మోడీ చరిత్ర పరిజ్ఞానం ఇంతేనా?


Special arrangement

“మీకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశాం సర్, చారిత్రక పేర్ల గురించి ప్రస్తావించదలుచుకుంటే జస్ట్ గూగుల్ చేయండి చాలు!”

———

ప్రధాన  మంత్రి కాగోరేవారికి భారత దేశ చరిత్ర గురించి సరైన అవగాహన ఉండాలని భావించడంలో తప్పుకాదు. పైగా అదొక షరతు కూడా. దేశ చరిత్ర పైన అవగాహన లేనివారు దేశ రాజకీయ-ఆర్ధిక-విదేశాంగ విధానాలను ఎలా నిర్దేశిస్తారు? కానీ బి.జె.పి ప్రధాని అభ్యర్ధికి అత్యవసరమైన ఈ అవగాహన కొరవడిందని ఆయన ఉపన్యాసాలు చెబుతున్నాయి. రెండు సందర్భాల్లో ఆయన చారిత్రక అవగాహన లేమిని వ్యక్తం చేసుకున్నారు.

ఒకటి: తక్షశిల విద్యాలయం. తక్షశిల పట్నం ప్రస్తుతం పాకిస్తాన్ లో ఉన్నది. పంజాబ్ రాష్ట్రంలోని రావల్పండి జిల్లాలో ఉన్న ఈ పట్టణం భారత ఉపఖండానికి సంబంధించి అత్యంత ప్రాముఖ్యత ఉన్న పురావస్తు నగరం. ప్రాచీనకాలంలో ఈ పట్టణం భారత ఉపఖండం, పశ్చిమాసియా, మధ్య ఆసియా ప్రాంతాల కూడలిగా ఉండేది. ప్రాచీన వాణిజ్య కూడలిగా కూడా ఉన్నందున దీనిపై పట్టు కోసం అనేక సామ్రాజ్యాలు యుద్ధాలు చేసుకున్నాయి. ఆ తర్వాత హూణుల దండయాత్రలో ఇది నాశనం అయింది. ఈ పట్టణం గుండా వెళ్ళే వాణిజ్య మార్గాలు కూడా క్రమంగా ప్రాముఖ్యత కోల్పోవడంతో నగర వైభవం కూడా తగ్గిపోయింది. ప్రపంచంలోనే మొట్టమొదటి విశ్వవిద్యాలయంగా ప్రసిద్ధి చెందిన ప్రాచీన తక్షశిల విశ్వవిద్యాలయం ఇక్కడిదే.

హిందూ పురాణాల్లో కూడా తక్షశిలకు ప్రాధాన్యత ఉన్నది. రాముడి సోదరుడయిన భరతుడు కొడుకు తక్షుడు. ఆయన పేరు మీదనే దీనికి తక్షశిల పేరు వచ్చిందని కొందరు నమ్ముతారు. అనగా రామాయణంలో దీనికి ప్రాముఖ్యత ఉన్నది. అర్జునుడు మనవడు పరీక్షిత్తు మహారాజుకు పట్టాభిషేకం ఇక్కడే జరిగిందని మహాభారతం చెబుతుంది. వ్యాస మహర్షి శిష్యుడు వైశంపాయనుడు తన గురువు కోరికపైన మహాభారతాన్ని మొట్టమొదట ఇక్కడే పఠించారని ఒక నమ్మకం. కాబట్టి మహాభారతం రీత్యా చూసినా దీనికి ప్రాముఖ్యత ఉన్నది.

పౌరాణిక నమ్మకాలను పక్కనబెట్టి అసలు చరిత్రను పరిశీలిస్తే తక్షక అంటే సంస్కృతంలో వడ్రంగి అని అర్ధం. ప్రాచీన భారతంలో నాగ తెగకు చెందిన ప్రజలకు ఇది మరో పేరు అని ప్రఖ్యాత చరిత్రకారుడు డి.డి.కోశాంబి పేర్కొన్నారు. తక్షులు నివసించిన స్ధలం కనుక తక్షశిల అని పేరు వచ్చింది.

