కామన్వెల్త్ దేశాల ప్రభుత్వాధినేతల సమావేశానికి హాజరయ్యే విషయంలో ప్రధాన మంత్రికి పెద్ద చిక్కే వచ్చినట్లుంది. నిజంగా చిక్కు వచ్చిందో, లేదో గానీ దేశంలో అలాంటి అభిప్రాయం కల్పించడంలో మాత్రం మీడియా సహకారంతో ప్రభుత్వం సఫలం అయింది. బ్రిటిష్ వలస సామ్రాజ్యానికి ప్రతీకగా నిలిచిన కామన్వెల్త్ కూటమిలో ఇప్పటికీ ఇండియా సభ్య దేశంగా కొనసాగడం ఒక విపరీతం అయితే అది శ్రీలంకలో జరుగుతోంది కనక హాజరు కావద్దని కొందరు, కావాల్సిందేనని మరి కొందరు జుట్లు పీక్కోవడం మరో విపరీతం!
CHOGM అంటే Commonwealth Heads of Government Meeting అని అర్ధం. బ్రిటన్ కింద ఉన్న వలస దేశాల పాలనా వ్యవహారాలను సమీక్షించడానికి బ్రిటిష్ రాణి అధ్యక్షతన సమావేశాలు జరిగేవి. అంటే బ్రిటిష్ సామ్రాజ్య అవసరాల కోసం ఏర్పాటు చేసినదే ఈ చోగం. 19వ శతాబ్దం చివరి నుండి ప్రారంభం అయిన ఈ సమావేశాలు వివిధ పేర్లతో జరిగినా, 1970 నుండి మాత్రం CHOGM పేరుతో జరుగుతున్నాయి.
రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే చోగమ్ సమావేశాలు ఈసారి శ్రీలంకలో జరగబోతున్నాయి. శ్రీలంక తమిళుల పట్ల అక్కడి జాతీయ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు ఈ మధ్య కాలంలో అంతర్జాతీయంగా ప్రముఖంగా చర్చలోకి వచ్చాయి. ఎల్.టి.టి.ఇ ని ఓడించిన యుద్ధంలో చివరి దశలో వందలాది మంది అమాయక తమిళులను శ్రీలంక సైన్యం ఊచకోత కోసిన దారుణాలు వీడియో సాక్ష్యాలతో సహా వెల్లడి అయ్యాయి.
ఐరాస మానవ హక్కుల సంస్ధ నుండి ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్, హ్యూమన్ రైట్స్ వాచ్ సంస్ధల వరకు శ్రీలంక సైన్యం సాగించిన హత్యాకాండ యుద్ధ నేరాల కిందికి వస్తాయని, వీటికి శ్రీలంక ప్రభుత్వం బాధ్యత వహించాలని ఆరోపణలు, డిమాండ్లు గుప్పించాయి. ఒక దశలో ఐరాస ప్రతినిధులను శ్రీలంక ప్రజల పేరుతో దాడి చేసి తరుముకున్న ఉదాహరణలు కూడా జరిగాయి.
గత సంవత్సరం జరిగిన ఐరాస మానవహక్కుల వేదిక సమావేశాల్లో శ్రీలంకకు వ్యతిరేకంగా అమెరికా ప్రతిపాదించిన తీర్మానం ఆమోదం పొందిన దగ్గర్నుండి మన దేశంలో, ముఖ్యంగా తమిళనాడులో రాజకీయ పార్టీలు ఈ అంశాన్ని సొమ్ము చేసుకోవడానికి పోటీ పడుతున్నాయి. ఇప్పుడు జరుగుతున్న వ్యవహారం కూడా ఈ పోటీలో భాగమే తప్ప శ్రీలంక తమిళుల పరిస్ధితి పట్ల నిజంగా ఆందోళన ఉండి మాత్రం కాదు. పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్నందున తమిళ రాజకీయ పార్టీలు మరింతగా స్వరం పెంచాయి.
నిజానికి వీళ్ళంతా వాస్తవంగా యుద్ధం జరుగుతున్న సమయంలో తమిళుల ఊచకోతల పైన వార్తలు వచ్చినా పెద్దగా స్పందించలేదు. పైగా లోపాయకారీగా శ్రీలంక దమనకాండకు మద్దతు ఇచ్చినవారే. ఇండియా మద్దతు లేకుండా ఎల్.టి.టి.ఇ ని ఓడించడం శ్రీలంకకు సాధ్యం అయ్యేది కాదన్న సంగతి బహిరంగ రహస్యమే.
