చెప్పినట్లు లాటరీలను ఆదాయ వనరుగా చూడకుండా పూర్తిగా నిషేధించి అమలు చేయాలి. కేసినో అన్నదే స్త్రీల సామాజిక హోదాను కించపరిచేది కనుక టూరిస్టు రిసార్టుల్లో కూడా అవి జరగకుండా చూడాలి. నల్లడబ్బు పోగేసుకునే దొంగవెధవలకు ‘స్వచ్ఛంద వెల్లడి’ లాంటి ప్రోత్సాహకాలు ఇవ్వడం కూడా మానుకోవాలి. అంతేతప్ప, ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి బెట్టింగ్ కూడా చట్టబద్ధం చేయమనడం ఎవరికి మేలు చేసే సలహా? నాలుగైదు తప్పులు జరుగుతున్నాయి కాబట్టి ఇంకో నాలుగు తప్పులు చెయ్యండి అని చెప్పడం కరెక్టా లేక ఆ నాలుగైదు తప్పులు కూడా జరగకుండా చూడండి, అందుకు తగినంతమంది సిబ్బందిని నియమించండి అని సలహా ఇవ్వడం కరెక్టా?

లాటరీలు, కేసినోలు, బెట్టింగులు మొదలయినవన్నీ మోసగాళ్ళయిన ధనికులు మరిన్ని మోసాలు చేయడానికీ, తద్వారా తమ సంపదల్ని మరిన్ని రెట్లు పెంచుకోవడానికి దోహదపడేవే. అప్పటికే సవాలక్షా బలహీనతలతో ఇల్లూ, ఒల్లూ గుల్ల చేసుకునే కూలీలు, దిగువ, ఎగువ మధ్యతరగతి కుటుంబాలను జూదంలోకి లాగి మరిన్ని కష్టాల్లోకి నెట్టేవి. అలాంటి వాటిని పూర్తిగా నిషేధించడమే సమాజానికి మంచింది. నిషేధం అమలు చేయడం ప్రభుత్వాలు, వాటికింద పనిచేసే ఏజన్సీల కర్తవ్యం. కర్తవ్యాన్ని నెరవేర్చడానికి తగిన సిబ్బంది ఇవ్వాలని పోట్లాడడం మాని మోసాలను కూడా చట్టబద్ధం చేయాలనడం పలాయనవాదమే కాక బాధ్యతారాహిత్యం కూడా.

4 thoughts on “అత్యాచారాలు: సి.బి.ఐ బాస్ కువ్యాఖ్యలు, ఆనక సారీ

  1. రాజకీయ వెన్నుదన్నులతో అందలమెక్కే మందమతుల వ్యవహార శైలికి ఇదొక మచ్చు తునక. ప్రభుత్వం ఒక పక్క నిర్భయ చట్టాని ప్రతిపాదిస్తే, లైంగిక అత్యాచారాల ద్వారా గర్భాధారణకు ప్రభుత్వ పరిధిలో మరొక బిల్లు తేవడానికి ఈయనగారు తపనపడుతున్నారు. సాంఘిక సామాజిక వ్యవస్థలకు అవస్థలను ఆపాదించి తద్వారా ఈ అత్యున్నత నేరపరిశోధన విభాగాన్ని స్త్రీ సాంగత్యంతో ముడిపడిన విషయంగా ఏ రీతిలో పోల్చాడో ఈయనగారికే తెలియాలి. బ్యాటింగ్ బెట్టింగ్, సెక్స్ ట్రేడింగ్ ను అనుసంధానంలో పరిశ్రమించిన విధానమేమిటో? పదవి విరమణ సమయంలో ఈ విధంగా పెదవి విరుపుల ప్రసంగాలను చేసి మేధా శక్తిని పెంపొందించడానికి బదులు సెక్స్ సామర్ధ్యాన్ని పదునుపెట్టడం స్కాముల స్కలనానికి మరొక తేలికపాటి మార్గమనుకుంటా!

  2. కానీ ఒక విషయం సీరియస్‌గా ఆలోచించాలి. చట్టాల వల్ల రేప్‌లు తగ్గడం లేదని తెలిసినా ఎవరూ రేప్‌లని చట్టబద్దం చెయ్యమని కోరరు. కేవలం జూదం, వ్యభిచారం లాంటి వాటినే చట్టబద్దం చెయ్యాలని ఎందుకు కోరుతున్నారు? మన ఇంటిలో దొంగతనం చేసిన బాల నేరస్తుడు కేవలం పేదరికం వల్లో, తల్లితండ్రుల నిర్లక్ష్యం వల్లో నేరం చేసినవాడైతే అతను జువెనైల్ హోం నుంచి విడుదలైన తరువాత కూడా నేరాలు చేస్తాడు. అతణ్ణి శిక్షించడం వల్ల అతను మారడు. అయినా బాల నేరస్తులని పోలీసులకి ఎందుకు పట్టిస్తాం? కానీ మత్తుమందులు, జూదం, వ్యభిచారం విషయంలో మాత్రం ఈ అభిప్రాయాలు ఎందుకు మారిపోతాయి? వ్యభిచారాన్ని నిషేధించడం వల్ల వ్యభిచారులు మారరు అని చెప్పి వ్యభిచారాన్ని చట్టబద్దం చెయ్యాలని ఎందుకు కోరుతాం? “వ్యభిచారాన్ని చట్టబద్దం చెయ్యడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు” అని రంగనాయకమ్మ గారు ఒక వ్యాసంలో వ్రాసినప్పుడు మన తెలుగు బ్లాగుల్లోనే దానిపై తీవ్ర వివాదం జరిగింది.

  3. వ్యభిచారం చట్టబద్దం చేస్తే వైవాహిక వ్యవస్థ చట్టబండలు అవుతుంది. ఇప్పటికే ఈ వ్యవస్థకు సాంఘిక,సామాజిక, న్యాయపరంగా ఆలుమగల సాతంత్రానికి పలు వెసులుబాట్లు కలుగుతూనే వున్నాయి. ఐతే ఒకటి ప్రభుత్వపరంగా ఎన్నికల నిర్వాహణ వ్యయం తగ్గుతుంది, ఓటరుల జాబితాకు కావలిసిన సమాచారం పొందుపరచే అవసరం ఉండదు. జనాభాకు చిరునామా, గుర్తింపు ఉండదు కాబట్టి.

  4. భార్య ఒక గిగోలో (మగ వేశ్య) దగ్గరకి వెళ్తే భర్త ఊరుకోడు కానీ భర్త ఒక వేశ్యని ఇంటికి తీసుకొస్తే భార్య మౌనంగా భరిస్తుంది. వ్యభిచారాన్ని చట్టబద్దం చేసినా, చెయ్యకపోయినా పరిస్థితి ఇలాగే ఉంటుంది. జూదం విషయానికొస్తే, పర్యాటక అభివృద్ధి పేరుతో కేసినోలకి అనుమతి ఇచ్చి, పల్లెటూర్లలో పేకాట ఆడేవాళ్ళని మాత్రం అరెస్త్ చేస్తే జనం పేకాటని తప్పు అని ఎలా అనుకుంటారు? నీతి అనేది ఎక్కడైనా ఒకేలా ఉండాలి కదా.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s