ప్రశ్న: ప్రపంచీకరణ అంటే…?


globalization

కె.బ్రహ్మం: ప్రపంచీకరణ అంటే ఏమిటి? సాంకేతిక పరిజ్ఞానం, అభివృద్ధిల విషయంలో అమెరికా, ఐరోపాలు ప్రత్యేకంగా ఎందుకు ఉన్నాయి?

సమాధానం: రెండో అంశాన్ని వివరిస్తూ మొదటి అంశానికి వస్తాను.

ప్రపంచీకరణ (Globalization) కు నిర్దిష్ట నిర్వచనం ఒక వాక్యంలో చెప్పడం తగదు.

ప్రపంచీకరణ అనేది మానవ సమాజం అభివృద్ధి చెందుతున్న దశలో ఏర్పడిన ఒక అనివార్య దశ. ఈ దశకు మూలాలు క్రీస్తు పూర్వం మూడో మిలీనియంలోనే ఉన్నాయని చెప్పేవారు లేకపోలేదు. అంత వెనక్కు కాకపోయినా 15వ శతాబ్దంలో సంభవించిన పారిశ్రామిక విప్లవం దరిమిలా ఐరోపా దేశాలు కొన్ని ముఖ్యమైన శాస్త్ర, సాంకేతిక ఆవిష్కరణలు చేయడం ద్వారా భారీ మొత్తంలో ఉత్పత్తులను తయారు చేయగలిగాయి. ఆ ఉత్పత్తులకు (సరుకులకు) మార్కెట్లను వెతుక్కునే క్రమంలో ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాలకు రావడం, వ్యాపారం పేరుతో ఆ దేశాలను వలసలుగా చేసుకోవడంతో ఈ ప్రపంచీకరణ దశ వేగం పుంజుకున్నదని చెప్పవచ్చు.

ప్రపంచీకరణ క్రమంలో భాగంగానే రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని చూడాలి. బ్రిటన్ తో పాటు ఫ్రాన్స్, హాలండ్, పోర్చుగల్, స్పెయిన్ మొదలైన దేశాలు, ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాలను వలసలుగా ఆక్రమించి అక్కడి సహజసిద్ధమైన సామాజిక పరిణామక్రమాన్ని, అభివృద్ధిని అడ్డుకున్నాయి. వలస దేశాల్లో స్ధానికంగా ఉత్పత్తి శక్తుల అభివృద్ధిని ఆటంకపరిచి తాము సాధించిన అభివృద్ధిని వాటిపై రుద్దాయి. ఈ రుద్దుడు కార్యక్రమం ప్రధానంగా ఆర్ధికంగా జరిగితే, అనుబంధంగా రాజకీయంగానూ, సాంస్కృతికంగానూ కూడా జరిగింది.

మొదటి, రెండవ ప్రపంచ యుద్ధాలను కూడా ప్రపంచీకరణలో ఒక కోణంగా చూడాలి. అప్పటివరకూ ఆధిపత్యంలో ఉన్న బ్రిటిష్, ఫ్రెంచి, స్పానిష్, ఒట్టోమాన్ (టర్కిష్), డచ్, రష్యా సామ్రాజ్యాలకు మార్కెట్ల పంపణీలో తగాదాలు తలెత్తాయి. జర్మనీ, ఇటలీ, జపాన్ దేశాలు కొత్త మార్కెట్ల కోసం అర్రులు చాస్తున్నాయి. వీటి మధ్య ప్రధాన తగాదా మార్కెట్ల విభజనే. దాదాపు ప్రతి దేశమూ అప్పటికే వలసలుగా పాత వలస రాజ్యాల ఆధీనంలో ఉండడంతో కొత్తగా భారీ సరుకుల ఉత్పత్తి చేయగల శక్తిని సంతరించుకున్న దేశాలకు మార్కెట్లు కరువయ్యాయి.

