అరాఫత్ ది హత్యే, శాస్త్రవేత్తల నిర్ధారణ


Yasser Arafat 01

పాలస్తీనా స్వాతంత్రోద్యమ నాయకుడు యాసర్ అరాఫత్ సహజ కారణాలతో చనిపోలేదని, ఆయనపై విష ప్రయోగం జరిగిందని దాదాపు నిర్ధారణ అయింది. అరాఫత్ సమాధి నుండి వెలికి తీసిన అవశేషాల్లో అణు ధార్మిక పదార్ధం పోలోనియం-210 భారీగా ఉన్నట్లు స్విట్జర్లాండ్ శాస్త్రవేత్తలు ప్రకటించారు. అరాఫత్ ను పూడ్చిపెట్టిన 8 యేళ్ళ తర్వాత కూడా పోలోనియం పదార్ధం ఉండడాన్ని బట్టి ఆయనపై విష ప్రయోగం జరిగిందన్న వాదనలో నిజం ఉన్నట్లేనని స్విస్ శాస్త్రజ్ఞుల నివేదిక పేర్కొంది.

యాసర్ అరాఫత్ హత్యలో ఇజ్రాయెల్ ప్రభుత్వమే ఏకైక అనుమాతురాలని ఆయన మృతిపై విచారణ జరపడానికి నియమించిన కమిటీ ప్రకటించడం విశేషం. విచారణ కమిటీకి నేతృత్వం వహిస్తున్న తాఫిక్ తిరవి శుక్రవారం విలేఖరులతో మాట్లాడుతూ ఈ ప్రకటన చేశాడు. “యాసర్ అరాఫత్ హత్యలో ఇజ్రాయెల్ దేశమే మొట్టమొదటి, ఏకైక, మౌలికమైన అనుమానితురాలు” అని ఆయన పేర్కొన్నాడు.

పాలస్తీనా ఉద్యమ నేత యాసర్ అరాఫత్ 2004లో హఠాన్మరణానికి గురయ్యారు. ఇజ్రాయెల్ ఆక్రమణలో ఉన్న పాలస్తీనా విమోచన ఉద్యమానికి అరాఫత్ పెట్టని కోట. తన చివరి రోజుల్లో ఇజ్రాయెల్ తో రాజీ కుదుర్చుకున్నప్పటికీ తన జీవిత కాలంలో మెజారిటీ భాగం రాజీ లేని వైఖరిని అవలంబించాడు. అయితే అరాఫత్ తో కుదిరిన ఒప్పందాన్ని కూడా అమలు చేసే ఉద్దేశ్యం ఇజ్రాయెల్ కు లేదు.

అంతర్జాతీయ తీర్మానాలను, చట్టాలను అడ్డంగా ఉల్లంఘిస్తూ ఆక్రమిత పాలస్తీనాలో యూదు సెటిల్మెంట్లను పెంచుకుంటూ వస్తోంది తప్ప పాలస్తీనా భూభాగాన్ని ఖాళీ చేస్తున్న వైఖరిని ఏ దశలోనూ ప్రదర్శించలేదు. ఆక్రమిత భూభాగాన్ని కూడా పూర్తిస్ధాయిలో ఇజ్రాయెల్ లో కలుపుకుని పాలస్తీనా శరణార్ధులను శాశ్వతంగా అరబ్ దేశాలకు పరిమితం చేయాలన్నది ఇజ్రాయెల్ పధకం. ఈ పధకానికి అరాఫత్ ను ఆటంకంగా భావించిన ఇజ్రాయెల్ స్లో పాయిజనింగ్ తో ఆయన్ను చంపించిందని పాలస్తీనీయుల దృఢమైన నమ్మకం.

అరాఫత్ మృతిపై విచారణ చేయాలన్న డిమాండ్ అంతకంతకూ పెరగడంతో గత సంవత్సరం ఆయన సమాధిని తవ్వి శరీర అవశేషాలను వెలికి తీశారు. వాటిని వివిధ శాంపిళ్లుగా విడదీసి ప్రపంచ ప్రఖ్యాతి చెందిన వివిధ ఫోరెన్సిక్ ప్రయోగశాలలకు పంపించారు. మొదటి శాంపిల్ ప్రయోగ ఫలితాలను స్విట్జర్లాండ్ శాస్త్రజ్ఞులు గురువారం (నవంబర్ 7, 2013) ప్రకటించారు. ఫ్రెంచి, రష్యా శాస్త్రవేత్తల పరిశోధనా ఫలితాలు ఇంకా వెల్లడించాల్సి ఉంది.