శ్రీలంకను తమ ప్రభావంలోకి తీసుకోడానికి చైనా కొన్నేళ్లుగా ప్రయత్నాలు ముమ్మరం చేసింది. చైనా ఆర్ధిక సహాయంతో రేవు పట్టణాలు నిర్మించుకుంది. ఆధునిక ఆయుధాలను కూడా చైనా నుండి కొనుగోలు చేసింది. చైనా పెట్టుబడులకు శ్రీలంకలో రెడ్ కార్పెట్ పరిచి ఆహ్వానం ఇస్తున్నారు. ఈ నేపధ్యంలో అమెరికా, దాని ఏలుబడిలో ఉన్న భారత ప్రభుత్వం అప్రమత్తం అయ్యాయి. చైనా చొరవను పూర్వపక్షం చేయడానికి ఇండియాయే స్వయంగా ఆయుధాలు ఇవ్వజూపింది. చైనా ప్రభావంలోకి వెళ్తే తగిన ఫలితం అనుభవించాల్సి ఉంటుందని చెప్పడానికే అమెరికా మానవ హక్కుల తీర్మానం ప్రతిపాదించి చివరి నిమిషంలో దానిని నీరుగార్చింది.
ఇదొక భౌగోళిక రాజకీయ క్రీడ. అమెరికా-చైనా ల మధ్య సాగుతున్న ఆధిపత్య పోరు. ఈ పోరులో భారత పాలకులు అమెరికా కొమ్ము కాస్తున్నారు. శ్రీలంక పాలకులు తాము సాగించిన దుర్మార్గాలను కప్పిపుచ్చుకోడానికి ఈ క్రీడను చక్కగా వాడుకుంటోంది. అమెరికా, ఇండియాలు గట్టిగా మార్లాడితే వాళ్ళు చైనాను ఆశ్రయిస్తారు. చైనాను చూపి మరిన్ని నిధులు సాయం డిమాండ్ చేస్తారు. అలాగే ఇండియా, అమెరికా బెదిరింపులను చూపి చైనా నుండి మరింత సాయం తీసుకుంటారు. చైనా, అమెరికాలకు ఇది భౌగోళిక రాజకీయ క్రీడ అయితే శ్రీలంక, ఇండియాలకు దళారీ క్రీడ. ఈ క్రీడల్లో ‘దక్కించుకున్నోడికి దక్కినంత’గా ఆట సాగుతుంది. మధ్యలో శ్రీలంక ప్రజలు (శ్రీలంక ప్రజలు, తమిళ ప్రజలు ఇద్దరూ) సమిధలుగా మిగులుతారు.
భారత పాలకుల దళారీ క్రీడలో భాగంగానే ప్రధాని చోగం సమావేశాలకు వెళ్లవద్దని తమిళ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. తమిళులను రాచి రంపాన పెడుతున్న శ్రీలంక ప్రభుత్వం నిర్వహిస్తోంది కాబట్టి సమావేశాలకు వెళ్లకూడదనేది వారి వాదన. దానికి ఒప్పుకుంటే శ్రీలంకను చైనాకు వదులుకోవడమేనని భారత పాలకుల భయం. అసలప్పుడు ఏమీ చేయకుండా నోరు, చేతులు కట్టేసుకున్న పార్టీలు ఇప్పుడు పెడబొబ్బలు పెట్టడం మోసం మాత్రమే.
పింగ్‌బ్యాక్: చోగం: కిం కర్తవ్యం? -కార్టూన్ | ugiridharaprasad
లంకలో తమీళులను సింహళీయులు విడదీసి ఊచకోత కోసారనే నెపంతో ప్రధాని ప్రయాణానానికి విముఖత చూపిన చిదంబరం ఆంధ్ర రాష్ట్రాని రెండుగా చీలిస్తే లాభదాయకం, రాజ్యాంగమని ఘోషిస్తాడు. తనవారైతే సాంబారు పరాయివారైతే సాంబారులో కరివేపాకులా ఏరిపడెయ్యడానికి. పొరుగు రాష్ట్రాన్ని చీల్చడంలొ సంబరం చూపిన చిదంబరం తన రాష్త్ర ప్రజల సమశ్య వచ్చేసరికి ఎప్పుడో రాబోయే ఎన్నికల కసరత్తుకు ప్రధాని లంక ప్రయాణం మీద ప్రజల పక్షాన నిలిచాడు. గతంలో చావు తప్పి కన్ను లొట్టపోయిన రీతిలో గెలిచిన ఈయనగారు మరోసారి జరగకుండా ఇప్పటినుంచి దృష్టిని సారిస్తున్నాడు. కానీ, ఈ పెద్ద మనిషికి అక్షరాల నలభై నాలుగు ఎమ్.పి. సీట్లతో యు.పి.ఏ కు వాయనమిచ్చి,వారి బ్రాండ్ ప్రభుత్వ పాలనలో ఆంధ్ర ప్రజలకు శ్రీకృష్ణ కమిటీ పేరుతో యాదవకులంలో ముసలం పుట్టించి రాష్ట్రాభివృద్ధిని పతాకస్థాయిలో అవనతం చేసి తమాషా చూస్తున్నాడు. రాష్ట్ర విభజనకు చేయుతనిచ్చిన ఇతగాడికి శ్రీలంకలోని తమిళ ప్రజల విషయంలో అతిగా స్పందిస్తున్నాదు. అతివృష్టి,అనావృష్టి అంటే ఇదే కాబోలు!
పాపం! ఇదంతా నిజమని నమ్ముతున్నారు కాబోలు?