దానితో ఉన్న మార్కెట్లనే పునర్విభజించుకోవాల్సిన పరిస్ధితి తరుముకొచ్చింది. మార్కెట్లను ఎలా పునర్విభజన చేసుకోవాలి అన్న సమస్యను పరిష్కరించుకోవడానికి జరిగినవే మొదటి, రెండవ ప్రపంచ యుద్ధాలు. అందుకే అప్పటికే వలస సామ్రాజ్యాలుగా, సామ్రాజ్యవాద దేశాలుగా ఉన్న బ్రిటన్, ఫ్రాన్స్, అమెరికా తదితర దేశాలు ఒకపక్క ఉంటే మార్కెట్ల పునర్విభజన డిమాండ్ చేసిన ఇటలీ, జర్మనీ, జపాన్ లు మరో పక్క ఉండడం కాకతాళీయం కాదని అర్ధం అవుతుంది.

మొదటి ప్రపంచ యుద్ధానంతరం ఆస్ట్రో-హంగేరియన్, ఒట్టోమాన్, రష్యా సామ్రాజ్యాలు అంతరించిపోతే రెండో ప్రపంచ యుద్ధానంతరం ఓడిపోయిన జర్మనీ, జపాన్, ఇటలీలతో పాటు గెలుపు పక్షంలో ఉన్న బ్రిటిష్ వలస సామ్రాజ్యం కూడా చావుదెబ్బ తిన్నాయి. యుద్ధానంతరం ఆసియా, ఆఫ్రికా దేశాల్లో చెలరేగిన జాతీయోద్యమాలు వలస సామ్రాజ్య శకానికి అంతం పలికాయి. అయితే వలస సామ్రాజ్యాలు నడిపిన దేశాలు తమ ఆర్ధిక దోపిడిని కొనసాగించడానికి వీలయిన ఒప్పందాలను ఆక్రమిత దేశాలతో కుదుర్చుకున్నాకనే వెనుదిరిగాయి తప్ప ఒట్టి చేతులతో వెళ్లలేదు.

ఒక దేశాన్ని వలసగా ఆక్రమించడం అంటే ఏమిటి? స్వంత సైన్యాలను దించి ఆక్రమించడం ఒక భాగం మాత్రమే. ఈ ఆక్రమణలోని అసలు ఉద్దేశ్యం ఆక్రమిత దేశంలోని వనరులను కొల్లగొట్టి తమ దేశాలకు తరలించడం, వాటితో తయారయిన సరుకులను తిరిగి ఆక్రమిత దేశాల్లో అమ్ముకుని లాభాలు సంపాదించడం. ఇలా చేయాలంటే మొదట ఆక్రమిత దేశాల్లో అప్పటికే కాస్తో, కూస్తో అభివృద్ధి అయి ఉన్న ఉత్పత్తి శక్తుల నడ్డి విరిచేయాలి. అనగా స్ధానికంగా సరుకులు తయారు చేసే ఉత్పత్తిదారుల ఉత్పాదక శక్తిని నిర్వీర్యం చేసి వారి సరుకుల స్ధానంలో తమ సరుకులను అమ్ముకోవాలి.

ఉత్పత్తి శక్తులు చురుకుగా ఉన్నపుడే ఒక సమాజం ఒక్కో దశను దాటుకుంటూ అభివృద్ధి పధంలో పురోగమిస్తుంది. ఉత్పత్తి శక్తులు అంటే వ్యవసాయదారులు, వ్యాపారులు, చేతివృత్తులవారు, పరిశ్రమలు.. మొదలయినవారు. వీరిని నిర్వీర్యం చేస్తేనే బ్రిటిష్ వలస ప్రయోజనాలు నెరవేరతాయి. లేకపోతే వాడు ఇక్కడికి రావడమే దండగ.

