భారత దేశ మొట్టమొదటి అంగారక ప్రయాణంలో ఒక దశ విజయవంతంగా పూర్తయింది. శ్రీహరి కోట నుండి ప్రయోగించిన పి.ఎస్.ఎల్.వి – సి25 ఉపగ్రహ వాహక నౌక, అంగారకుడి చుట్టూ పరిభ్రమించడానికి ఉద్దేశించిన ఉపగ్రహాన్ని మొదటి దశలో భూమి చుట్టూ తిరిగే కక్షలో విజయవంతంగా ప్రవేశపెట్టింది. ఈ మేరకు ఇస్రో ఛైర్మన్ కె.రాధాకృష్ణన్ తమ శాస్త్రవేత్తల బృందానికి అభినందనలు చెబుతూ ప్రకటన జారీ చేశారు. ప్రధాని, రాష్ట్రపతిలు కూడా ఇస్రో బృందానికి అభినందనలు తెలిపారు. ఉపగ్రహం భూమి చుట్టూ తిరిగే కక్ష దూరాన్ని క్రమంగా పెంచుకుంటూ పోవడం, అంతిమంగా అంగారకుడు చుట్టూ ఉన్న కక్షలోకి ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టడం మిగిలి ఉంది. సెప్టెంబర్ 24, 2014 తేదీకి గాని తాజా ఉపగ్రహం అంగారకుడి కక్షలోకి ప్రవేశించదని తెలుస్తోంది.
అంగారకుడి వరకూ ఉపగ్రహ ప్రయాణాలను తలపెట్టి పూర్తి చేసిన దేశాలు లేదా కూటములు ఇప్పటివరకు మూడు. అవి: అమెరికా, యూరోపియన్ యూనియన్, రష్యా. వాటి సరసన ఇండియా చేరేదీ లేనిదీ మరో 11 నెలలకు గానీ తెలియదు. 2008లో చంద్రయాన్-1 ని విజయవంతంగా పూర్తి చేసి చంద్రుడిపై నీటి జాడలు కనిపెట్టామని ప్రకటించిన భారత ప్రభుత్వం 450 కోట్ల రూపాయల ఖర్చుతో అంగారకుడి ప్రయాణం తలపెట్టింది. ఈ ఉపగ్రహ ప్రయోగంలో అమెరికా, ఇ.యుల సాంకేతిక సహాయం ఎంతవరకు ఉన్నదీ తెలియలేదు. ‘స్వదేశీ పరిజ్ఞానంతో’ అని ఎవరూ చెప్పడం లేదు కాబట్టి బైటి దేశాల సహాయం ఉండి ఉండవచ్చు. ప్రయోగం సందర్భంగా అమెరికా రాయబారి నాన్సీ అక్కడే ఉండడం గమనార్హం.
అంగారకుడి వరకూ ప్రయాణించి అంగారక కక్షలో ప్రవేశించడానికి ఉద్దేశించిన తాజా ప్రయోగాన్ని తెలుగు పత్రికలు ‘మంగళయానం’ గా చెబుతున్నాయి. ఆంగ్ల పత్రికలు దీనిని మార్స్ ఆర్బిటర్ మిషన్ (ఎం.ఒ.ఎం) గా చెబుతున్నాయి. మధ్యాహ్నం గం. 2:38 ని.లకు ప్రయోగించబడిన పి.ఎస్.ఎల్.వి –సి25 (పి.ఎస్.ఎల్.వి ఒక ఉపగ్రహాన్ని భూకక్ష్యలోకి ప్రవేశపెట్టడం ఇది 25వ సారి) ఉపగ్రహాన్ని భూమి చుట్టూ ఉండే దీర్ఘ వృత్తాకార కక్ష్యలోకి ప్రవేశ పెట్టింది. ఈ కక్ష భూమికి సమీపంలో భూకేంద్రం నుండి 250 కి.మీ దూరంలోనూ, భూమికి అత్యంత దూరంలో భూకేంద్రం నుండి 23,500 కి.మీ దూరంలోనూ ఉంటుందని తెలుస్తోంది.
మార్స్ ప్రయాణ ఉపగ్రహం భూమి చుట్టూ 20 నుండి 25 రోజుల పాటు తిరిగిన తర్వాత అంగారకుడి వైపుకు ప్రయాణం కడుతుంది. 9 నెలలపాటు ప్రయాణించిన తర్వాత ఇది అంగారకుడి చుట్టూ తిరగాల్సిన కక్షకు సమీపంలోకి వెళ్తుంది. అంగారకుడి చుట్టూ కూడా ఈ ఉపగ్రహం దీర్ఘ వృత్తాకార కక్ష్యలోనే తిరగాల్సి ఉంది. భూ కక్ష్యలో 20-25 రోజులు గడపడం, భూకక్ష్యను వీడి తొమ్మిది నెలల ప్రయాణంలోకి ప్రవేశించడం, అనంతరం అంగారక కక్ష్యలోకి ప్రవేశించడం ఇక ముందు పూర్తి చేసుకోవలసిన దశలు. వీటిలో ప్రతి దశా దేనికదే సంక్లిష్టతను కలిగినట్టిది.
