“నాకనుమానం లేదు. ఇక అంగారకుడిపైన నీరు, ఉచిత భూమి ఇస్తామని వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా వాగ్దానాలు కురిపిస్తారు.”
* * *
భారత రాజకీయ పార్టీల హామీల వరదకు ఆనకట్ట వేయగల మొనగాడు ఈ భూప్రపంచంలో ఎవరైనా ఉన్నారా అంటే లేనే లేరని ఇట్టే చెప్పొచ్చు. ప్రజల్ని బిచ్చగాళ్లను చేసి పగ్గం గడుపుకోని పార్లమెంటరీ రాజకీయ పార్టీ కూడా ఇండియాలో కనపడదు. ఇందిరాగాంధి కాలంలో ఎస్.సి, ఎస్.టి ల గుడిసెలకు ఉచితంగా బొంగులు, తాటాకులు ఇవ్వడం మొదలుకొని ఈ నాటి ఉచిత విద్యుత్ పధకం వరకూ భారత రాజకీయ పార్టీలు వేయని వేషం లేదంటే అతిశయోక్తి కాదు.
ఉచిత ల్యాప్ టాప్ లు, ఉచిత టి.విలు, ఉచిత చీరలు, ఉచిత క్రికెట్ కిట్ లు, ఉచిత బియ్యం, ఉచిత సరుకులు… ఇలా ఎన్ని వీలయితే అన్నీ ఉచితంగా ఇస్తూ అధికారం లోకి వచ్చాక ‘నువ్వు నాకు ఊరకనే ఓటేశావా?’ అని జనాన్ని ప్రశ్నించే తుంటరితనం మన రాజకీయ పార్టీల సొంతం. ‘ఉచిత’ మాటున దాగిన దోపిడి ఎంతగా విడమరిచి చెప్పినా గ్రహించలేని సాంస్కృతిక వెనుకబాటుతనంలో జనాన్ని తరాల తరబడి కొనసాగిస్తున్న దురన్యాయం కూడా మన రాజకీయ పార్టీల కీర్తి కిరీటంలో ఒక కలికితురాయిగా వెలుగొందుతోంది.
జనాన్ని ఎంత అజ్ఞానంలో ఉంచితే దోపిడి వర్గాలకు, వారి ప్రయోజనాలను కాపాడే రాజకీయ పార్టీలకు అంత పండగ. జనాన్ని అజ్ఞానంలో ఉంచితే వారిని శాశ్వత బిచ్చగాళ్లుగా కొనసాగించవచ్చు. వారు బిచ్చగాళ్లుగా ఉంటేనే అయిన కాడికి శ్రమను అమ్ముకోవడానికి కోట్లాది శ్రామిక జనం మార్కెట్ లో సిద్ధంగా ఉంటారు. వారలా సిద్ధంగా ఉంటేనే పెట్టుబడుల లాభాలను ఇబ్బడి ముబ్బడిగా పెంచుకోవచ్చు. కాబట్టి పెట్టుబడి లాభార్జనలో కనపడే పెట్టుబడి డబ్బు, యంత్రాలు, కూలీ అయితే కనపడని పెట్టుబడి ప్రజల అజ్ఞానం, సదరు అజ్ఞానం నుండి ఉద్భవించే అవసరం.
అంగారకుడి మీదకు ఉపగ్రహాన్ని ప్రయోగిస్తున్నామన్న సంగతిని భారత పత్రికలు వీపరీత ప్రచారంలో పెట్టాయి. ఈ ఉపగ్రహం గనుక అంగారుకుడి చుట్టూ తిరగడం మొదలు పెడితే ఇక దేశ పాలకులకు పట్టపగ్గాలు ఉండవు. సెప్టెంబర్ 14, 2014 నాటి అంతిమ దశ పూర్తయితే ఇక ప్రతి యేటా స్వాతంత్ర దినోత్సవ సభల్లో అంగారక ఉపగ్రహ ప్రయోగం ప్రముఖ స్ధానాన్ని ఆక్రమిస్తుంది. అది చెప్పుకుని భారత శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఎంతగా కొత్త పుంతలు తొక్కిందో, దేశం ఎంతగా అభివృద్ధి సాధించిందో వివరించుకుంటూ దశాబ్దాలు గడిపేసినా ఆశ్చర్యం లేదు.
ఈ రొదలో పడి భారత దేశంలో కోట్లాది మంది భూమి లేని కూలీలు ఇంకా అర్ధాకలితో గడుపుతున్న వాస్తవం కొట్టుకుపోతుంది. జనాభాలో సగభాగంగా ఉన్న స్త్రీలపై అత్యాచారాలు నిర్నిరోధంగా కొనసాగుతున్న దీనత్వం మరుగున పడిపోతుంది. దేశ సహజ సంపద, వనరులను లెక్క లేకుండా విదేశీ కంపెనీలు కొల్లగొట్టుకుపోతున్న నిలువు దోపిడి ఇంకా ఇంకా కొనసాగుతూ ఉంటుంది. దేశ ప్రజలు అనుభవిస్తున్న దారిద్ర్యం, నిరుద్యోగం, ఆకలి, అనారోగ్యం అనేవి ఈ దేశానికి చేదు మాత్ర కాదు, విషపు గుళిక. ఆ విషపు గుళికకు మంగళయానం లాంటి తీపి పూతలు పూయబోతున్నారు. తస్మాత్ జాగ్రత్త!
(MOM = మార్స్ ఆర్బిటర్ మిషన్)
నోట్లో సారాయి, చేతిలో ఐదు వందల నోటు, నోటికాడ బిర్యాని పాకెట్ కోసం అంగలార్చే జనాలు, అంగారకుడి మీద ఉచిత భూములను పంపిణిచేస్తే నాయకులు కబ్జాలకోసం రాకెట్ కు మించిన వేగంతో శ్రీహరికోటలో పాగవేస్తారు.