ఆసియా, ఆఫ్రికా దేశాలు వెనకబడి ఉన్నాయని వాటిని అభివృద్ధి చేయడానికే తాము వచ్చామని, నాగరికత నేర్పామని యూరోపియన్లు చెప్పుకుంటారు. కానీ ఒక దేశాన్ని ఆక్రమించి ఆ దేశ స్వాతంత్ర్యాన్ని హరించడానికి మించిన అనాగరికత మరొకటి ఉంటుందా? అగ్గిపెట్టెలో పట్టే చీరల్ని నేసే నేతగాళ్ల వేళ్ళను నరకడం కంటే మించిన క్రూరత్వం మరొకటి ఉంటుందా? తమ కంపెనీల మార్కెట్ల కోసం వందల దేశాల్లోని కోటానుకోట్ల ప్రజల సహజ అభివృద్ధిని ఆటంకపరచడం కంటే మించిన చారిత్రక దుర్మార్గం ఉంటుందా?  మార్కెట్ల విస్తరణ కోసం, పునర్విభజన కోసం కోటి మందిని భౌతికంగా చంపేసి, మరిన్ని కోట్లమందిని ఆకలి, దారిద్రాలతో అలమటించేలా చేసిన ప్రపంచ యుద్ధాలకు మించిన పాశవిక న్యాయం ఏముంటుంది? అంతెందుకు? సోషలిస్టు రష్యాను హెచ్చరించే లక్ష్యంతో లొంగిపోతున్నట్లు సందేశం పంపిన జపాన్ పైన రెండు అణు బాంబులు జారవిడిచిన అమానుషత్వం పశ్చిమ నాగరీకుల సొంతం!

యూరోపియన్లు నాగరికతలో ఓనమాలు నేర్వడానికి అనేక శతాబ్దాల పూర్వమే భారత దేశంలో సింధూ నాగరికత వర్ధిల్లింది. యూరోపియన్ల కంటే చాలా ముందే నగరీకరణ సాధించిన నాగరికత భారత దేశానిది. అరేబియాలో యూఫ్రటీస్, టైగ్రెస్ నదుల వెంట వెలిసిన మెసోపోటేమియా నాగరికత, స్వార్ధ ప్రయోజనాల కోసం కాకుండా కేవలం వ్యాపార దృష్టితోనే దేశ విదేశాలతో సంబంధాలు నెరిపి శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఐరోపా కంటే ముందే అభివృద్ధి చేసుకున్న చైనా, నైలు నదీ నాగరికతలో వర్ధిల్లిన ఈజిప్టు… ఇవేవీ యూరోపియన్లు తెచ్చినవి కావు. ప్రాచ్య దేశాలు నాగరికతలతో వర్ధిల్లుతున్న కాలంలో పశ్చిమ దేశాలు ఆటవిక యుగంలో ఉండి నాగరికతవైపు బుడి బుడి నడకలు వేస్తున్న పరిస్ధితి ఉండేది. కాబట్టి పశ్చిమ దేశాలు ఇండియా, చైనా, అరేబియా దేశాలకు నాగరికతను, సాంకేతిక పరిజ్ఞానాన్ని నేర్పకపోగా ఇక్కడి నుండి అరువు తీసుకెళ్లిన జ్ఞానంతోనే తొలి అడుగులు వేశారు.

పారిశ్రామిక విప్లవం ముందరివరకు జి.డి.పిలో చూసినా, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం విషయంలో చూసినా చైనా ముందంజలో ఉండేది. చైనా నుండి అరువు తెచ్చుకున్న శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానంతోనే ఐరోపా దేశాలు ప్రాధమిక అభివృద్ధిని సాధించాయని ప్రొఫెసర్ జేమ్స్ పెట్రాస్ లాంటి నిపుణులు పరిశోధించి తేల్చిన సంగతి.

ప్రాచ్య దేశాల పురోగమనానికి ఆటంకాలు ఏర్పడడానికి స్ధానిక కారణాలు ఉన్నాయి; బైటి కారణాలూ ఉన్నాయి. ప్రధాన కారణం మాత్రం వలస ఆక్రమణ. అనగా బైటి కారణం. వలస ఆక్రమణలో పైన చెప్పుకున్నట్లు స్ధానిక ఉత్పత్తి శక్తులకు మార్కెట్ లేక నిర్వీర్యం కాగా వాటి అభివృద్ధి ఆగిపోయింది. అదే సమయంలో ఇక్కడి మార్కెట్ ఐరోపా దేశాల పరం కావడంతో అక్కడి మార్కెట్ శక్తులు లేదా ఉత్పత్తి శక్తులు అనివార్యంగా కొత్తపుంతలు తొక్కాయి. దానికితోడు మిలట్రీ శక్తిని ప్రత్యేక దృష్టితో అభివృద్ధి చేసుకుని ప్రాచ్య (తూర్పు) దేశాలపై బలప్రయోగం చేశాయి.