Taxila -Googole Map

Taxila -Googole Map

ఇన్ని రకాలుగా ప్రాముఖ్యత ఉన్న తక్షశిల బీహార్ లో ఉన్నదని ఈ మధ్య మోడిగారు వాకృచ్చారు. ఆయన బహుశా నలందా విశ్వవిద్యాలయం గురించి చెప్పాలనుకుని ఉంటారు. (తక్షశిల విశ్వవిద్యాలయం కంటే నలందా విశ్వవిద్యాలయమే మరింత ప్రాముఖ్యత పొందినది. విశ్వవిద్యాలయం అని చెప్పడానికి తగిన నిర్మాణాలు నలందాలో ఉన్నాయి తప్ప తక్షశిలలో లేవు.) బీహార్ ప్రజలను ఉబ్బించడానికి వారికి సొంతం కానీ స్ధల పురాణాన్ని మోడి విప్పబోయారు.

మోడి చరిత్ర విజ్ఞానాన్ని కాంగ్రెస్ పట్టించుకుంది. అవకాశాన్ని ఎందుకు వదులుకుంటుంది? అతి స్ఫూర్తితో బి.జె.పి నాయకులు దేశ సరిహద్దుల్ని తిరగరాస్తున్నారని మన్మోహన్ విమర్శించారు. అంటే తక్షశిల తెచ్చి బీహార్ లో పెట్టడం ఏమిటని ఆయన విమర్శ. దానికి మోడి ఇచ్చిన సామాధానం: దేశ విభజనకు కారణం కాంగ్రెస్ పార్టీయే అని.

ఇదా సమాధానం? దేశ విభజన జరక్కపోయి ఉంటే తక్షశిల బీహార్ లోనే ఉండి ఉండేదనా మోడి చెప్పదలుచుకున్నది? మోడి చరిత్ర పరిజ్ఞానం గురించి కాంగ్రెస్ విమర్శిస్తుంటే దానికి సమాధానం చెప్పడం మాని దేశ విభజన గురించి ఎత్తుకోవడం ఏమిటి? విభజనకు కాంగ్రెస్ కారణం అయితే ఇక బ్రిటిష్ పాత్ర ఏమిటి అన్నది ఒక ప్రశ్న అయితే అసలు విషయం వదిలేసి ఏమిటేమిటో మాట్లాడితే ఏమిటి అర్ధం. కాంగ్రెస్ విమర్శకు నేరుగా సమాధానం ఇచ్చే దమ్ము మోడీకి లేదనేనా?

రెండు: జన సంఘ్ వ్యవస్ధాపకులు, బి.జె.పి నిత్యం కొలిచే వ్యక్తి అయిన శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గురించి కూడా మోడీకి తెలియదా? బ్రిటిష్ వ్యతిరేక సంస్ధ ‘ఇండియా హౌస్’ ని లండన్ లో స్ధాపించిన శ్యామజి కృష్ణ వర్మకూ, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీకి ఒకరికొకరు పొరపాటు పడలేనంత తేడా ఉంది. చరిత్ర రీత్యా చూసినా, నివసించిన కాలం రీత్యా చూసినా, రాజకీయ కార్యకలాపాల రీత్యా చూసినా ఇద్దరికీ కొండత తేడా ఉంది.

ఒకాయన 1930లోనే చనిపోతే మరోకాయన 1953లో చనిపోయారు. ఒకాయన బ్రిటిష్ వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహిస్తే మరోకాయన నెహ్రూ మంత్రివర్గంలో కేంద్ర మంత్రిగా పని చేశారు. ఒకాయన గుజరాతీయుడు ఐతే మరోకాయన బెంగాలీయుడు. శ్యామజికి బి.జె.పి కీ సంబంధమే లేదు. ముఖర్జీ యేమో బి.జె.పి పూర్వ సంస్ధ జన సంఘ్ ని స్ధాపించిన వ్యక్తి.

ఇన్ని తేడాలుండగా శ్యామజీ ముఖర్జీ గురించి చెప్పాల్సిన చోట శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పేరు చెప్పారు మోడి. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ బ్రిటిష్ వాడి ముక్కు కిందనే ఇండియా హౌస్ సంస్ధ నిర్వహించారని, బి.జె.పి స్ధాపక పితామహుడయిన ముఖర్జీ గుజరాత్ గర్వించదగ్గ గుజరాతీ పుత్రుడని మోడి చెప్పారు. ఆయన 1930లోనే చనిపోయారని కానీ స్వేచ్ఛా భారత దేశానికి తీసుకెళ్లడానికి వీలుగా తన అస్ధికలను భద్రపరచాలని కోరిన దేశభక్తుడని కొనియాడారు. (మోడియే ఇటీవల ఆయన అస్ధికలను దేశానికి తిరిగి తెచ్చారని ఒక వార్త.)