శాస్త్రవేత్తలు నిరంతరం అప్రమత్తతో ఉంటే తప్ప ఈ దశలు అనుకున్నట్లుగా పూర్తికావు. ఉపగ్రహం భూకక్ష్యను వీడి అంగారకుడివైపుకి ప్రయాణం కట్టాక దూరం వెళ్ళే కొద్దీ దాన్నుండి వచ్చే సంకేతాలు ఇస్రో పరిశోధనా కేంద్రానికి చేరడానికి పట్టే సమయం పెరుగుతూ పోతుంది. ఒక దశలో ఉపగ్రహం నుండి సంకేతాలు భూమికి చేరడానికి 20 నిమిషాల సమయం పడుతుంది. వాటిని గుర్తించి ఉపగ్రహానికి తగిన సంకేతాలు పంపడానికి మరో 20 నిమిషాలు పడుతుంది. ఈ 40 నిమిషాల్లో ఉపగ్రహం ఏ దశలో ఉన్నదో తెలిసే అవకాశం లేదు.
ఈ పరిస్ధితి దృష్ట్యా ఉపగ్రహం తనంతట తాను పనిచేసేందుకు వీలయిన ఉపకరణాలను ఉంచారు. భూమి నుండి అందవలసిన సంకేతాలు అందేలోపు అనుకోని అవాంతరం ఎదురయితేగనక ఈ ఉపకరణాల సహాయంతో తనంతట తాను ఇంధనాన్ని ఉత్పత్తి చేసుకోవడం, అవాంతరం అధిగమించేవైపుగా కనీస చర్యలను తీసుకోవడం లాంటివి ఉపగ్రహం పూర్తి చేసుకోగలుగుతుంది. వీటితో పాటు అంగారకుడి కక్షలో ఉండగా తనకు అప్పజెప్పిన బాధ్యతలను నిర్వర్తించడానికి తగిన ఉపకరణాలను కూడా ఉంచారు.
- Click to enlarge
ది హిందు పత్రిక ప్రకారం ఉపగ్రహంలో 5 సాంకేతిక ఉపకరణాలను ఉంచారు. అవి: లైమన్ ఆల్ఫా ఫోటో మీటర్, మిధేన్ సెన్సార్ ఫర్ మార్స్ (అంగారుకుడిపై మిధేన్ వాయువు ఉన్నదీ లేనిదీ పసిగట్టే సాధనం), మార్స్ ఎక్సోస్ఫెరిక్ న్యూట్రల్ కంపోజిషన్ అనలైజర్, మార్స్ కలర్ కెమెరా, ధర్మల్ ఇన్ఫ్రా రెడ్ ఇమేజింగ్స్పెక్ట్రో మీటర్.
అక్టోబర్ లోనే అంగారక ఉపగ్రహ ప్రయోగం జరగవలసి ఉండగా అది నవంబర్ 5 కి వాయిదా పడింది. ఫిజి సమీపంలోని పరిశీలక స్ధలానికి (watch post) చేరాల్సిన భారత నౌక ప్రతికూల వాతావరణం వలన ఆలస్యంగా చేరింది. దానితో ప్రయోగం వాయిదా పడింది. సాధారణంగా ఒక ఉపగ్రహాన్ని భూకక్ష్యలో ప్రవేశపెట్టడానికి 20 నిమిషాల సమయం తీసుకునే పి.ఎస్.ఎల్.వి -సి25 ఈసారి 43 నిమిషాల సమయం తీసుకుంది. దీర్ఘ వృత్తాకార కక్ష్యలో ప్రవేశించడానికి వీలుగా పి.ఎస్.ఎల్.వి -సి25 ప్రయాణం లోని నాలుగు దశల్లోని చివరి దశకు మరింత సమయం పట్టడమే దీనికి కారణం.
వచ్చే డిసెంబర్ 1 తేదీకి ఉపగ్రహం భూకక్ష్యను వీడి అంగారకుడి వైపు ప్రయాణం కడుతుంది. అక్కడి నుండి 9 నెలలు పైనే ప్రయాణం చేసి అంగారకుడి సమీపంలోకి వెళుతుంది. అంగారకుడి సమీపంలోకి వెళ్ళాక ఉపగ్రహం వేగం తగ్గించాల్సి ఉంటుంది. లేనట్లయితే అంగారకుడి కక్ష్యను కూడా దాటి మరింత ముందుకు వెళ్లిపోయే ప్రమాదం ఉంటుంది. వేగం తగ్గించి అంగారకుడి కక్ష్యలో ప్రవేశపెట్టడం మరో సంక్లిష్ట ప్రక్రియ. ఈ సంక్లిష్ట దశలను దాటి అంగారకుడి కక్ష్యలోకి ఉపగ్రహం ప్రవేశించడం జరిగితే అది ఇస్రో శాస్త్రవేత్తలకు శాస్త్రపరమైన విజయం. కానీ దీనివల్ల జనానికి ఒరిగేదేమీ లేదు. అయితే ఈ క్రమంలో భారత శాస్త్రవేత్తలకు కొన్ని అనుభవాలు సమకూరుతాయి. భవిష్యత్తులో జరిపే ప్రయోగాలకు ఈ అనుభవాలు ఉపయోగపడే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రయోగాన్ని పూర్తిగా పనికిరానిదిగా కొట్టిపారేయడం కూడా సరికాదు.