ఇండియా, చైనా లాంటి దేశాల్లో పాతుకుపోయిన భూస్వామ్య వ్యవస్ధలు ఇక్కడి అభివృద్ధిని ఆటంకపరిచిన స్ధానిక కారణం. చైనాలో కన్ఫ్యూషియస్ బోధనలపై ఆధారపడిన సామాజిక సూత్రాలు ఉత్పత్తి శక్తుల అభివృద్ధిని ఆటంకపరచగా భారత దేశంలోని కుల వ్యవస్ధ, దానికి ఆపాదించిన దైవత్వం, మనుధర్మ సూత్రాలు ఇక్కడి ఉత్పత్తిశక్తుల పురోగమనానికి సుదీర్ఘకాలం పాటు ఆటంకపరిచాయి.

కుల కట్టుబాట్ల కింద కట్టుబానిసలుగా మగ్గిపోయిన వర్గాలు కళ్ళు తెరిచి తిరుగుబాట్లకు పూనుకునేలోపు తెల్లవాడు వచ్చి మరింతగా అణగదొక్కాడు. పైన చెప్పినట్లు ఇక్కడి ఉత్పత్తి శక్తులు వృద్ధి చెందకుండా కుల వ్యవస్ధను కాపాడుతూనే పైపై సంస్కరణల ద్వారా వలస పాలనకు అవసరమైన పెట్టుబడిదారీ సంబంధాలను బ్రిటిష్ వాడు రుద్దాడు. దానితో భారత దేశంలో భూస్వామ్య వ్యవస్ధను కూల్చివేసే పెట్టుబడిదారీ విప్లవం లేదా ప్రజాస్వామిక విప్లవం సంభవించడానికి మార్గం మూసుకుపోయింది. అంటే అభివృద్ధి మార్గం మూసుకుపోయింది. ఫలితంగా కుల వ్యవస్ధ ఇంకా కొనసాగుతూ ఆధునిక ఉత్పత్తి శక్తులలోకి సైతం చొరబడి వ్యవస్ధను లోలోపలి నుండి కుళ్లబొడుస్తున్నాయి.

ఇదింకా ఇలాగే కొనసాగితే సమాజం ఇంకా కుళ్లిపోతుంది. అంటే ఒక పక్క స్త్రీని దేవత అంటాం; అదే చేత్తో వారి హక్కులు తొక్కేస్తాం. తిరగబడ్డ స్త్రీని తిరుగుబాటు స్త్రీ అనడానికి బదులు వాటంగా ‘తిరుగుబోతు’గా ముద్ర వేస్తాం. కుల వివక్షకు వ్యతిరేకంగా చట్టాలు చేస్తాం; అదే చేత్తో కుల ప్రసక్తి లేకుండా విద్య నేర్పము, పెళ్లిళ్ళు చేయము, అద్దెకు ఇల్లు ఇవ్వము, చివరికి కోర్టులో కేసుకూడా నమోదు చేయలేము. అత్యాచారాలు, అవినీతి, కుల-మత-లింగ వివక్షలు, అణచివేత, నేర ప్రవృత్తి ఇత్యాది లక్షణాలు కుళ్ళిపోయిన సమాజానికి ప్రతీకలు.

పశ్చిమ దేశాల్లో ఏం జరిగింది? అక్కడ ప్రజల్లోని వివిధ వర్గాలు ఎప్పటికప్పుడు సామాజిక విప్లవాల్లో చురుకుగా పాల్గొన్నారు. విప్లవాలతో సమాజాన్ని తదుపరి ఉన్నత దశకు చేర్చుకుంటూపోయారు. ఉదాహరణకి బానిస సమాజంలో బానిసలుఉత్పత్తి శక్తులు కాగా భూములు ఉత్పత్తి సాధనాలు. సమాజ పురోభివృద్ధికి బానిస సంబంధాలు ఆటంకం అయిన దశలో బానిస విప్లవాలు చెలరేగాయి. ఆ విప్లవాల వల్ల బానిస సమాజాలు కూలిపోయి ఫ్యూడల్ సమాజాలు ఏర్పడ్డాయి.