ప్రయోగ ఫలితాల నివేదికను ఆల్-జజీరా ఛానెల్ ప్రకటించింది. బ్రిటన్ కి చెందిన ‘ది గార్డియన్’ పత్రిక కూడా సదరు వివరాలను ఆల్-జజీరా నుండి సంపాదించి ప్రచురించింది. ఈ ఫలితాల ప్రకారం అరాఫత్ శరీరంలో పోలోనియం-210 అనే అణు ధార్మిక పదార్ధం భారీగా ఉన్నట్లు తేలింది. సాధారణ స్ధాయి కంటే 18 రెట్లు మొత్తంలో ఈ పదార్ధం ఉన్నదని తేలింది. ఈ పదార్ధం సహజ సిద్ధంగా ప్రకృతిలో దొరికేది కాదు. ఎవరన్నా పూనుకుని తయారు చేయాల్సిందే. ఈ పదార్ధాన్ని తయారు చేయాల్సిన అవసరం కూడా ఉండదని తెలుస్తోంది.

అరాఫత్ పక్కటెముకలు, పొత్తికడుపు భాగాల్లో ఇలాంటి అరుదైన పోలోనియం-210 ఉన్నట్లు తేలిన నేపధ్యంలో ఇజ్రాయెల్ దుష్టనీతి, నీతిబాహ్యత మరోసారి లోకానికి తెలిసి వచ్చింది. ఈ పదార్ధం ఎంత భారీ మొత్తంలో ఉన్నదంటే శరీర ద్రవాలు కలిసిన మట్టిలో కూడా దానిని కనుగొన్నారు. అణు ధార్మిక పదార్ధం శరీరం బైట ఉన్నప్పటి కంటే లోపల ఉన్నపుడు అనేక రెట్లు ప్రభావం చూపిస్తుందని అణు శాస్త్రవేత్తలు చెప్పే మాట.

ఆల్-జజీరా ప్రకారం అక్టోబర్ 12, 2004 తేదీ సాయంత్రం అరాఫర్ హఠాత్తుగా జబ్బు పడ్డారు. అప్పటికి పాలస్తీనీయుల రెండవ ఇంతిఫాదా తీవ్రంగా కొనసాగుతోంది. అరాఫత్ అప్పటికి రెండేళ్లుగా రమల్లాలో ఇజ్రాయెల్ సైన్యం గృహ నిర్బంధంలో కొనసాగుతున్నారు. 75 వయసులోనూ సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్న ఆయన ఆ రోజు సాయంత్రం భోజనం చేసిన వెంటనే అనారోగ్యానికి గురయ్యారు.

వాంతులు, పొత్తికడుపులో నొప్పి, తల తిరగడం తదితర లక్షణాలతో ఉన్న అరాఫర్ ఫ్లూ బారిన పడ్డట్లు భావించి వైద్యులు చికిత్స చేశారు. కానీ ఆయన పరిస్ధితి మరింత క్షీణించింది. ఈజిప్టు, ట్యునీషియాల నుండి వైద్యులను అత్యవసరంగా రప్పించినప్పటికీ వారు కూడా అనారోగ్య కారణాలు చెప్పలేకపోయారు. అక్టోబర్ 29 తేదీన ఆయనను ప్రత్యేక విమానంలో జోర్డాన్ కు అక్కడి నుండి ప్యారిస్ కు తీసుకెళ్లారు.

ఫ్రెంచి ప్రభుత్వం ఆయనను పెర్సి మిలటరీ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందజేసింది. కానీ ఫ్రెంచి డాక్టర్లకు కూడా జబ్బు ఏమిటో తెలియలేదని చెప్పారు. అరాఫత్ కొద్ది రోజుల్లోనే కోమాలోకి వెళ్లిపాయారు. నవంబర్ 11 తేదీన 75 యేళ్ళ వయసులో అంతు చిక్కని కారణాలతో చనిపోయారు. విచిత్రంగా పెర్సీ ఆసుపత్రి డాక్టర్లు అటాప్సీ నిర్వహించలేదు. చనిపోవానికి కారణం చెప్పలేదు. కనీసం ఆయన మెడికల్ రికార్డులు కూడా విడుదల చేయలేదు. దానితో పాలస్తీనీయుల్లో అనుమానాలు తీవ్రం అయ్యాయి.

పశ్చిమ వార్తా సంస్ధలు అరాఫత్ మరణానికి అనేక కారణాలను ప్రచారంలో పెట్టాయి. ఆయన ఎయిడ్స్ తో చనిపోయారని పుకార్లు ప్రచారం చేశాయి. కొంతమంది ఆయన లుకేమియాతో చనిపోయాడన్నారు. కొందరు ఆహారం నుండి సంక్రమించిన జబ్బుతో చనిపోయాడన్నారు. మరి కొందరు వయసు మీదపడితే చనిపోడా అని ప్రశ్నించారు. 