చంద్రయాన్-1 సందర్భంగా పొందిన అనుభవాలు తాజా ప్రయోగానికి ఉపయోగపడ్డాయని ఇస్రో చెబుతోంది. తాజా ప్రయోగానికి సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఉపగ్రహ లక్ష్యం అంగారకుడిపై మిధేన్ వాయువు ఉన్నదో లేదో తెలుసుకోవడం అని చెబుతున్నారు. మిధేన్ ఛాయలు ఉంటే అంగారకుడిపై ఇప్పుడో ఒకప్పుడో జీవం ఉన్న ప్రాణులు ఉన్నట్లు లెక్క. కానీ ఇస్రో ఛైర్మన్ రాధా కృష్ణన్ మాటలను బట్టి చూస్తే ఇది కేవలం భారత దేశ సాంకేతిక సామర్ధ్యాన్ని రుజువు చేయడానికి చేపట్టినది మాత్రమే అని అర్ధం అవుతోంది. అంగారకుడి కక్ష్యలో ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టడానికి జరిపిన ప్రయత్నాల్లో అమెరికా, సోవియట్ యూనియన్, జపాన్, చైనాలు మొదటిసారి విఫలం అయ్యాయని తెలుస్తోంది. ఒక్క యూరోపియన్ యూనియన్ మాత్రమే మొదటి ప్రయత్నంలోనే సఫలం అయింది. ఈ దృష్ట్యా ‘మంగళయానం’ భారత శాస్త్రవేత్తలకు సవాలు వంటిదని రాధాకృష్ణన్ చెప్పారు.
మరి కొద్ది రోజుల్లో అమెరికా మరో ఉపగ్రహాన్ని అంగారకుడి కక్ష్యలో ప్రవేశపెడుతోంది. దానిని ‘Mars Atmosphere and Volatile Evolution’ (Maven) గా పిలుస్తున్నారు. ఈ ప్రయోగానీకీ, భారత ప్రయోగానికీ ఉమ్మడి లక్ష్యాలు ఉన్నట్లు పత్రికలు చెబుతున్నాయి. ఉమ్మడి లక్ష్యాలతో పాటు ప్రత్యేక లక్ష్యాలు కూడా కొన్ని ఉన్నాయని చెబుతున్నా అవేమిటో ఇంకా తెలియలేదు. మార్స్ ను ఆవరించిన వాతావరణం క్రమక్రమంగా పలచబడుతోందని, దానికి కారణం ఏమిటో తెలుసుకోవడం ఉమ్మడి లక్ష్యాల్లో ఒకటని ది హిందు తెలిపింది. వాతావరణం దట్టంగా ఉన్నట్లయితే గ్రహంపై ఉండే నీరు అక్కడే ఉండడానికి దోహదపడుతుంది. పలచగా ఉంటే గ్రహంపై నీరు నిలవ ఉండే అవకాశం తగ్గిపోతుంది. జీవం ఉండడానికి ప్రధాన అవసరం నీరే గనుక ఈ ప్రయోగాలు భూమి చరిత్రను తెలుసుకోవడానికి ఉపయోగపడవచ్చు. అలాగే విశ్వంలోని ఇతర గ్రహాలపై పరిశోధనలకు కూడా ఉపయోగపడవచ్చు.
ఒక కోణంలో చూస్తే అంగారక ప్రయాణం మానవ సమాజం సాధించిన విజయం. అయితే శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ప్రతి మనిషికి అందుబాటులోకి వచ్చే సామాజిక పరిస్ధితులు ఉన్నట్లయితే మానవ సమాజం ఒక్క అంగారక ప్రయాణమేం ఖర్మ, ఇంకా సుదూర తీరాలకు సైతం ప్రయాణం చేపట్టగలిగి ఉండేది అని అర్ధం అయినప్పుడు ఒకింత నిరాశ కమ్ముకోక మానదు.
అంగారకుడి మీద పరిశోధన మన శాస్త్రవేత్తల అంగరంగ వైభోగం. ప్రపంచంలో పంచుకునేదేదైన వుందంటే అది శాస్త్ర విజ్ఞానం. ఒండొరుల సహకారంతో ఈ పరిశొధాత్మక చర్యలు మానవాళి గ్రహాంతర నివాసానికి సోపానాలు. మనిషి ఆయుషు స్వల్పమే కావచ్చు కానీ, ఫలితాలు మాత్రం కాలక్రమేణ ముందు తరాలవారికి తలమానికం. ఏదిఏమైనా మన శాస్త్రవేత్తలకు చంద్రయాన్ విజయవంత ప్రయోగానికి హృదయపూర్వక అభినందనలు.