ఫ్యూడల్ సమాజాల్లో రైతులు, వ్యాపారులు, చేతివృత్తుల వారు ఉత్పత్తి శక్తులు కాగా భూములు, చిన్న చిన్న పరిశ్రమలు ఉత్పత్తి సాధనాలు. ఉత్పత్తి సాధనాలు అభివృద్ధి చెందేకొద్దీ ఉత్పత్తి శక్తులూ అభివృద్ధి చెందుతాయి. ఉత్పత్తి పెరుగుతుంది. ఈ రెండూ మరింత అభివృద్ధి చెందిన క్రమంలో ఫ్యూడల్ సమాజ సంబంధాలు సమాజ అభివృద్ధికి ఆటంకం అయ్యాయి. అనగా పరిశ్రమలు వృద్ధి చెంది వాటిలో పని చేయడానికి పెద్ద ఎత్తున స్వేచ్ఛా కార్మికులు అవసరం కాగా వారేమో ఫ్యూడల్ ప్రభువుల భూములు నిర్బంధంగా సాగుచేస్తూ అర్ధ బానిసలుగా పడిఉన్నారు.

అంటే రైతాంగాన్ని, భూమిలేని చిన్న రైతులను భూస్వాముల నుండి విముక్తి చేస్తే తప్ప పెట్టుబడిదారీ పరిశ్రమలకు కార్మికులు దొరకరు. ఈ పరిస్ధితుల్లో రైతుల సాయంతో వ్యాపారులు/పెట్టుబడిదారులు తిరుగుబాటు చేసి పెట్టుబడిదారీ విప్లవం/ప్రజాస్వామిక విప్లవం సాధించారు. తద్వారా రైతులను అర్ధ బానిసత్వం నుండి విముక్తి చేసి పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానంలో కార్మికులుగా ఇముడ్చుకున్నారు.

పెట్టుబడిదారీ విధానం అభివృద్ధి చెందేకొద్దీ అది కూడా సమాజ పురోగమనానికి ఆటంకం అవుతుంది. అయింది కూడా. పెట్టుబడి అంతకంతకూ ఎక్కువ లాభాలు ఆర్జించడానికి చూస్తుంది. లాభాల వేటలో కార్మికుల వేతనాలను తగ్గిస్తూ పోతుంది. ఆ క్రమంలో తన సరుకులు ఎవరైతే కొనుగోలు చేయాలో వారి కొనుగోలు శక్తినే తగ్గిస్తుంది. తద్వారా వేతన శ్రామికులకు తిరుగుబాటు చేయక తప్పని పరిస్ధితి కల్పిస్తుంది. కార్మికవర్గం తిరుగుబాటు చేసి వ్యవస్ధలో ఉత్పత్తి సాధనాలను తమ చేతుల్లోకి తీసుకుంటే తప్ప వారి పరిస్ధితి మెరుగుపడదు. అలా కార్మికులు జరిపే విప్లవాన్ని సోషలిస్టు విప్లవం అంటారు. ఈ టాపిక్ ఇప్పటికీ వదిలేద్దాం.

మళ్ళీ పెట్టుబడిదారీ వ్యవస్ధకు వద్దాం. ఐరోపా పెట్టుబడిదారీ కంపెనీలు మార్కెట్లు, లాభాల వేటలో ఇతర దేశాల మీదికి దండెత్తి వెళ్ళి వాటిని తమ వలసలుగా చేసుకున్న క్రమం 16-17 శతాబ్దాల్లోనే మొదలయింది. అనగా ప్రపంచీకరణ క్రమం 16-17 శతాబ్దాల్లోనే వాస్తవంగా మొదలయింది. వలసల దురాక్రమణ వలన వారి సంస్కృతిని ఆక్రమిత దేశాల్లోని ధనికవర్గాలు అలవారుచుకున్నాయి. ఆ విధంగా సంస్కృతుల సంగమం కూడా అప్పుడే మొదలయింది. తమ కంపెనీల్లో పని చేసే కార్మికుల కోసం ఐరోపా దేశాలు వలస దేశాల్లోని జనాన్ని అటూ ఇటూ తరలించారు. తమ యుద్ధాల కోసం కూడా ఆక్రమిత దేశాల నుండి జనాన్ని తరలించారు. అలాగే వ్యవసాయ క్షేత్రాల్లో పని చేయడానికి ఆఫ్రికా నుండి నీగ్రోలను బానిసలుగా తెచ్చుకున్నారు. ఇవన్నీ బలవంతపు ప్రపంచీకరణలో భాగం. అనగా మనుషుల ప్రపంచీకరణ బానిస కాలంలోనే జరిగింది.