(జోర్డాన్ వెళ్ళే విమానం ఎక్కే ముందు అరాఫత్ తన అభిమానులకు ముద్దులు, కరచాలనం ఇస్తున్న దృశ్యాలు)

2011లో ఆల్-జజీరా, అరాఫత్ మరణంపై సమాచారం సేకరించడం ప్రారంభించింది. అరాఫత్ భార్య నుండి మెడికల్ రికార్డులు సంపాదించింది. ఆయన వస్తువులను, చివరి రోజుల్లో ఆయన ధరించిన దుస్తులను కూడా సంపాదించింది. ఈ వస్తువులపై స్విస్ శాస్త్రవేత్తలు పరిశోధన నిర్వహించగా పోలోనీయం-210 ఐసోటోపు వాటిలో అసాధారణ స్ధాయిలో ఉన్నట్లు కనుగొన్నారు. ఆయన రక్తంలోనూ, చెమట లోనూ, బట్టలపై ఉన్న యూరిన్ మరకల్లోనూ ఈ ప్రమాదకర పదార్ధం ఉన్నట్లు కనుగొన్నారు.

జులై 2012లో ఈ ఫలితాలను ఆల్-జజీరా ఛానెల్ ప్రసారం చేసింది. దానితో ప్రపంచ వ్యాపితంగా గగ్గోలు పుట్టింది. దానితో ఫ్రెంచి ప్రభుత్వం హత్య కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించింది. ఈ విచారణ కోసం యాసర్ అరాఫత్ శరీర అవశేషాలను తవ్వి 60 శాంపిళ్ళు సేకరించారు. స్విస్, ఫ్రెంచి, రష్యన్ శాస్త్రవేత్తలకు 20 చొప్పున శాంపిళ్ళు అందజేశారు. హత్య కేసు విచారణ కోసం ఫ్రెంచి ప్రభుత్వం శాంపిళ్ళు తీసుకోగా, పాలస్తీనా ప్రభుత్వం ఆహ్వానం మేరకు రష్యన్ శాస్త్రవేత్తలు శాంపిళ్ళు తీసుకున్నారు. రష్యన్లు త్వరలోనే తమ పరిశోధన ఫలితాలు వెల్లడించవచ్చు. హత్య పరిశోధన పూర్తి కాకుండా ఫ్రెంచి శాస్త్రవేత్తల శాంపిళ్ల పరిశోధన వివరాలు వెల్లడి అయ్యే అవకాశం లేదని తెలుస్తోంది.

బిస్మత్-209 ఐసోటోపును అణు రియాక్టర్ లో న్యూట్రాన్లతో ఢీకొట్టినపుడు మాత్రమే పుట్టే  పోలోనియం-210 శక్తివంతమైన ఆల్ఫా రేడియేషన్ విడుదల చేస్తుంది. అయితే ఇవి శరీరం బయట పెద్దగా దూరం వెళ్లలేవు. శరీరం లోపలికి వెళ్తే మాత్రం అత్యంత ప్రమాదకరం. అణ్వాయుధాల పేలుడు ప్రారంభించడానికి దీనిని గతంలో వాడారని ఇప్పుడు మాత్రం శాటిలైట్ ప్రయోగాలకు తప్ప ఎవరూ వాడడం లేదని అంతర్జాతీయ అణు శక్తి సంస్ధ చెబుతోంది.

ఎవరు చంపారు అన్న ప్రశ్నకు సమాధానం పెద్ద కష్టం కాదు. ఎందుకంటే అరాఫత్ చచ్చిపోవాలన్న కోరికను ఇజ్రాయెల్ ప్రభుత్వాధినేతలు అప్పటికే పలుమార్లు వ్యక్తం చేశారు. అప్పటి ఇజ్రాయెల్ ప్రధాని ఏరియల్ షరాన్ అరాఫత్ ను ‘టెర్రరిస్టు’ గా అభివర్ణిస్తూ “ఆయన చావు మధ్య ప్రాచ్యం చరిత్రలో ఒక ముఖ్యమైన మూల ములుపు అవుతుంది” అని ప్రకటించాడు. అంతకుముందు ఇజ్రాయెల్ ఉప ప్రధానిగా పనిచేసిన యూద్ ఒల్మర్ట్ అయితే “అరాఫత్ ని చంపేయడం ఖచ్చితంగా మేం ఎంచుకున్న అవకాశాల్లో ఒకటి” అని ప్రకటించాడు.  

స్విస్ ఫోరెన్సిక్ నివేదికను అరాఫత్ భార్య సుహా అరాఫత్ ప్రతినిధులకు, పాలస్తీనా ఆధారిటీ ప్రభుత్వానికీ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే పాలస్తీనా ఆధారిటీ ఈ విషయంపై ఇంకా నోరు తెరవలేదు. ఇజ్రాయెల్ కు నమ్మిన బంటు అయిన మహమ్మద్ అబ్బాస్ ఇప్పుడు పాలస్తీనా ఆధారిటీ అధ్యక్షుడు కనుక ఆయన నోరు తెరిచినా పెద్దగా ఒరిగేదేమీ లేదు.

