ఫిలిప్పైన్స్ ని ఊపేసిన రాక్షస తుఫాను ‘హైయాన్’


ఈ సంవత్సరం ఇప్పటికే అనేక ప్రకృతి విలయాలతో డస్సిపోయిన ఫిలిప్పైన్స్ ను శుక్రవారం మరో భారీ తుఫాను ఊపేసింది. ‘చరిత్రలోనే అది అతి పెద్ద తుఫాను’ అని పత్రికలు చెబుతున్నాయి. సూపర్ టైఫూన్ గా చెబుతున్న ఈ తుఫాను ధాటికి 100 మంది చనిపోయారనీ, ఈ సంఖ్య ఇంకా అనేక రెట్లు పెరగవచ్చని ఫిలిప్పైన్స్ ప్రభుత్వం చెబుతోంది. గంటకు 315 కి.మీ వేగంగా గాలులు వీస్తున్నట్లు రష్యా టుడే తెలిపింది.

బ్రిటన్ పత్రిక డెయిలీ మెయిల్, గాలుల వేగం గంటకు 150 మైళ్ళ పైనే అని తెలిపింది. దేశంలోని 36 రాష్ట్రాలు ఈ తుఫాను బారినపడ్డాయి. 40 లక్షల మంది నిరాశ్రయులు కాగా 8 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు మెయిల్ తెలిపింది. భారత సునామీ తర్వాత ఇంతటి ఉత్పాతం చూడలేదని ఐరాస ప్రతినిధులు గుర్తుకు తెచ్చుకుంటున్నారు.

డెయిలీ మెయిల్ ప్రకారం హైయాన్, చరిత్రలోనే అతి పెద్ద తుఫాను. పదుల లక్షల మంది ఇళ్ళు విడిచి వెళ్లిపోవాల్సి వచ్చింది. ఆర్.టి ప్రకారం హైయాన్ కేటగిరీ-5 కు చెందిన తుఫాను. తుఫాను కేటగిరీల్లో ఇదే అతి పెద్దది. మొత్తం 36 రాష్ట్రాలను హైయాన్ అతలాకుతలం చేసింది. తూర్పు ద్వీపాలయిన లేటే, సమర్ లు భారీ స్ధాయిలో దెబ్బ తిన్నాయి.

రాయిటర్స్ ప్రకారం లేటే రాష్ట్రం లోని టాక్లోబన్ నగరంలో దాదాపు ఇళ్లన్ని దెబ్బతిన్నాయని ఫిలిప్పైన్స్ సివిల్ ఏవియేషన్ ఆధారిటీ అధికారులు చెప్పారు. 2.2 లక్షల మంది నివసించే ఈ నగరంలో రోడ్లపై చెల్లా చెదురుగా పడి ఉన్న 100 మంది మృత దేహాలు కనుగొన్నామని, ఈ సంఖ్య ఇంకా అనేక రెట్లు పెరుగుతుందని వారు తెలిపారు.

“మరణాలు వందల్లో ఉండొచ్చు” అని ఫిలిప్పైన్స్ ఇంధన శాఖ కార్యదర్శి జెరికో పెటిల్లా తెలిపారు. భారీ వట వృక్షాలు సైతం కూలిపోయి రోడ్లను మూసివేయడంతో రక్షణ కార్యక్రమాలకు తీవ్ర అంతరాయం ఏర్పడిందని తెలుస్తోంది. చాలా చోట్ల రోడ్లన్నీ నీటి మడుగుల్లో ఉండిపోయాయి. ఫెర్రీలు నడవడం లేదు. అనేక విమానాశ్రయాలను మూసివేశారు. ఫలితంగా సహాయ సరఫరాలు అందడం గగనం అయింది. మొత్తం 13 విమానాశ్రయాలు మూసివేయడంతో 458 స్ధానిక, అంతర్జాతీయ విమానాలు రద్దయ్యాయని ఆర్.టి తెలిపింది. టెలిఫోన్ సర్వీసులు కూడా బాగా దెబ్బ తిన్నాయి. తీర గ్రామాల్లో 20 అడుగుల ఎత్తున అలలు ఎగసి పడ్డాయి. దట్టంగా అల్లుకున్న మేఘాలు పగటిని రాత్రిగా మార్చేశాయి. 

“ఇలాంటి మహా వినాశనం గతంలో హిందూ మహా సముద్రంలో సునామీ సంభవించినప్పుడే చూశాను” అని ఐరాస ప్రకృతి వినాశన మూల్యాంకన బృందం అధినేత సెబాస్టియన్ రోడ్స్ చెప్పాడని రాయిటర్స్ తెలిపింది. ఈయన బృందాన్ని టాక్లోబన్ నగరానికి పంపారు. నగరంలోని వీధులన్నీ ఇళ్ల శిధిలాలతోనూ, విరిగిపడిన స్తంభాలతోనూ, కొట్టుకు వచ్చిన ఇళ్ల కప్పులతోనూ నిండి ఉన్నాయని ఈ బృందం తెలిపింది. “దాదాపు ఇళ్లన్నీ నాశనం అయ్యాయి. మెజారిటీ ఇళ్ళు పూర్తిగా కూలిపోయాయి. కొన్ని మాత్రమే నిలబడి ఉన్నాయి” అని ఫిలిప్పైన్స్ జాతీయ విపత్తు నివారణ సంస్ధ ప్రతినిధి మేజర్ రే బాలిడోవా చెప్పారని ఆర్.టి తెలిపింది.