ఇప్పుడు ప్రపంచీకరణ నిర్వచనానికి వద్దాం.

“ప్రపంచ వ్యాపితంగా విస్తరించి ఉన్న ఆర్ధిక వ్యవస్ధలు, పరిశ్రమలు, మార్కెట్లు, సంస్కృతులు, విధానాల రూపకల్పన (ఈ పని చేసేది ప్రభుత్వాలు అని గుర్తుంచుకోండి!) అన్నీ సమ్మిళితం కావడమే ప్రపంచీకరణ” అని ఫైనాన్షియల్ టైమ్స్ పత్రిక (బ్రిటన్) నిర్వచించింది.

అనగా జాతీయ మరియు ప్రాంతీయ (దేశంలోపల ప్రాంతీయ కాదు, ప్రపంచ స్ధాయిలో ప్రాంతీయ అని దీని అర్ధం. ఉదా: దక్షిణాసియా, మధ్య ప్రాచ్యం మొ.) ఆర్ధిక వ్యవస్ధలు, సమాజాలు సంస్కృతులు ప్రపంచ స్ధాయిలోని వాణిజ్య, సమాచార, రవాణా, వలసీకరణ మార్గాల ద్వారా సమ్మిళితం అయ్యే క్రమమే ప్రపంచీకరణ అని ఎఫ్.టి వివరిస్తుంది. ఇందులో మీడియా, టెక్నాలజీ, రాజకీయాలు, వాతావరణ మార్పులు కూడా కలుపుతారు.

ప్రభుత్వాలు, ఆధ్పత్య వర్గాలు (బడా భూస్వాములు, బడా పెట్టుబడిదారులు, సామ్రాజ్యవాదులు, బహుళజాతి కంపెనీలు మొ) ఈ నిర్వచనాన్ని అంగీకరిస్తాయి. ఈ నిర్వచనం ప్రకారం పెట్టుబడుల ప్రవాహానికి ఆటంకాలు ఉండరాదు. సాంకేతిక పరిజ్ఞానం ఇచ్చి పుచ్చుకోవాలి. ఒకరి సంస్కృతిని మరొకరు సమాన స్ధాయిని ఇచ్చి గౌరవించుకోవాలి. ప్రపంచ స్ధాయి రాజకీయాల్లో దేశాలన్నింటి ప్రమేయం సమానంగా ఉండాలి. వాతావరణ మార్పులకు అసలు బాధ్యులు ఎవరో గుర్తించి వారి కార్యకలాపాలను ప్రపంచ స్ధాయిలోనే నియంత్రించాలి.

కానీ వాస్తవం ఏమిటంటే ఈ ప్రపంచీకరణ అనేది ఒకవైపే జరుగుతోంది గానీ రెండోవైపుకు జరగడం లేదు. అలాగే ఉన్నత వర్గాల ప్రపంచీకరణ యధేచ్ఛగా సాగుతోంది గానీ కార్మిక వర్గం (ఉద్యోగాలు) ప్రపంచీకరణకు అనేక ఆటంకాలు ఏర్పరిచారు. చివరికి ప్రపంచీకరణ అంటే వాస్తవ అర్ధం ఏమయ్యిందంటే పెట్టుబడుల/దోపిడి ప్రపంచీకరణ, కార్మిక వర్గ స్ధానికీకరణగా మారిపోయింది. లాభాల ప్రపంచీకరణ గానూ నష్టాల స్ధానికీకరణగానూ మారిపోయింది. ఇది ఒకేవైపు సాగుతోందని గుర్తుంచుకుంటే లాభాల ప్రపంచీకరణలో పశ్చిమ దేశాలే లబ్ది పొందుతుండగా నష్టాల స్ధానికీకరణలో మూడో ప్రపంచ దేశాలు నష్టపోతున్నాయి.