7 thoughts on “అరాఫత్ ది హత్యే, శాస్త్రవేత్తల నిర్ధారణ

  1. శివరామకృష్ణ గారు, శిక్షలు ఉండవేమో గానీ, అది చరిత్రలో రికార్డవుతుంది. పాలస్తీనా ప్రజల జాతీయోద్యమ నేతతో చర్చలు జరిపి ఆక్రమణ నుండి వైదొలగడం మాని ఆయన్ని చంపేసే కిరాతకం ఇజ్రాయెల్ దేశానికి ఉందన్న సంగతి రికార్డవుతుంది. ఒక ముఖ్యమైన వ్యక్తి దేశం కాని దేశానికి వచ్చి చనిపోతే కనీసం అటాప్సీ కూడా నిర్వహించని ఫ్రాన్స్ కుట్ర కూడా వెల్లడి అవుతుంది. ఈ చరిత్ర నుండి భవిష్యత్తు తరం నేర్చుకోవలసిన పాఠాలు చాలా విలువైనవిగా మునుముందు తేలుతాయి.

  2. ఈ విడియో లో నంబి నారాయన్ గారు అడిగిన ప్రశ్నలకు ఎవ్వరి వద్ద సమాధానం లేదు. ఆయన సైంటిస్ట్ గా నా అచివ్ మెంట్శ్ (పి యస్. యల్. వి మొద||) ఇవి. నేను ఒక శాస్రవేత్తను, నా మీద ఒక పోలిస్ ఆఫీసర్ ను వదలి నా జీవితంతో ఆడుకొన్నారు అని ఎంతో ఆవేదనతో చెప్పారు.

    చర్చలో శ్రీకుమార్ గారి మాటలు వింట్టుంటే సిటిలలో పెద్ద బిండింగ్ ల ముందు కాపలా గాచే సేక్యురిటి గార్డ్ లు గుర్తుకువచ్చారు. ఈ మధ్య కాలంలో రియల్ ఎస్టేట్ భూం వలన చాలా సిటిలలో స్థలాలను, పెద బిల్డింగ్ లను అమ్మి, వాటికి కాపలాగా ప్రైవేట్ సెక్యురిటి గార్డ్ లను పెడుతూంటారు. ఈ సెక్యురిటి గార్డ్ లు ఎవరంటే చదువు సంధ్యా లేని, పల్లెటురి నుంచి పొట్ట చేతపట్టుకొని పట్టణాలలో ఉద్యోగానికి వచ్చిన వారు. ఉద్యోగం లో పెట్టుకొన్నవాడు వీళ్లకి యునిఫార్మ్ ఇచ్చేటప్పటికి పోలిస్ ల కన్నా ఎక్కువగా ఫీలౌతుంటారు. ఇక చూస్కోండి వీళ్ల ప్రతాపం ప్రభుత్వ రోడ్ పైన పాదాచారులు, సైకిళ్లు, స్కూటర్లు, కారువాళ్లు ఎవ్వరు వారి బిల్డింగ్ పక్కగా కొద్దిసేపు నిలబడినా ఈ గార్డ్ లు వచ్చి తగువువేసుకొని మరీ తరుముతూంటారు. వారిని ఎవరైనా ఈ స్థలం నీ బిల్డర్ ది గాదు, నువ్వేవరు మమ్మల్ని ఇక్కడ నిలబడదు అని చెప్పటానికి? నీకేవరిచ్చారు హక్కు అని ఎదురు తిరిగి గట్టిగా ప్రశ్నిస్తే , మా ఓనర్ మాకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం పని చేయాలి గదా అంట్టు నోరు తగ్గించి మాట్లాడుతారు, వెనక్కి తగ్గుతారు. నేనొక్కడినే కాదు, నా పై అధికారులు కూడా ఉన్నారు. శ్రీకుమార్ గారు నేనొక్కడినే కాదు, నా పై అధికారులు కూడా ఉన్నారు, టిం వర్క్ పేరుతో ఎస్కేప్ అవ్వటానికి ప్రయత్నించారు. నంబి నారాయన్ ను కేసులో ఇరకబెట్టిన వారందరికి వెంటనే ప్రమోషన్లు వచ్చాయంటా. అదే నారాయణ గారికి కోర్ట్ పదిలక్షలు కాంపెన్సేషన్ వెంటనే ఇమ్మంటే పదేళ్లైనా ఆయనచేతికి రాలేదని చెప్పాడు.

  3. శ్రీకుమార్ గారి అధ్వర్యం లో ని ఇన్వెస్టిగేషన్ చేసిన లోకల్ పోలిసులు నంబి నారయాణ్ గారిని చిత్రహింసలు ఎలా పెట్టారో ఈ విడీయో లో చెప్పారు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s