సమర్ ద్వీపంలో అయితే పదుల లక్షల మంది ఇళ్ళు వదిలి పారిపోవలసి వచ్చింది. దేశంలో ఆస్తులు, భవనాలు, ప్రభుత్వ, ప్రైవేటు నిర్మాణాలను నాశనం చేసిన హైయాన్ శనివారం సాయంత్రానికి వియత్నాం తీరం దాటి బలహీనపడుతుందని వాతావరణ నిపుణులు చెప్పారు. తుఫాను అనంతరం సమర్ ద్వీపకల్పంలో వరదలు విరుచుకుపడుతున్నాయని, కొండల పై నుండి మట్టిచరియలు విరిగి పడుతున్నాయని తెలుస్తోంది.

విద్యుత్, టెలిఫోన్ సౌకర్యాల గురించి చెప్పుకోకపోవడమే మేలని పత్రికలు అభివర్ణిస్తున్నాయి. ప్రార్ధించడం మినహా గత్యంతరం లేదని అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. “ఇటువంటి మహా వినాశనం ఎదురయితే మనం చేయగలిగిందల్లా ప్రార్ధన, ప్రార్ధన, ప్రార్ధన! అంతే” అని దక్షిణ లేటే గవర్నర్ రోగర్ మెర్కాడో వ్యాఖ్యానించాడు. (డెయిలీ మెయిల్)

ఫిలిప్పైన్స్ కు తుఫానుల్లాంటి ప్రకృతి విలయాలు కొత్త కాదు. పసిఫిక్ మహా సముద్రంలో నిర్మితం అయ్యే తుఫానులకు ఎదురయ్యే మొదటి భూభాగం ఫిలిప్పైన్స్ దేశమే. అందువలన సంవత్సరంలో సగటున 20 తుఫానులు ఆ దేశానికి గ్యారంటీ. ఈ సంవత్సరం అయితే ఈ సగటు సంఖ్య ఇప్పటికే దాటిపోయింది. ఒక భూకంపంతో పాటు 24 తుఫాన్లు ఇప్పటివరకు ఫిలిప్పైన్స్ ను ముంచెత్తాయి.

కానీ హైయాన్ మాత్రం వీటన్నింటికి భిన్నం. కేటగిరీ 5 తుఫానును కూడా ఈ సంవత్సరమే ఒకసారి ఫిలిప్పైన్స్ ఎదుర్కొంది. దానికంటే హైయాన్ ఇంకా తీవ్రమైనదని ఆర్.టి తెలిపింది. గత సంవత్సరం సంభవించిన బోఫా తుఫానులో దక్షిణ ఫిలిప్పైన్స్ లోని మిందానో రాష్ట్రంలో మూడు పట్టణాలు తీవ్రంగా దెబ్బతినగా 1100 మందికి పైగా చనిపోయారు. హైయాన్ తుఫాను మరణాలు ఇంకా ఎక్కువ ఉండవచ్చని భయపడుతున్నారు. గత నెలలోనే 7.2 తీవ్రతతో సంభవించిన భూకంపంలో ఇళ్ళు కోల్పోయి గుడారాల్లో రక్షణ పొందుతున్న బొహోల్ వాసులకు హైయాన్ మరిన్ని కష్టాలను, చావులను మిగిల్చింది.

వాతావరణ నిపుణుల ప్రకారం హైయాన్ తుఫాను వియత్నాం తీరం తాకే లోపు దక్షిణ చైనా సముద్రంలో తిరిగి బలం పుంజుకోవచ్చు. వియత్నాం తీరం వెంట ఉన్న 15 రాష్ట్రాలలో ఇప్పటికే 3 లక్షల మంది ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

అమెరికా నేవీ ప్రకారం హైయాన్ తుఫాను గాలుల స్ధిర వేగం గంటకు 195 మైళ్ళు కాగా గరిష్టంగా 235 మైళ్ళ వరకూ గాలులు వీచాయి.

MeteoGroup సంస్ధలో వాతావరణ పరిశీలకుడు పాల్ నైట్లీ, హైయాన్ తుఫానును “ఆధునిక యుగంలో అత్యంత శక్తివంతమైన టైఫూన్లలో ఒకటి. ఇలాంటిది ఇంతవరకు నేను కని విని ఎరుగను” అని పేర్కొన్నాడు. “ఇది మహా మహా శక్తివంతమైన తుఫాను. నష్టం అపారంగా ఉంటుందనడంలో సందేహం లేదు. ఉష్ణ దేశాల తుఫానుల్లో  ఇది బాగా పై స్ధానంలో ఉండే తుఫాను. గంటకు 200 మైళ్ళ వేగం అంటే చరిత్రలో చాలా అరుదుగా మాత్రమే సంభవిస్తాయి” అని పాల్ నైట్లీ పేర్కొన్నాడు.

హైయాన్ అంటే చైనీస్ భాషలో ‘సముద్ర పక్షి’ అని అర్ధం. సముద్ర పక్షి కన్నెర్ర చేసిన ఫలితం కింది ఫొటోల్లో చూడవచ్చు. ఈ ఫోటోలను డెయిలీ మెయిల్, బోస్టన్ గ్లోబ్ పత్రికలు అందించాయి.

అప్ డేట్: హైయాన్ తుఫాను ధాటికి 1200 మంది జనం మరణించారని రెడ్ క్రాస్ ప్రకటించింది. వీరిలో 1000 మంది టాక్లోబన్ నగరానికి చెందినవారే.

One thought on “ఫిలిప్పైన్స్ ని ఊపేసిన రాక్షస తుఫాను ‘హైయాన్’

  1. పింగ్‌బ్యాక్: ఫిలిప్పైన్స్ ని ఊపేసిన రాక్షస తుఫాను ‘హైయాన్’ | ugiridharaprasad

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s