ప్రపంచ రాజకీయాలకు కేంద్రం అయిన ఐరాసలో పశ్చిమ దేశాలదే ఆధిపత్యం. వీటో అధికారంతో అమెరికా, ఐరోపాలు ప్రపంచ రాజకీయాలను శాసిస్తున్నాయి. ఆ ఆధిపత్యంతోనే ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్, లిబియా, మాలి, సోమాలియా, యెమెన్, హైతీ, హోండురాస్, వెనిజులా తదితర దేశాల్లో కొన్నింటిపై దాడులు చేశాయి. కొన్నింటిని ఆక్రమించాయి. కొన్నింటిలో ప్రభుత్వాలను కూల్చేసాయి. కొన్ని దేశాల అధ్యక్షులను కుట్రలతో చంపేశాయి.

ప్రపంచ వాణిజ్య కార్యకలాపాలకు కేంద్రం అయిన ప్రపంచ వాణిజ్య సంస్ధ (WTO)లో అమెరికా, ఐరోపాలదే పెత్తనం. ప్రపంచ ద్రవ్య పెట్టుబడుల విధానాలను రూపొందించే ప్రపంచ బ్యాంకు, ఐ.ఏం.ఎఫ్ లలో కూడా అమెరికా, ఐరోపాలదే పెత్తనం. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని పశ్చిమ దేశాలు పంచుకోవడం లేదని ఇండియాతో సహా అనేక దేశాలు దశాబ్దాలుగా అమెరికా, ఐరోపాలపై చేస్తున్న ఆరోపణ.

ఇలా ఉండగానే ఇండియాతో సహా దాదాపు మూడో ప్రపంచ దేశాలన్నీ పశ్చిమ దేశాల పెట్టుబడుల ప్రవాహానికి గేట్లు ఎత్తేశారు. దేశీయ కంపెనీలను సైతం అమ్మేసి విదేశీ ప్రవేటు కంపెనీలపరం చేస్తున్నారు. స్వదేశీ ప్రైవేటు కంపెనీల్లో సింహభాగం మళ్ళీ విదేశీ బహుళజాతి ద్రవ్య, పారిశ్రామిక కంపెనీలవే.

సరళీకరణ, ప్రయివేటీకరణ, ప్రపంచీకరణ (Liberalization, Privatization, Globalization -LPG) విధానాల పేరుతో ఇండియాతో సహా పశ్చిమ బహుళజాతి కంపెనీల పెట్టుబడులకు స్వేచ్ఛా ప్రవేశం కల్పిస్తుండగా ఇక్కడి కార్మికులు, ఉద్యోగులు, విద్యార్ధులు, పరిశోధకులు పశ్చిమ దేశాలకు వెళ్లడానికి అనేక నిబంధనలు విధిస్తున్నారు. ఆర్ధిక సంక్షోభం నేపధ్యంలో ఈ నిబంధనలను మరింత కఠినం చేస్తున్నారు. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ తదితర దేశాలు వీసా నిబంధనలు కఠినం చేశాయి. అదేమని అడిగే సాహసం భారత ప్రభుత్వానికి లేదు.

చివరికి పరిస్ధితి ఎలా ఉన్నదంటే జర్మనీ నేత ఏంజెలా మెర్కెల్, బ్రిటన్ నేత కామెరాన్, ఫ్రాన్స్ మాజీ నేత సర్కోజీ తదితరులు ‘మల్టీ కల్చరలిజం’ విఫలం అయిందని గత రెండేళ్లుగా ప్రకటనలు గుప్పిస్తున్నారు. ప్రపంచీకరణ అంటే సంస్కృతుల స్వేచ్ఛా సంగమం అన్నవారే నేడు ‘బహుళ సంస్కృతుల విధానం’ విఫలం అయిందని ప్రకటిస్తున్నారు. అంటే విదేశీయులు తమ దేశాలకు రావద్దని చెప్పడమే వారి ఉద్దేశ్యం. లేకపోతే అక్కడి వారు దాడులు చేయొచ్చని కూడా పరోక్షంగా హెచ్చరిస్తున్నారు.