మోడి మాటలను బట్టి ఏమర్ధమవుతోంది? ఆయన శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ బి.జె.పి వ్యవస్ధాపకులని తెలుసు. కానీ ఆయన బెంగాలీ అని తెలియదు. పైగా గుజరాతీయుడు అంటూ మరో వ్యాఖ్యానం! శ్యామజి 1930లోనే చనిపోయారని తెలుసు; కానీ ఆయనే బి.జె.పి ఫౌండింగ్ ఫాదర్ అని నిర్ధారించేయడం. ఇంత అయోమయం ఎవరికైనా ఎలా సాధ్యం? అది కూడా భారత దేశ అత్యున్నత పదవిని అలంకరించాలని కోరుతున్న వ్యక్తికి ఎలా సాధ్యం?

ఈ నేపధ్యంలో ఈ కార్టూన్ ఎంత గొప్పగా ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇకముందు చరిత్ర గురించి వ్యాఖ్యానం చేసేటప్పుడు ఇంటర్నెట్ లో వెతికేందుకు వీలుగా ఆయన పోడియంకే గూగుల్ లో వెతికే సౌకర్యాన్ని అమర్చినట్లు కార్టూనిస్టు చూపించారు. కానీ మోడీకి బదులు మరో వ్యక్తి బొమ్మ వేయడమే అర్ధం కాని విషయం.

4 thoughts on “మోడీ చరిత్ర పరిజ్ఞానం ఇంతేనా?

  1. ఐనా మన పిచ్చి గాని, గంబీరోపాన్యాసాలిచ్చి హిందు మతాన్ని రెచ్చగొట్టే వాల్లకు చరిత్ర కావాల? సరైనా చరిత్ర చెపితే రెచ్చి పోతారా ఎమిటి? వాళ్లకు కావాలసింది ఉద్రేకం. అటు పరచడమో ఇటు పరచ బడట మో ! ఇంతోటి చరిత్ర ఎవరికి కావాలీ? ఏమిటీ? ఆ చరిత్రను మరుగు పరచడమే కావాలి గానీ. అందుకే కసేపు భగత్సింగు మావాడే నంటారు. నిజాం కు ఎదురొడ్డి పోరాడిందిం మేమే నంటారు. ఇదంతా చరిత్రా?

  2. chartra telisinolle ప్రధాని అవ్వాలని రాజ్యాంగం లో లేదు 25 సంవత్సరాల వయసున్నోడు ఎవడన్నా అవ్వొచ్చు

  3. అలాగైతే నా వయసు 30 ఏళ్ళు, పైగా నేను యూనివర్సితీలో ఆర్థిక శాస్త్ర విద్యార్థిని కూడా. నాకు మోదీ కంటే ఎక్కువ తెలివితేటలు ఉన్నాయి. అలాగని నాకు ప్రధాన మంత్రి పదవి ఇవ్వరు కదా. ఎన్నికల విధానంలో ఇలాంటి లోపాలు ఉన్నంతమాత్రాన మోదీ గొప్పవాడైపోడు. మోదీ గ్లోబలైజేషన్ సమర్థిస్తున్నాడు కాబట్టే పత్రికలు అతన్ని ఇంత పాప్యులర్ చేశాయి. లేకపోతే పత్రికలు అతన్ని ఒక ఊరు, పేరు లేనివాణ్ణి చూసినట్టు చూసేవి.

  4. ఇవేమీ కొత్త విషయాలు కాదు. “Residue” అనే పదాన్ని “రెజ్హిద్యూ” అని పలకాలని మన కేంద్ర మంత్రులలో ఎంత మందికి తెలుసు? ఇంగ్లిష్‌లో t & dలని కేవలం దంతాలతోనే పలకాలనీ, retroflex(నోటి పై భాగం)తో పలకకూడదనీ ఇందియాలో ఎంత మంది ఇంగ్లిష్ ఉపాధ్యాయులకి తెలుసు? అమెరికన్ ఇంగ్లిష్ నేర్చుకున్నవాడు ఇందియాలో ఇంగ్లిష్ ఉపాధ్యాయులు ఇంగ్లిష్ తప్పుగా మాట్లాడడం చూసి ఎలా ఆశ్చర్యపోతాడో, పబ్లిక్ లైబ్రరీలో లయోనెల్ రాబిన్స్ ఆర్థిక శాస్త్ర పుస్తకాలు చదివినవాడు ఆర్థిక శాస్త్రం తెలియని ప్రధాన మంత్రిని చూసి అలాగే ఆశ్చర్యపోతాడు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం వేరు, ప్రజల కోసం పని చేసే ప్రభుత్వం వేరు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s