కానీ అదే నోటితో పెట్టుబడి ప్రపంచీకరణ విఫలం అయిందని మాత్రం చెప్పరు. 2008 ప్రపంచ ఆర్ధిక సంక్షోభం గానీ, 2009 నుండి నిర్నిరోధంగా కొనసాగుతున్న ఐరోపా ఋణ సంక్షోభం గానీ, అమెరికా సెంట్రల్ బ్యాంకు ప్రకటనల వల్ల ఇండియాలాంటి మూడో ప్రపంచ దేశాల కరెన్సీలు పతనం అవుతున్న పరిణామం గానీ ఏం చెబుతున్నాయి? వారు అమలు చేస్తున్న పెట్టుబడి ప్రపంచీకరణ విఫలం అయిందని చెబుతున్నాయి. కానీ ఆ ముక్క వాళ్ళు చెప్పనే చెప్పరు. పైగా మన మార్కెట్లు ఇంకా ఇంకా తెరవాలని ఒత్తిళ్ళు తీవ్రం చేస్తున్నారు. మన ప్రభుత్వం కూడా ప్రభుత్వ కంపెనీలను తెగనమ్మేస్తూ, చిల్లర వర్తకం లాంటి స్వయం ఉపాధిని కూడా పశ్చిమ బహుళజాతి కంపెనీల పరం చేసేస్తున్నాయి.

ప్రపంచీకరణను నిజమైన సమానతా సూత్రాల ప్రాతికన అమలు చేస్తే ప్రపంచంలోని ప్రతి పౌరుడికీ మేలు జరుగుతుంది. కానీ పెట్టుబడిదారీ సామ్రాజ్యవాద వ్యవస్ధ కొనసాగుతున్నంత కాలం అది జరగదు గాక జరగదు.

పశ్చిమ దేశాలు ప్రభోధించే ప్రపంచీకరణ లక్ష్యం వారి పెట్టుబడులకు ప్రపంచం మొత్తం ఒక కుగ్రామంగా అందుబాటులోకి వెళ్లిపోవడం. మూడో ప్రపంచ దేశాల కార్మికులు, ఉద్యోగుల మార్పిడికి మాత్రం అంగారకుడి ప్రయాణంలా పరిస్ధితిని మార్చేయడం.

కాబట్టి ప్రపంచీకరణకు రెండు అర్ధాలు ఉన్నాయి. వాస్తవ అర్ధం ఒకటయితే అమలవుతున్న అర్ధం మరొకటి. అది పశ్చిమ దేశాలకూ, బహుళజాతి కంపెనీలకు మాత్రమే ఉపయోగపడే ఏకపక్ష ప్రపంచీకరణ.

శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానంలో అమెరికా, ఐరోపాలు ప్రత్యేకంగా ఉండడానికి కారణం వారి దోపిడి, అణచివేత విధానాలే. అనగా సామ్రాజ్యవాద విధానాలే. వలసీకరణ మన సమాజాల అభివృద్ధిని వారు అడ్డుకున్నారు. వారు సాధించిన అభివృద్ధికి వాడుకరులుగా, సేవకులుగా మాత్రమే మనల్ని మార్చేశారు. అందుకే తేడా. ఇందులో మన పాలకుల చేతగానితనం ఉన్నది. అలాగే సమాజాన్ని విప్లవకారంగా మార్చుకోవడంలో అశేష శ్రామిక ప్రజల వైఫల్యమూ ఉన్నది.

5 thoughts on “ప్రశ్న: ప్రపంచీకరణ అంటే…?

  1. బానిస మనస్తత్వానికి, ఆధిపత్య అహంకారాల అనుభందీకరణమే ప్రపంచీకరణ. అభివృద్ధి చెందే దేశాల వెనక అగ్రరాజ్య అధీకృతం వికృతంగా మారి చరిత్రను పునరావృత్తం చేయాలనే ధోరణి ఇటివలకాలంలో ప్రస్ఫుటంగా విదితమవుతోంది. ఈ విషయంలో భారతదేశం అమెరికా అడుగులకు మడుగులొత్తుతూ తొత్తుగా రూపాంతరం చెందినడంలో సందేహం లేదు.

  2. టర్కీ సామ్రాజ్యాన్ని ఒట్టోమాన్ సమ్రాజ్యం అని కూడా అంటారు.అసలు ఒట్టోమాన్ అనగా వంశమా,ప్రాంతమా,వ్యక్తి పేరా ఒట్టోమాన్ ప్రాశస్త్యాన్ని వివరించగలరు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s